స్మార్ట్ రైళ్లు.. సినిమా తెరలు
న్యూఢిల్లీ: హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా త్వరలో భారతీయ రైళ్లు మెరిసిపోనున్నాయి. కళ్లను కట్టిపడేయనున్నాయి. త్వరలోనే స్మార్ట్ (స్పెషల్లీ మోడిఫైడ్ ఆస్తేటిక్ రిఫ్రెషింగ్ ట్రావెల్) కోచెస్ రానున్నాయి. వీటిలో ఉండే సౌకర్యాలు వింటే అబ్బుర పడాల్సిందే. ఇది ఎక్కువమంది ప్రయాణీకులను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు ప్రయాణీకులు రాగానే వాటంతట అవే తలుపులు తెరుచుకుంటాయి.
అలాగే, బార్ కోడ్ రీడర్స్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, వాటర్ లెవల్ ఇండికేటర్స్, ఆధునిక డస్ట్ బిన్స్, కొత్త విధానంలో సీటింగ్ వ్యవసథ, వెండింగ్ మెషిన్స్తోపాటు ఎంటర్ టైన్ మెంట్ తెరలు, ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులు ఇందులో ఉంటాయి. దీంతోపాటు, ఇండియన్ రైల్వేలో రైల్ మిత్ర సేవ రానుంది. ఇప్పటికే కొంకణ్ రైల్వే లో ఉన్న సారథి సేవను దాదాపుగా అన్ని రైళ్లకు విస్తరించి దివ్యాంగులకు సేవలు అందించనున్నారు. విశ్రాంతి గదుల బుకింగ్ గంటగంటకు చేసుకునే అవకాశం కలగనుంది. దీనిని పూర్తిగా ఐఆర్సీటీసీకి అప్పగించనున్నారు.