ఇంతకీ ప్రయాణీకుల సౌకర్యాలేమిటి?
న్యూఢిల్లీ: రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌తో లోక్ సభలో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నింటికి అరకొర కేటాయింపులే చేశారు. ప్రయాణీకులను మెప్పించేలా కొన్ని ప్రకటనలు చేశారు. అయితే, ఇదివరకే ఉన్నవాటిని కాస్తంత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఆధునీకరణ దిశగా ముందుకెళుతున్నాం అని చెప్పేందుకు ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు. వాటిని సంక్షిప్తంగా పరిశీలిస్తే..
- పూర్తిగా ఐవీఆర్ఎస్ వ్యవస్థకు అంకితమై సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకొని ప్రయాణీకులకు అనుసంధానమవడంతోపాటు వారి ప్రతి స్పందనలను తెలుసుకునేందుకు పెద్ద పీఠ వేశారు.
- అదనంగా 65,000 బెర్త్ లను ఏర్పాటుచేయనున్నారు. 2,500 వాటర్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తారు
- అత్యాధునిక పద్ధతిలో తీర్చిదిద్దిన బోగీలతో మహామన ఎక్స్ ప్రెస్ రైలును ప్రకటించారు
- 17 వేల బయో టాయిలెట్లను రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు ఇందుకోసం ప్రపంచంలోనే తొలి బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
- ఈ టికెటింగ్ వ్యవస్థను బలపరచనున్నట్లు ప్రకటించిన ఆయన ఇందుకోసం 1,780 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. మొబైల్ ఆప్స్ను, గో ఇండియా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. నిమిషానికి రెండు వేల టికెట్లు వచ్చేలాగా ఈ టికెటింగ్ వ్యవస్థ రానుంది.
- ఇప్పటికిప్పుడు 100 స్టేషన్లలో వైఫై సేవలు.. మరో 400 స్టేషన్లలో త్వరలో వైఫై ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
- దివ్యాంగుల కోసం ఆన్ లైన్లోనే వీల్ చైర్లు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- భద్రత కోసం మరిన్ని సీసీటీవీ కెమెరాలు, హెల్ప్ లైన్ సెంటర్లు పెంచనున్నారు.