కూలీ నెంబర్ 1 కాదు.. సహాయక్ నెంబర్ 1!
న్యూఢిల్లీ: ఇక నుంచి రైల్వే స్టేషన్లలో కూలీ.. కూలీ అనే పిలుపులు వినపడటం ఆగిపోనుంది. ఆ పేరు ఇక చరిత్ర పుస్తకాలకు పరిమితం కానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కూలీలకు గౌరవాన్ని కట్టబెట్టారు. కూలీ అనే పేరు స్థానంలో ఆయన కొత్త పేరును ప్రకటించారు. ఇక నుంచి రైల్వే కూలీలను కూలీలు అని పిలవకూడదని, వారిని సహాయక్లు లేదా హెల్పర్స్ అని పిలవాల్సి ఉంటుందని చెప్పారు.
ఇక నుంచి ఇదే పేరు ఉంటుందని చెప్పారు. దీంతోపాటు వారికి కొన్ని ప్రత్యేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు విమానాశ్రయాల మాదిరిగా ట్రాలీలను కూడా అందించనున్నారు. రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌ను మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో రైళ్ల సగటు వేగాన్ని పెంచుతామని, మీటర్‌గేజిని బ్రాడ్ గేజిగా మారుస్తామని, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వే కూలీల పేరిట పలు సినిమాలు, పుస్తకాలు విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.