న్యూఢిల్లీ: ప్రతీ వినియోగదారుడు తమకు బ్రాండ్ అంబాసిడరేనని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో మెరుపులు మెరిపించారు. 2016 సంవత్సరానికి ఆయన గురువారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామని సురేశ్ ప్రభు ప్రకటించారు.
దీంతోపాటుగా ఈ బడ్జెట్ లో మహిళల రక్షణకు పెద్దపీట , దీన్ దయాళ్ రైళ్ల ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు 50శాతం లోయర్ బెర్తులు, 311 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, అన్నిబోగీలలో మొబైల్ చార్జింగ్ ఏర్పాటు.. సోషల్ మీడియాలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా తక్షణం చర్యలు తదితర తాయిలాలను ఆయన తన బడ్జెట్ లో పంచారు.
ఈ సందర్భంగా సురేశ్ ప్రభు జర్నలిస్టులకు ఒక తీపి కబురు అందించారు. జర్నలిస్టులు రైల్వే టికెట్ పై రాయితీని ఆన్లైన్ లోనే పొందే వెసులుబాటును కల్పించారు. దీంతో ఎక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు రైల్వే రాయితీని ఇక మీదట ఆన్లైన్లోనే పొందే అవకాశం కలిగింది. మొత్తం మీద ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చాలా చప్పగా సాగిందని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు గంట పది నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని పెదవి వివరించారు.