కూ.. చుక్‌.. చుక్‌ | This is the cover of the Hyderabad rail transport system | Sakshi
Sakshi News home page

కూ.. చుక్‌.. చుక్‌

Published Sun, Nov 26 2017 2:45 AM | Last Updated on Sun, Nov 26 2017 2:45 AM

This is the cover of the Hyderabad rail transport system - Sakshi

1907.. నాంపల్లి రైల్వే స్టేషన్‌..
నాంపల్లి రైల్వే స్టేషన్‌ను 1907లో ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మించారు. అయితే 1921 వరకు ప్రయాణికులను ఇందులోకి అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్‌ రైళ్ల కోసమే వినియోగించారు. బొంబాయి తదితర ప్రదేశాల నుంచి వచ్చే సరుకులను సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి వరకు తీసుకురావడానికి ఈ స్టేషన్‌ అనుకూలంగా ఉండేది.

ఆ రోజుల్లో.. కచ్రం ఎడ్ల బండ్లు, జట్కాలే దిక్కు..
ఈ రోజుల్లో ఉన్నట్టుగా ప్రభుత్వ రవాణా వ్యవస్థ అ రోజుల్లో ఉండేది కాదు.. జమిందారులు, ప్రభుత్వ అధికారులు సొంత గుర్రాలు, ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేవారు.. లేదంటే ప్రభుత్వం కేటాయించిన గుర్రాలు, గుర్రపు బగ్గీలపైనే వెళ్లే వారు. సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా ఉండేది. కాస్తో కూస్తో ఉన్న వారు సొంత ఎడ్ల బండ్లపై రోజుల తరబడి ప్రయాణం చేసి గమ్యానికి చేరుకునేవారు.. అదే పేదలైతే కాలినడకనే ప్రయాణం సాగించేవారు. మారుమూల గ్రామలు, తాలుకాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వచ్చినా.. లేక పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వేరే జిల్లాలకు, ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా.. కచ్రం ఎడ్ల బండ్లు అద్దెకు తీసుకుని వేళ్లావారు. హైదరాబాద్‌ సంస్థానంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కచ్రాలు అద్దెకు లభించేవి. ఆ రోజుల్లో దొరలు, జమిందారులు, భుస్వాములు, ధనికుల వద్ద సొంత కచ్రాలు ఉండేవి. వాటిని వారు రోజుల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే.. ఊళ్లో జనమంతా ప్రణాళిక వేసుకుని అందరూ కలసి కచ్రం అద్దెకు తీసుకుని వెళ్లే వారు.

ప్రపంచంలోనే తొలి స్వతంత్ర రైల్వే వ్యవస్థ
హైదరాబాద్‌ స్టేట్‌. ఈ పేరు వింటే ఘనమైన గతమంతా కళ్ల ముందు కదులుతుంది. దేశంలోనే సుసంపన్నమైన హైదరాబాద్‌ రాష్ట్రంలో అన్నీ అద్భుతాలే. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి అదో దేశం. బ్రిటిష్‌ వలస నీడకు దూరంగా ఎదిగిన రాజ్యం. కరెన్సీ, పోస్టల్, ఎయిర్‌వేస్‌ ఇలా అన్నీ స్వతంత్రమే. వీటికి తోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్‌ సొంతం చేసుకుంది. అదే స్వతంత్ర రైల్వే. అవును.. ఈ దేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది హైదరాబాదే. 1857 తర్వాత బ్రిటిష్‌ వారు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్‌ ఇండియన్‌ రైల్వే లైన్‌ వేయాలని ప్రతిపాదించారు. అయితే అందుకు నిజాం పాలకులు ఒప్పుకోలేదు. తమ రాజ్యంలో బ్రిటిష్‌ వారి చొరబాటును, ఆధిపత్యాన్నీ అంగీకరించలేదు. అయితే అభివృద్ధికి, ఆధునిక అవసరాలనూ గుర్తించిన నిజాం సర్కార్‌ సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌ రైల్వే.. 143 ఏళ్ల ఘన చరిత్ర..
హైదరాబాద్‌ స్టేట్‌ రైల్వేది 143 ఏళ్ల ఘన చరిత్ర. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా బ్రిటిష్‌ రైల్వేనే. దాని పేరు గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వే. కానీ హైదరాబాద్‌ రాష్ట్రంలో మాత్రం బ్రిటిష్‌ వారికి సంబంధం లేని సొంత రైల్వే ఉండేది. అదే నిజాం స్టేట్‌ రైల్వే. 1870లో నిజాం స్టేట్‌ రైల్వే పురుడు పోసుకుంది. ఆ రోజుల్లో ఆరో నిజాం పాలనలో ప్రధానమంత్రిగా ఉన్న సాలార్‌ జంగ్‌.. నిజాం రైల్వేకు ప్రాణంపోశారు. ఇందుకోసం లండన్‌ మనీ మార్కెట్‌ నుంచి నేరుగా రుణం తీసుకున్నారు. రూ.4.3 కోట్లను మూడు విడతల్లో 6 శాతం గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు. భారత పాలకులతో సంబంధం లేకుండా నేరుగా లండన్‌ మనీ మార్కెట్‌కు వెళ్లడం ఆ రోజుల్లో పెను సంచలనం. ఈ వార్తతో భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలకు నిజాం సంస్థానం పరిపాలన, వ్యవహార శైలి తెలిసింది.

1916.. కాచిగూడ రైల్వే స్టేషన్‌..
కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారంటీడ్‌ స్టేట్‌ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌గా దీనిని వినియోగించారు.

మోడ్రన్‌ హైదరాబాద్‌కు పునాది..
ఐదో నిజాం మీర్‌ తహీనియత్‌ అలీఖాన్‌ అఫ్జలుద్దౌల్లా పాలనా కాలంలో హైదరాబాద్‌ అభివృద్ధి బాట పట్టింది. ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్న మీర్‌ తురా»Œ అలీఖాన్‌ సాలార్‌ జంగ్‌–1 నగరాభివృద్ధికి కారణం. బ్రిటిష్‌ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పోటీ పడుతూ.. హైదరాబాద్‌ సంస్థానంలో సొంతంగా పోస్టల్, టెలిగ్రాఫ్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. మోడ్రన్‌ హైదరాబాద్‌ నిర్మాణానికి సాలార్‌ జంగ్‌ ఆధునిక ఆలోచనా విధానమే నాంది. ఐదో నిజాం మరణానంతరం ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. ఈయన హయాంలో కూడా ప్రధానమంత్రిగా సాలార్‌జంగ్‌ 1 ఉన్నారు. మోడ్రన్‌ హైదరాబాద్‌ కోసం సిద్ధం చేసిన ప్రణాళికల్లో రవాణా వ్యవస్థ ఏర్పాటు కూడా ఉంది.

హైదరాబాద్‌లో తొలి రైల్వే లైన్‌..
కర్ణాటకలో ఉన్న బ్రిటిష్‌ రైల్వే జంక్షన్‌ వాడితో హైదరాబాద్‌ సంస్థానాన్ని అనుసంధానం చేసేలా 1871లో సికింద్రాబాద్‌–వాడి రైల్వే లైన్‌ పనులు మొదలై 1874 నాటికి పూర్తయ్యాయి. హైదరాబాద్‌ నుంచి 1874 అక్టోబర్‌ 8న తొలి ప్యాసింజర్‌ రైలు మూడు బోగీలు.. 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్‌ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది.(హైæదరాబాద్‌ నుంచి వాడికి 115 మైళ్లు, 185 కిలోమీటర్లు). అదే రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రారంభమైంది. దీంతో స్వతంత్రంగా ఏర్పాటైన తొలి రైల్వేగా నిజాం రైల్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రైల్వేగా కూడా మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు అప్పట్లో సిద్ధమైనవే. కీలకమైన హైదరాబాద్‌–కాజీపేట–బెజవాడ లైన్‌ కూడా 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్‌ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం నల్ల బంగారు లోకం సింగరేణి పుట్టిల్లు ఇల్లెందుకు కూడా అప్పట్లోనే ట్రాక్‌ వేశారు.

మద్రాస్‌లో తొలి గూడ్స్‌ రైల్‌
బ్రిటిష్‌ పాలిత భారతదేశంలో మద్రాస్‌లో రైలు రవాణా వ్యవస్థ కోసం 1832లో ప్రణాళికలు రచించారు. తొలిసారి 1837లో మద్రాస్‌ రెడ్‌ హిల్స్‌ రైల్వేస్టేషన్‌ నుంచి చింతాద్రిపేట్‌ వరకు రైలు నడిపించారు. విలియమ్స్‌ ఎవిరీ రూపొందించిన రోటరీ స్టీమ్‌ ఇంజన్‌ ద్వారా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఈ రైలును రూపొందించారు. తొలి రోజుల్లో మద్రాస్‌లో రోడ్లు, భవనాల నిర్మాణం కోసం గ్రానైట్, రాళ్లు తరలించేందుకు గూడ్స్‌ రైలుగా నడిపించారు. ఆ తర్వాత 1845లో ధవళేశ్వరంలో రైల్వే లైన్‌ నిర్మాణం జరిగింది. అదే ఏట ఆర్థర్‌ కాటన్‌ గోదావరి వంతెన నిర్మాణం కూడా ప్రారంభించారు. వంతెన నిర్మాణానికి రాళ్లను రైల్‌ ద్వారా తీసుకెళ్లారు. ఇదే ఏడాది మే 8న మద్రాస్‌ రైల్వే ఏర్పాటైంది.

స్వాతంత్య్రానికి పూర్వమే అన్ని ప్రాంతాలకూ రవాణా
1891 నాటికి నిజాం స్టేట్‌ రైల్వే వేసిన బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ 467 మైళ్లు. 1901 వచ్చే సరికి 391 మైళ్ల మీటర్‌ గేజ్‌ లైన్స్‌ నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటీడ్‌ స్టేట్‌ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది. ఈ సంస్థ 1930లో తిరిగి పూర్తిగా హైదరాబాద్‌ స్టేట్‌ అధీనంలోకి వచ్చింది. నిజాం స్టేట్‌ రైల్వేకు అనుబంధంగా మరో సంస్థ ఉండేది. అదే గోదావరి వ్యాలీ రైల్వే. మహారాష్ట్రలోని మన్మాడ్‌ను లింక్‌ చేసే ప్రధాన లైన్‌ 1897లో మంజూరైంది. మూడేళ్లలో పనులన్నీ పూర్తై 1900 సంవత్సరంలో హైదరాబాద్‌–మన్మాడ్‌ మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని కలిపే మరో లైన్‌ కాజీపేట–బలార్షా. అత్యంత కీలకమైన ఈ లైన్‌ పనులు 1921లో ప్రారంభమై దశలవారీగా పూర్తవుతూవచ్చాయి. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్లను కలుపుతూ 1928 నాటికి సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చింది ఈ మార్గం. ఇక 117 మైళ్ల సికింద్రాబాద్‌–గద్వాల్‌ లైన్‌ 1914లో ప్రారంభమై 1916 నాటికి వినియోగంలోకి వచ్చింది. కారేపల్లి–కొత్తగూడం లైన్‌ 1925 నాటికి పని చేయడం ప్రారంభించింది. ముధ్ఖేడ్‌–ఆదిలాబాద్‌ లైన్‌ 1931లో వాడుకలోకి వచ్చింది. ఇలా హైదరాబాద్‌ నుంచి నలువైపులా పరుచుకున్న పట్టాలన్నీ అప్పట్లో నిర్మించినవే. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఉన్న స్టేషన్లన్నీ ఆనాడు నిర్మించినవే.

ఉమ్మడి రైల్, రోడ్‌ వ్యవస్థ మరో ప్రత్యేకత
నిజాం రైల్వేకు ఉన్న మరో ప్రత్యేకత ఉమ్మడి రైల్, రోడ్డు వ్యవస్థ. 1932 జూన్‌ 15న రోడ్డు, రైలును లింక్‌ చేస్తూ జాయింట్‌ స్టీమ్‌ను తయారు చేశారు. దేశంలో అది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్‌ కార్కిక్‌ కమిటీ దేశంలో రోడ్డు, రైల్‌ రవాణా వ్యవస్థలను ఒకే సంస్థ నిర్వహణలో ఉంచాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సిఫార్సుల అమలు సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ స్టేట్‌ మాత్రం వెంటనే అమలులో పెట్టి అద్భుత ఫలితాలను సాధించింది. మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్‌లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారతదేశాలతో కలిపే రైల్వే లైన్‌ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1950 నాటికి 2,353 కిలోమీటర్ల పట్టాలను పరిచింది నిజాం రైల్వే. నిజాం స్టేట్‌ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్‌ రైల్వేలో కలిపేసింది. అది 1966 నుంచి సౌత్‌ సెంట్రల్‌ రైల్వేగా మారింది.

బొంబాయిలో తొలి ప్యాసింజర్‌ రైలు
దేశంలో తొలి ప్యాసింజర్‌ రైలు బొంబాయి(బొరిబందర్‌) నుంచి థానే వరకూ 1853 ఏప్రిల్‌ 8న నడిచింది. 14 బోగీలతో మూడు స్టీమ్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లు సాహెబ్‌–సింధ్‌–సుల్తాన్‌ పేర్లతో 34 కిలోమీటర్లు 400 మంది ప్యాసింజర్లతో నడిపించారు. 1854 ఆగస్టు 15న కలకత్తా హౌరా నుంచి హుబ్లీ వరకూ 24 మైళ్లు ప్యాసింజర్‌ రైలు నడిపించారు. 1884లోనే బొంబాయి–థానే నుంచి కళ్యాణ్‌ వరకు రైల్వే లైన్‌ పొడిగించారు. ఇందుకోసం ఉల్లాస్‌ నదిపై దేశంలోనే తొలి రైలు వంతెన దపూరీ వయాడక్ట్‌ను నిర్మించారు. దక్షిణాదిన 1856 జూలై 1న మద్రాస్‌లోని రాయపురం/వేయసరపాడి నుంచి వల్లజా రోడ్‌(ఆర్కాట్‌) వరకు 60 మైళ్ల దూరం నడిపించారు.

ప్రత్యేక రైలు బోగీ
నిజాం పాలకులు ప్రయాణించడానికి ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ 1904లో ఢిల్లీ దర్బార్‌కు వెళ్లేటప్పుడు ఈ ప్రత్యేక రైలు బోగీలోనే బయలుదేరారు. ఈ రైలులో నిజాం పాలకుల కోసం బెడ్‌రూమ్, కిచెన్, సెలూన్, బాత్‌రూమ్‌ ఉండేవి. సికింద్రాబాద్‌ గూడ్స్‌ రైలు గ్యారేజ్‌లో ఈ బోగీ ఉండేది.

2003లో ఎంఎంటీఎస్‌
మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం(ఎంఎంటీఎస్‌). ఇది సబర్బన్‌ రైల్వే వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాయి. నగరంలోని 43 కిలోమీటర్ల(27 మైళ్లు) పరిధిలోని 27 స్టేషన్లను కలుపుతూ 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. ఈ రైల్వే లైన్‌ ఏర్పాటుకు రూ.178 కోట్లు ఖర్చు చేశారు. తొలి దశలో ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–సికింద్రాబాద్, సికింద్రాబాద్‌– లింగంపల్లి, లింగంపల్లి– నాంపల్లి రూట్లలో ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నా యి. రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్, సికింద్రాబాద్‌ నుంచి మనోహరాబాద్‌ వరకు పొడిగించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement