సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో.. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్ సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. రైలు స్లోగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు.
ఇక దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలోని రైల్వే అధికారుల బృందం సహాయ, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సంఘటనపై చట్టబద్దమైన విచారణను నిర్వహిస్తుందని తెలిపారు.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో సహాయక చర్యల దృష్ట్యా పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫారమ్ 1,2 వైపు నుంచి రైళ్ల రాకపోకలు సాగాయి. ఈ రోజు షెడ్యూల్‌లో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడిపారు.
ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు
ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment