ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచం
స్పష్టం చేసిన రైల్వే మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 110 కి.మీ. వేగంతో పయనిస్తుందని, ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమాధానమిచ్చారు. ఈ రైలు పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం వీలుపడదని తేల్చి చెప్పారు.
ఏపీలోని ప్రధాన పట్టణాలను దేశ రాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్ట్‌లతో నడుస్తోందని, అందువల్ల వేగం పెంచడం, హాల్ట్‌లు కుదించడం సాధ్యపడదని వివరించారు. నాన్-ఏసీ బోగీలను కలపాలన్న వినతులు కూడా వచ్చాయని, అయితే 2014-15 బడ్జెట్‌లో ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో మార్చలేమని చెప్పారు.