కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుపై జిల్లావాసుల ఆశలు
పెండింగ్ ప్రాజెక్టులు పరిష్కారమయ్యేనా?
రైల్వే ఆస్పత్రికి సబ్ డివిజన్ హోదా దక్కేనా?
నాలుగేళ్లుగా పెండింగ్‌లో వ్యాగన్ వర్క్‌షాప్
హన్మకొండ/కాజీపేట రూరల్ : రైల్వే బడ్జెట్ 2015-16పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. గురువారం పార్లమెంట్‌లో రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతిసారి బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం జరుగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రంలో ప్రవేశపెట్టే తొలి రైల్వే బడ్జెట్ కావడంతో జిల్లాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా కాజీపేటకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
అప్పటిప్రధాని పీవీ నర్సింహారావు హయూంలో కాజీపేట-ఫాతిమానగర్ బ్రిడ్జి కింద న్యూఢిల్లీ-చెన్నై, హైదరాబాద్ ట్రంక్ మార్గంలో ట్రయాంగిల్ ప్లాట్‌ఫాం నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి రైల్వే బోర్డుకు పంపించారు. తర్వాత ప్రజాప్రతినిధులు చొరవ చూపలేదు. ట్రయాంగిల్ వస్తే దేశంలో కాజీపేట మొదటి నిర్మాణం అవుతుంది. అన్ని రూట్‌ల నుంచి వచ్చే రైళ్లు ఆగే అవకాశం ఉండేది.
కాజీపేట జంక్షన్‌లో మంజూరైన ఫిట్‌లైన్ల నిర్మాణం, కాజీపేట రైల్వే స్టేషన్‌లో అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, జంక్షన్‌లో మూడో నంబర్ ప్లాట్‌ఫాంలో ఆఫ్రాన్ నిర్మాణానికి నిధులు మంజూరుకాక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. న్యూఢిల్లీ-చెన్నై, హైదరాబాద్ రూట్‌లో ఫాతిమానగర్ బ్రిడ్జి కింద 2006లో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్ నుంచి వందల సంఖ్యలో రైళ్లు వెళ్తాయి. కేవలం ఈ స్టేషన్‌లో భద్రాచలం-బల్లార్షా వెళ్లే ఒకే ఒక ప్యాసింజర్ రైలు అప్ అండ్ డౌన్ వెళ్తోంది. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసి మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి.
కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని బోడగుట్ట ప్రజల చిరకాల కోరిక ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలి. ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. గత బడ్జెట్‌లో రైల్వేశాఖ మంత్రి కాజీపేట నుంచి ముంబై వరకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించినా మంజూరు కాలేదు. కాగా, వరంగ ల్ మీదుగా కరీంనగర్-తిరుపతి వెళ్లే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజులు పొడిగించాలని వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ వారంలో ఐదు రోజులు మాత్రమే వెళ్తుంది. దీనిని వారం రోజుల పొడిగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. అప్రంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశం ఉంటుంది.
కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఐదేళ్ల నుంచి డిమాండ్ ఉంది. రైల్వే అధికారులు సబ్ డివిజన్‌స్థాయి హోదాకు సంబంధించిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించారు. రైల్వే బోర్డులో డివిజన్ హోదా ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఈ బడ్జెట్‌లో కాజీపేట సబ్‌డివిజన్ ఆస్పత్రి కావాలని రైల్వే కార్మికులు కోరుతున్నారు. కాగా, కాజీపేట జంక్షన్ మీదుగా అప్ అండ్ డౌన్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాజీపేట జంక్షన్‌కు ఇక్కడి నుంచి పంజాబ్‌కు తరలిన కోచ్‌ఫ్యాక్టరీ నుంచి నేటి వ్యాగన్‌షెడ్ వరకు అన్యాయం జరుగుతూనే ఉంది.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తుందనుకున్న వ్యాగన్ వర్క్‌షాప్ పరిశ్రమ నిర్మాణం మరో అడుగు దూరంలో ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. తొలిదశ అడ్వాన్స్ కింద రూ.18 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక రైల్వేశాఖ వాటా నిధులు విడుదల కావడం మిగిలింది. ఈ బడ్జెట్‌లో రైల్వేశాఖ నిధులు కేటాయిస్తే వ్యాగన్ పరిశ్రమ పనులు త్వరగా ప్రారంభమయ్యేందుకు ఆస్కారం ఉంది.
పట్టాలెక్కేనా!
Published Wed, Feb 25 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement