
రైల్వేల్లో భారీ ఎఫ్‌డీఐలకు గ్రీన్‌సిగ్నల్
- బిహార్‌లో రెండు లోకోమోటివ్ ప్లాంట్లకు ఆమోదం
- పెట్టుబడి విలువ రూ.2,400 కోట్లుగా అంచనా..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా స్వప్నాన్ని సాకారం చేసేందుకు రైల్వే శాఖ కూడా చురుగ్గా చర్యలు చేపడుతోంది. భారతీయ రైల్వేల్లో భారీస్థాయి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బిహార్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజిన్ల(లోకోమోటివ్స్) తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.2,400 కోట్లుగా అంచనా. సాధ్యాసాధ్యాల పరిశీలన, పదేపదే బిడ్డింగ్ పత్రాల్లో మార్పులు, ఇతరత్రా తీవ్ర జాప్యాల తర్వా త రైల్వే శాఖ ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ను ఖరారు చేసింది. బిహార్‌లోని మాధేపురాలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంటు, మరోరాలో డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే షార్ట్‌లిస్ట్ చేసిన బిడ్డర్లకు ప్రతిపాదనలు(ఆర్‌ఈపీ) ఇవ్వాల్సిందిగా తెలియజేయనున్నామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మాధేపురా ప్లాంట్‌కు గ్లోబల్ దిగ్గజాలైన ఆల్‌స్తోమ్, సీమెన్స్, జీఈ, బంబార్డియర్‌లు షార్ట్‌లిస్ట్‌లో నిలిచాయి.
ఇక మరోరా ప్లాంట్‌కు తుది జాబితాలో ఉన్న ఎంఎన్‌సీల్లో జీఈ, ఈఎండీలు ఉన్నాయి. ఆగస్టు 31న ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ను తెరవనున్నామని.. ఈలోగా ఆయా సంస్థలతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించనున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. రైల్వేల్లో(భద్రత, నిర్వహణ వంటి కీలక విభాగాలు మినహా) 100%ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం ఇదివరకే ఆమోదముద్ర వేయడం తెలిసిందే. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) పర్యవేక్షిస్తున్న 8 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఈ రెండు కూడా ఉండటం గమనార్హం.