సురేష్ ‘ప్రభు’ కరుణించేనా?
► నేడు ముఖ్యమంత్రితో భేటీ
► సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం
► రాజధానికి రైలుమార్గం, ప్రత్యేక జోన్, పుష్కరాలకు నిధులు ప్రధానాంశాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్న రైల్వే మంత్రి సురేష్ ‘ప్రభు’ తొలిసారిగా శనివారం రాష్ట్ర రాజధాని విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా తనను రాజ్యసభకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమవుతారు.
కొత్త రాష్ట్రం ఏర్పడి రెండు రైల్వేబడ్జెట్‌లు గడిచిపోయినా ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు ఏమీ మంజూరు కాలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన అధికారపార్టీ ఎంపీలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చేందుకు టీడీపీ-బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
చిరకాల వాంఛగా రైల్వే జోన్..
ఈస్ట్‌కోస్ట్ రైల్వే నుంచి విశాఖపట్నం డివిజన్‌ను, దక్షిణ మధ్య రైల్వే నుంచి విజయవాడ డివిజన్‌ను విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ కావాలనే డిమాండ్ ఈ ప్రాంత వాసుల నుంచి అనేక సంవత్సరాలుగా వస్తోంది.
రాజధానికి కొత్త రైల్వే మార్గం ..
విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి 67 కి.మీ. నూతన రైలు మార్గం ఏర్పాటుకు ఇప్పటికే రైల్వే అధికారులు సర్వే పూర్తిచేశారు. ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మిస్తామని రైల్వే మంత్రి శనివారం నగరానికి వచ్చిన సందర్భంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆన్‌లైన్ ద్వారా ఈ రైల్వేమార్గానికి ప్రారంభోత్సవం చేయించాలనే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలిసింది.
డబుల్ డెక్కర్ రైళ్లు..
విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం- సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తిచేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది.
పుష్కరాలకు పుష్కలంగా నిధులు..
పుష్కరాలకు ఇప్పటికే రూ.14 కోట్లతో రైల్వేశాఖ పుష్కర పనుల్ని ప్రారంభించింది. 600 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా గుణదల, రాయనపాడు, కొండపల్లి, రామవరప్పాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా ప్రకటించి పుష్కరాలకు వీటి అభివృద్ధికి నిధులు కావాలని కోరే అవకాశం ఉంది. దీనివల్ల ప్రధాన స్టేషన్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.