‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’
అనకాపల్లి : తన ప్రాణం పోయినా సరే విశాఖ రైల్వేజోన్ సాధించేవరకూ పోరాటం చేస్తానని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధన కోసం ఆయన ఇవాళ్టి నుంచి 11 రోజులు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ రైల్వేజోన్ కోసం విశాఖ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు ఓడారని, బీజేపీ ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారని, అయితే ఇక్కడ గెలిచిన నేతలు ఢిల్లీలో మాత్రం పోరాటం చేయలేకపోతున్నారన్నారు. కాగా అమర్‌నాథ్ ఆత్మగౌరవ యాత్ర అనకాపల్లి నుంచి మొదలై చిట్టివలస వరకూ సాగుతుంది.
రైల్వేజోన్ రావాల్సిందే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్‌ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నాయని, ఇప్పుడు రైల్వే జోన్ రాకుండా చేస్తున్నాయన్నారు. రైల్వేజోన్ కోసం తీవ్రమైన పోరారం చేయాల్సి ఉందని, రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, మరో లక్ష కోట్ల అప్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ధర్మాన అన్నారు.
తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వేజోన్ రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందరూ పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. విశాఖకు రైల్వేజోన్ రావాలంటే గుడివాడ అమర్నాథ్ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... వెనుకబాటుతనం ఇక్కడే ఉందని, విశాఖకు రైల్వే జోన్ రావాలని అన్నారు. రైల్వే జోన్ వస్తే కొన్నివేల ఉద్యోగాలు వస్తాయని, అమర్‌నాథ్ ఆత్మగౌరవ యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు.