వార్ జోన్
⇒లక్ష్యం : విశాఖ రైల్వే జోన్
⇒11 రోజులు.. 200 కి.మీ.
⇒అమర్ ఆత్మగౌరవయాత్ర
⇒వైఎస్‌ఆర్‌సీపీ పోరాటంలో కీలక అంకం
⇒నేడు అనకాపల్లిలో ప్రారంభం
విశాఖ రైల్వే జోన్.. ఉత్తరాంధ్రుల ఆశ.. శ్వాస.. దశాబ్దాల ఈ ఆకాంక్షను అణగదొక్కే ప్రయత్నాలు.. రైల్వేజోన్‌ను పట్టాలు తప్పించి వేరే ప్రాంతానికి తరలించే కుట్రలకు కొదవలేదు. ఎన్నో ఉద్యమాల.. పోరాటాల ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో చోటు దక్కించుకున్న జోన్ ప్రతిపాదనకు నీళ్లొదిలే రీతిలో అధికార పార్టీలు దుర్నీతిని పాటిస్తుంటే.. జోన్ సాధనే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అదే బాటలో కదం తొక్కుతోంది..
పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశనంలో గతంలో నిరవధిక దీక్ష చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్.. మరో ముందడుగు వేస్తున్నారు.. అదే 11 రోజుల సుదీర్ఘ పాదయాత్ర.. ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక.. జోన్ కోసం జనఘోషను ఢిల్లీకి మోసుకెళ్లే ఆత్మగౌరవ యాత్ర. గురువారం అనకాపల్లిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర పల్లె పట్టణ ప్రాంతాలను స్పృశిస్తూ.. వారి గుండె గొంతుకలను తట్టిలేపుతూ చిట్టివలస వరకు సాగుతుంది.