కల ఫలించింది కానీ..! | Central Govt Litigation in the South Coast zone | Sakshi
Sakshi News home page

కల ఫలించింది కానీ..!

Published Thu, Feb 28 2019 4:37 AM | Last Updated on Thu, Feb 28 2019 10:19 AM

Central Govt Litigation in the South Coast zone - Sakshi

విశాఖ పోర్టులో రైలు ర్యాక్‌ నుంచి అన్‌లోడు చేస్తున్న ఐరన్‌ ఓర్‌

ఐదు దశాబ్దాల కల.. ఐదేళ్ల పోరాటం.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం.. ఫలించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒడిషాను నొప్పించకుండా ప్రధాన ఆదాయ వనరైన కేకే లైన్‌ని వారికే కట్టబె ట్టేసి.. రైల్వే జోన్‌ హోదాని మాత్రం విశాఖకు అప్పగించింది. ఆర్థిక పరిపుష్టి, వనరులతో ముడిపడిన అభివృద్ధి మార్గమైన కేకే లైన్‌ను తాజాగా ఏర్పాటయ్యే విశాఖ జోన్‌ నుంచి మినహాయించడం గమనార్హం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ కాలంలోనే తెరపైకి వచ్చిన రైల్వేజోన్‌ డిమాండ్‌ను రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్‌ సీపీ బలంగా వినిపించి పోరాటాలు చేసింది.  

సాక్షి, విశాఖపట్నం: సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొత్త జోన్‌లో ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌లో సగాన్ని మాత్రమే విలీనం చేసింది. దీంతో భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు మంచి ఆదాయ వనరైన కొత్తవలస–కిరండల్‌ (కేకే) లైన్‌ రాయగడ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు, ఖుర్దా, సంబల్‌పూర్‌ డివిజన్లున్నాయి. వాల్తేరు డివిజన్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలున్నాయి. దేశంలో అధిక ఆదాయం కలిగిన జోన్లలో తూర్పు కోస్తా రైల్వే జోన్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ జోన్‌ ద్వారా  ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో వాల్తేరు డివిజన్‌లో ఉన్న కేకే లైన్‌ చాలా కీలకం. ఈ డివిజన్‌ నుంచి సుమారు రూ.7,500 కోట్లు ఆదాయం వస్తుండగా ఒక్క కేకే లైన్‌ నుంచే రూ.7 వేల కోట్లు లభిస్తోంది.   

కేకే లైన్‌ కథేంటంటే.. 
విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్‌ ఏర్పాటు నేపథ్యంలో కిరండల్‌–కొత్తవలస (కేకే) లైన్‌ ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది. 2003 వరకు ఇది ఆగ్నేయ రైల్వే పరిధిలో ఉండేది. 2003లో తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటయ్యాక అందులో విలీనమైంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ వాల్తేరు డివిజన్‌లో.. కొత్తవలస–కిరండల్‌ లైన్‌ అత్యంత కీలకమైనదిగా రైల్వే భావిస్తుంది. తూర్పు కోస్తాకు వెన్నెముకగా నిలిచిన ఈ కేకే లైన్‌ నిర్మాణానికి జపాన్‌ ఆర్థిక సాయం అందించింది. దేశంలోనే అతిపెద్ద బ్రాడ్‌గేజి లైన్‌గా కేకే లైన్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1960లో మొదలయిన ట్రాక్‌ నిర్మాణ పనులు 1968కి పూర్తయ్యాయి. అప్పట్నుంచి ఈ లైన్‌ అందుబాటులోకొచ్చింది. విశాఖ నుంచి చత్తీస్‌గఢ్‌లోని కిరండల్‌ వరకు 446 కిలోమీటర్ల వరకు కేకే లైన్‌ పరిధి ఉంది. సింగిల్‌ ట్రాక్‌ ఉన్న ఈ లైన్‌ను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మీదుగా తూర్పు కనుమల్లోంచి కిరండల్‌ వరకు వేశారు. మధ్యలో 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు.

ఈ లైన్‌లో 48 రైల్వే స్టేషన్లున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి.. విశాఖ పోర్టు వరకు ఐరన్‌ ఓర్‌ (ముడి ఇనుప ఖనిజం) రవాణా అవుతుంది. విశాఖ పోర్టుకు రోజుకు సగటున 10–12 ర్యాక్‌లు (వ్యాగన్లు) ఈ ఖనిజాన్ని రవాణా చేస్తుంటాయి. ఒక్కో ర్యాక్‌ సుమారు రూ.80 లక్షల నుంచి కోటి విలువైన ఐరన్‌ ఓర్‌ను తీసుకెళ్తాయి. ఈ ఐరన్‌ ఓర్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. ఇందులో అత్యధికంగా జపాన్‌కు ఎగుమతి అవుతోంది. ఇవికాకుండా విశాఖ నుంచి ఒక ఎక్స్‌ప్రెస్, మరో పాసింజరు రైలు, రాయగడ నుంచి మరో మూడు రైళ్లు ఈ లైన్‌ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌కు ఏటా సమకూరే రూ.7,500 కోట్లలో కేకే లైన్‌ ద్వారా వచ్చే రూ.7 వేల కోట్లు ఇకపై రాయగడ డివిజన్‌పరం కానుంది. ఫలితంగా ఈ రూ.7 వేల కోట్లను ప్రస్తుత వాల్తేరు డివిజన్‌ కోల్పోనుంది. 

విభజన చట్టంలో పేర్కొన్నా..  
దాదాపు యాభై ఏళ్ల నుంచే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని పేర్కొన్నా ఒడిశా ఒప్పుకోవడం లేదని కొన్నాళ్లు, సాంకేతికంగా సాధ్యం కాదని మరికొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. నిపుణుల కమిటీ పేరుతో తీవ్ర జాప్యం చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, ఉద్యమాలు జరిగినా నాన్చివేత వైఖరినే ప్రదర్శించింది. ఎన్నికలు సమీపించడం, మార్చి 1వ తేదీన ప్రధాని మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు జోన్‌పై ప్రకటన వెలువడింది.  

ముగిసిన వాల్తేరు డివిజన్‌ ప్రస్థానం: డీఆర్‌ఎం 
కొత్త జోన్‌కు సంబంధించిన విధివిధానాలు, పరిధులపై స్పష్టత రావాల్సి ఉందని వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎం.ఎస్‌.మాథుర్‌ బుధవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. విశాఖ జోన్‌గా మారడంతో ప్రస్తుతం ఉన్న డిఆర్‌యం కేడర్‌ జనరల్‌ మేనేజర్‌గా మారనుందన్నారు. 125 ఏళ్ల వాల్తేర్‌ డివిజన్‌ ప్రస్థానం నేటితో ముగిసిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని, నిర్ణయం తీసుకున్నాక త్వరలోనే ఆచరణలోకి వస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జోన్‌పై నిర్ణయం వెలువడడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. 

ఇదీ కొత్త జోన్‌ పరిధి.. 
విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న కొత్త జోన్‌ పరిధి ఇలా ఉండనుంది. విజయవాడ డివిజన్‌ 959 కి.మీలు, గుంతకల్లు 1,354 కి.మీలు, గుంటూరు డివిజన్‌ 628 కి.మీలు వెరసి 2,931 కి.మీల పరిధి ఉంది. వాల్తేరు డివిజన్‌ పరిధి 1,106 కి.మీ ఉంది. ఇప్పుడు ఇందులో సగం వరకు రాయగడ డివిజన్‌కు వెళ్లనుంది. అంటే దాదాపు 600 కి.మీలు కొత్త జోన్‌లో కలిసే అవకాశం ఉంది. ఈ లెక్కన కొత్తగా ఏర్పాటయ్యే సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌ పరిధి 3,500 కి.మీల వరకు ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే ఇక మీదట హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్‌లకు మాత్రమే పరిమితం కానుంది.  

జోన్‌తో ప్రయోజనాలివీ..
- కొత్త రైల్వే లైన్లు  
కొత్త ప్రాజెక్టులు 
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఏర్పాటు ద్వారా  ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలు.  
రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెంటరు కూడా వస్తుంది.   
జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఏర్పాటుతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది. 
డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను నడపవచ్చు. 
దీంతో కొత్త రైళ్ల కోసం రైల్వే బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.  
లోకల్‌ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు.  
విశాఖలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెరుగుతుంది.  
రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు పెరుగుతాయి.  
జోన్‌ కేంద్రంలో జోనల్‌ ఆసుపత్రి ఏర్పాటవుతుంది.  
ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  
విశాఖ ప్రగతికి రైల్వే జోన్‌ దోహదం చేసినా కేకే లైన్‌ ఒడిశాకు తరలిపోవడం మాత్రం  ప్రతికూల అంశం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement