సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదు.
గత బడ్జెట్‌లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత
కేంద్ర బడ్జెట్‌లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment