Railway line Works
-
బడ్జెట్ రైలు ఏపీలో ఆగేనా!
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత కేంద్ర బడ్జెట్లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. -
ఐటీ సిటీ ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరుపై వరాల వర్షం కురిపిస్తోంది. ఐటీ నగరంగా పేరొందిన బెంగళూర్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 492 కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. బెంగళూర్ కంటోన్మెంట్ నుంచి వైట్‌ఫీల్డ్ వరకూ రూ 492 కోట్లతో రెండు అదనపు లైన్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రయాణీకుల రద్దీని తగ్గించి, రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని, రోజూ 62,000 మంది ప్రయాణికులు లబ్ధిపొందుతారని మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 25 కిమీల రైల్వే లైన్లో కీలకమైన బెంగళూర్ కంటోన్మెంట్, బెంగళూర్ ఈస్ట్, బైపనహళ్లి, కృష్ణరాజపురం, హుదీ, వైట్‌ఫీల్డ్ స్టేషన్లున్నాయి. ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని, వైట్‌ఫీల్డ్ ఐటీ హబ్ పరిసర ప్రాంతవాసులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. -
నష్టాలొస్తే భారం తెలంగాణదే..!
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను విషయంలో ఇదీ కేంద్రం తీరు.. * ఐదేళ్లపాటు రైల్వేకు రీయింబర్స్ చేయాల్సిందే * కావాల్సిన భూమిని ఉచితంగా ఇవ్వాలి.. * వీటికి అంగీకరిస్తేనే పనులు ప్రారంభిస్తామని మెలిక * తప్పక అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాతే కదిలిన ఫైళ్లు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను పనులు ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తదితరులు ఈనెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కేంద్ర మంత్రి హోదాలో దశాబ్దం కిందట కేసీఆర్ చేసిన కృషి వల్ల ప్రాజెక్టు మంజూరు కాగా, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒత్తిడితో పనులు మొదలు కానున్నాయి. అయితే ఖర్చు విషయంలో తమపై భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెరవెనక భారీ తతంగమే నడిపింది. సాధారణంగా రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని రైల్వే శాఖనే భరించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇకపై కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే రైల్వే ప్రాజెక్టుల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ ప్రాజెక్టుతో తేటతెల్లమవుతోంది. తమ షరతులకు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు ముందుకెళ్తుందని కేంద్రం తేల్చి చెప్పటంతో ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఢిల్లీలో ఫైళ్లు చకచకా కది లాయి. ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని మోదీ కూడా సై అన్నారు. ప్రస్తుత పరిస్థితేంటి..? సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ వరకు సికింద్రాబాద్-నిజామాబాద్ ప్రస్తుత లైను మీదుగానే రైళ్లు నడుస్తాయి. మనోహరాబాద్ నుంచి కొత్త లైన్ నిర్మించాలి. అక్కడి నుంచి మెదక్ జిల్లా గజ్వే ల్ వరకు 1,200 ఎకరాల భూమి సేకరించాలి. ఇప్పటికే 900 ఎకరాల సేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రైల్వేకు అప్పగించింది. మిగతా 300 ఎకరాల సేకరణను సెప్టెంబరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరీంనగర్లో 800 ఎకరాలు అవసరముండగా.. వచ్చే మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గజ్వేల్ వరకు భూమి అప్పగించినందున తొలి దశలో అక్కడి వరకు పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది. షరతులు ఏవంటే.. మనోహరాబాద్ నుంచి కరీంనగర్‌లోని కొత్తపల్లి వరకు 151 కి.మీ. మేర కొత్త లైను అంచనా వ్యయం రూ.1160.47 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.387 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. భూ సేకరణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వానిదే. సేకరించిన భూమిని రాష్ట్రప్రభుత్వం రైల్వేకు ఉచితంగా అందజేయాలి. ప్రాజెక్టు పూర్తయి రైళ్లు తిరగటం ప్రారంభమైనప్పటి నుంచి ఐదేళ్లపాటు నష్టాలు వస్తే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రైల్వేకు రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే పనులు చేపట్టేందుకు రైల్వే సంసిద్ధత వ్యక్తం చేసింది.