నష్టాలొస్తే భారం తెలంగాణదే..! | The Burden of Telangana! | Sakshi
Sakshi News home page

నష్టాలొస్తే భారం తెలంగాణదే..!

Published Fri, Aug 5 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

నష్టాలొస్తే భారం తెలంగాణదే..!

నష్టాలొస్తే భారం తెలంగాణదే..!

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను విషయంలో ఇదీ కేంద్రం తీరు..
* ఐదేళ్లపాటు రైల్వేకు రీయింబర్స్ చేయాల్సిందే
* కావాల్సిన భూమిని ఉచితంగా ఇవ్వాలి..
* వీటికి అంగీకరిస్తేనే పనులు ప్రారంభిస్తామని మెలిక
* తప్పక అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాతే కదిలిన ఫైళ్లు

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను పనులు ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తదితరులు ఈనెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కేంద్ర మంత్రి హోదాలో దశాబ్దం కిందట కేసీఆర్ చేసిన కృషి వల్ల ప్రాజెక్టు మంజూరు కాగా, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒత్తిడితో పనులు మొదలు కానున్నాయి. అయితే ఖర్చు విషయంలో తమపై భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెరవెనక భారీ తతంగమే నడిపింది. సాధారణంగా రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని రైల్వే శాఖనే భరించడం ఇప్పటివరకు చూశాం.

కానీ ఇకపై కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే రైల్వే ప్రాజెక్టుల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ ప్రాజెక్టుతో తేటతెల్లమవుతోంది. తమ షరతులకు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు ముందుకెళ్తుందని కేంద్రం తేల్చి చెప్పటంతో ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఢిల్లీలో ఫైళ్లు చకచకా కది లాయి. ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని మోదీ కూడా సై అన్నారు.
 
ప్రస్తుత పరిస్థితేంటి..?

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ వరకు సికింద్రాబాద్-నిజామాబాద్ ప్రస్తుత లైను మీదుగానే రైళ్లు నడుస్తాయి. మనోహరాబాద్ నుంచి కొత్త లైన్ నిర్మించాలి. అక్కడి నుంచి మెదక్ జిల్లా గజ్వే ల్ వరకు 1,200 ఎకరాల భూమి సేకరించాలి. ఇప్పటికే 900 ఎకరాల సేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రైల్వేకు అప్పగించింది. మిగతా 300 ఎకరాల సేకరణను సెప్టెంబరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరీంనగర్‌లో 800 ఎకరాలు అవసరముండగా.. వచ్చే మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గజ్వేల్ వరకు భూమి అప్పగించినందున తొలి దశలో అక్కడి వరకు పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది.
 
షరతులు ఏవంటే..
మనోహరాబాద్ నుంచి కరీంనగర్‌లోని కొత్తపల్లి వరకు 151 కి.మీ. మేర కొత్త లైను అంచనా వ్యయం రూ.1160.47 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.387 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. భూ సేకరణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వానిదే. సేకరించిన భూమిని రాష్ట్రప్రభుత్వం రైల్వేకు ఉచితంగా అందజేయాలి. ప్రాజెక్టు పూర్తయి రైళ్లు తిరగటం ప్రారంభమైనప్పటి నుంచి ఐదేళ్లపాటు నష్టాలు వస్తే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రైల్వేకు రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే పనులు చేపట్టేందుకు రైల్వే సంసిద్ధత వ్యక్తం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement