డెబిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: డెబిట్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఎండిఆర్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎండిఆర్ రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్టు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు రీఇంబర్స్ చేయనున్నట్టు తెలిపింది.
ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకాన్నిఅమలు చేసే దిశగా జనవరి 1, 2017 నుంచి డెబిట్ కార్డుల మీద టాక్స్ అండ్ నాన్ టాక్స్ బకాయిలను ఆయా బ్యాంకులకు చెల్లించనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకులు ఎండీఆర్ బకాయిల కోసం త్రైమాసిక ప్రాతిపదికన చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ తోపాటు ఆర్బిఐ నాగ్పూర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది.
అలాగే రూ. ఒక లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారునుండి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బకాయి ల చెల్లింపుల కోసం ఏప్రిల్30 లోగా ఆర్‌బీఐలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో కోరింది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. సంవత్సర కాలానికి గాను రూ.లక్ష నుంచి 2లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకోవచ్చు.
కాగా గత ఏడాది డిశెంబర్ లో డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. డీమానిటైజేషన్ అనంతరం డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.