సాక్షి, విశాఖపట్నం: విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను విలీనం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై ఒకింత స్పష్టత వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. వాల్తేరు డివిజన్‌లో కొంతభాగాన్ని విజయవాడ, మరికొంత భాగాన్ని కొత్తగా ఏర్పడబోయే రాయగడ డివిజన్‌లో కలుపుతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై స్పష్టతనిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ డివిజన్‌లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పూర్తిగా చేర్చింది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాయగడ డివిజన్‌లో కలుపుతారని భావించారు. విశాఖ రైల్వే జోన్ పరిధి ఏపీ సహా తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో కొంతమేర విస్తరించి ఉంటుంది.
ఈ జోన్ పరిధిలోకి మూడు ఏ–1 కేటగిరి స్టేషన్లు, ఎ కేటగిరి స్టేషన్లు 21, బి కేటగిరి స్టేషన్లు 20 వచ్చాయి. అయితే దీనిపై ఇంకా తమకు అధికారిక ఉత్తర్వులు అందలేదని విశాఖ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. కాగా, జోన్ పరిధిలోని తిరుపతి, రాయనపాడులో మెకానికల్ వర్క్‌షాపులు, విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, నర్సాపూర్, గుంతకల్, మచిలీపట్నంలో కోచ్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. అలాగే విశాఖ, గుత్తి, గుంతకల్లు, విజయవాడలో డీజిల్ లోకోషెడ్లు.. విజయవాడ, గుంతకల్లు, విశాఖలో ఎలక్ట్రిక్ లోకోషెడ్లు, రేణిగుంటలో ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్, రాజమండ్రిలో మెము కార్‌షెడ్డు ఉన్నాయి. విశాఖ, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నల్లపాడు, తిరుపతి, గుంతకల్లులో పాసింజర్ కోచ్ కేర్ డిపోలు, విజయవాడ, గుత్తిలో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. విజయవాడ, గుంతకల్లు, గుత్తిలో రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు, విశాఖ, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడులో డివిజనల్ ఆస్పత్రులు.. గుంటూరులో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం హెల్త్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు.
విశాఖ జోన్ పరిధిపై స్పష్టత!
Published Mon, Mar 11 2019 5:13 AM | Last Updated on Mon, Mar 11 2019 5:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment