విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌కు టెండర్లు ఆహ్వానించిన రైల్వే బోర్డు
జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు
రూ.149.16 కోట్లతో 12 అంతస్తుల భవన నిర్మాణం.. టెండర్లు ఖరారైన 24 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పగించిన భూమిలోనే జోన్ కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం: ఐదున్నరేళ్ల తర్వాత కలల జోన్ పనులకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు రూ.149.16 కోట్లతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ టెండర్లు పిలిచింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైల్వేకు కేటాయించిన ముడసర్లోవ భూముల్లోనే జోన్ జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపు దిద్దుకోనుంది.
టెండర్లు ఖరారు చేసిన 24 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించింది. ఈ ఏడాది జనవరిలోనే ముడసర్లోవ భూములు అప్పగిస్తే.. అవి ముంపు భూములంటూ అబద్ధాలతో గోబెల్స్ ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవే భూములు దిక్కంటూ జోన్ కార్యాలయ పనులకు సిద్ధం చేయడం గమనార్హం. రెండు బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 9 అంతస్తులతో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మించనున్నారు.
ప్రతి భవనానికి రెండు యాక్సెస్ పాయింట్లు, రెండు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్ ఏరియా, పార్కింగ్ పావ్‌డ్ ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, బిల్ట్ అప్ ఏరియా, బేస్‌మెంట్, పార్కింగ్ ఇలా.. ప్యాకేజీలుగా పనులు విభజించారు.
అసలేం జరిగిందంటే..
రోడ్డు విస్తరణలో భాగంగా పెందుర్తి ట్రాన్సిట్ కారిడార్ మంజూరు చేసిన సమయంలో రోడ్డు నిర్మాణానికి, రైల్వే భూముల్లో తరాలుగా ఉన్న మురికివాడల అభివృద్ధికి మొత్తం 26.11 ఎకరాలు అవసరమయ్యాయి. దీనిపై రైల్వే అధికారులతో దఫ దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. చివరికి 1ః2 నిష్పత్తిలో అంటే 52.22 ఎకరాలు ముడసర్లోవలో ఇచ్చే ప్రతిపాదనకు రైల్వే అధికారులు అంగీకరించారు.
ముడసర్లోవ స్థలం రైల్వేకు ఇచ్చేందుకు 2013 ఫిబ్రవరి 2న నం.55/12తో జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్ 26న జీవో ఎంఎస్ నం.254 జారీ చేసింది. విశాఖపట్నం రూరల్‌లోని ముడసర్లోవలో సర్వే నెం.26లో జీవీఎంసీకి చెందిన సుమారు 270 ఎకరాలు పోరంబోకు ఉండగా, ఇందులో 52 ఎకరాలు రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించారు.
అప్పట్లో రైల్వే అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేసి, వారు ఆమోదించిన తర్వాతే భూమి అప్పగింత చర్యలు చేపట్టారు. జీవీఎంసీ, రైల్వేల మధ్య 2013లో ఒప్పందం కుదిరితే 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా, భూమి ఇవ్వకుండా జాప్యం చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూములు అందిస్తే.. దానిపైనా విష ప్రచారం చేశారు.
ఏ నిర్మాణాలకైనా అనుకూలం
వాస్తవానికి రైల్వేకు ఇచ్చిన ఈ ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అది మిక్స్‌డ్ జోన్. ఏ విధమైన భవనాలైనా నిర్మించుకునేందుకు అనుకూలమైన స్థలంగా ధ్రువీకరించారు. ఆ భూమి చెరువు బ్యాక్ వాటర్లో లేదని, ముడసర్లోవ రిజర్వాయర్‌లో భాగం కాదని, ముంపునకు గురయ్యే అవకాశమే లేదని మాస్టర్ ప్లాన్‌లో స్పష్టం చేశారు. ఈ విషయంపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, లేఖలూ రాలేదు.
అక్కడ ఉన్న ఆక్రమణల్ని తొలగించి.. స్థానికులతో సంప్రదింపులు చేసి.. సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి రెవిన్యూ శాఖ మొత్తం స్థలానికి కంచె కూడా వేసింది. రైల్వేకు ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని క్లియర్ టైటిల్‌తో సిద్ధం చేశారు. వాల్తేరు డీఆర్‌ఎంకు ఈ ఏడాది జనవరి 2న లేఖలు రాసి.. అప్పగించారు. నాడు అది ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. ఇప్పుడు అదే భూమి అద్భుతమంటూ పొగడటం గమనార్హం.
తాత్కాలిక సేవలు ఎప్పుడో మరి?
2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే.. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు ఇవ్వాలా వద్దా.. అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది.
ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పని లేకుండా.. జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్‌డీ.. తను సమర్పించిన జోన్ డీపీఆర్‌లోనూ పొందు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment