వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుందా? రైల్వే జోన్ ఏర్పాటు కోసం డివిజన్ విచ్ఛిన్నం అనివార్యమా?.. అంటే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటనతో అవుననే తేలిపోయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. 129 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విభజనతో నీరుగారిపోతోంది. వాల్తేరు డివిజన్‌ని కొనసాగించాలని ప్రజాప్రతినిధుల విన్నపాలను పక్కన పెట్టడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్.. తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా.. వాల్తేర్ డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది.
గతంలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్.. ఇప్పుడు రాయగడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుందని కేంద్రం పేర్కొంది. డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలతోపాటు జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు.
చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
వాల్తేరే డివిజన్ కీలకం
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది.
ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది.
భూ సర్వేకు సన్నద్ధం
ఇప్పటికే జోన్‌కు సంబంధించిన ఓఎస్‌డీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఓఎస్‌డీ ఆధ్వర్యంలో జోన్ ప్రధాన కార్యాలయ సముదాయానికి సంబంధించిన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిగిలిన కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు భూ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది.
విశాఖలో సమగ్ర వనరులు
జోన్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించినా. విశాఖపట్నం సమగ్ర వనరులతో సిద్ధంగా ఉంది. తాత్కాలిక జోనల్ కార్యాలయంగా వాల్తేరు డీఆర్‌ఎం ఆఫీస్‌ని వినియోగించనున్నారు. శాశ్వత కార్యాలయం నిర్మించాలంటే సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇందుకు అవసరమైన స్థలాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో మెండుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో, ముడసర్లోవ పరిసరాల్లోనూ 70 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి.
దీంతో పాటు మర్రిపాలెం, గోపాలపట్నం పరిసరాల్లోనూ స్థలాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు.. ఇప్పటికే విశాఖలో ఆఫీసర్స్ క్లబ్, రైల్వే సంస్థలు, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎన్నో వసతులు ఉన్నాయి. ఉద్యోగులు ఎందరు వచ్చినా వారికి కావల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో.. ఎప్పుడు జోన్ ప్రకటన వచ్చినా ఉద్యోగులు వెంటనే విశాఖకు రావచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే..
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలందరం నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా.. మొట్టమొదట కోరేది రైల్వే జోన్ గురించే. కేంద్ర మంత్రివర్గం జోన్ ఏర్పాటుకు ఆమోదించడం హర్షణీయం. అయితే వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరి నిమిషం వరకూ వాల్తేరు డివిజన్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.
– ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ
ఆర్‌ఆర్‌బీ ఏర్పాటుకు కృషి చేస్తాం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఆనందంగా ఉంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదనపు రైళ్లు, రైల్వే లైన్లు వస్తాయి. అలాగే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఏర్పాటుకు కావల్సిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి నివేదిస్తాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తీసుకొస్తాం.
– డా.బీవీ సత్యవతి, అనకాపల్లి ఎంపీ
వాల్తేరు డివిజన్ కొనసాగించాల్సిందే..
జోన్ ఏర్పాటు చేసే సమయంలో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరుని విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు దేశ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
– డా. పెదిరెడ్ల. రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment