నిధులున్నా..తప్పని నిరీక్షణ! | Purchases of medical devices in government hospitals | Sakshi
Sakshi News home page

నిధులున్నా..తప్పని నిరీక్షణ!

Published Sun, Aug 30 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

నిధులున్నా..తప్పని నిరీక్షణ!

నిధులున్నా..తప్పని నిరీక్షణ!

- ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.520.97 కోట్లు కేటాయింపు
- ప్రతిపాదనలకే పరిమితమైన వైద్య పరికరాల కొనుగోలు  
- ఇప్పటి వరకు పైసా ఖర్చు చేయని వైనం..
సాక్షి, సిటీబ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సర్కారు దవాఖానాలకు ఆస్పత్రుల వారిగా బ డ్జెట్ కేటాయించింది. ఇందుకుగాను గత మార్చిలో రూ.520.97 కోట్ల కేటాయించింది. 70 శాతం నిధులు వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనకు, మిగిలి నిధులను నిర్మాణాలు, పునరుద్ధరణ పనులు కోసం వెచ్చించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా ఆస్పత్రులు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్పత్రుల వారిగా బడ్జెట్ కేటాయించినట్లు పాలకులు ప్రచారం చేసుకుంటున్నా..బడ్జెట్ కేటాయించి ఆరునెలలు గడచినా ఇప్పటి వరకు ఒక్క వైద్య పరికరం కూడా కొనుగోలు చేయలేదు. దీంతో  ఉస్మానియా, గాంధీ, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి, ప్లేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో సకాలంలో మెరుగైన వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, కింగ్‌కోఠి ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
 
వైద్యం కోసం వెళితే..కొత్త రోగాలు:
ఉస్మానియా ఆస్పత్రిలో 1400 పడకలు, 7 సూపర్ స్పెషాలిటీ, 15 ఇతర విభాగాలతో కలిపి మొత్తం 33 విభాగాలు ఉన్నాయి. ప్రతి రోజూ సగటున 1200 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతుండగా, నిత్యం 120-150 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి తగినట్లు ఎక్స్‌రే మిషన్లు, సీటీ, ఎంఆర్ స్కాన్‌లు లేక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో  క్షతగాత్రులను ప్రైవేటు డయాగ్నో స్టిక్స్ సెంటర్‌కు పంపుతున్నారు. ఎంఆర్‌ఐ కోసం 30-40 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఎంతోమంది రోగం ముదిరి చికిత్సకు నోచుకోకుండానే మృత్యువాత పడుతున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఇప్పటికే పాత భవనం శిథిలావస్థకు చేరుకోగా,  వార్డులు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యం కోసం వెళ్తే...ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్లు కొత్త రోగాలు వస్తున్నాయి.
 
కోమాలో నిమ్స్ ట్రామా!
నిమ్స్ ట్రామ్‌సెంటర్‌లో సకాలంలో వైద్య సేవలు అందక క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ట్రామా సెంటర్‌లో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, ఆల్ట్రా సౌండ్ యంత్ర పరికరాలు లేక పోవడంతో క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర విభాగానికి ప్రతి రోజూ 70-80 కేసులు వస్తుంటాయి. వారిలో చాలా మంది వివిధ రోడ్డు ప్రమాదా ల్లో తీవ్రంగా గాయపడిన వారే కావడం గమనార్హం. కాళ్లు, చేతులు, వెన్నుపూసతో పాటు తలకు తీవ్ర గాయాలు ఉంటాయి.

ఎక్కడ  ఫ్యాకచర్ ఉందో గుర్తించిన తర్వాతే శస్త్రచికిత్స చేసి కట్టుకడతారు. స్పైన్, హెడ్ ఇంజూరీ బాధితులకు సీటీస్కాన్, ఎంఆర్‌ఐ తప్పనిసరి. ట్రామా సెంటర్‌లో సీటీ,ఎంఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్‌మిషన్లు లేక పోవడంతో పాతభవనంలోని రేడియాలజీ విభాగానికి పంపుతున్నారు. అసలే భరించలేనినొప్పితో బాధపడుతున్న క్షతగాత్రులను టెస్టుల పేరుతో అటు ఇటూ తిప్పుతూ బతికుండగానే చంపేస్తున్నారు.
 
నిలోఫర్‌లో మరణ మృదంగంః

550 పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో నిత్యం 900-1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. అయితే రోగుల సంఖ్యకు తగినట్లుగా పడకలు, వెంటిలేటర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వార్మర్లు లేక పోవడంతో ఒక్కో దానిపై ఇద్దరు ముగ్గురు చిన్నారులను పడుకోపెట్టి వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ విభాగంలో గత మూడేళ్ల నుంచి లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో బాలింతలు చంటిపిల్లలను ఎత్తుకుని పైఅంతస్థులకు చేరుకోవాల్సి వస్తోంది. ఇక్కడ రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతుండగా, ఆస్పత్రిలో క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో వారు మృత్యువాత పడుతున్నారు. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఈసీజీ, 2డిఎకో పరికరాలు లేకపోవడంతో ఉస్మానియాకు తరలించాల్సి వస్తోంది.
 
హే.. గాంధీ...!

1542 పడకల సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ 1300-1500 మంది చికిత్స పొందుతుంటారు. ఇక్కడ మొత్తం 36 విభాగాలు ఉండగా, 28 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 350 వైద్యులు, 453 మంది నర్సులు, 500 ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. సిటీ, ఎం ఆర్‌ఐ, ఎక్సరే యంత్రాలు తరచూ మెరాయిస్తుండడంతో, సిటీస్కానింగ్‌కు 15 రోజులు పడుతుండగా, ఎంఆర్‌ఐ స్కాన్‌కు 45 రోజులు పడుతోంది. ప్రస్తుతం 250 మందికిపైగా ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం పేర్లు నమోదు చేసుకుని వెయిటింగ్‌లో ఉన్నారు. డయాలసిస్ విభాగంలో 5 యంత్రాలు ఉండగా, 3 పని చేయడం లేదు. ఆస్పత్రిలో 18 లిఫ్ట్‌లు ఉండగా, నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవికూడా తరుచూ మొరాయిస్తుండటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు వీటిని పునరుద ్ధరించే అవకాశం ఉన్నా..ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement