బడ్జెట్‌పై సంక్షేమ సంతకం | Heavily funded for the welfare sector | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై సంక్షేమ సంతకం

Published Wed, Jun 17 2020 4:45 AM | Last Updated on Wed, Jun 17 2020 8:49 AM

Heavily funded for the welfare sector - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించి పేదలకు అండగా ఉన్నామనే భరోసాను ప్రభుత్వం కల్పించింది. 2020–21 బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే కేటాయింపులు పెరిగాయి. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తామనే వివరాలు (టార్గెట్‌) కూడా బడ్జెట్‌లో పొందుపరిచారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఈ బడ్జెట్‌ ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎదురు లేకుండా అమలవుతున్నాయి. కేటాయింపులు ఘనంగా ఉన్నా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని విమర్శించేందుకు తావే లేదు. ఎందుకంటే ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. 

బీసీ సంక్షేమం
► బీసీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్‌లో కాంపోనెంట్‌ ద్వారా రూ.25,331.30 కోట్లు కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో కేటాయించడం ఇదే మొదటి సారి. 
► గత సంవత్సరం రూ.15,061.64 కోట్లు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 68.18 శాతం ఎక్కువ బడ్జెట్‌ కేటాయింపు జరిగింది. నవరత్నాల ద్వారా రూ. 23,458.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

ఎస్సీ సంక్షేమం
► షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కోసం 2020–21 బడ్జెట్‌లో రూ.15,735.68 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం బడ్జెట్‌ కంటే 4.90 శాతం ఎక్కువ. 
► గత ఏడాది రూ.15,000.85 కోట్లు కేటాయించారు. 47 ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు వివిధ పథకాల కోసం ఖర్చు చేస్తారు. నవరత్నాల అమలుకు రూ.7,525.02 కోట్లు ఖర్చు చేస్తారు. 

ఎస్టీల సంక్షేమం
► గిరిజనుల సంక్షేమానికి 2020–21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 5,177.53 కోట్లు కేటాయించింది. 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే 3.79 శాతం ఎక్కువ. 
► నవరత్న పథకాల అమలుకు రూ.1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

మైనార్టీల సంక్షేమం
► రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,050.22 కోట్లు కేటాయించింది. 
► 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 116.10 శాతం ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించడం ఇదే మొదటి సారి. 
► మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ సంవత్సరం రూ.1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు.  

ఈ నిధుల ఖర్చు ఇలా..
► వివిధ పథకాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వైఎస్సార్‌ నవశకం ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆయా వర్గాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, తదితర పథకాలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు.
► అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకం (విదేశీ విద్య) ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.15 లక్షలు, ఈబీసీలకు రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. డిగ్రీ పాసైన వారికి బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు యూపీఎస్‌ఈ, గ్రూప్‌1, 2, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, ఏపీపీఎస్సీ, ఇతర ఎంట్రెన్స్‌ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్‌ స్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. 
► వైఎస్సార్‌ పెళ్లి కానుక ద్వారా బీసీలకు రూ.75 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,00,000, దివ్యాంగులకు రూ. 1.20 లక్షలు ఇస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తారు. 
► బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీలకు సామాజిక భవనాల నిర్మాణాలు, పెళ్లిళ్లు, ఇతర సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
► సంక్షేమ కార్పొరేషన్‌ల ద్వారా ఆర్థికంగా స్థిరపడేందుకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేస్తారు.
► 28.59 లక్షల మంది బీసీలకు పెన్షన్‌ కానుక, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు కూడా పెన్షన్‌ కానుక.
► ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రత్యేక కేటాయింపులు.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున నిధుల కేటాయింపు.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీల్లోని ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం. ఆయా వర్గాల్లోని రైతులకు ఉచితంగా బోర్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు. 
► వైఎస్సార్‌ ఆసరా ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం.
► వృత్తిని నమ్ముకుని బతుకుతున్న చేనేతలకు రూ.24 వేల ఆర్థిక సాయం. 
► వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో 45 నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750ల లెక్కన నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. 
► వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ఆర్థిక సాయం అందిస్తారు. 

కాపు కార్పొరేషన్‌కు రూ.2845.60 కోట్లు
కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో గత ఏడాది కంటే రూ.830.95 కోట్లను అధికంగా కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.2845.60 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.2014.65 కోట్లు కేటాయించింది. కాపు నేస్తం పథకం కింద మహిళలు చిన్న చిన్న వ్యాపారులు చేసుకోడానికి సాలీనా రూ.15 వేలు చొప్పున ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తం బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న 1.20 కోట్ల కాపులు ఈ కేటాయింపుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement