ప్చ్.. ఉపయోగం లేదు | Budget allocations | Sakshi
Sakshi News home page

ప్చ్.. ఉపయోగం లేదు

Published Sun, Mar 1 2015 1:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Budget allocations

ఆశల పల్లకిలో ఊరేగించి ఉసూరుమనిపించారు. సర్వీస్ టాక్స్ పెంచి సామాన్యులపై భారం వేశారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచకుండా ఉద్యోగుల్లో అసంతృప్తి రగిల్చారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను విస్మరించి రైతులను గాలికొదిలేశారు. నవ్యాంధ్ర నిర్మాణానికి అరకొర నిధులు కేటారుుంచి జనం ఆశలపై నీళ్లు చల్లారు. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర సాధారణ బడ్జెట్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఒరిగిందేమీ లేదని పలువురు విమర్శించారు. బడ్జెట్ బాగుం దని బీజేపీ నాయకుల్లో కొందరు పేర్కొనగా.. మరికొందరు మొహం చాటేశారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని టీడీపీ ప్రజా ప్రతినిధులు పెదవి విరిచారు. బడ్జెట్ కేటాయింపులు బీజేపీ, టీడీపీ మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాయని విశ్లేషకులు తేల్చారు.
 
 నో కామెంట్
 కేంద్ర బడ్జెట్ తీరుతెన్నులపై స్పందించడానికి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు నిరాకరించారు. బడ్జెట్‌లో కేటాయింపులు, ఏపీకి ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించకపోవడం వంటి అంశాలపై ఎంపీని ఫోన్‌లో అభిప్రాయం కోరగా ఆయన చెప్పడానికి ఏమీలేదు, నో కామెంట్ అంటూ నిరాశను వ్యక్తపరిచారు.
 -గోకరాజు గంగరాజు, నరసాపురం ఎంపీ
 
 నిష్ర్పయోజనం
 బడ్జెట్‌తో రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం లేదు. రాష్ట్ర విభజనతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రత్యేక హోదాపై ఊసెత్తకపోగా, రాష్ట్రానికి ఏవిధమైన రాయితీలు ప్రకటించకపోవడం దారుణం. ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కేటాయించడం రైతులను పూర్తిగా నిరుత్సాహపరిచింది. ప్రధాని మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ముచేశారు. రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడమే కారణం.  
  - మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ
 
 వెనుకబడిన ప్రాంతాలకు నిధుల్లేవు
 బడ్జెట్‌తో పేదలకు ఉపయోగం ఏమీ లేదు. జైట్లీ బడ్జెట్ పోలవరం ప్రాజెక్ట్‌కి రూ.100 కోట్లు కేటాయించటం దురదృష్టకరం. పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకి చరిత్ర ఉండదు. ఏడాదికి రూ.100 కోట్లిస్తే ఎన్నేళ్లకు ప్రాజెక్ట్ పూర్తవుతుంది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటారుుంచలేదు. బడ్జెట్‌పై టీడీపీ నేతలే భిన్నస్వరాలు వ్యక్తమవుతున్నారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విసిగిపోయూరు.
 -తెల్లం బాలరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 
 నిరాశాజనకం
 బీజేపీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. పెట్టుబడిదారులు, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేదిగా ఉంది తప్పా సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగం లేదు. రాష్ట్రం విడిపోవడానికి మద్దతు తెలిపిన బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయలేదు. టీడీపీ మిత్రపక్షమైనా ఇది న్యాయం కాదని అడగలేని పరిస్థితి. కొత్త రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు ఉంటేఅభివృద్ధి చేయవచ్చన్న సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
 - కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ తణుకు సమన్వయకర్త  
 
 ప్రత్యేక హోదాను విస్మరించారు
 ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి 9 నెలలు గడచినా బడ్జెట్‌లో ఏ విధమైన ప్రయోజనం కల్పించలేదు. ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రస్తావన చేయలేదు. గ్రామీణ పాడి పరిశ్రమకు రాయితీలు లేవు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు విడుదల చేయడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటారుుంపు లేదు.  
 - అంగర రామ్మోహన్, ప్రభుత్వ విప్
 
 కార్పొరేట్ శక్తులకు అనుకూలం
 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో కార్పొరేట్ శక్తుల అభివృద్ధికే తప్ప పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పెట్రోల్ ధర లు తగ్గించకపోవడం ఆశ్చర్యం. రాష్ట్ర విభజన నేపథ్యంలో చెప్పినట్టుగా రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపు లేకపోవడం బాధాకరం.
 - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 రాష్ట్రానికి అన్యాయం
 మౌళిక వసతుల కల్పనకు అరుణ్‌జైట్లీ బడ్జెట్ పెద్ద పీట వేసింది. కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ భారీగా పరిశ్రమలు నెలకొల్పేం దుకు అవకాశాలు కల్పించింది. స్టార్టప్ కంపెనీలకు రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి ఉపశమనం కలగలేదు. నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది.
 - అంబికా కృష్ణ, టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షుడు
 
 ఉసూరుమనిపించారు
 కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. విభజన అనంతరం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని ఆశల పల్లకిలో ఊరేగిన అన్ని వర్గాల ప్రజలను ఉసూరుమనిపించింది. ఇది బీజేపీ ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించడం ఏ మూలకు సరిపోతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకశాల కల్పనలో నిర్మాణాత్మక పాత్ర లోపించింది.
 - తేరా రాజేష్, మార్కెటింగ్ విశ్లేషకులు
 
 సర్వీస్ టాక్స్ పెంపుతో భారం
 సర్వీసు ట్యాక్స్‌ను 12 నుంచి 14 శాతానికి పెంచి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై ఎన్‌డీఏ ప్రభుత్వం భారాలు మోపింది. ఫలితంగా రూ.15 వేల కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఆదాయ పన్ను పరిమితిని యథాతథంగా ఉంచడం ఉద్యోగ వర్గాలను కలిచివేసింది. 41 కోట్ల పైబడి ఉన్న కార్మికుల ప్రయోజనాలకు ప్రభుత్వం విలువ ఇవ్వకపోవడం శోచనీయం.
 - డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
 
 అన్ని వర్గాలకూ మేలు
 శ్రామికులు, రైతులు, పేద ప్రజలు, యువత, అన్ని వర్గాల శ్రేయస్సుకు బడ్జెట్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్తగా పేదలకు పెన్షన్ పథకాలు, 2022 నాటికి అందరికి ఇళ్లు, ఆరు కోట్ల టాయిలెట్స్ నిర్మాణం పేద వర్గాలకు శుభపరిణామం.
 - చలమల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర సమితి సభ్యుడు
 
 రైతులకు ఒరిగిందేమీ లేదు
 బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. కౌలు రైతులు, సాగుదారుల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించలేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేసి మద్దతు ధర పెంచుతామని ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. రైతుల సాగు వదిలేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు సహకరించేలా వ్యవహరించింది.
 - కె.శ్రీనివాస్, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
 హర్షణీయం
 సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లు కేటారుుంచడం హర్షణీయం. సీనియర్ సిటీజన్ల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటారుుంచాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. బీమా ప్రీమియం రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంచడం వల్ల ఒరిగేదేమి ఉండదు. ఆదాయ పన్ను పరిమితిని రూ.4 లక్షలకు పెంచుతారని ఆశించాం.

 - వెంపరాల నారాయణమూర్తి, సీనియర్ సిటీజన్ల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 జీతాలు పెరిగినా పన్నులకే సరి.. ప్రభుత్వ ఉద్యోగులు ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని ఆశించాం. అయితే ఉద్యోగుల ఆశలను కేంద్ర బడ్జెట్ నిరాశ పర్చింది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెరిగినా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం సరికాదు.
 -కె.రాధాపుష్పావతి, రీడర్, ఎస్‌కెఎస్‌డీ కళాశాల, తణుకు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement