
సాక్షి, అమరావతి : అప్పులు, నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రూ.4,758 కోట్లు కేటాయించాలని యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. ఈ నిధులు కేటాయిస్తేతప్ప ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడలేని పరిస్థితి ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఆర్టీసీకి రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం కలిపి రూ.6,370 కోట్ల వరకూ ఉన్నాయి. అయితే ఆర్టీసీకి ఏడాదికి ట్రాఫిక్ రెవెన్యూ, సరుకు రవాణా, బీవోటీ స్థలాలపై ఆదాయం మొత్తం రూ.5,996 కోట్లు వస్తుంటే.. ఎంవీ ట్యాక్స్, బస్సుల నిర్వహణ, డీజిల్ భారం, రుణాలకు వడ్డీల భారం తదితరాలు కలిపి రూ.6,994 కోట్ల వరకూ ఖర్చవుతోంది. అంటే రూ.998 కోట్ల వరకు నష్టాలొస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే ఆర్టీసీకి ఇతోధికంగా సాయమందించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నెల రెండో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై కసరత్తు ప్రారంభించనుంది.
గత నాలుగేళ్లలో రూ.560 కోట్లు దాటని కేటాయింపులు
ఆర్టీసీకి గత ప్రభుత్వం నాలుగేళ్లలో ఏ ఏడాదీ రూ.560 కోట్లకు మించి కేటాయింపులు జరపలేదు. రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని 2015–16లో ప్రభుత్వాన్ని కోరితే.. కేవలం రూ.367.29 కోట్లతోనే అప్పటి ప్రభుత్వం సరిపెట్టింది. అప్పటి నుంచి 2018–19 వరకు బడ్జెట్ కేటాయింపుల్లో ఆర్టీసీకి మొండిచెయ్యి చూపుతోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం, మూడు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఈ నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉంటాయని యాజమాన్యం భావిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment