వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు. చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది.
పల్నాటి ప్రజల 70 ఏళ్ల స్వప్నం..
వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ఇదీ..
► పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన జలాల్లో కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి(80 కి.మీ. వద్దకు) ఎత్తి పోస్తారు. కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూనే పల్నాటి సీమకు గోదావరి జలాలను తరలిస్తారు.
► ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగా ర్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను రెండు ప్యాకేజీలుగా చేపడతారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను రూ.2,845 కోట్ల వ్యయంతో, రెండో ప్యాకేజీ పనులను రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు.
వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ఇదీ..
వరికపుడిశెల వాగు వరద జలాలను ఒడిసి పట్టి పల్నాటి సీమను సస్యశ్యామలం చేయాలనే ప్రతిపాదన ఏడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల పథకానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం తొలిదశను రూ.350 కోట్లతో, రెండో దశను రూ.1,400 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.
వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్‌కు శ్రీకారం..
వరికపుడిశెల ఎత్తిపోతల పనులను రూ.1,750 కోట్లతోనూ, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను రూ.6,020 కోట్లతో వెరసి రూ.7,770 కోట్ల వ్యయంతో వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రిని కలిసిన పల్నాడు ప్రజాప్రతినిధులు
పల్నాడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిశారు. పల్నాటి ప్రజల చిరకాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా మిగిలిన వరికపుడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్సార్ పల్నాడు దుర్బిక్ష నివారణ మిషన్‌లో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment