సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రులు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలు తీరాకే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా తమిళనాడుకు గోదావరి వరద జలాలను తరలించడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి.. పరిపాలన సంస్కరణలు, మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్ బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు.
నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గత నెల 26న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తమ రాష్ట్ర అవసరాలు తీరాకే గోదావరి వరద జలాలను తమిళనాడుకు తరలించడానికి సమ్మతిస్తామని ఏపీ సర్కార్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నదుల అనుసంధానానికి సహకరించాలని కోరేందుకు తమిళనాడు మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సీఎంలు ఏకాభిప్రాయానికి వస్తే, జాతీయ ప్రాజెక్టుగా ఆ అనుసంధానాన్ని చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని ఇద్దరు మంత్రులు వివరించారు.
కృష్ణా ప్రాజెక్టులకు నీటి కొరత
కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. తమ రాష్ట్రానికి ఏ మేరకు గోదావరి జలాలను తరలిస్తారో ఆ దామాషా పద్ధతిలో ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని భరిస్తామని తమిళనాడు మంత్రులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతోన్న నేపథ్యంలో పోలవరం– కృష్ణా (ప్రకాశం బ్యారేజీ)–బొల్లాపల్లి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) అనుసంధానం పనులు చేపట్టడంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
గోదావరి నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను కృష్ణా నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే.. కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించవచ్చని.. అప్పుడు మిగులుగా ఉన్న జలాలను కావేరికి తరలించవచ్చని చేసిన ప్రతిపాదనతో తమిళనాడు మంత్రులు ఏకీభవించారు. కాగా, చెన్నైకి నీటిని సరఫరా చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి బకాయి పడిన రూ.348 కోట్లలో రూ.25 కోట్ల మేర చెక్కును ఆ రాష్ట్ర మంత్రులు సీఎంకు అందజేశారు. చెన్నైలో తాగునీటి ఎద్దడి నివారణకు కండలేరు జలాశయం నుంచి రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న వారి ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశమవుతున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment