CM Jagan Special Focus On Irrigation Projects Directs Officials To Complete Them Promptly - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు

Published Tue, Jun 20 2023 3:46 AM | Last Updated on Tue, Jun 20 2023 9:55 AM

CM Jagan Special focus on irrigation projects Complete Andhra Pradesh - Sakshi

కేంద్రం ప్రదానం చేసిన జాతీయ జల అవార్డుతో సీఎం వైఎస్‌ జగన్, మంత్రి అంబటి, ఉన్నతాధికారులు

సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధి­కా­రు­లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధా­న్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువు­లోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాల­న్నారు.

పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు.

సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా..
గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌(సొరంగం)లో ఫాల్ట్‌ జోన్‌ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్‌ ఫోమ్‌ గ్రౌటింగ్‌ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.  నాన్‌ ఫాల్ట్‌ జోన్‌లో మరో 149 మీటర్ల లైనింగ్‌ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని  జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత డిజైన్‌ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్‌ రెగ్యులేటర్‌ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్‌లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే  17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్‌ అక్టోబర్‌కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేస్తామన్నారు.

వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్‌ కెనాల్, హెడ్‌ రెగ్యులేటర్‌తోపాటు ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

► వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే  పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్‌–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్‌ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

శరవేగంగా పోలవరం.. 
► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్‌ఎఫ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్‌తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

► ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. 

► గైడ్‌ బండ్‌లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్‌ బండ్‌లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు.

గైడ్‌ బండ్‌లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్‌ డంప్, సిమెంట్‌ స్లర్రీతో నింపి గాబియన్‌లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్‌ బండ్‌ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్‌ బండ్‌ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్‌ నోట్‌ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్‌ సూచించారు.

► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 

► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 

సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్‌ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

అంబటి, అధికారులకు సీఎం అభినందనలు
నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్‌ వాటర్‌ అవార్డ్స్‌–2022) ఆంధ్రప్రదేశ్‌ నాలుగు అవార్డులను  దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ తృతీయ స్థానంలో నిలిచింది.

శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌కర్‌ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ  సి.నారాయణరెడ్డి సీఎం జగన్‌కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement