galeru nagari sujala sravanthi project
-
కరువు ప్రాంతానికి నీరు తెచ్చిన ఘనత సీఎం జగన్ దే
-
Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాలన్నారు. పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాన్ ఫాల్ట్ జోన్లో మరో 149 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్ రెగ్యులేటర్ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే 17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ అక్టోబర్‌కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్‌ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా పోలవరం.. ► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్‌తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ► గైడ్ బండ్లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్ బండ్లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. గైడ్ బండ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్, సిమెంట్ స్లర్రీతో నింపి గాబియన్లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్ బండ్‌ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్ బండ్‌ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్ నోట్ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అంబటి, అధికారులకు సీఎం అభినందనలు నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్ వాటర్ అవార్డ్స్–2022) ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సీఎం జగన్‌కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. -
గాలేరు నగరిపై కట్టుకథలు
-
‘ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు!
అధికారంలో తన వాడుంటే... ఏమీ చేయకపోయినా ప్రశ్నలుండవు. అన్నీ ప్రశంసలే. అదే వేరొకరుంటే మాత్రం... ప్రశంసించాల్సిన చోట కూడా ప్రశ్నలే ఉంటాయి. ఇదీ... రామోజీరావు విధానం. ఇదే ‘ఈనాడు’కు ప్రధానం కూడా. చాలా ప్రాజెక్టుల్ని 2014–19 మధ్య ఐదేళ్ల పాటు చంద్రబాబు గాలికొదిలేసినా అప్పట్లో రామోజీ కంటికవి ఆనలేదు. ఇక 1996 నుంచి 2004 మధ్య సీఎంగా ఉన్నపుడు అసలు ప్రాజెక్టుల ఊసే ఎత్తకపోయినా... చంద్రబాబు కాబట్టి ‘ఈనాడు’కది కనీసం వార్తగా కూడా కనిపించలేదు. కానీ గడిచిన మూడేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టులపై దృష్టిపెట్టి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి.. ఆయకట్టుల్ని స్థిరీకరిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం నచ్చటం లేదు. అందుకే.. ప్రశంసించాల్సిన చోట కూడా తప్పుడు కథనాలతో ప్రశ్నలే వేస్తున్నారు రామోజీ!!. ‘రైతు ఆశలపై నీళ్లు’ అంటూ అసత్యాలు, అర్థసత్యాలతో శుక్రవారం వండి వార్చిన కథనంలో అసలు నిజమెంత? ఏది నిజం? చూద్దాం... రైతుల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తూ 2004లో జలయజ్ఞంలో భాగంగా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ పథకంలో అంతర్భాగమైన గండికోట, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పూర్తి చేసిందీ ఆయనే. కానీ రామోజీ ‘పచ్చ’కామెర్ల కళ్లకు ఇవన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో చేసినట్లుగానే కనిపిస్తున్నాయి. అందుకే 2019, జూన్‌లో 1,500 ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లందిస్తే... అదంతా టీడీపీ సర్కార్ హయాంలో పూర్తయిన పనుల వల్లే సాధ్యమయిందని, కాబట్టే ఆ మేరకైనా ఆయకట్టుకు నీళ్లందించగలిగారని వక్రీకరించేశారు. కానీ నిజమేంటో తెలుసా? రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... మిగిలిపోయిన కొందరు నిర్వాసితులకు కూడా ఐదేళ్ల కాలంలో కనీసం పునరావాసం కల్పించలేకపోయారు. దీంతో గండికోట, వామికొండ, సర్వారాయసాగర్‌లలో అరకొరగానే నీటి నిల్వ సాధ్యమయింది. నిల్వ సామర్థ్యం లేక వందల టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద కొత్తగా ఒక్కటంటే ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయారు. ఇవీ ‘ఈనాడు’ ప్రశ్నించడానికి ఇష్టపడని నిజాలు. గరిష్ఠ నీటి నిల్వలు కంటికి కన్పించలేదా?: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసి.. రైతుల ఆశలను నెరవేర్చడానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే శ్రీకారం చుట్టారు. నిర్వాసితులకు రూ.640 కోట్లను పరిహారం చెల్లించి.. పునరావాసం కల్పించి.. గండికోట రిజర్వాయర్ 2020లోనే పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. వామికొండ సాగర్‌లో 1.66, సర్వారాయసాగర్‌లో 1.2 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. నిర్వాసితులకు రూ.240 కోట్లను పరిహారంగా చెల్లించి... పునరావాసం కల్పించి.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2020లోనే పూర్తి స్థాయిలో 10.20 టీఎంసీలు నిల్వ చేశారు. అదే రీతిలో పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలు నిల్వ చేశారు. ఇవేవీ రామోజీరావు కంటికి కన్పించకపోవడమే అసలైన దుర్మార్గం. వీటిని విస్మరించి రైతుల ఆశలపై నీళ్లు చల్లారంటూ రాయటమే దారుణాతిదారుణం. దగుల్బాజీ రాతలెందుకు రామోజీ..?: టీడీపీ సర్కార్ హయాంలో ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చంద్రబాబు పట్టించుకుంటే ఒట్టు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఓ వైపున జలాశయాల్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూనే.. మరో వైపు డిస్ట్రిబ్యూటరీల పనులు చేయిస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. గండికోట కింద 9,500 ఎకరాలు, వామికొండసాగర్ కింద 1,500 ఎకరాలు, సర్వారాయసాగర్ కింద 3 వేల ఎకరాలు, పైడిపాలెం రిజర్వాయర్ కింద 12,500 ఎకరాలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద 61 వేల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అబద్ధాలు అచ్చేయటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మాత్రం... డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకుండా రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందంటూ విషం చిమ్మింది. దుష్ప్రచారానికి అడ్డూఅదుపూ లేదా? భారతి సిమెంట్స్ పరిశ్రమ తొలుత 0.06 టీఎంసీలను వినియోగించుకోవడానికి 2007, నవంబర్ 24న జీవో ఎంఎస్ నెం: 252 ద్వారా ఒక సారి.. 2008, ఫిబ్రవరి 1న జీవో ఎంఎస్ నెం:18 ద్వారా 0.09 టీఎంసీలు వాడుకోవడానికి మరోసారి అనుమతి తీసుకుంది. వాటి ఆధారంగా 2019, ఫిబ్రవరి 5న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పైపులైన్ వేసుకుని.. నీటిని వాడుకుంటోంది. వినియోగించుకున్న ప్రతి నీటి బొట్టుకూ ప్రభుత్వం నిర్ణయించిన పన్ను చెల్లిస్తోంది. నీటి పన్ను రూపంలో 2020, మార్చి నుంచి 2022, మార్చి వరకూ ప్రభుత్వానికి రూ.2,68,843.98 చెల్లించింది. పైపెచ్చు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇక సర్వారాయసాగర్, వామికొండసాగర్ల నిర్మాణంలో మట్టికట్ట పనుల కోసం మట్టి సమీపంలో దొరకకపోవడంతో కొంత భూమిలో మట్టిని తవ్వి తరలించారు. ఆ భూమి చెరువుగా మారింది. అందులో చేపల పెంపకం కోసం రైతులు ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు. వాటికి వినియోగించే ప్రతి వెయ్యి గ్యాలన్ల నీటికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రూ.5.50 చొప్పున రైతులు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కూడా రామోజీకి అస్సలు నచ్చటం లేదు. భారతి సిమెంట్స్, చేపల రైతుల కోసమే జలాశయాల నీటిని వాడుకున్నట్లు అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తూ... సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లటానికి తెగబడ్డారు. ఇంతకీ రామోజీకి నచ్చనిదేంటో తెలుసా? ముఖ్యమంత్రిగా తాను కష్టపడి గద్దెనెక్కించిన చంద్రబాబు లేకపోవటమే. అదీ అసలు నిజం. మరి.. దీన్నేమంటారు రామోజీరావు? 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు ముందు గండికోట వద్ద గాలేరు–నగరి సుజల స్రవంతికి తొలుత చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు.. ఎన్నికలయ్యాక ఆ ప్రాజెక్టు పేరు కూడా మరిచిపోయారు. ఇంతలోనే 1999 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద చంద్రబాబు మరో సారి గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. రైతులను నమ్మించడానికి తట్టెడు మట్టి కూడా ఎత్తారు. కానీ.. ఎన్నికలు పూర్తయ్యాక ఆ ఊసెత్తితే ఒట్టు. 1995 నుంచి 2004 మధ్య తొమ్మిదేళ్లలో ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు. అదీ ఉద్యోగుల జీతభత్యాల కోసం. ఓట్ల కోసం నాటకాలాడి రైతు ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు దాష్టీకాలు రామోజీరావుకు ఎప్పుడూ కమ్మగానే కనిపించాయి. ఆయన రెండు సార్లు శంకుస్థాపనలు చేస్తే రెండుసార్లూ చక్కని ఫొటోలతో కవరేజీ ఇచ్చిన ఈనాడు... బాబు మోసాలపై ఒక్కటంటే ఒక్క కథనాన్ని కూడా అచ్చేయలేదు మరి. -
‘నాడు–నేడు’కు రూ.1,350.33 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ‘మనబడి.. నాడు–నేడు’ కింద మొదటి దశలో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.1,350.33 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ప్రాంతాల్లోని 470 స్కూళ్లకు ప్రహరీలు, 14,010 పాఠశాలలకు రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, 14,250 స్కూళ్లలో మంచినీటి సరఫరా సదుపాయం, 11,952 స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటు, 14,776 స్కూళ్లలో మరమ్మతు పనులకు ఈ నిధులు విడుదల చేశారు. ఏపీఆర్డీసీకి రూ.133.50 కోట్లు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బ్యాంకు రుణాల వడ్డీ కింద రూ.133.50 కోట్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020–21 బడ్జెట్ కింద మొదటి త్రైమాసికానికి గాను ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. గాలేరు–నగరి వరద కాలువ వెడల్పునకు గ్రీన్ సిగ్నల్ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువను వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచేలా కాలువను వెడల్పు చేసేందుకు రూ.632.88 కోట్లతో పరిపాలన అనుమతిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులు పూర్తిచేయడం ద్వారా శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడిన ప్రాజెక్టులను నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల కృష్ణా నదికి వచ్చే వరద రోజులు తగ్గిపోతుండటం, వచ్చిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వస్తుండడంతో.. ఆ వరదను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపడానికి వాటి కాలువల సామర్థ్యాన్ని పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
గాలేరు – నగరి రెండో దశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండో ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ పథకం రెండో దశలో ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి ప్రీ–క్లోజర్ చేసుకునేలా చక్రం తిప్పిన గత ప్రభుత్వ పెద్ద.. ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచి, అధిక ధరకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. రెండో ప్యాకేజీ (గాలేరు–నగరి ప్రధాన కాలువ 66.15 కిలోమీటర్ల నుంచి 96.50 కిలోమీటర్ల వరకు తవ్వడం, 12 వేల ఎకరాలకు నీళ్లందించడానికి పిల్ల కాలువలు తవ్వడం) పనుల అంచనా వ్యయాన్ని రూ.343.97 కోట్లకు పెంచి లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్లను జారీ చేయించారు. తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌ను కాదని బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేయించారు. ఆ కాంట్రాక్టర్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఆ కేసు విచారణలో ఉండగానే సింగిల్ బిడ్‌గా దాఖలు చేసిన టెండర్‌ను ఆమోదించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి 4.76 శాతం అధిక ధర (రూ.360.35)కు ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారు. దాంతో ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా చేసింది.. పనులు ప్రారంభించకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిన గాలేరు–నగరి అధికారులు.. రూ.343.97 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో ఆ పనులు పూర్తిచేయాలనే షరతుతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్స్ బిడ్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు తెరిచారు. నాలుగు సంస్థలు (ఎమ్మార్కేఆర్, ఎస్సీఎల్, బీవీఎస్సార్, బృందా ఇన్ఫ్రాటెక్) పోటీ పడుతూ బిడ్లు దాఖలు చేశాయి. 4.5 శాతం తక్కువ ధర (రూ.328.50 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.15.47 కోట్లు ఆదా అయ్యాయి. రూ.328.50 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఐదు శాతం తక్కువ ధర(రూ.326.78 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచించింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు గాలేరు–నగరి అధికారులు నివేదిక పంపనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.17.19 కోట్లు ఆదా అయ్యాయి. గతంతో 4.76 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా 9.76 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. కాగా, ఈ నెల 19న రెండో దశలోని మొదటి ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల రూ.35.3 కోట్లు ఖజానాకు ఆదా అయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇప్పటి దాకా రూ.1752.83 కోట్లు ఆదా అయ్యాయి. టిడ్కో నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48కోట్లు ఆదా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) నిర్వహించిన నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8,448 ఇళ్ల నిర్మాణానికి ఏపీ టిడ్కో శుక్రవారం రూ.431.62 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు పిలవగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రూ.384.14 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో రూ.47.48 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. ఇంతకు ముందు మూడు దశల్లో 40,160 ఇళ్ల నిర్మాణానికి ఈ విధానం ద్వారా రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలిన విషయం తెలిసిందే. మొత్తంగా నాలుగు దశల్లో 48,608 ఇళ్ల నిర్మాణానికి రూ.2,399 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు నిర్వహించగా రూ.303.31 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నందున మరిన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. -
గాలేరు–నగరి రెండో దశలో రూ.35.3 కోట్లు ఆదా
-
గాలేరు–నగరిలో రూ.35.3 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ తొలి ప్యాకేజీ పనులకు రూ.391.13 కోట్ల అంచనా వ్యయంతో గురువారం ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విజయవంతం అయ్యింది. 5.04 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఆ పనులను దక్కించుకుంది. ఎన్నికలకు ముందు ఇదే పనులను 3.99 శాతం అధిక ధరకు తన బినామీ అయిన సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అప్పట్లో ఖజానాపై రూ.15.60 కోట్ల భారం పడింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సర్కారు ఈ పనులను రద్దు చేసి, తాజాగా టెండర్లు నిర్వహించి.. 9.03 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 2 నెలల ముందు సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేంచేందుకు గాలేరు–నగరి రెండో దశలోని ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఒప్పందాలను ‘ప్రీ–క్లోజ్’ చేసుకునేలా చంద్రబాబు చక్రం తిప్పారు. ఇదీ టెండర్ కథాకమామిషూ ►మొదటి ప్యాకేజీ (ప్రధాన కాలువ 32.64 కిలోమీటర్ల నుంచి 66.15 కిలోమీటర్ల వరకు తవ్వకం.. పది వేల ఎకరాలకు నీళ్లందించేలా పిల్ల కాలువలు తవ్వడం) పనుల వ్యయాన్ని 2018–19 ధరల ప్రకారం రూ.391.13 కోట్లుగా నిర్ణయించి గత ప్రభుత్వం లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ►తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలపై సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంపై కాంట్రాక్టు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయ విచారణ జరుగుతున్నా లెక్క చేయకుండా.. మొదటి ప్యాకేజీ పనులను 3.99 శాతం అధిక ధర (రూ.406.73 కోట్లు)కు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. ►రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారు చేసి.. పనులు ప్రారంభించని కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసింది. గత ప్రభుత్వం నిర్ణయించిన రూ.391.13 కోట్ల విలువైన పనులకు ఈ నెల 2న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ప్రైస్ బిడ్ తెరవగా రెండు సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ►ప్రైస్ బిడ్, రివర్స్ టెండరింగ్‌లో 5.04 శాతం తక్కువ ధరకు (రూ.371.43 కోట్లు) కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపుతామని ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద 9.03 శాతం తక్కువ ధరలకే ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి దాకా రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన మొత్తం రూ.1567.89 కోట్లకు చేరింది. -
‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర
-
‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర
సాక్షి, తిరుమల : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ మంత్రి అ'మాయకుడు'
గాలేరు నగరి ప్రాజెక్టులో బయటపడ్డ గోల్మాల్ 12 కోట్ల అంచనా వ్యయం 110 కోట్లకు పెంచారు.. సొంత పార్టీ ఎంపీకి కట్టబెట్టారు రూ.35 కోట్ల మేర బిల్లులూ చెల్లించారు... కానీ అవేవీ తనకు తెలియవంటున్న నీటిపారుదల శాఖ మంత్రి కమిషన్లు.. వాటాలు తేలకే బయటపడ్డ కుంభకోణం పరిపాలనా అనుమతులు కూడా లేవని తేల్చిన నిపుణుల కమిటీ మంత్రిని వదిలేసి తమను బలిచేస్తారని భయపడుతున్న అధికారులు హైదరాబాద్: ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 12 కోట్ల నుంచి రూ.110 కోట్లకు పెంచేశారు... అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కి ఆ కాంట్రాక్టు కట్టబెట్టారు... కాంట్రాక్టర్‌కు రూ. 35 కోట్ల మేర రెండు బిల్లులూ చెల్లించేశారు... అసలు పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచారని నిపుణుల కమిటీ తేల్చింది.. విచిత్రమేమిటంటే ఈ విషయాలేవీ ఆ శాఖ మంత్రికి తెలియవట. ఒక శాఖలో ఇన్ని జరుగుతుంటే ఆ శాఖ మంత్రికే తెలియకుండా ఉంటుందా..? తాను అమాయకుణ్ణని చెబితే కుదురుతుందా? మంత్రికి తెలియకుండానే ఏ ప్రాజెక్టయినా బిల్లుల చెల్లింపు వరకు ముందుకు సాగుతుందా? అలాంటి మంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు ఉంటుందా..? ఇంతకీ అది ఏ ప్రాజెక్టు..? ఆ మంత్రి ఎవరు అనేగా మీ సందేహం... ఆ ప్రాజెక్టు... గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో 29వ ప్యాకేజీ... కాంట్రాక్టు కట్టబెట్టింది... తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కి.. తనకేమీ తెలియదని చెబుతున్న ఆయన.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టులో భాగంగా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు వరద కాల్వ నిర్మాణంలో మిగిలిపోయిన పనులకు సంబంధించిన వ్యవహారం ఇది. మిగిలిపోయిన పనుల విలువ రూ.12 కోట్లే.. కానీ అంచనాలను భారీగా పెంచి రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారు. చివరకు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. రూ.35 కోట్ల మేర చెల్లింపులు జరిపేసిన ఈ వ్యవహారంలో తాజాగా అనేక కొత్త నిజాలు బయటపడుతున్నాయి. రెండు బిల్లులు చెల్లించేశారు..: అడ్డగోలుగా కాం ట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా కాంట్రాక్టర్‌కు 2 బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. రూ. 110 కోట్ల కాంట్రాక్టులో దాదాపు రూ.35 కోట్ల బిల్లులు కాం ట్రాక్టర్ తీసుకున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎంత బిల్లు చెల్లించారనేది సాగునీటి శాఖలోని ‘ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ ప్రతివారం నివేదిక రూపొందించి మంత్రికిస్తారు. మంత్రి అనుమతి లేకుండా సాగునీటి శాఖలో ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించరు. కానీ జీఎన్ఎస్ఎస్ 29వ ప్యాకేజీ బిల్లులు చెల్లించిన విషయం తన దృష్టికి రాలేదని దేవినేని చెబుతున్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, మంత్రికి తెలియకుండా ఏమీ జరిగే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతులు లేకుండానే బిల్లుల చెల్లింపు మరో నిర్ఘాంతపోయే నిజమేమిటంటే.. అసలు ఎలాంటి పరిపాలనా అనుమతులు లేకుండానే రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారని ఈ వ్యవహారంపై నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మరి పరిపాలనా అనుమతులు లేకుండానే దాదాపు రూ. 35 కోట్ల విలువైన బిల్లులు ఎలా చెల్లించారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సాగునీటి శాఖలో, అటు ఆర్థిక శాఖలో ఉన్నతాధికారుల సహకారం ఉంటే తప్ప బిల్లుల చెల్లింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాటాలు దక్కకే బయటకు పొక్కింది.. పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచాలనే ప్రతిపాదన మొదలు.. టెండర్లు పిలిచే ప్రతిపాదన, బిడ్ల పరిశీలన, కాంట్రాక్టర్ ఎంపిక, ప్రభుత్వం-కాంట్రాక్టర్ మధ్య ఒప్పందం.. అన్ని దశల్లోనూ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఏమీ జరిగే అవకాశంలేదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. అన్ని దశల్లోనూ అడ్డగోలు వ్యవహారాలు నిరాటంకంగా జరిగిపోయాయి. వాస్తవ పని విలువపై దాదాపు రూ. 100 కోట్లు అదనంగా ఉన్నందున.. ఆమేరకు వాటా వస్తుందని ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఎంపీకి సహకరించిన వారు భావించారు. తీరా టెండర్ దక్కించుకున్న తర్వాత.. ఆశించిన స్థాయిలో వాటాలు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాతే వ్యవహారం బయటకు పొక్కిందని నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఎవరి మీద చర్యలు?: పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి అధికార పార్టీ ఎంపీకి కాంట్రాక్టు కట్టబెట్టడంతో పాటు బిల్లులు కూడా చెల్లించిన తర్వాత.. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కారని.. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా జరగడానికి అవకాశం లేదని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. సాగునీటి శాఖలో ఇంత భారీ అవినీతి వ్యవహారం జరిగిన నేపథ్యంలో.. ఆ శాఖ మంత్రి మీద ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారా? కిందిస్థాయి అధికారులను బలిపశువులను చేస్తారా? అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది.