ఆ మంత్రి అ'మాయకుడు' | golmaal in galeru nagari | Sakshi
Sakshi News home page

ఆ మంత్రి అ'మాయకుడు'

Published Sat, Nov 7 2015 9:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

ఆ మంత్రి అ'మాయకుడు'

ఆ మంత్రి అ'మాయకుడు'

  • గాలేరు నగరి ప్రాజెక్టులో బయటపడ్డ గోల్‌మాల్
  • 12 కోట్ల అంచనా వ్యయం 110 కోట్లకు పెంచారు..
  • సొంత పార్టీ ఎంపీకి కట్టబెట్టారు
  • రూ.35 కోట్ల మేర బిల్లులూ చెల్లించారు...
  • కానీ అవేవీ తనకు తెలియవంటున్న నీటిపారుదల శాఖ మంత్రి
  • కమిషన్లు.. వాటాలు తేలకే బయటపడ్డ కుంభకోణం
  • పరిపాలనా అనుమతులు కూడా లేవని తేల్చిన నిపుణుల కమిటీ
  • మంత్రిని వదిలేసి తమను బలిచేస్తారని భయపడుతున్న అధికారులు
  •  
    హైదరాబాద్: ప్రాజెక్టు అంచనా వ్యయం  రూ. 12 కోట్ల నుంచి రూ.110 కోట్లకు పెంచేశారు...
    అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కి  ఆ కాంట్రాక్టు కట్టబెట్టారు...
    కాంట్రాక్టర్‌కు రూ. 35 కోట్ల మేర  రెండు బిల్లులూ చెల్లించేశారు...
    అసలు పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచారని నిపుణుల కమిటీ తేల్చింది..

     
    విచిత్రమేమిటంటే ఈ విషయాలేవీ ఆ శాఖ మంత్రికి తెలియవట. ఒక శాఖలో ఇన్ని జరుగుతుంటే ఆ శాఖ మంత్రికే తెలియకుండా ఉంటుందా..? తాను అమాయకుణ్ణని చెబితే కుదురుతుందా? మంత్రికి తెలియకుండానే ఏ ప్రాజెక్టయినా బిల్లుల చెల్లింపు వరకు ముందుకు సాగుతుందా? అలాంటి మంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు ఉంటుందా..?  ఇంతకీ అది ఏ ప్రాజెక్టు..? ఆ మంత్రి ఎవరు అనేగా మీ సందేహం...
     
    ఆ ప్రాజెక్టు... గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో 29వ ప్యాకేజీ...
    కాంట్రాక్టు కట్టబెట్టింది... తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కి..
    తనకేమీ తెలియదని చెబుతున్న ఆయన.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
    గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టులో భాగంగా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు వరద కాల్వ నిర్మాణంలో మిగిలిపోయిన పనులకు సంబంధించిన వ్యవహారం ఇది. మిగిలిపోయిన పనుల విలువ రూ.12 కోట్లే.. కానీ అంచనాలను భారీగా పెంచి రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారు. చివరకు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. రూ.35 కోట్ల మేర చెల్లింపులు జరిపేసిన ఈ వ్యవహారంలో తాజాగా అనేక కొత్త నిజాలు బయటపడుతున్నాయి.
     
    రెండు బిల్లులు చెల్లించేశారు..: అడ్డగోలుగా కాం ట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా కాంట్రాక్టర్‌కు 2 బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. రూ. 110 కోట్ల కాంట్రాక్టులో దాదాపు రూ.35 కోట్ల బిల్లులు కాం ట్రాక్టర్ తీసుకున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎంత బిల్లు చెల్లించారనేది సాగునీటి శాఖలోని ‘ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ ప్రతివారం నివేదిక రూపొందించి మంత్రికిస్తారు.

    మంత్రి అనుమతి లేకుండా సాగునీటి శాఖలో ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించరు. కానీ జీఎన్‌ఎస్‌ఎస్ 29వ ప్యాకేజీ బిల్లులు చెల్లించిన విషయం తన దృష్టికి రాలేదని దేవినేని చెబుతున్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, మంత్రికి తెలియకుండా ఏమీ జరిగే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
     
     
    అనుమతులు లేకుండానే బిల్లుల చెల్లింపు
    మరో నిర్ఘాంతపోయే నిజమేమిటంటే.. అసలు ఎలాంటి పరిపాలనా అనుమతులు లేకుండానే రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారని ఈ వ్యవహారంపై నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మరి పరిపాలనా అనుమతులు లేకుండానే దాదాపు రూ. 35 కోట్ల విలువైన బిల్లులు ఎలా చెల్లించారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సాగునీటి శాఖలో, అటు ఆర్థిక శాఖలో ఉన్నతాధికారుల సహకారం ఉంటే తప్ప బిల్లుల చెల్లింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
    వాటాలు దక్కకే బయటకు పొక్కింది..

    పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచాలనే ప్రతిపాదన మొదలు.. టెండర్లు పిలిచే ప్రతిపాదన, బిడ్ల పరిశీలన, కాంట్రాక్టర్ ఎంపిక, ప్రభుత్వం-కాంట్రాక్టర్ మధ్య ఒప్పందం.. అన్ని దశల్లోనూ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఏమీ జరిగే అవకాశంలేదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. అన్ని దశల్లోనూ అడ్డగోలు వ్యవహారాలు నిరాటంకంగా జరిగిపోయాయి.

    వాస్తవ పని విలువపై దాదాపు రూ. 100 కోట్లు అదనంగా ఉన్నందున.. ఆమేరకు వాటా వస్తుందని ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఎంపీకి సహకరించిన వారు భావించారు. తీరా టెండర్ దక్కించుకున్న తర్వాత.. ఆశించిన స్థాయిలో వాటాలు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాతే వ్యవహారం బయటకు పొక్కిందని నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది.
     
    ఎవరి మీద చర్యలు?: పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి అధికార పార్టీ ఎంపీకి కాంట్రాక్టు కట్టబెట్టడంతో పాటు బిల్లులు కూడా చెల్లించిన తర్వాత.. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కారని.. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా జరగడానికి అవకాశం లేదని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. సాగునీటి శాఖలో ఇంత భారీ అవినీతి వ్యవహారం జరిగిన నేపథ్యంలో.. ఆ శాఖ మంత్రి మీద ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారా? కిందిస్థాయి అధికారులను బలిపశువులను చేస్తారా? అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement