సైకిల్ పార్టీలో ఒకప్పుడాయన ఎంతో కీలక నేత. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే. అంతటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు. ఆయన ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చినా కామ్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీలో ఎక్కడా కనిపించడంలేదని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత ఇప్పుడెందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు? ఇంతకీ ఆ నేత ఎవరు?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అదంతా గత వైభవం. ఇప్పుడు దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా వినిపించడంలేదు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఫిరాయించి మైలవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వసంతకు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమను సైడ్ చేసేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని అధినేత చెప్పిన మాటను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారని టాక్. ఇంతవరకూ బాగానే ఉంది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ పట్టించుకోవడం మానేశారని సమాచారం.
చంద్రబాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందట. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ... టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కచ్చితంగా తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఉమాకు నిరాశే ఎదురయ్యిందట. అందుకే ఇప్పుడాయన పార్టీలో అందరికీ దూరంగా ఉంటున్నారట. కూటమి ఘన విజయం సాధించినా పార్టీ సంబరాల్లో ఉమా ఎక్కడా పాలు పంచుకోలేదట. అధినేతను కలిసి కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపింది లేదట. ఇక సాక్షాత్తూ ప్రధానమంత్రి సమక్షంలోనే తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ..ఎవరితోనూ సంబంధం లేకుండా కామ్ గా ఎక్కడో ఓ మూలన కూర్చుని వెళ్ళిపోయారట.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక చంద్రబాబు తనకు ఏదోరూపంలో ప్రాధాన్యం కల్పిస్తారని దేవినేని ఉమా నమ్మారట. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తేలిపోవడంతో ఇక టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఇప్పుడు అటు టీడీపీలోనూ.. ఇటు మైలవరంలోనూ తెలుగుతమ్ముళ్ల చర్చంతా దేవినేని చుట్టూనే తిరుగుతోందట. ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్‌లా వ్యవహరించిన దేవినేని ఉమా ప్రస్తుత దీన పరిస్థితి తలుచుకుని తెగ ఫీలైపోతున్నారట. అసలు పార్టీలో ఎవరితోనూ కలవడంలేదనే టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment