Mylavaram constituency
-
బాబు పక్కకు నెట్టేశారు.. అజ్ఞాతంలోకి దేవినేని ఉమ!
సైకిల్ పార్టీలో ఒకప్పుడాయన ఎంతో కీలక నేత. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే. అంతటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు. ఆయన ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చినా కామ్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీలో ఎక్కడా కనిపించడంలేదని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత ఇప్పుడెందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు? ఇంతకీ ఆ నేత ఎవరు? తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అదంతా గత వైభవం. ఇప్పుడు దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా వినిపించడంలేదు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఫిరాయించి మైలవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వసంతకు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమను సైడ్ చేసేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని అధినేత చెప్పిన మాటను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారని టాక్. ఇంతవరకూ బాగానే ఉంది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ పట్టించుకోవడం మానేశారని సమాచారం.చంద్రబాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందట. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ... టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కచ్చితంగా తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఉమాకు నిరాశే ఎదురయ్యిందట. అందుకే ఇప్పుడాయన పార్టీలో అందరికీ దూరంగా ఉంటున్నారట. కూటమి ఘన విజయం సాధించినా పార్టీ సంబరాల్లో ఉమా ఎక్కడా పాలు పంచుకోలేదట. అధినేతను కలిసి కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపింది లేదట. ఇక సాక్షాత్తూ ప్రధానమంత్రి సమక్షంలోనే తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ..ఎవరితోనూ సంబంధం లేకుండా కామ్ గా ఎక్కడో ఓ మూలన కూర్చుని వెళ్ళిపోయారట.ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక చంద్రబాబు తనకు ఏదోరూపంలో ప్రాధాన్యం కల్పిస్తారని దేవినేని ఉమా నమ్మారట. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తేలిపోవడంతో ఇక టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఇప్పుడు అటు టీడీపీలోనూ.. ఇటు మైలవరంలోనూ తెలుగుతమ్ముళ్ల చర్చంతా దేవినేని చుట్టూనే తిరుగుతోందట. ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్లా వ్యవహరించిన దేవినేని ఉమా ప్రస్తుత దీన పరిస్థితి తలుచుకుని తెగ ఫీలైపోతున్నారట. అసలు పార్టీలో ఎవరితోనూ కలవడంలేదనే టాక్ నడుస్తోంది. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ... వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్‌తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు. ఏం చేస్తాడో స్పష్టత లేదు... మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
మన టార్గెట్ 151 కాదు..175
సాక్షి, అమరావతి: ‘వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 151 కాదు.. 175కు 175 శాసనసభ స్థానాల్లో విజయం సాధించడమే’ అని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలకు ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్య నిర్దేశం చేశారు. మనం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు విజయబావుటా ఎగుర వేయాలంటే యథావిధిగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మీరు, ఎమ్మెల్యే కలిసి.. అందరూ ఒక్కటై.. మనం చేస్తున్న మేలు, అభివృద్ధిని ప్రతి ఇంట్లో వివరించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. అలా అందరూ కలిసికట్టుగా పని చేస్తే మొత్తం 175 సీట్లు గెల్చుకోగలం అని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో వివరించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అర్హులందరికీ పథకాలు అందించడానికే.. ► ‘మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకు చాలా సమయం ఉంది కదా అని అనుకోవద్దు. నాలుగు నెలల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం ద్వారా ప్రజల వైపు అడుగులు వేగంగా వేస్తున్నాం. ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగింది. వివిధ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు రూ.900 కోట్ల నగదు నియోజకవర్గంలోని ఇళ్లకు చేర్చాం. ► ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి.. ఆ ఇంట్లో అక్కకూ, చెల్లెమ్మకూ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును వివరించండి. ఇంత మేలు చేసిన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి.. దీవించండి అని అడిగే గొప్ప కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. అర్హత ఉండి మిగిలిపోయిన వారినిఅలానే వదిలేయకుండా.. వారికీ మేలు చేయాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ► మరోవైపు ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించాం. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి సచివాలయంలో కనీసం 2 రోజులు.. రోజుకు కనీసం 5 లేక 6 గంటలు గడపాలి. ప్రతి ఇంటికీ వెళ్లాలి. దాని వల్ల ఎమ్మెల్యేలు మీకు దగ్గర అవుతారు. దాంతో సచివాలయాలు కూడా మీకు మరింత చేరువవుతాయి. ఇంకా రూ.20 లక్షల పనుల వల్ల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. వీటన్నింటి కోసమే గడప గడపకు కార్యక్రమం. ► వచ్చే జనవరి నుంచి అడుగులు ఇంకా వేగంగా ముందుకు పడనున్నాయి. బూత్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు.. వారిలో ఒకరు మహిళ. వారిని ఎమ్మెల్యే ఎంపిక చేస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మను కన్వీనర్లు ఎంపిక చేస్తారు. కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీసి.. అర్హులందరికీ పథకాలు అందేలా చూడటంలో భాగస్వాములవుతారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ‘‘ప్రతి పథకం ప్రజలకు అందుతుందా లేదా అన్నది పరిశీలించాలి. మైలవరంలో 89 శాతం ఇళ్లకు సంక్షేమం అందించాం. ఈ సారి మన టార్గెట్ 175 నియోజకవర్గాలు ఈ మూడున్నరేళ్లలో మైలవరంలో రూ.900 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం. ఇంత మేలు చేయగలిగాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని అడుగ గలుగుతున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘ఇతర కారణాలతో సంక్షేమం అందని వారికి కూడా గడప గడప ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం. జనవరి నుంచి బూత్ కమిటీలను నియమించనున్నాం. బూత్ కమిటిలో ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం. ముగ్గురు సభ్యుల్లో కచ్చితంగా ఒక మహిళ కూడా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, ఒక తమ్ముడు గృహ సారధులను నియమిస్తున్నాం. గృహ సారధులు, సచివాలయ కమిటి కన్వీనర్లు రానున్న 16 నెలలు ఇంటింటికి వెళ్లాలి’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: నోరు జారి నిజాలు ఒప్పుకున్నారా? -
దేవినేని ఉమకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న బొమ్మసాని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేవినేని లేకుండానే బొమ్మసాని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే దేవినేని నాయకత్వాన్ని బొమ్మసాని, అతని వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే, మైలవరంలో లోకల్ నినాదం కూడా రోజురోజుకి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈసారి స్థానికుడే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో బొమ్మసాని నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఆ వర్గం ప్రకటించింది. దీంతో మైలవరం టీడీపీలో కలవరం మొదలైంది. చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!) -
ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఆరాటం
-
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు పంట అని అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ ఉమ గతంలో బీరాలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 2018 నాటికి పోలవరం ఎక్కడ పూర్తి చేశారో దేవినేని ఉమా చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని గుర్తు చేశారు. దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి కేసీఆర్ ఉమా ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, జగన్మోహన్రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదన్నారు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదాంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇకనైనా దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉందని, తెలంగాణలో కనుమరుగైన ఆ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. -
ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటే!
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీలో గెలుపుపై ధీమా సన్నగిల్లుతోంది. మంత్రి దేవినేని ఉమ హ్యాట్రిక్ ఆశలపై ప్రజావ్యతిరేకత నీళ్లుకుమ్మరిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రిగారి అవినీతి.. అనుయాయుల దందాలు ఈ ఎన్నికల్లో తమ కొంపముంచుతున్నాయనే అంచనాలతో టీడీపీ డీలాపడింది. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న ప్రధాన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా మైలవరం ఒకటి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి దేవినేని ఉమ, మరోవైపు మాజీమంత్రి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ తలపడ్డారు. గెలుపుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. మైలవరంలో విజేత ఎవరూ అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో 2 లక్షల 59 వేల 500 మంది ఓటర్లుండగా.. వీరిలో స్త్రీలు 1,30,812, పురుషులు 1,28,673. టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన దేవినేని ఆశలు ఆవిరేనని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రజలకు బాగా దగ్గరైన వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతోనే దేవినేనికి గట్టిపోటీ ఎదురయ్యిందని, ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గట్టి ప్రత్యర్థిని ఎన్నికల్లో ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మంత్రి దేవినేని ఉమ చివరికి అధికార దుర్వినియోగానికి ప్రయత్నించడం కూడా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టించేందుకు మంత్రి దేవినేని చేసిన ప్రయత్నం అభాసుపాలై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతను మరింత పెంచింది. మైలవరం నియోజకవర్గంలో మంచినీటి సమస్యను, మామిడి రైతుల కష్టాలను, సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా మంత్రిదేవినేని ఉమ అయిదేళ్లపాటు నడిపిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్ ద్వారా ఆయన అనుయాయులకు కోట్ల రూపాయలను దండుకునే అవకాశం కల్పించడం, ఇసుక, మట్టి తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, చివరికి అనుమతిలేని బోట్లతో అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవ్వడం వంటి అంశాలు అనేకం తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారాయి. జన్మభూమి కమిటీల కారణంగా అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కకపోవడం, పైరవీ కారులు, అనర్హులకే పెన్షన్ల నుంచి పక్కాగృహాల వరకు కట్టబెట్టడం మొదలైన అంశాలు మంత్రి దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పని స్థితిని తెచ్చిపెట్టాయని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ధన ప్రభావం అధికంగా కనిపించిన నియోజకవర్గాల్లో మైలవరంకూడా నిలుస్తోంది. మంత్రి దేవినేని ఉమ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శలు చేశాయి. దాంతో మైలవరం ప్రజలు...అధికార టిడిపిపై తీవ్ర అసంతృప్తితో రగిలి పోయారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోపై అభిమానం పెంచుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో అధిక శాతం అంశాలు తమకు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహంలో పడ్డారు. -
దేవినేని మైలవరం నియోజవర్గం సమస్యలను నిర్లక్ష్యం చేశారు
-
అక్కడ మంత్రి అయితే ఇంటికే!
సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్‌గా మారింది. మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. 2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఆయనది చెరగని సంతకం
సాక్షి, మైలవరం : ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్యసాయం పొందిన పేదవాడి కుటుంబంలో ఆనందం.. డెల్టా ఆధునికీకరణతో అన్నదాత కళ్లలో వెలుగు.. పావలావడ్డీ రుణాలు పొందిన మహిళ మోములో చిరునవ్వు.. రీయింబర్స్‌మెంట్‌లో ఉచితంగా ఉన్నత విద్యాఫలాలు అందుకున్న విద్యార్థుల్లో నమ్మకం.. ఇవీ రాజన్న రాజ్యంలో చెరగని సంతకాలు. జిల్లావాసులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే అజెండాగా అభివృద్ధి ఫలాలను అందజేసిన మహానేతను మననం చేసుకుంటున్నారు. చెప్పినవీ.. చెప్పనివి కూడా చేసి చూపించిన ఆ విశ్వసనీయతను తలచుకుంటున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. సాగుకు భరోసా.. మైలవరం నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పటికే కృష్ణాజలాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకు అందించేందుకు గత ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసింది. కానీ మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 కోట్లు కేటాయించి రెండోదశ పనులను పూర్తి చేశారు. కృష్ణావాటర్పైపులైను రెండోదశ పనులతో పాటు తారకరామ ఎత్తిపోతల రెండోదశ పనుల పూర్తి చేసి 2006 మే 10న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ప్రారంభించారు. పోలవరం కాలువ మళ్లింపు వెఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పోలవరం కుడికాల్వ తవ్వకం చేస్తున్న సందర్భంలో కాలువకు చివరి భాగంలో ఉన్న వెలగలేరు గ్రామాన్ని అనుకొని తవ్వ వలసి ఉంది. అయితే కాలువను గ్రామానికి అనుకొని తవ్వడంతో గ్రామానికి ఒక వైపు బుడమేరు, రెండో వైపు పోలవరం కాల్వ ఉంటే వరదల వచ్చిన సమయంలో గ్రామం ముంపునకు గురవుతుందని అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. చనమోలు అడిగిందే తడువుగా కాలువ రూట్‌మ్యాప్‌ను మార్చి వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా కాలువను తవ్వించి బుడమేరులో కలిపారు. వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికీ మరవలేమని వెలగలేరు గ్రామ ప్రజలు అంటున్నారు. తారకరామతో రైతులకు సాగనీరు మైలవరం నియోజకవర్గానికి తలమానికమైన తారకరామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. తారకరామ ఎత్తపోతల పథకాన్ని నిర్మించడానికి అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇబ్రహీంపట్నం,జి కొండూరు, విజయవాడరూరల్ మండలాల పరిధిలోని 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యం. మొదటి దశ పనులు అప్పటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే,వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు ఆధ్వర్యంలో 2004 నాటికి పూర్తయ్యాయి. వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా దారిమళ్లించి తవ్వించిన పోలవరం కుడి కాల్వ రెండవ దశలో జి.కొండూరు మండలంలోని 8గ్రామాలకు చెందిన 4,242ఎకరాలకు నీరందించడం లక్ష్యం.దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో 10–05–2006న పనులు ప్రారంభించి 2009కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరందించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాజకీయాలలో సంచలన మార్పులు కారణంగా మూడో దశ పనులు నిలిచిపోయాయి. రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తారకరామా ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులకు సాగునీరు అందింది. ఆయన బతికి ఉంటే మూడో దశ పనుల కూడా పూరై్త నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేది. కృష్ణా జలాలను మైలవరానికి అందించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. వైఎస్సార్ హయాంలో రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది. నాలుగున్నరేళ్లుగా రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. జలవనరులశాఖా మంత్రిగా ఉండి కూడా దేవినేని ఉమా తన సొంత నియోజకవర్గంలో ఉన్న తారకరామను నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను అందించడంలో దేవినేని విఫలమయ్యారు. -పామర్తి వెంకటనారాయణ, రైతు, కుంటముక్కల -
తమ్ముళ్లు కాదు తోడేళ్లు..
సాక్షి, మైలవరం : అధికారం అండతో నాలుగున్నరేళ్లలో అందినకాడికి దండుకున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా సాగిపోయాయి టీడీపీ నాయకుల లీలలు. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. నీరు చెట్టు పనుల్లో రూ.కోట్లు కొల్లగొట్టినా.. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. దేవినేని, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి అక్రమాలు ఆయన పర్యవేక్షించిన శాఖ మాదిరిగానే భారీస్థాయిలో ఉండటం విశేషం. నియోజకవర్గంలో సహజ వనరులైన మట్టి, చెట్టు, ఇసుక, గ్రావెల్ ఇలా దేన్నీ వదలకుండా కోట్లు దండుకున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల పేరుతో దేవినేనితో పాటు అతని అనుచరులు దోపిడీ అంతా ఇంతా కాదు. ఎందుకూ పనికిరాని వాగులు, వంకలపై 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మంత్రిగారి ఆజ్ఞలేనిదే పనులు మొదలు కాదంటే ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎత్తిపోతల పథకాల్లో రూ.10కోట్ల అవినీతి మైలవరం నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యం అంటూ 22 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతల పథకాలను దశాబ్దాలుగా నీరు ప్రవహించని ఎన్ఎస్పీ కాలువలు, బుడమేరు, వాగులపై నిర్మించారు. వీటి నిర్మాణాలకు గానూ రూ.22.57కోట్లను కేటాయించారు. నాసిరం పైపులు, తక్కు ఖరీదు మోటార్లు, షెడ్ల నిర్మాణం తదితర పనుల్లో రూ.10కోట్ల మేర అవినతీకి పాల్పడినట్లు తెలుస్తుంది. నీరు–చెట్టులో కోట్లు పోగేశారు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.118కోట్ల పనులు చేపట్టారు. ఈ పథకం కింద చెరువుల్లో పూడికతీత, కాలువల మరమత్తులు తదితర పనులన్నీ చేశారు. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులకు ఉచితంగా అందించాల్సి ఉండగా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. మొత్తం 48 చెరువులలో పనులు జరగ్గా మట్టిని విక్రయించి రూ.70కోట్ల వరకు పోగేసినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం మండలంలోని వెల్వడం సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో దేవినేని అనుచరుడు కోమటి సుధాకర్ గతేడాది నీరు–చెట్టు పనులు చేపట్టారు. అయితే చెరువులో 32వేల క్యాబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతులు ఉండగా 1,42,875 క్యాబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.5కోట్ల విలువైన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు పడమర చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి 2017–18 సంవత్సరంలో 2లక్షల క్యాబిక్మీటర్ల మట్టిని తవ్వి తరలించారు. ఒక్కొక్క ట్రక్కు మట్టిని రూ.400 నుంచి 600కు విక్రయించారు. ఈ విధంగా రెండేళ్లలో రూ.12కోట్ల మేర గడించారు. అదేవిధంగా గొల్లపూడి మేజర్ పంచాయతీ పరిధిలో నీరు–చెట్టు కింద రూ.1.80కోట్ల మేర పనులు జరిగాయి. ఇక్కడ కూడా మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బుడమేరులో అక్రమాలెన్నో.. మైలవరం నియోజకవర్గంలో చండ్రగూడెం నుంచి వెలగలేరు వరకు విస్తరించి ఉన్న బుడమేరు ఆధునికీకరణ పనుల్లో దేవినేని అనుచరులు చేతివాటం చూపించారు. ఈ పనులకు గానూ రూ.45కోట్ల మేర కేటాయించారు. అయితే బుడమేరులోని మొక్కలు తొలగించి కేవలం రూ.10కోట్లతో పనులు ముగించి, అక్రమ బిల్లులతో రూ.35కోట్ల మేర కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అండతో.. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి ఇసుకరేవుల్లో దేవినేని అనుచరులు నిబందనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకతోడుతున్నారు. రోజుకు 4వేల క్యూబిక్ మీటర్లు నది నుంచి తోడి లారీలతో రవాణా చేస్తున్నారు. రోజుకు రోజుకు సుమారు రూ.6లక్షలు వరకు సంపాడించారు. మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావుకు చెందిన సీలింగ్ భూమిని రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలో తన వాటా దక్కించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. గుంటుపల్లిలో కృష్ణానది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సర్వే నంబర్ 144, 147లో సుమారు 70 ఎకరాల్లో అమరావతి అమెరికన్ వైద్యశాలకు 26 ఎకరాలు కేటాయించి తెరవెనుక మంత్రాంగంతో తనవాటా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో సిమెంటు కంపెనీల పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా బూడిద తరలించి కోట్లు గడించారు. కేతనకొండ, మూలపాడు, కొండపల్లి రాతిక్వారీల్లోనూ పర్మిట్లు లేకుండానే అక్రమ మార్గాన నడిపిస్తున్నారు. -
మంత్రి ఉమా స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారు!
సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు తాయిలాలతో ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మరో మేనిఫెస్టో కమిటీ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. కంత్రి మంత్రి దేవినేని ఉమా తనస్థాయి మరచి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, దాసరి జైరమేశ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు. టీడీపీలో రాముడి సంతతి పోయి రావణ సంతతి వచ్చిందని, టీడీపీలో అందరూ రావణులే మిగిలారని కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మంత్రి ఉమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏం చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏదో చేసినట్టు ఆయన హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ళు మంత్రిగా ఉండి పేదలకు పట్టాలు ఇవ్వకుండా.. ఉమా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని, ఆయన ఓటమి తప్పదని పేర్కొన్నారు. మంత్రి ఉమాకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. -
138వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న బిడ్డతో కలిసి అడుగులేస్తున్నారు. ప్రత్యేక హోదాకు మద్ధతుగా సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించగా, మంగళవారం నుంచి తిరగి ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా 138వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదలైంది. ముత్యాలంపాడు శివారు నుంచి వైఎస్ జగన్ మంగళవారం పాదయాత్ర ప్రారంభిస్తారు. ముత్యాలంపాడు, ఎత్కూరు, మీదుగా చెవుటూరు చేరుకుంటారు. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కుంటముక్కల క్రాస్, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను మీడియాకు విడుదల చేశారు. -
'ఉమా.. నీ నియోజకవర్గంలో చర్చకు సిద్ధమా?'
హైదరాబాద్: కృష్ణా జిల్లా మైలవరంలో సాగు, తాగు నీరు సరఫరా విషయమై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సవాల్ విసిరారు. దేవినేని ఉమా సొంత నియోజకవర్గమైన మైలవరంలో మీడియా సమక్షంలో ఇద్దరు చర్చిద్దామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. మంత్రి ఉమా తీరుపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వలేని దేవినేని ఉమా.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు పులివెందులకు నీరిచ్చామని ప్రగల్భాలు చెప్పడం మానుకోవాలని జోగి రమేష్ హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఉమా కలసి జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా మార్చారని విమర్శించారు. -
ప్రజాసమస్యలు గాలికొదిలిన మంత్రి ఉమా
ఇబ్రహీంపట్నం: మైలవరం నియోజకవర్గం ప్రజాసమస్యలను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గాలికొదిలేసి తిరుగుతున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం సమన్వయ కర్త జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన గ్రామసభలో అధికార పక్ష ప్రజాప్రతినిధులు పాల్గొనక పోవడాన్ని బట్టి మంత్రి నిర్వాకం బయట పడిందన్నారు. ప్రజాప్రతినిధుల గైర్హాజరుతో జన్మభూమి సభ అభాసుపాలైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీపీ జన్మభూమి సభకు హాజరుకాకపోవటం వెనుక మతలబు ఏమిటని మంత్రిని ప్రశ్నించారు. హైవే బాధితులు, నివాసాలు కోల్పోయిన వారు, స్థానిక ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, మంత్రి ఉమా ముఖం చాటేశాడని ఎద్దేవాచేశారు. బీసీ ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వకుండా మంత్రి ఉమా తన చెప్పు కింద అణగదొక్కుతున్నాడని ఆరోపించారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న జన్మభూమి సభను టీడీపీ సభగా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు హాజరు కాకపోయినా ప్రొటోకాల్ లేని వ్యక్తులు జన్మభూమి వేదికపై సబ్‌కలెక్టర్ సమక్షంలో కూర్చోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన సమస్యలు వివరిస్తున్న వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో మంత్రి ఉమాతో పాటు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి చూపాలని హితవు పలికారు. -
నేతల కనుసన్నల్లో... తమ్ముళ్ల దందా
ఇసుక దందా నుంచి భూ కబ్జా వరకు.. అన్నీ వారి కనుసన్నల్లోనే.. ప్రతి పనికీ ఓ రేటు మాట వినని అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు, కొందరు ముఖ్య నేతలు పైరవీలు సాగిస్తున్నారు. ఇసుక దందా నుంచి స్థలాల కబ్జా వరకు అన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు. అలా జరిగేలా సహకరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు పెట్టించి మరీ మాటవినని అధికారులను బెదిరిస్తున్నారు. విజయవాడ : మైలవరం నియోజకవర్గంలోని పొందుగల, మైలవరానికి చెందిన ఇద్దరు నాయకులు జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి అండ చూసుకుని చెలరేగుతున్నారు. పొందుగల చెరువు పూడిక పనుల్లో రూ.40 లక్షలు, చంద్రాల చెరువు పనుల్లో రూ.70 లక్షల విలువైన మట్టిని ఇటుక బట్టీలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నీరు చెట్టు కింద రూ.80 లక్షల విలువైన మట్టిని విక్రయించారు. అధికారులు ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే తాము చెప్పినట్టే మంత్రి చేస్తారంటూ బెదిరిస్తున్నారు. పెడన మండలం మడక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు పెడన తోటమూలలో కోటి రూపాయల విలువ చేసే ప్రయివేట్ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా వేసి విక్రయించాడు. తన వెనుక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నారంటూ సదరు తమ్ముడు బాధితులను బెదిరిస్తున్నారు. మండల నిధులు దోపిడీ పెనమలూరు మండలంలో నియోజకవర్గ ముఖ్య నేత అనుచరులు మండలపరిషత్ నిధులు కోటి రూపాయల పనులు పంచుకున్నారు. నామినేషన్ పద్ధతిలో గ్రావెల్ రోడ్ల పనులు తీసుకొని మట్టిపోసి డబ్బులు పోగేసుకున్నారు. పెత్తనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యేకు మంత్రి అండగా ఉన్నారు. అధికారుల బదిలీలు, విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు అధికార పార్టీకి చెందిన వారు రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాకిరాయి కోసం... జగ్గయ్యపేట నియోజకవర్గంలో కీలక ఇద్దరు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి అండతో వారి అనుచరులు దోపిడీకి తెరతీశారు. కాకిరాయి అనుమతులకోసం కొందరు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సెంట్రల్లో పెరిగిన దౌర్జన్యాలు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు తెలుగుతమ్ముళ్లు చెలరేగి పోతున్నారు. సత్యనారాయణపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు పోలీసుల అండతో కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఓ టైలరింగ్ షాపును తన అనుచరులతో దౌర్జన్యంగా ఇటీవల ఖాళీ చేయించారు. సత్యనారాయణపురం శివాలయం వీధిలోని కల్యాణమండపాన్ని కీలక నేతే ఆక్రమించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. భువనేశ్వరి పీఠానికి చెందిన ఈ కల్యాణ మండపాన్ని దేవాదాయశాఖకు అప్పగించారు. దీనిని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణసంఘం నాయకులు ఎమ్మెల్యే బొండా ఉమాను కలిశారు. పీఠానికి ఉంచేందుకు అర్హతలు ఏమున్నాయో వివరిస్తే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదు. బందరు రోడ్డులోని బ్రిటీష్ కాలంనాటి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాచేసేందుకు కార్పొరేటర్లు కొందరు యత్నించారు. పాయకాపురంలోని వైఎస్సార్ స్మృతి వనం ఉన్న చెరువును ఆక్రమించి ప్లాట్లుగా వేయాలని కొందరు కార్పొరేటర్లు ప్రయత్నించారు. కోర్టు కేసుల్లో ఉన్న బిల్డింగ్లు, షాపులు ఖాళీ చేయించడం వంటి సెటిల్మెంట్లు బాగా పెరిగాయి. ఎమ్మెల్యే తనయుడు తన పుట్టిన రోజు సందర్భంగా అత్యంత రద్దీగా ఉండే బందరు రోడ్డులో నిబంధనలను బేఖాతరుచేసి ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. మరో కుమారుడు జాతీయ రహదారిపై కారు రేసు నిర్వహించి అమాయకుడి ప్రాణాలు బలితీసుకున్నాడు. అక్రమ మైనింగ్ కైకలూరు నియోజకవర్గంలోని వేమవరప్పాడు గ్రామంలో మండవల్లి మండలానికి చెందిన ఒక నాయకుడు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అతనికి పార్లమెంటరీ నియోజకవర్గ నేత అండగా ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి, పొరుగు జిల్లా ఎంపీ అండతో కొందరు తమ్ముళ్ల ఆటపాక పక్షుల చెరువులో చేపలను పట్టి విక్రయించారు. -
టీడీపీలో మైలవరం చిచ్చు
* అక్కడి నుంచి పోటీ కి బాలకృష్ణ సిద్ధం * ససేమిరా అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమ * ఉమకు పెనమలూరు లేదా నూజివీడు సూచించిన బాలయ్య * చంద్రబాబు వద్దకు చేరిన పంచాయితీ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసే అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే బాలకృష్ణ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. దీంతో ఈ సీటు పంచాయితీ ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఆయన సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, ఎవ్వరికీ సర్దిచెప్పలేక తలపట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని బాలకృష్ణ ఎంతో కాలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయాలని తొలుత భావించారు. దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆ గ్రామం పామర్రు (ఎస్సీ) నియోజకవర్గంలో కలవడంతో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు తనకు సన్నిహితులైన వారితో సర్వేలు చేయించగా గుడివాడ నుంచి పోటీ చేయకపోవటమే మంచిదని తేలింది. దీంతో బాలకృష్ణ మైలవరంపై కన్నేయడం దేవినేని ఉమామహేశ్వరరావుకు షాకిచ్చింది. తన సీటును వదులుకునేది లేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. గతంలో ఉమ పోటీచేసి గెలిచిన నందిగామ 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్ అయింది. దాంతో ఆయన మైలవరంనుంచి పోటీచేసి గెలిచారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేశాన ని, అలాంటప్పుడు వేరే నియోజకవర్గానికి ఎలా వెళతానని ఉమ సన్నిహితుల ముందు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున నూజివీడు లేదా పెనమలూరు నుంచి పోటీ చేయాలని బాలకృష్ణ సూచిస్తున్నారు. ఈ పరిణామాలు రుచించని ఉమ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మైలవరం నుంచే పోటీచేస్తానని అధినేతకు స్పష్టం చేయగా, ఆయన నుంచి స్పందనలేదని తెలి సింది. ఆ అంశంపై మళ్లీ మాట్లాడదామని అందరికీ చెప్పినట్లే ఉమకూ చెప్పి పంపినట్లు సమాచారం. కాగా, మైలవరం నుంచే తను పోటీకి వీలుగా ఉమను ఒప్పించే బాధ్యత మీదేనని బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబుకు తేల్చిచెప్పినట్లు తెలిసింది.