దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో.. | YSRCP MLA Vasanta Krishna Prasad Fires on Devineni Uma | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..

Published Wed, Nov 20 2019 3:53 PM | Last Updated on Wed, Nov 20 2019 8:32 PM

YSRCP MLA Vasanta Krishna Prasad Fires on Devineni Uma - Sakshi

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు పంట అని అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ ఉమ గతంలో బీరాలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 2018 నాటికి పోలవరం ఎక్కడ పూర్తి చేశారో దేవినేని ఉమా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని గుర్తు చేశారు.

దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి కేసీఆర్‌ ఉమా ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, జగన్‌మోహన్‌రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదన్నారు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైఎస్‌ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదాంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇకనైనా దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని సూచించారు.

ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉందని, తెలంగాణలో కనుమరుగైన ఆ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్‌ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు.  చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement