టీడీపీలో మైలవరం చిచ్చు
* అక్కడి నుంచి పోటీ కి బాలకృష్ణ సిద్ధం
* ససేమిరా అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమ
* ఉమకు పెనమలూరు లేదా నూజివీడు సూచించిన బాలయ్య
* చంద్రబాబు వద్దకు చేరిన పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసే అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే బాలకృష్ణ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు.
దీంతో ఈ సీటు పంచాయితీ ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఆయన సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, ఎవ్వరికీ సర్దిచెప్పలేక తలపట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని బాలకృష్ణ ఎంతో కాలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయాలని తొలుత భావించారు. దివంగత ఎన్‌టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉండేది.
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆ గ్రామం పామర్రు (ఎస్సీ) నియోజకవర్గంలో కలవడంతో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు తనకు సన్నిహితులైన వారితో సర్వేలు చేయించగా గుడివాడ నుంచి పోటీ చేయకపోవటమే మంచిదని తేలింది. దీంతో బాలకృష్ణ మైలవరంపై కన్నేయడం దేవినేని ఉమామహేశ్వరరావుకు షాకిచ్చింది. తన సీటును వదులుకునేది లేదని ఆయన స్పష్టంచేస్తున్నారు.
గతంలో ఉమ పోటీచేసి గెలిచిన నందిగామ 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్ అయింది. దాంతో ఆయన మైలవరంనుంచి పోటీచేసి గెలిచారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేశాన ని, అలాంటప్పుడు వేరే నియోజకవర్గానికి ఎలా వెళతానని ఉమ సన్నిహితుల ముందు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున నూజివీడు లేదా పెనమలూరు నుంచి పోటీ చేయాలని బాలకృష్ణ సూచిస్తున్నారు.
ఈ పరిణామాలు రుచించని ఉమ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మైలవరం నుంచే పోటీచేస్తానని అధినేతకు స్పష్టం చేయగా, ఆయన నుంచి స్పందనలేదని తెలి సింది. ఆ అంశంపై మళ్లీ మాట్లాడదామని అందరికీ చెప్పినట్లే ఉమకూ చెప్పి పంపినట్లు సమాచారం. కాగా, మైలవరం నుంచే తను పోటీకి వీలుగా ఉమను ఒప్పించే బాధ్యత మీదేనని బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబుకు తేల్చిచెప్పినట్లు తెలిసింది.