
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు.
బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం.
ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు.