Singeetam Srinivasa Rao
-
ఈ అవార్డుతో ఇంకా చేయాలనే ప్రోత్సాహం లభించింది: సింగీతం
Sakshi Excellence Awards: కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఇందులో భాగంగా 2019గాను జీవితసాఫల్య పురస్కారంతో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని సత్కరించింది. అయితే వివిధ కారణాలతో ఆయన వేడుకకి రాలేకపోయారు. ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అవార్డు అందుకున్నారు. అనంతరం అవార్డు గురించి సింగీతం సాక్షితో మాట్లాడాడు. ఆయన మాటాల్లోనే.. ‘ముందుగా జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు మా కాంట్రిబ్యూషన్ ఉంది. అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్‌గా మిగతా రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘సాక్షి’ వారు నాకు ప్రదానం చేసిన ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నాను. ఇంకా కాంట్రిబ్యూషన్ చేయాలన్నది ఇప్పుడు నా మెయిన్ ప్లాన్. నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ‘ఇంకా చెయ్’ అనేవారు నాకు కావాలి. ఇప్పుడు ఈ అవార్డుతో నాకింకా చేయాలనే ప్రోత్సాహం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలవడం ఒక ఆనందం. కానీ ఈ అవార్డు ఫంక్షన్‌కు రావాలని నేను ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేని పరిస్థితి. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాని’ అన్నారు. మేం ఏం చేస్తే ఈ అవకాశం వస్తది: దర్శకుడు గుణశేఖర్ సింగీతం శ్రీనివాసరావు తరఫున అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘పెద్దాయన సింగీతం శ్రీనివాస రావు గారు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అందుకుంటూ కూడా... ‘ఇంకా నాకు ఎంతో కంట్రిబ్యూట్ చేయాలనిపిస్తోంది’ అన్న తర్వాత మాలాంటివాళ్లం ఇంకా ఎంత కంట్రిబ్యూట్ చేస్తే మాకిలాంటి అవకాశం వస్తది! ఆయన అవార్డును ఆయన తరఫున నేను అందుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్.’ అన్నాడు. -
ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్ ట్రావెల్ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం. విమానం స్మూత్‌గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్ టైమ్‌లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్‌గారు అన్నారు. అయితే టైం మెషిన్‌ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్‌జీ వెల్స్ అనే రైటర్ రాసిన ది టైమ్ మెషిన్ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి. ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్‌గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి, ‘సార్.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్ స్టేషన్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు అంకుల్ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్‌లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. దాంతో కెమెరామేన్ వీఎస్సార్ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు. -
సింగీతం... స్క్రిప్ట్ మెంటార్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ను సి. అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే... తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సింగీతం పుట్టినరోజు సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 21) ఈ చిత్రానికి ఆయన మెంటార్‌గా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ‘‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. -
ప్రభాస్ కోసం లెజండరీ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త తెలిసింది. విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. సింగీతం శ్రీనివాసరావు స్కెచ్ పోస్టర్ని రిలీజ్ చేసింది. దాంతో పాటు ‘లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనను మా ఇతిహాసానికి స్వాగతిస్తునందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలం. క్వారంటైన్ సమయాన్ని కూడా మా సినిమా కోసం వినియోగించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసింది.(చదవండి: కాంబినేషన్ రిపీట్?) A long awaited dream finally comes true. We are thrilled to welcome #SingeetamSrinivasaRao Garu to our epic. His creative superpowers will surely be a guiding force for us.#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/Mxvbs2s7R9 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2020 గత వారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా సింగీత శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఇక ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాకు వస్తే.. ఈ చిత్ర షూటింగ్ 2021లో ప్రారంభమయ్యి.. 2022లో విడుదల కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. -
నేనెప్పుడూ పాజిటివ్
‘‘ఈ నెల 21న నా పుట్టినరోజు. చాలామంది నాకు ఫోన్ చేసి నా జన్మదినానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మీడియా నుండి అనేక మంది ఫోన్ చేసి బర్త్‌డే ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కాదు.. 22 తర్వాత మాట్లాడతాను’’ అని బుధవారం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో... ‘‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఈ నెల 9న వైద్యులు చెప్పారు. నాకు నవ్వొచ్చింది. ‘అదేంటీ... నేను ఎప్పుడూ పాజిటివే కదా, ఎప్పుడూ నెగెటివ్ కాదు కదా’ అనుకున్నాను (నవ్వుతూ). ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో నా గదిలో నేనుంటున్నాను. బుక్స్ చదువుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. ఫుడ్ కూడా గదిలోకే వస్తోంది. ఇదంతా చూస్తుంటే నా హాస్టల్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. సీటీ స్కాన్ పని సీటీ స్కాన్ చేసింది, మందులు పని మందులు చేస్తున్నాయి. నా వంతు పని నేను చేయాలి కాబట్టి గదిలోనే ఉంటున్నాను. నిజానికి కరోనా రాకుండా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. నా బర్త్‌డే గురించి ఎవరూ ఫోన్ చేయవద్దని మనవి చేస్తున్నా. 22వ తేదీ వరకూ ఐసొలేషన్‌లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత నన్ను అభిమానించే అందరితో మాట్లాడతాను’’ అని సింగీతం శ్రీనివాసరావు చెప్పారు. -
శ్రీనివాస కల్యాణం
చక్కగా డిగ్రీ చదివిన అమ్మాయిని సినిమావాళ్లకిచ్చి చేస్తున్నారేమిటో..! చుట్టు పక్కలవాళ్ల గుసగుసలు. లోపల పెళ్లిచూపుల సీన్ మాత్రం వేరుగా ఉంది. ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ’ అని రాగం తీస్తోంది అమ్మాయి. ఇకనేం.. అబ్బాయి అమ్మాయికి నచ్చేశాడు. పెళ్లయింది. పెళ్లయి అరవై ఏళ్లూ అయింది. ఈ అరవై ఏళ్లలో సింగీతంగారు.. ఎక్కువసార్లు పలికిన పేరు.. కల్యాణి. ఈ అరవై ఏళ్లలో కల్యాణి గారు.. చెప్పకోడానికి ఇష్టపడిన మాట.. ‘సింగీతం గారి భార్యని’ అరవై ఉగాదులు..! అరవై ఉషస్సులు..! ఎలా గడిచాయని ఇంటర్వ్యూలో అడిగాం. వాళ్లు చెప్పిన ప్రతి మాటా ఏడడుగుల బంధం విలువను చాటింది. రండి... శ్రీనివాస కల్యాణం చూతము రారండి ► ఈ నెల 20తో మీ పెళ్లయి 60 ఏళ్లవుతోంది. సుదీర్ఘ వైవాహిక జీవితం కాబట్టి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? సింగీతం: మేమెప్పుడూ పెళ్లి రోజు అంటూ ఆర్భాటాలు చేయలేదు. పిల్లలు వచ్చి మా దంపతులకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. కల్యాణి: అయితే మా 50 సంవత్సరాల పెళ్లిరోజుని మాత్రం అందరినీ పిలిచి చేసుకున్నాం. మా చిన్నమ్మాయి లండన్‌లో ఉంటోంది. పోయిన నెల తను ఇక్కడే ఉంది. లండన్ వెళ్లిపోయే లోపు 60 ఏళ్ల పెళ్లి రోజుని ముందే సెలబ్రేట్ చేద్దామని ఫిబ్రవరి 25న చేసుకున్నాం. ఆ వేడుక తర్వాత మా ఆమ్మాయి లండన్ వెళ్లిపోయింది. మా పిల్లల అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడే మేం వేడుక చేసుకుంటాం. మాకు అదే మంచి రోజు అనుకుంటాం. సింగీతం: వాళ్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మా మ్యారేజ్ డే అన్నమాట (నవ్వుతూ). ► మీ పెళ్లి ఎలా ఖాయం అయింది? సింగీతం: నేను టీచర్‌గా కొంతకాలం పనిచేశాక అక్కడక్కడా పని చేస్తూ దర్శక–నిర్మాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరాను. సినిమా ఇండస్ట్రీలోకి రాగానే పెళ్లి సంబంధం వచ్చింది. చూసుకోవటం, వెంటనే ఓకే అనుకోవటం.. అలా క్విక్‌గా జరిగిపోయింది. కల్యాణి: నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలమే. నాది ‘ఆశ్లేషా నక్షత్రం’. జాతక రీత్యా నేను చేసుకోబోయే అబ్బాయికి వాళ్ల అమ్మ బతికి ఉండకూడదు. సింగీతం: ఆశ్లేషా నక్షత్రం వారికి తాను చేసుకోబోయే అబ్బాయికి తల్లి ఉంటే ప్రమాదం. అది ఆ జాతకం వారితో ఉన్న లిటికేషన్ అన్నమాట (నవ్వులు). కల్యాణి: అంతకుముందు నాకో సంబంధం వచ్చింది. అబ్బాయికి తల్లి ఉన్నారు. మా నాన్న నా జాతకం విషయం చెబితే వాళ్లు ఫర్వాలేదన్నారు. మంచి సంబంధం అయినప్పటికీ నాన్న ఒప్పుకోలేదు. ఆ సంబంధం గురించి ఆ నోటా ఈ నోటా వైజాగ్‌లో ఉన్న సింగీతంగారి బాబాయ్ వరకూ వెళ్లింది. ఆయన మా నాన్నగారితో ‘మా అన్నయ్యకి తెలిసిన సింగీతం రామచంద్రరావుగారి అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. మీకు అభ్యంతరం లేదంటే నేను మా అన్నయ్యకు లెటర్ రాస్తాను’ అన్నారు. సింగీతం: ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనివ్వాలంటే అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు. కల్యాణి: ‘మావాడు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయి ఫోటో పంపగలరు’ అని మా నాన్నగారికి వీళ్ల నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్న తన అభిప్రాయం చెప్పకుండా ‘అమ్మడూ.. నీ ఇష్టం’ అని ఆ లెటర్ నాకు ఇచ్చారు. నేను ఆలోచిస్తుంటే మా అమ్మమ్మగారు ‘వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. కంగారు పడకుండా ఒప్పుకో. ఆ అబ్బాయి డిగ్రీ, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను ‘సరే’ అన్నాను. కల్యాణి, సింగీతం ► 60 ఏళ్ల క్రితం పెళ్లంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా పెద్దలు పెళ్లి ఖాయం చేసేవారు. అయితే మీ నాన్నగారు మీ అభిప్రాయాన్ని అడిగారంటే, ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతోంది.. సింగీతం: మా మామగారు ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏది నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అనుకునేవారు. మా పెళ్లికి అంతా ఓకే అనుకున్నారు కానీ, కట్నం ఎంత అడుగుతారో అనేది అందరి మనసులోనూ ఉంది. అది గ్రహించి మా నాన్నగారు ‘మా వంశంలో కట్న, కానుకల ప్రసక్తే లేదు. నో డిమాండ్స్, నథింగ్’ అన్నారు. ► ఈ సందర్భంగా కట్న, కానుకలు తీసుకునే వారి గురించి నాలుగు మాటలు? సింగీతం: కట్నం తీసుకోకూడదు, నేరం.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే సరిపోదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఆడవాళ్లు చదువుకోవాలి. స్త్రీలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒకప్పుడు వాళ్ల అమ్మమ్మకు జరిగింది, తర్వాత వాళ్ల అమ్మకు జరిగింది.. ఇప్పుడు కూతురికి జరగకుండా చూసుకుంటే చాలు. మార్పు అదే వస్తుంది. ► అప్పట్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిని పాడమనేవారు.. కల్యాణి: ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ..’ అని పాడాను (నవ్వుతూ). ‘అబ్బాయి నచ్చాడని ఇంతకన్నా అమ్మాయి ఎలా చెబుతుంది’ అని పెద్దవాళ్లు అన్నారు. మా పెళ్లి కుదిరింది. కానీ అమ్మలక్కలు చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని సినిమా వాళ్లకి ఎందుకిస్తున్నారో అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు వాళ్లు అలా అన్నారు. ‘సింగీతంగారి భార్యని’ అని నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నాది ఒకటే మాట... ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను ధన్యురాలిని. ► పెళ్లి చూపుల్లో ‘ఇంతాకన్నా ఆనందం ఏముంది..’ అని పాడినట్లుగానే మీ లైఫ్ ఆనందంగా సాగుతోందన్న మాట... కల్యాణి: రెండొందల శాతం నా లైఫ్ అలానే ఉంది. పెళ్లికి ముందు నేను పక్కింట్లో పేరంటానికి కూడా వెళ్లేదాన్ని కాదు. మేం మా పుట్టింట్లో అలా పెరిగాం. ఓ సారి చెల్లెలు మద్రాసులో మా ఇంటికి వచ్చింది. నేను అందరితో మాట్లాడటం చూసి ‘అదేంటే... అందరితో అంత బాగా మాట్లాడుతున్నావు! బావగారు నిన్ను భలే మార్చేశారే’ అంది. సింగీతం: కాలేజీ డేస్‌లోనే మోడ్రన్‌గా ఉండేవాణ్ణి. మోడ్రన్‌గా డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాదు.. నా ఆలోచనలు కూడా అలానే ఉండేవి. నేను కేవీ రెడ్డిగారి దగ్గర పని చేసేటప్పుడు మద్రాసులో రెండు లైబ్రరీలు ఉండేవి. ఇద్దరం పుస్తకాలు తెచ్చుకుని, చదివేవాళ్లం. ‘నేను ఏది చెబితే అది ఫైనల్ కాదు, నీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీరు ఎంత చెబితే అంతే అనే తత్వం నుంచి నీకున్న హక్కుతో నువ్వు డిమాండ్ చెయ్’ అని పెళ్లయిన కొత్తలోనే తనకు చెప్పాను. ► ఇప్పుడు కూడా భార్యకి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి చాలామంది భర్తలు ఇష్టపడటంలేదు. 60 ఏళ్ల క్రితం ‘ఈక్వల్ రైట్స్’ అన్నారంటే సూçపర్బ్. మేల్ డామినేషన్ అంటూ స్త్రీని చిన్నచూపు చూసేవారికి చిన్న సలహా ఏమైనా? సింగీతం: అప్పట్లో మగవాళ్లు ఆఫీసుకు వెళ్లి, తర్వాత క్లబ్‌లకు వెళ్లి, పేకాట ఆడి ఇలా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే తప్ప ఆడవాళ్లకు వేరే ఏమీ ఉండేది కాదు. టీవి వచ్చాక కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అయితే మగవాడు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్లు టీవి చూస్తూనే ఉంటారనే అర్థంతో కార్టూన్లు వేసేవారు. అవి వేసేది కూడా మగవాళ్లే. అన్నిరోజులూ మగవాళ్లు పేకాట ఆడినా ఒక్క కార్టూన్ రాలేదు. ఆడవాళ్ల మీద ‘తిరగబడే ఆడది’, ‘భయపడే మొగుడు’ లాంటి టైటిల్స్‌తో కార్టూన్లు వచ్చేవి. ఇదంతా మేల్ డామినేషన్. ఇది తరతరాలుగా వస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఒక్కటే పరిష్కారం. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం డిమాండ్ చేయాలి. ఈ రోజుకీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మగవాడు ఫస్ట్ అన్నట్లు చూస్తారు. 60 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా ఇప్పుడూ ఈమె కొన్ని విషయాల్లో ‘మేల్ ప్రయారిటీ’ ఇస్తుంది. అలా వద్దంటాను. స్త్రీ బతికినంతకాలం పురుషుడి మీద ఆధారపడాలనే ధోరణి మంచిది కాదు. ఆవిడకూ ఒక లైఫ్ ఉంటుంది. ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. కల్యాణి: అప్పట్లో మా నాన్నగారు ఓ పత్రికకు నాతో కరస్పాండెంట్‌గా పని చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుందో రాసి ఇచ్చేదాన్ని. అక్కడ లేడీస్ క్లబ్ మెంబర్‌గా ఉండేదాన్ని. అక్కడే పాఠాలు, టైప్ రైటింగ్ నేర్చుకున్నా. అలా మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవారు. పెళ్లయ్యాక ఈయన ఇంకా బాగా ఎంకరేజ్ చేశారు. ► మీరు డైరెక్షన్ చేసిన సినిమాల్లో కొన్నింటి కథా చర్చల్లో మీ ఆవిడ కూడా భాగం పంచుకున్నారట... ఆ విషయం గురించి? సింగీతం: ప్రతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ముందుగా ఆమెకు వినిపించేవాణ్ణి. ఆమెతో డిస్కస్ చేసేవాణ్ణి. ఓసారి ఆమెకు ఒక ఫిలిం ఫెస్టివల్లో చూసిన ఓ అర్జెంటీనా సినిమా నచ్చింది. ఆ మాట నాతో అంటే.. అయితే తెలుగుకి తగ్గట్టుగా ఆ కథ రాయమన్నాను. దాన్నే ‘సొమ్మొకడిది–సోకొకడిది’గా తెలుగులో తీశాను. కల్యాణి: ఏ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినా సినిమా చూస్తూ టక టకా నోట్ చేసేదాన్ని. తర్వాత ఆయనతో డిస్కస్ చేసేదాన్ని. కుమార్తెలు సుధా కార్తీక్, శకుంతలా సతీష్‌తో.... ► మీ 60 ఏళ్ల వైవాహిక బంధం గురించి అందరికీ స్ఫూర్తిగా ఉండే ఓ కొన్ని పాయింట్లు చెప్పండి... కల్యాణి: ఎంత అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అయినా వాదనలు లేకుండా ఉండవు. వాదించుకున్నా కూడా ఆ తర్వాత కలిసిపోవాలి. సమస్యలు ఉన్నా విడాకులవరకూ వెళ్లకూడదు. పెళ్లికి ముందు నాకు కొంచెం కోపం ఎక్కువ. పిల్లలు పుట్టాక ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ల అల్లరి తట్టుకోలేకపోయేదాన్ని. దాంతో పిల్లలను తిట్టి, కొట్టేదాన్ని. అలాంటి సమయాల్లో ఆయనే ఎక్కువగా సర్దుకుపోయేవారు. నాకు కోపం వచ్చింది కదా అని ఆయన ఇంకా కోపం తెచ్చుకుని సమస్యని పెద్దది చేసేవారు కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్సాండింగ్ ఉంది. సింగీతం: నాది ఆబ్సెంట్ మైండ్. అది నిజంగా పెద్ద సమస్యే అయినా తను సర్దుకుంది. నేను చిన్నçప్పటి నుంచీ నాస్తికుడిని. కానీ ఆమె పూజలు చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను కదా అని తనని మానేయమనలేదు. తనకోసం నేను అష్టోత్తరాలు చదువుతాను. ఎందుకంటే ఆవిడ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా. నేను అష్టోత్తరాలు చదవడంవల్ల దేవుడు నన్ను ఇష్టపడతాడని కాదు... ఈమె ఇష్టపడుతుంది కదా (నవ్వుతూ). మనం ఎవరమూ పర్ఫెక్ట్ పీపుల్ కాదు. ప్రపంచంలో అందరం ‘ఇన్పర్ఫెక్ట్ పీపులే’. ఆ ఇన్పర్ఫెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ► ‘ఆదిత్య 369’ చిత్రంలో టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పి ప్రేక్షకులందర్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. ఇప్పుడు టైమ్ మెషీన్ వెనక్కి వెళితే మీకు ఏమేం చేయాలని ఉంది? సింగీతం: ఏవీ లేవమ్మా.. నిన్నటికన్నా రేపు బెటర్ అంటాను. అప్పట్లో అన్నీ అద్భుతాలే అంటుంటారు. కానీ ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చేయనివి ఎన్నో ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నారు. వాళ్లను చూసి నేను అప్డేట్ అవుతుంటాను. ► ఫైనల్లీ.. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు? సింగీతం: రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. స్క్రిప్ట్ విషయంలో కల్యాణికి గతంలో చెప్పినట్లు పెద్దగా చెప్పడంలేదు. కాకపోతే ఇలా చేయబోతున్నానని తనకి చెబుతుంటాను. అన్నీ తనకి చెప్పే చేస్తుంటాను. ► చెప్పకుండా చేసినది ఏదైనా మీ జీవితంలో ఉందా? కల్యాణి: అలాంటిది ఏదీ లేదు (నవ్వులు). ► మీరు ‘శ్రీ కల్యాణం’ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఎవరు? కల్యాణి: నీ చిన్నప్పటి విషయాలు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అనుభవాలతో ఓ పుస్తకం రాయొచ్చు కదా? అని మా చిన్నమ్మాయి అంది. నా ఆటోబయోగ్రఫీ రాయడానికి ముఖ్య కారణం తనే. ఎలా ప్రారంభించాలా అనుకునేదాన్ని.. ‘నువ్వు అనుకున్నవన్నీ రఫ్‌గా రాస్తుండు. ఫైనల్ వెర్షన్ ఒకటి రాయొచ్చు’ అని ఆయన అన్నారు. ఓ డైరీలో రాసుకునేదాన్ని. రఫ్ రాయడానికే ఆర్నెల్లు పట్టింది. సింగీతం: మాకు పెళ్లైన కొత్తలో మాకు పెద్దగా వస్తువులు లేవు. రచయిత పింగళి నాగేంద్రగారు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు బహుమతిగా ఇచ్చారు. ఆ టేబుల్ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. అది మాకు ప్రత్యేకం. దానిపై కాగితాలు పెట్టుకుని ఆ పుస్తకం రాసింది తను. అది నాకు సంతోషం. ► ఇప్పుడు మీ రోజువారి జీవితం ఎలా సాగుతోంది? సింగీతం: నేను ఉదయం 6:30 గంటలకు నిద్ర లేచి కాసేపు వాకింగ్, శ్వాసకి సంబంధించిన వ్యాయామం చేస్తాను. సాయంత్రం కూడా వాక్ చేస్తాను. ఆహారం అంతా టైమ్ టు టైమ్ జరిగిపోతుంది. రాత్రి కళ్లు మూసుకోగానే నిద్రపట్టేస్తుంది. పాపం తనకి నిద్రపట్టదు. కల్యాణి: నాకు రాత్రి 12 తర్వాత నిద్రపడుతుంది. అందుకని త్వరగా నిద్ర లేవలేను. నా 55వ సంవత్సరం నుంచే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. డాక్టర్ చెప్పినట్లు కాసేపు చేతులు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తాను. నాకు 83 ఏళ్లొచ్చినా ఇప్పటికీ మా ఇద్దరికీ చపాతీలు చేయడం, దోసెలు వేయడం చేస్తాను.. వంట చేయడానికి మనుషులు ఉన్నారనుకోండి. సింగీతం: మేం చెన్నైలో ఉంటున్నాం. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నా తమ్ముడు అసిస్టెంట్‌గా చేసేవాడు. తన అబ్బాయి పూర్ణ ప్రగ్యా, కోడలు, వాళ్ల పిల్లలు మా వద్దే ఉంటూ బాగా చూసుకుంటున్నారు. కల్యాణి: ఆ అమ్మాయి మా సొంత కోడలిలా మమ్మల్ని చూసుకుంటుంది. అందుకని మాకేం ఇబ్బంది లేదు. ► ‘నా జీవితంలో నేను ఎక్కువగా పలికిన పేరు కల్యాణి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సింగీతం: అవును. నేను ఎక్కువసార్లు పలికిన పేరు కల్యాణి. మాది చాలా సింపుల్ లైఫ్. నాకు డైరెక్షన్ తప్ప వేరే ఏదీ తెలియదు. షూటింగ్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేవాణ్ణి. మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆరుగురు మాత్రమే ఉండేవారు. సినిమాలు, ఇల్లు, ఆ ఫ్రెండ్స్.. అంతే. – డి.జి. భవాని -
మదిలో మోహన గీతం...
బృందావనం చిత్రంలోని ‘మధురమే సుధాగానం/ మనకిదే మరోప్రాణం/మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం’ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను చిత్రపరిశ్రమకు వచ్చిన కొత్తల్లో సింగీతం శ్రీనివాసరావుగారి సినిమాలకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసేవాడిని. అప్పటికే ఆయన తీసిన పంతులమ్మ చిత్రంలో మోహన రాగంలో చేసిన ‘సిరిమల్లె నీవే విరిజల్లు తావే’ పాట బాగా పాపులరయ్యింది. ఈ పాటలో చరణాల మధ్యలో హమ్మింగ్ ఉంటుంది కాబట్టి నేను చేయబోయే పాటలో కూడా హమ్మింగ్ పెట్టాలనుకున్నాను. అలాగే ‘విజయా’ వారికి మోహన రాగమైతే సమ్మోహనంగా ఉంటుందనుకున్నాను. ‘చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా/కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా/ శతకోటి భావాలను పలుకు ఎద మాటున/సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా’ అనే చరణానికి అనువుగా అనుభూతి ప్రధానంగా చే శాను. లిరిక్ – ట్యూన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లాగ ఉండాలి. ‘సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం’ అని నా నమ్మకం. సహజ నటుడు రాజేంద్రప్రసాద్, విలక్షణ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ సంస్థ ‘విజయా’... వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సంగీతం జాగ్రత్తగా చేశాను. ‘వేవేల తారలున్నా నింగి ఒకటే కదా/ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా/ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా/అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా’ చరణంలో కూడా భావాన్ని ప్రతిబింబించాను. మా అమ్మగారు వీణ విద్వాంసురాలు కనుక ఈ పాటలో వీణకు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ చిత్రంలో హీరోయిన్ సంగీతం టీచర్ కనుక మోహనరాగంలో ఉన్న ‘వరవీణా మృదుపాణి’ గీతం ట్యూన్ తీసుకున్నాం. పిల్లలకు నేర్పుతుండగా హీరో వచ్చి ఇంకో రకంగా సంగీతం తెలిసినట్లుగా పాడుతుంటే, ఇలా పాడతావేంటని ప్రశ్నిస్తుంది హీరోయిన్. అందరూ ఒకేలా పాడితే మిలిటరీ సంగీతం అవుతుంది అంటాడు హీరో. ఆ మాటలను ఆధారంగా చేసుకుని, ఆబ్లిగేటర్స్ చేశాను. అంటే ఒకరు గాంధారంలో పాడుతుంటే, ఒకరు షడ్జమం, మరొకరు పంచమంలో పాడుతుంటారు. ఇన్ని శృతుల్లో పాడినా చెవికి ఇంపుగా ఉండేదే సంగీతం అని చెప్పడానికి ఇలా చూపాం. ఆర్కెస్ట్రాలో సుమారు 40 మందిని వాడుకున్నాం. ఈ పాటకు ఆర్కెస్ట్రయిజేషన్ చేసిన ‘దిన’ ఇప్పుడు తమిళంలో పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. చెన్నై ‘విజయా గార్డెన్ డీలక్స్’ లో పాట రికార్డు చేశాం. పియానో సౌండ్‌తో ప్రారంభించి, వీణా నాదంలోకి అనుసంధానం చేయడం ఒక కొత్త ప్రయోగం. విజయా వారు బాపు దర్శకత్వంలో ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ తీసిన పదిహేడేళ్ల విరామం తరవాత ‘బృందావనం’ చిత్రం తీశారు. ప్రముఖ నటులు రావికొండలరావుపూనుకొని... కెవిరెడ్డి దగ్గర అసోసియేట్‌గా చేసిన సింగీతం, నాగిరెడ్డి గారి పిల్లలు విశ్వనాథ రెడ్డి, మాధవపెద్ది వంశంలో మా రెండో తరం అందరినీ ఒక గ్రూప్ చేశారు. ‘చందమామ’ నాగిరెడ్డి, చక్రపాణిగారల మానసపుత్రిక కనుక ‘విజయా చందమామ’ బ్యానర్‌గా ఈ సినిమా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఎస్. రాజేశ్వరరావుగారికి నివాళిగా చేశాం. ఈ ఆడియోని నా కోరిక మేరకు ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ‘విజయా వారి పాటలను, సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని, మాధవపెద్ది బాగా చేశాడు’ అని ఆయన నన్ను ప్రశంసించారు. ఈ పాట నాకు మరచిపోలేని గొప్ప పేరు సాధించి పెట్టింది. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
క్రిష్‌ను ప్రశంసిస్తూ సింగీతం లేఖ
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దర్శకుడు క్రిష్ కు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. ఓ భారీ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో తెరకెక్కించి సూపర్ హిట్ చేసిన క్రిష్, ప్రతిష్టాత్మక కేవీ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ఆయనకు స్వహస్తాలతో లేఖరాసి పంపారు. ఈ సందర్భంగా సింగీతం క్రిష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 'యువ కళావాహిని వారు ఈ సంవత్సరపు కేవీ రెడ్డి అవార్డును నా అభిమాన దర్శకుడు క్రిష్ కు ఇస్తున్నారని తెలిసి, ఒకప్పుడు నాకు ఇదే అవార్డు వచ్చినప్పటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంతోషిస్తున్నాను. నా గురువుగారు కేవీ రెడ్డి గారి ప్రతిభను ప్రతిభింభించే మూడు ముఖ్య గుణాలు - స్పష్టత, బాధ్యత, పవిత్రత. ఈ మూడు గుణాలు క్రిష్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇది అతని మొదటి సినిమా గమ్యంలోనే చూసాను. అప్పుడు అతనెవరో నాకు తెలీదు. అతన్ని వెతికి, ఫోన్ నంబర్ పట్టి, మాట్లాడి అభినందించాను. నేనూహించినట్లుగానే క్రిష్ గమ్యం మొదలు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ప్రతి చిత్రాన్నీ ఒక కళాఖండంగా తీర్చిదిద్దుతూ అదే సమయంలో వ్యాపారాత్మక అవసరాలను విస్మరించకుండా తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నాడు. క్రిష్ మున్ముందు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి, అతి త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి పొందుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్రిష్ కు నా హృదయ పూర్వక ఆశీస్సులు.' అంటూ ఈ నెల 22న లేఖ రాశారు. ఈ లేఖ పై స్పందించిన క్రిష్, సీనియర్ దర్శకులు సింగీతం గారు రాసిన ఈ లేఖను జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ ట్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో సింగీతం శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించారు. -
కాలపరీక్షలో...వెండితెర విజేత
సింగీతం శ్రీనివాసరావు సుప్రసిద్ధ దర్శకుడు హాలీవుడ్ తారాగణం:ఎల్లార్ కోల్ట్రానే, లోరెలీ లింక్లాటర్, ప్యాట్రీషియా ఆర్క్వెట్, ఎథాన్ హాకీ చాయాగ్రహణం: లీ డేనియల్, షానె కెల్లి దర్శకత్వం: రిచర్డ్ లింక్లాటర్ విడుదల: 2014 జూలై 11 (అమెరికా) సినిమా నిడివి: 165 నిమిషాలు నిర్మాణ వ్యయం: 40 లక్షల డాలర్లు (రూ. 24 కోట్లు) ఇప్పటివరకు వసూళ్లు: 444 లక్షల డాలర్లు (దాదాపు రూ. 276 కోట్లు) నాకు నచ్చిన హాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా ‘బాయ్‌హుడ్’ పేరు చెబుతా. అలాగని నాకు ఇదొక్కటే నచ్చిందని కాదు. ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. మరికొన్ని కలకాలం నిలిచిపోయేవిలా ఉంటాయి. ఈ రెండో కోవకు చెందినదే - ‘బాయ్‌హుడ్’.నిజానికి గతవారం ముగిసిన ‘ఆస్కార్’ అవార్డుల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ఇది. ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికీ, ‘బాయ్‌హుడ్’ చిత్రానికీ మధ్య ఒక తెలియని పోటీ ఆ అవార్డుల్లో నెలకొంది. కథాకథనానికి సంబంధించి రెండు వేర్వేరు శైలులను ఇష్టపడే వారి మధ్య జరిగిన పోటీ అది. ‘బర్డ్ మ్యాన్’ చిత్రం హాలీవుడ్ మీద తీసిన వ్యంగ్యపూరిత హాస్య చిత్రమైతే, ‘బాయ్‌హుడ్’ సినిమా పన్నెండేళ్ళ జీవితంలోని ఘట్టాలను సహజాతి సహజంగా చూపిన సినిమా. హాలీవుడ్ జీవితం మీద తీసిన సినిమాగా ‘బర్డ్ మ్యాన్’ ఉత్తమ చిత్రంతో పాటు మరో మూడు విభాగాల్లో ఆస్కార్‌ను అందుకోవడం ఆశ్చర్యం అనిపించదు. ‘బాయ్‌హుడ్’ చిత్రం ఒక పాత్రను అద్భుతంగా చిత్రిస్తూ, పెరిగే వయసుతో పాటు అమాయకత్వం తరగిపోతూ రావడాన్ని చూపెడుతుంది. నిజం చెప్పాలంటే, ‘బాయ్‌హుడ్’ ఒక అద్భుతసృష్టి. నాకు తెలిసినంత వరకూ, ఇంతవరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు. ఇది మన జీవితాన్ని అనుసరిస్తూ చేసిన విచిత్రమైన సినిమా. ఇదొక అమెరికన్ కుటుంబానికి అద్దం పట్టే కథ. చూస్తున్నంతసేపూ ఒక సినిమా చూస్తున్నట్టుండదు. కొన్నేళ్ళ పాటు కొందరి జీవితాలను వాళ్లతో పాటు మనమూ అనుసరిస్తూ వెళుతున్నట్టుంటుంది. ఆరేళ్ల కుర్రాడు. మేసన్ అతని పేరు. అతని అక్క - సమంత. వాళ్ల తల్లి - ఒలివా. విడిపోయిన ఆమె భర్త - సీనియర్ మేసన్. వేరొకతనితో ఒలివా పెళ్లి. ఈ వాతావరణంలో మేసన్ పదేళ్ళ పెరుగుదల... ఇదీ సూక్ష్మంగా కథ.మామూలుగా మన సినిమాల్లో ఒక పాత్ర తాలూకు చిన్నప్పటి వేషాన్ని చూపించాలంటే, ఎవరైనా బాలనటునితో చిత్రీకరిస్తారు. కానీ విశేషమేమిటంటే - ఆరేళ్ల మేసన్ పాత్రను ఆరేళ్ల ఎల్లార్ కోల్ట్రాన్ పోషించాడు. ఇలాగే వాళ్ల వాళ్ల వయసులకు తగ్గట్టు మిగతా నటీనటులు పాత్రలు పోషించారు. ఇలా 2002వ సంవత్సరంలో ప్రారంభమైన షూటింగ్, అదే నటీనటులతో ప్రతి సంవత్సరం చిత్రీకరిస్తూ, అలా అలా 12 ఏళ్ళు చిత్రీకరించారు. అంటే ఆరేళ్ల కుర్రాడికి 18 ఏళ్ళు వచ్చేవరకూ అతనిలో ఏయే మార్పులు వచ్చాయో, వాటిని యథాతథంగా చిత్రీకరిస్తూ, 2013 వరకూ తీసి సినిమా ముగించారు. ఇలా ఇందులో నటించిన నటీనటులందరూ ఆ షూటింగ్ జరిగిన 12 సంవత్సరాల్లో ఎలా పెరిగారన్నది చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ఒక సాహసం. ఒక విచిత్రం. దీని దర్శకుడు రిచర్డ్ లింక్లాటర్ (ఖజీఛిజ్చిటఛీ ఔజీజ్చ్ట్ఛుట) చూచాయగా ఒక కథను నిర్ణయించుకున్నాడట. కాలాన్ని బట్టి నటీనటులు ఎలా మారుతుంటారో, దాన్ని బట్టి ప్రతి సంవత్సరం స్క్రీన్‌ప్లేను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, చేర్చుకుంటూ రాసుకున్నాడట. ఈ సినిమాలో ట్రిక్స్ లేవు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. ఉన్నదల్లా జీవితమే! సమంత పాత్ర పోషించిన లోరెలీ సాక్షాత్తూ దర్శకుడు లింక్లాటర్ కూతురే. ఇటీవల ‘బాఫ్తా’ అవార్డుల్లో ‘బాయ్‌హుడ్’ ఉత్తమ చిత్రమైతే, లింక్లాటర్ ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అంటారు. రిచర్డ్ లింక్లాటర్ ఒక పుణ్య పురుషుడు. ‘ఆస్కార్’ అవార్డుల్లోనూ ‘బాయ్‌హుడ్’ చిత్రం తొమ్మిది విభాగాల్లో నామినేటై, ఉత్తమ చిత్రం విభాగంలో గట్టి పోటీనిచ్చినా, చివరకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మాత్రమే ఆస్కార్‌ను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ‘ఆస్కార్’ను అందుకోకపోయినా, అంతకు మించిన గౌరవమున్న చిత్రంగా ‘బాయ్‌హుడ్’ రానున్న రోజుల్లో హాలీవుడ్ చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. పైకి చేదుగా అనిపించే ఈ తీపి జ్ఞాపకాన్ని తెరపై ఆస్వాదించండి. కథ ఏమిటంటే... సమంత, మేసన్ అక్కా తమ్ముళ్లు. వీళ్ల తల్లి ఒలివా సొంత కాళ్లపై నిలబడాలనుకుని డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం సంపాదిస్తుంది. ఒలివా భర్త సీనియర్ మేసన్ ఇరాక్ యుద్ధంలో ఉండడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటాడు. దాంతో ఒలివా, సీనియర్ మేసన్ విడిపోతారు. మూడేళ్ల తర్వాత - ఒలివా తన కుమారుడి ప్రొఫెసరైన బిల్‌తో ప్రేమలో పడుతుంది. బిల్ పిల్లలతో కలిసి సమంత, మేసన్ ఉండాల్సి వస్తుంది. బిల్‌కు క్రమశిక్షణ ఎక్కువ. పిల్లల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్నాళ్ల తర్వాత బిల్ మద్యానికి బానిసై, ఒలివాను హింసిస్తుంటాడు. దాంతో ఒలివా, అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదంతా తెలుసుకున్న సీనియర్ మేసన్, ఒలివాకు సర్ది చెప్పి సమంత, మేసన్లను వేరే ప్రాంతానికి తీసుకువెళతాడు. మళ్లీ కొత్త జీవితం మొదలవుతుంది. ఒలివా వేరొకరితో సహజీవనం చేస్తుంది. మేసన్‌కు క్రమంగా ఫొటోగ్రఫీపై ఆసక్తి మొదలవుతుంది. ఒక పార్టీలో మేసన్, షీనా అనే యువతితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మేసన్‌కు షీనాతో త్వరగా బ్రేకప్ అవుతుంది. ఇంతకీ ఫొటోగ్రఫీలో మేసన్‌కు సిల్వర్ మెడల్ వస్తుంది. డిగ్రీ కూడా సాధిస్తాడు. సమంత, మేసన్‌ల భవిష్యత్ ప్రణాళికలను చర్చించడానికి ఒలివా వారిని లంచ్‌కు పిలుస్తుంది. గత జీవితం చాలా విఫలమైందనీ, అందుకే ఇల్లు అమ్మేస్తున్నాననీ ఒలివా చెబుతుంది. ఇంతలో మేసన్ చదువుకోవడానికి యూనివర్సిటీకి వెళతాడు. అక్కడ పరిచయమైన స్నేహితుడితో కలిసి నేషనల్ పార్క్‌కు వెళతాడు. ‘ఈ క్షణాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండాలి’ అని వాళ్లు అనుకోవడంతో సినిమాకు ‘శుభం’ కార్డు పడుతుంది. ఆయన రూటే సెపరేటు! అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, రచయిత అయిన యాభై అయిదేళ్ళ రిచర్డ్ స్టూవర్ట్ లింక్లాటర్ విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తుంటారు. ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఆయన తీసిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (1995), ‘బిఫోర్ సన్‌సెట్’ (2004), ‘బిఫోర్ మిడ్నైట్’ (2013)ల చలనచిత్ర త్రయం గురించి సినీ వర్గీయులు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అదే నటీనటుల్ని తీసుకొని కొన్నేళ్ళ పాటు వాళ్ళను చిత్రీకరించడమనే పద్ధతిని ఆయన ఆ ట్రయాలజీలోనూ, ఈ ‘బాయ్‌హుడ్’లోనూ అనుసరించారు. సినీ దర్శకత్వానికి రాక ముందు అనేక సంవత్సరాలు ఆయన ఫిల్మ్ టెక్నిక్‌లకు అభ్యాసాలుగా, ప్రయోగాలుగా చాలా లఘు చిత్రాలు తీశారు. చిత్రం ఏమిటంటే, ఒక రోజులో జరిగిన కథగా సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఆ రకమైన ఇతివృత్తాలు బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇక, పన్నెండేళ్ళ పాటు ఆయన చిత్రీకరించిన ‘బాయ్‌హుడ్’ తాజాగా వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ చిత్రాలు తీస్తున్నప్పటికీ, ఇప్పటికీ స్వస్థలమైన టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోనే ఉండడం ఆయన విల క్షణత. సాంప్రదాయిక సినీ కథాకథన శైలికి భిన్నంగా వెళ్ళడం వృత్తిపరంగానూ లింక్లాటర్ను ఇతరులకు భిన్నంగా నిలుపుతోంది. -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ -
నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23
వయసు పెరిగేకొద్ది క్రియేటివిటీ తగ్గిపోతుందా? మెమరీ లాస్ అయిపోతుందా? ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయా? హెల్త్ దెబ్బతింటుందా? ఫిజిక్ కంట్రోల్ తప్పిపోతుందా? ఏమో... సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఇవన్నీ రాంగే! ఇప్పుడాయన వయసు 83 ఏళ్లు. కానీ 23 ఏళ్ల కుర్రాడిలాగానే ఆలోచిస్తారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం! నో సీక్రెట్స్: నన్ను అందరూ కామన్‌గా అడిగే ప్రశ్న ఒక్కటే. ఈ వయసులో కూడా మీరింత ఉత్సాహవంతంగా ఎలా ఉండగలుగుతున్నారని. ఈ విషయంలో ఎలాంటి రహస్యాలూ లేవు. నా మనసే దీనికి ప్రధాన కారణం. మామూలుగా అందరికీ శారీరక వయసు, మానసిక వయసు ఉంటాయి. రెండింటినీ బ్యాలెన్స్ చేసేవారే యూత్‌ఫుల్‌గా ఆలోచిస్తారు. నా వయసు 83 అయితే, నా మనసు వయసు 23. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహమే నా మానసిక యవ్వనానికి కారణం. వయసు పెరిగాక శారీరకంగా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అవన్నీ నాకూ ఉన్నాయి. మనసు మన అధీనంలో ఉంటే వాటిని సులువుగా అధిగమించేయొచ్చును. అభిరుచికి నో రిటైర్మెంట్: ఇప్పటి జనరేషన్లో నిరుత్సాహం ఎక్కువైపోయింది. ఎంత చేసినా మన బతుకింతేగా అనుకుంటూ బతుకు బండిని బరువుగా ఈడుస్తున్నారు. నాకలాంటి నిరుత్సాహాలు, నిస్పృహలు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. చేసే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటే ఉండొచ్చు కానీ, మన అభిరుచికి మాత్రం రిటైర్మెంట్ ఉండకూడదు. ఈసురోమంటూ ఆఫీసుకెళ్లడం... ఎప్పుడు అక్కడ నుంచీ బయటపడతామా అని ఎదురుచూడటం, సెలవు కోసం ఆత్రపడటం... ఇవన్నీ పనిమీద ఆసక్తి లేకపోవడం వల్ల వచ్చే చర్యలు. మనకు నచ్చే పని చేసే అవకాశం రావడం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఉద్యోగంతో పాటు మన అభిరుచికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తరచుగా పాల్గొంటే మనసు చైతన్యవంతం అవుతుంది. స్టూవర్డ్ అని నాకు తెలిసిన ఓ ఆంగ్లో ఇండియన్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో పనిచేసేవారు. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరుగుతూ రకరకాల పక్షులు గురించి పరిశోధన చేసి, ఓ పుస్తకం రాశాడు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాపకం ఒకటి ఉంటుంది. దాని మీద ఏకాగ్రత చూపిస్తే ఎప్పటికీ ఉత్సాహంగా ఉంటాం. నా అంత బిజీ ఎవరూ ఉండరు: నేను అప్పుడూ బిజీనే. ఇప్పుడూ బిజీనే. అసలు నా అంత బిజీ ఎవ్వరూ ఉండరు కూడా. ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. టిఫిన్ చేయగానే నా రూమ్‌లోకి వెళ్లిపోయి, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి యూ ట్యూబ్‌లో నాకిష్టమైన సినిమాలు చూస్తుంటాను. పాటలకు ట్యూన్ కట్టుకుంటుంటాను. కొత్త కథల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాకు లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డు ఇస్తానంటే, అంతకన్నా శాపం ఏదీ ఉండదు. ఎందుకంటే నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఎక్కువ. ఆ నడకే ఇప్పటికీ నాకు హెల్ప్: నేను మొదట్నుంచీ వాకింగ్ ఎక్కువ చేసేవాణ్ణి. షూటింగ్స్‌కి కూడా నడిచే వెళ్లేవాణ్ణి. ఆ నడక ఇప్పటికీ నాకు హెల్ప్ అవుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఓ అరగంట వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తాను. నేను తినేదంతా వెజిటేరియన్ ఫుడ్డే. లంచ్‌తో పాటు డిన్నర్లో కూడా రైస్ తీసుకుంటాను. నచ్చిన ఫుడ్ తినేస్తాను. రాత్రి 11 గంటలకు నిద్రపోతాను. ఇలా పడుకుంటానో లేదో వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. అనవసరపు విషయాలు పట్టించుకోను: నా మనసు ఎక్కువ ఆలోచిస్తుంది కానీ, అనవసరమైన విషయాల గురించి కాదు. కోపాలు, ఈర్ష్యలు అస్సలుండవు. నాకు సినిమా ఫీల్డ్‌లో విరోధులు ఎవ్వరూ లేరు. 60 ఏళ్ల క్రితం విషయాలు కూడా గుర్తుంటాయి: నాకు పెద్దగా మనుషులు గుర్తుండరు కానీ, సినిమాకు సంబంధించిన ఏ అంశమైనా బాగా గుర్తు. 60 ఏళ్ల క్రితం ఏదో పేపర్లో చదివిన వార్త, సినిమాలో చూసిన సంఘటన కూడా ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. దాన్ని బట్టి ఆలోచించండి... నా మెమరీ పవరేంటో! నేనెప్పటికీ యూత్! ఫైనల్‌గా ఒక్క విషయం చెప్పనా... పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు నేను నా వయసు వాళ్లతో అస్సలు కూర్చోను. కుర్రవాళ్లతో కూర్చుని వాళ్ల కెరీర్, అభిరుచుల గురించి తెలుసుకోవడం నాకిష్టం. అలా అప్డేట్ అవుతాను. నాకు వయసు మీద పడిందనే ఆలోచన ఎప్పుడూ రాదు. నేను ఎప్పటికీ యూత్. అందుకే టీషర్ట్స్ వేసుకుంటుంటాను. -
అమ్మతనపు కమ్మదనానికి ‘వెల్కమ్ ఒబామా’
తారాగణం: ఊర్మిళ, రేచల్, ఎస్తాబన్, సంజీవ్... దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: భారతీ, కృష్ణ మాతృమూర్తులు రెండు రకాలు. కన్నతల్లి, పెంచిన తల్లి. ఇతిహాసాలు సైతం ఈ ఇద్దరు తల్లుల గురించే ప్రస్తావించాయి. అమ్మ అనే భావన... బిడ్డల మూలకణాలు, జీన్స్ వంటి సాంకేతిక అంశాలకు అతీతం. తన శరీరాన్ని చీల్చుకొని బయటకొచ్చిన బిడ్డ జాతి గురించి, మతం, జీన్స్ గురించి అమ్మ ఆలోచించదు. శాస్త్ర, సాంకేతిక పరంగా అమెరికా లాంటి దేశాలు ఎంతైనా అభివృద్ధి చెందనీ, మనిషి జన్మకు సంబంధించినంతవరకూ ఎన్ని దారులైనా వెతకనీ.. కానీ అమ్మ మాత్రం అమ్మే. నవ మాసాలూ మోసి, కని... తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను సాకే తల్లికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. శాస్త్రాలకు అందని మాయ అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అంది మన దేశం. ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో సింగీతం చెప్పింది అదే. సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తుందంటే... కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సింగీతం. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ఓ కొత్త ప్రయోగంతోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ముందు కథలోకెళదాం. లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో ఇండియాలోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను మెడికల్ చెకప్‌కి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది. అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. అమ్మ గొప్పదనాన్ని చూపిస్తూ, అంతర్లీనంగా దేశం గొప్పతనాన్ని వివరిస్తూ నవ్యరీతిలో సింగీతం ఈ కథను నడిపించిన తీరు అభినందనీయం. భావోద్వేగాలు కూడా కథానుగుణంగా సాగాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లు చెమర్చాయి. భారతమాతకు మరోరూపంలా యశోద పాత్రను, అమెరికాకు ప్రతిరూపంగా లూసీ పాత్రను మలిచారు సింగీతం. యశోద పాత్రలో మరాఠి నటి ఉర్మిళ చూపిన నటన అమోఘం. లూసీ క్యారెక్టర్లో రేచెల్(యూకే) ఫర్వాలేదనిపించింది. కృష్ణ పాత్రలో బాలనటుడు ఎస్తాబాన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి నటులుగా మారారు. అసహజమైన వారి హావభావాలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. తెల్లని కాగితంపై నల్లని మచ్చలా ఉంది వారి ఎపిసోడ్. సింగీతం స్క్రీన్‌ప్లే, సంగీతం రెండూ బావున్నాయి. దర్శన్ కెమెరా, రోహిణి మాటలు సినిమాకు అదనపు ఆకర్షణలు. భారతీకృష్ణ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. హైబ్రిడ్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో వచ్చినఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లస్: దర్శకత్వం, కథ, మాటలు, ఛాయా గ్రహణం, ఊర్మిళ నటన మైనస్: ముగ్గురు రచయితల ఎపిసోడ్ -
ఇప్పటికీ స్పిరిట్ తగ్గలేదు - దాసరి
‘‘నేటి దర్శకులు సింగీతాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సింగీతం పలు మార్లు నిరూపించాడు. ఇప్పటికీ ఆయనలో స్పిరిట్ తగ్గలేదు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎస్.భారతి, కృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. సింగీతమే సంగీతాన్నందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన దాసరి ఇంకా మాట్లాడుతూ -‘‘కొత్తగా వచ్చిన నిర్మాతలు కొత్త దర్శకులతో సినిమా చేస్తారు. కానీ భారతి, కృష్ణ అందుకు భిన్నంగా సింగీతంగారికి బాధ్యత అప్పజెప్పడం అభినందనీయం. ఆ రోజుల్లో చాలా సందర్భాల్లో సంగీత దర్శకునిగా అవకాశం ఇవ్వమని నన్ను అడిగారు సింగీతం. సరదాగా అంటున్నారేమో అనుకున్నాను. ఈ సినిమాకు ఆయన అందించిన పాటలు వింటుంటే.. ఆయన ఎంత మంచి సంగీత దర్శకుడో అర్థమవుతోంది’’ అన్నారు. ‘‘పింగళి గారిని స్ఫూర్తిగా తీసుకొని సంగీతం అందించాను. అంతర్జాతీయ స్థాయిలో ‘3డి కురుక్షేత్రం’ చేయాలనుంద’’ని సింగీతం తెలిపారు. ‘పుష్పకవిమానం’ టైమ్‌లో సింగీతం వద్ద చాలా నేర్చుకున్నానని అమల గుర్తుచేసుకున్నారు. నటన మాత్రమే తెలిసిన తనతో సింగీతం మాటలు రాయించారని నటి రోహిణి చెప్పారు. విద్యార్థులుగా మారి సింగీతం వద్ద ఎన్నో నేర్చుకున్నామని నిర్మాతలు తెలిపారు. ‘ఆదిత్య 369’లోని ‘జాణవులే’ పాటకు సింగీతం, రోజా సరదాగా స్టెప్స్ వేయడం ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.