నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23 | My physical age of 83 my mental age of 23 | Sakshi
Sakshi News home page

నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23

Published Wed, Aug 20 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23

నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23

వయసు పెరిగేకొద్ది క్రియేటివిటీ తగ్గిపోతుందా? మెమరీ లాస్ అయిపోతుందా? ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయా? హెల్త్ దెబ్బతింటుందా? ఫిజిక్ కంట్రోల్ తప్పిపోతుందా? ఏమో... సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఇవన్నీ రాంగే! ఇప్పుడాయన వయసు 83 ఏళ్లు. కానీ 23 ఏళ్ల కుర్రాడిలాగానే ఆలోచిస్తారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం!
 
 నో సీక్రెట్స్: నన్ను అందరూ కామన్‌గా అడిగే ప్రశ్న ఒక్కటే. ఈ వయసులో కూడా మీరింత ఉత్సాహవంతంగా ఎలా ఉండగలుగుతున్నారని. ఈ విషయంలో ఎలాంటి రహస్యాలూ లేవు. నా మనసే దీనికి ప్రధాన కారణం. మామూలుగా అందరికీ శారీరక వయసు, మానసిక వయసు ఉంటాయి. రెండింటినీ బ్యాలెన్స్ చేసేవారే యూత్‌ఫుల్‌గా ఆలోచిస్తారు. నా వయసు 83 అయితే, నా మనసు వయసు 23. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహమే నా మానసిక యవ్వనానికి కారణం. వయసు పెరిగాక శారీరకంగా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అవన్నీ నాకూ ఉన్నాయి. మనసు మన అధీనంలో ఉంటే వాటిని సులువుగా అధిగమించేయొచ్చును.
 
 అభిరుచికి నో రిటైర్మెంట్: ఇప్పటి జనరేషన్‌లో నిరుత్సాహం ఎక్కువైపోయింది. ఎంత చేసినా మన బతుకింతేగా అనుకుంటూ బతుకు బండిని బరువుగా ఈడుస్తున్నారు. నాకలాంటి నిరుత్సాహాలు, నిస్పృహలు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. చేసే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటే ఉండొచ్చు కానీ, మన అభిరుచికి మాత్రం రిటైర్మెంట్ ఉండకూడదు. ఈసురోమంటూ ఆఫీసుకెళ్లడం... ఎప్పుడు అక్కడ నుంచీ బయటపడతామా అని ఎదురుచూడటం, సెలవు కోసం ఆత్రపడటం... ఇవన్నీ పనిమీద ఆసక్తి లేకపోవడం వల్ల వచ్చే చర్యలు. మనకు నచ్చే పని చేసే అవకాశం రావడం అందరికీ కుదరకపోవచ్చు.
 
  అలాంటప్పుడు ఉద్యోగంతో పాటు మన అభిరుచికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తరచుగా పాల్గొంటే మనసు చైతన్యవంతం అవుతుంది. స్టూవర్డ్ అని నాకు తెలిసిన ఓ ఆంగ్లో ఇండియన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో పనిచేసేవారు. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరుగుతూ రకరకాల పక్షులు గురించి పరిశోధన చేసి, ఓ పుస్తకం రాశాడు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాపకం ఒకటి ఉంటుంది. దాని మీద ఏకాగ్రత చూపిస్తే ఎప్పటికీ ఉత్సాహంగా ఉంటాం.
 
 నా అంత బిజీ ఎవరూ ఉండరు: నేను అప్పుడూ బిజీనే. ఇప్పుడూ బిజీనే. అసలు నా అంత బిజీ ఎవ్వరూ ఉండరు కూడా. ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. టిఫిన్ చేయగానే నా రూమ్‌లోకి వెళ్లిపోయి, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి యూ ట్యూబ్‌లో నాకిష్టమైన సినిమాలు చూస్తుంటాను. పాటలకు ట్యూన్ కట్టుకుంటుంటాను. కొత్త కథల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాకు లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు ఇస్తానంటే, అంతకన్నా శాపం ఏదీ ఉండదు. ఎందుకంటే నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఎక్కువ.
 
 ఆ నడకే ఇప్పటికీ నాకు హెల్ప్:  నేను మొదట్నుంచీ వాకింగ్ ఎక్కువ చేసేవాణ్ణి. షూటింగ్స్‌కి కూడా నడిచే వెళ్లేవాణ్ణి. ఆ నడక ఇప్పటికీ నాకు హెల్ప్ అవుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఓ అరగంట వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేస్తాను. నేను తినేదంతా వెజిటేరియన్ ఫుడ్డే. లంచ్‌తో పాటు డిన్నర్‌లో కూడా రైస్ తీసుకుంటాను. నచ్చిన ఫుడ్ తినేస్తాను. రాత్రి 11 గంటలకు నిద్రపోతాను. ఇలా పడుకుంటానో లేదో వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది.
 
 అనవసరపు విషయాలు పట్టించుకోను:  నా మనసు ఎక్కువ ఆలోచిస్తుంది కానీ, అనవసరమైన విషయాల గురించి కాదు. కోపాలు, ఈర్ష్యలు అస్సలుండవు. నాకు సినిమా ఫీల్డ్‌లో విరోధులు ఎవ్వరూ లేరు.  60 ఏళ్ల క్రితం విషయాలు కూడా గుర్తుంటాయి: నాకు పెద్దగా మనుషులు గుర్తుండరు కానీ, సినిమాకు సంబంధించిన ఏ అంశమైనా బాగా గుర్తు. 60 ఏళ్ల క్రితం ఏదో పేపర్లో చదివిన వార్త, సినిమాలో చూసిన సంఘటన కూడా ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. దాన్ని బట్టి ఆలోచించండి... నా మెమరీ పవరేంటో!

 నేనెప్పటికీ యూత్! ఫైనల్‌గా ఒక్క విషయం చెప్పనా... పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు నేను నా వయసు వాళ్లతో అస్సలు కూర్చోను. కుర్రవాళ్లతో కూర్చుని వాళ్ల కెరీర్, అభిరుచుల గురించి తెలుసుకోవడం నాకిష్టం. అలా అప్‌డేట్ అవుతాను. నాకు వయసు మీద పడిందనే ఆలోచన ఎప్పుడూ రాదు. నేను ఎప్పటికీ యూత్. అందుకే టీషర్ట్స్ వేసుకుంటుంటాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement