YS Jagan Interview: క్లీన్‌ స్వీప్‌ ఖాయం | Times Now Exclusive Interview With Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

క్లీన్‌ స్వీప్‌ ఖాయం.. టైమ్స్‌ నౌ ఇంటర్వ్యూలో సీఎం జగన్‌

Published Sat, May 4 2024 7:35 AM | Last Updated on Sat, May 4 2024 12:04 PM

Times Now Exclusive Interview With Andhra Pradesh CM YS Jagan Mohan Reddy

టైమ్స్‌ నౌ గ్రూప్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ నవికా కుమార్‌ ఇంటర్వ్యూలో సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి : ‘రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సుపరిపాలన అందించాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాం. అర్హతే ప్రామాణికంగా, వివక్ష చూపకుండా.. అవినీతికి తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. విప్లవాత్మక సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. 

ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడానికి దారితీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్‌ జగన్‌ను టైమ్స్‌ నౌ గ్రూప్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ నవికా కుమార్‌ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.

నవికా: రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మీ చెల్లెళ్లు మీ మీద పోరాటానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరితో పోరాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? 
సీఎం జగన్‌: మా ప్రభుత్వంపై పోరాటానికి వస్తున్న ప్రతి ఒక్కరితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కాంగ్రెస్‌ పార్టీ రిమోట్‌ కంట్రోల్‌ కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు నా చెల్లెలు షర్మిలను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నా చెల్లిని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ ఓటర్లలో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని వాళ్లు భావిస్తు న్నారు. మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతి రేకత లేదు. ప్రజాస్వామ్యంలో 50 శాతానికి పైగా ఓట్లతో గెలిచాం. చెప్పినవి చేసి చూపించాం. అందువల్ల ప్రజలు మాతోనే ఉన్నారు. దేవుడి దయతో మేం స్వీప్‌ చేయబోతున్నాం.

నవికా: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని మీరు అంటున్నారు. ఈ విషయం బీజేపీకి తెలియదంటారా?
సీఎం జగన్‌: ఈ ప్రశ్న మీరు ఆ పార్టీ వాళ్లను అడగాలి.

నవికా: మీరు పరాజయం పాలవ్వబోతున్నారనే బీజేపీ మీతో పొత్తు పెట్టుకోలేదా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని మీరేమైన నిరాశకు గురయ్యారా?
సీఎం జగన్‌: పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఈ రెండు జాతీయ పార్టీలు అప్రధానం. వాళ్ల పార్టీ, వాళ్లకు ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకున్నారు. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొన్ని సందర్భాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చాం. ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది అనిపించినప్పుడు ఆ బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. ఉదాహరణకు మైనార్టీల హక్కులకు విఘాతం కలిగించే బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. సీఏఏకు వ్యతిరేకంగా మేం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.

నవికా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే మీరు ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది. ఈ క్రమంలో హోదా అంశంపై ఏదైనా భరోసా లభించిందా?
సీఎం జగన్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒప్పుకుంది. కానీ.. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా అన్యాయం చేసింది. పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన మేరకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని మేం నమ్మాం. కానీ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలు చెలగాటం ఆడాయి. ప్రత్యేక హోదాను సాధించడమే ప్రధాన అజెండాగా మేం అడుగులు ముందుకు వేశాం, వేస్తున్నాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తాం.

నవికా: పూర్తి మెజార్టీతో కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే హోదా వస్తుందని భావిస్తున్నారా?
సీఎం జగన్‌: ఇది నిజం. అందరికీ ఇది తెలిసిన అంశమే.

నవికా: మెజార్టీ లేక సంకీర్ణం.. కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు భావిస్తున్నారు? 
సీఎం జగన్‌: జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. జాతీయ మీడియా చేసిన సర్వేలు కొన్ని సార్లు నిజం కావచ్చు. కాపోవచ్చు.  

నవికా: రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని మీరు అనుకుంటున్నారా?
సీఎం జగన్‌: రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరిని నేను దగ్గరగా చూశాను. వ్యక్తిగతంగా రాహుల్‌ గాంధీ, మోదీతో పోల్చి చూస్తే.. మైనార్టీలకు వ్యతిరేకం అని తప్పితే మిగతా అంశాల్లో మోదీనే మంచివారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి మరణించాక నా కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో అందరికీ తెలుసు. ఆ వేధింపులకు నేనే సాక్షి. ఈ క్రమంలో ఏ విధంగా రాహుల్‌ గాంధీ మంచివాడని అనాలి?

నవికా: రాజకీయాల్లో ఉన్నత ఆశయాలు ఉన్నాయని చెబుతున్నారు మీరు.. అందుకే మీ చెల్లెళ్లు్ల మీ నుంచి దూరమయ్యారా? మీరు పార్టీలోకి రానివ్వకపోవడంతోనే వేరే పార్టీల వైపు వెళ్లారా?
సీఎం జగన్‌: వాళ్లను తీసుకొస్తే అది కుటుంబ రాజకీయంగా మారిపోతుంది. ఒకే కుటుంబలోని ఒక జనరేషన్‌ నుంచి ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటే అది పార్టీ అవ్వదు. మరేదో అవుతుంది. నాకు స్పష్టమైన విజన్‌ ఉంది. పార్టీ వారసత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజలకు మంచి చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. వారసత్వం అనేది వేరే ప్రస్తావన. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలంటే.. ఎవరైనా వస్తే సంతోషంగా మాట్లాడుకోగలగాలి. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని సరదాగా ఉండాలి. అంతేగానీ ప్రతి చోట రాజకీయం అంటే ఎలా? ఒక కుటుంబం నడిపే పార్టీ ఎప్పటికీ బతకదు.

నవికా: మీ చెల్లెలితో మీ అనుబంధం ఎలా ఉండేది?
సీఎం జగన్‌: దురదృష్టవశాత్తు ఆమె చంద్రబాబుతో కలిసింది. ఆయన చెప్పినట్టే రాజకీయాలు చేస్తోంది. మా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. ఆ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తోంది. (నవికా: ఆమె మీ కుటుంబమే కదా..) మా కుటుంబ సభ్యురాలు అయి ఉండి కూడా.. బయటకు వెళ్లడం, రాజకీయ శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది.

నవికా: మీ ఇద్దరి విషయంలో.. రెండు వైపులా మీ తల్లి ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
సీఎం జగన్‌: ఈ రోజు రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు చేయట్లేదు అనేది కాదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచిని మేము చెబుతున్నాం. ఇక్కడ జగన్‌ ఒక వైపు.. మిగిలిన వారందరూ మరో వైపు ఉన్నారు. ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలుపుతారు. అలాంటి రాజకీయమే నడుస్తోంది. కుటుంబ రాజకీయాలు ఇక్కడ పని చేయవు.

నవికా: చంద్రబాబు చెప్పినట్టే.. ఆయనకు ఏమి అవసరమో అదే.. మీ చెల్లెలు చేస్తున్నారని ఎలా చెబుతున్నారు? కాంగ్రెస్‌ పార్టీలోని సభ్యులు ఆమెకు ఆశలు కల్పించి ఉండొచ్చుకదా?
సీఎం జగన్‌: ఇక్కడ వాస్తవం ఏమంటే.. ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. (నవికా: మీరేమైనా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారా? తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంలో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాప్‌ చేశారని చెబుతున్నట్టు) ఎవరైనా ఎందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలి. ఆమె నా సొంత చెల్లెలు. అందుకే ఏం జరిగిందో ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఎవరు ఆడిస్తున్నారో.. ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలుసు.

నవికా:  నారీ శక్తిని విశ్వసిస్తున్న దేశంలో.. తండ్రి వారసత్వం వాటా కొడుకులకు మాత్రమే కాదు.. కూతుళ్లకు వర్తిస్తుందంటే మీరు ఏమంటారు?
సీఎం జగన్‌: దీనినే సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారసత్వం కోసం పోరాటం జరగట్లేదు. మా నాన్న 2009లో అందరినీ విడిచి వెళ్లిపోయారు. మనం 2024లో మాట్లాడుకుంటున్నాం. దాదాపు 15 ఏళ్లు అవుతుంది నాన్న వెళ్లిపోయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా నా ఐదేళ్ల పాలనను ప్రజలు చూశారు. నా పాలనను విశ్వసిస్తే వారే ఓటు రూపంలో నాకు మద్దతుగా నిలుస్తారు. లేకుంటే వేరే వైపు చూస్తారు. ఆ పోరాటమే నడుస్తోంది గానీ, వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది?

నవికా:  ఏపీలో కాంగ్రెస్, ఎన్‌డీఏ, జగన్‌ ముక్కోణపు పోటీలో ఉన్నారు? ఏమైనా మీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారా?
సీఎం జగన్‌: ఈ రోజు నేను చెప్పే మాటలను (మార్క్‌) గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ రండి. కాంగ్రెస్‌కు నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్యే పోటీ.

నవికా:  2019 ఎన్నికల్లో మీరు రికార్డు విజయం సాధించారు. 175 శాసనసభ స్థానాల్లో 151 స్థానాలు, 25లో 22 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలవబోతున్నారు?
సీఎం జగన్‌: ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం అనేది ముఖ్యమైనది. గత ఎన్నికల్లో మేము 49.96 శాతం ఓట్లు సాధించాం. ఈ సారి దేవుడి దయతో 2019లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకుంటామని నాకు బలమైన నమ్మకం ఉంది. మీరు మంచి విశ్లేషణ చేస్తారు.. మీరే ఆ రోజు టీవీలో నంబర్లు చూస్తారు.

నవికా:  దేశంలో ప్రత్యర్థి పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి? దీనిపై మీరు ఏమంటారు?
సీఎం జగన్‌: నేను దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు వేరే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

నవికా:  ఏపీలో బీజేపీ పొత్తును మీరు టార్గెట్‌ చేశారు. 2014లో కలిసి పోటీ చేసిన వాళ్లు.. తిరిగి 2024లో వస్తున్నారు? మీరు దీనిని అవకాశవాద పొత్తుగా ఎందుకు చూస్తున్నారు?
సీఎం జగన్‌: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తుంది. అదే పార్టీ విజన్‌ను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మార్గదర్శకంగా ఉంటుంది. పాలనా పని తీరును కూడా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో నేరవేర్చామా లేదా అని పోల్చి చూడాలి. ఇదే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లను అడిగేందుకు మన అర్హతను నిర్ణయిస్తుంది. ఇప్పుడు కూటమిగా వస్తున్న వాళ్లే.. గతంలో చంద్రబాబు సంతకంతో రకరకాల హామీలతో కరపత్రం ముద్రించి 2014లో ప్రతి ఇంటికీ పంపించారు. కూటమి నాయకుల ఫొటోలతో ముద్రించారు. ఇదే విషయాన్ని నా ప్రతి బహిరంగ సభలోనూ ప్రజలకు చెబుతున్నాను. వాళ్ల మేనిఫెస్టోను చూపించి.. అందులోని  వాగ్ద్ధానాలను చదివి.. ఇవన్నీ 2014 ఎన్నికల తర్వాత అమలు చేశారా? లేదా? అంటూ ప్రజలనే అడుగుతున్నాను. అందులో నెరవేర్చిన ఒక్క హామీనైనా చెప్పమంటున్నాను. చెప్పడానికి అందులో ఒక్కటంటే ఒక్కటీ లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో ఆ కూటమి ప్రజలను మోసం చేసింది. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం నుంచి తుడిచి పెట్టుకుపోయాడు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల్లో మేము గెలిచాం. మళ్లీ అదే కూటమి.. అదే చంద్రబాబు.. కొత్త మేనిఫెస్టోతో వచ్చారు.

నవికా:  ఐదేళ్ల మీ పాలనను ప్రజలు చూశారు. చంద్రబాబు కంటే మీరు మెరుగైన పాలన అందించారని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?
సీఎం జగన్‌: చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ మేం 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్రికరణశుద్ధితో అమలు చేశాం. మా మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకే ఇచ్చి.. అందులో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం అందాయో టిక్‌ చేయమని చెప్పాం. మొదటి ఏడాదిలోనే దాదాపు 86, 87 శాతం హామీలు అమలు చేస్తే.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారని ప్రజలే చెబుతున్నారు. అది మా ప్రభుత్వం, మా పార్టీపై ప్రజలకున్న విశ్వసనీయత. అదే మా నమ్మకం.

నవికా:  చంద్రబాబు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాక సభలు నిర్వహించారు. అదే సమయంలో మీరూ సిద్ధం సభలు పెట్టారు. చంద్రబాబుకు ప్రజల నుంచి సానుభూతి రాకూడదనే మీరు సిద్ధం సభలు నిర్వహించారని ప్రతిపక్షాలు అంటే మీరేమంటారు?  
సీఎం జగన్‌: (నవ్వుతూ..) నేను సిద్ధం సభలు పెట్టినట్టే వారూ రాజకీయ సభలు పెట్టారు. కానీ జగన్‌ సిద్ధం సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారి సభలకు ఎవరూ రాలేదు. దానికి నేనేం చేయగలను.. ఈ ప్రశ్న వారినే అడగాలి. జగన్‌ అంత జనాన్ని ఎలా ఆకట్టుకుంటున్నాడు.. మీరెందుకు ప్రజలను ఆకట్టుకోలేకపోయారని వారినే అడగండి.

నవికా:  మీ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య మీ కుటుంబంలో వివాదాస్పదంగా మారింది. ఆ హత్య కేసులో ఆయన భార్య, మీ చెల్లెళ్లు కూడా గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తులో న్యాయం జరగలేదంటున్నారు. 
సీఎం జగన్‌: ఈ అంశం మా కజిన్స్‌ మధ్య ఉంది. మా కజిన్‌ సిస్టర్‌ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మరో కజిన్‌ బ్రదర్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆరోపణలు కజిన్‌పై చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఘటన జరిగినప్పుడు ఇవేమీ లేవు. కానీ సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీనికంతటికీ కారణం చంద్రబాబే.

నవికా:  ప్రతి సమస్యకు చంద్రబాబుతో సంబంధం ఉంటుందా?
సీఎం జగన్‌: ఇక్కడ జరుగుతున్నది జగన్, చంద్రబాబు మధ్య పోరాటం. జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తున్నారు. జగన్‌ ఎప్పుడూ ఒంటరి కాదు.. నా వెనుక ప్రజలున్నారు. ఇలాంటప్పుడు నాపై వ్యతిరేకత ఎందుకొస్తుంది! ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇతర పార్టీల అవసరం ఏముంది?  

నవికా:  రాజకీయ ప్రతీకారంతో అనుకోండి, లేదా మరేమైనాగానీ మీపై ఉన్న సీబీఐ కేసుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. అవి మీ ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయనుకుంటున్నారా?
సీఎం జగన్‌: నాపై ఉన్న కేసులు నా ప్రభుత్వంలో, నా పాలనలో నమోదైనవి కాదు. మా నాన్న చనిపోయినప్పుడు.. నేను రాజకీయంగా వారికి ఎక్కడ అడ్డు తగులుతానో అని భయపడి చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి కుట్రతో పెట్టిన కేసులు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నాపై అక్రమ కేసులు బనాయించడానికి చేసిన ఆరోపణలు ఏ కాలానికి సంబంధించినవి? అప్పటికి నేను ఎమ్మెల్యేను కాను, ఎంపీనీ కాను. పైగా అప్పట్లో నేను  హైదరాబాద్‌లో కూడా లేను. ఆ సమయంలో నేను ఏ ఒక్క  మంత్రితోగానీ ఏ ఒక్క ఐఏఎస్‌ ఆఫీసర్‌తోగానీ ఏ ఒక్క ఐపీఎస్‌ అధికారితో గానీ  ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది వాస్తవం. 

నవికా:  కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయా? 
సీఎం జగన్‌: అవును, నిజానికి నా జీవితంలో 16 నెలలు ఎవరు చెల్లిస్తారు? నన్ను జైల్లో పెట్టారు, కారణం ఏంటి?

నవికా:  కేంద్రంలోని బీజేపీ తన ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు కేంద్ర ఏజెన్సీలను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌ చెబుతోంది, మీరేం చెబుతారు?
సీఎం జగన్‌: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఏం చేసింది? నాపై నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ. 2004 నుంచి 2009 వరకు నా తండ్రి ముఖ్యమంత్రి. ఇప్పుడు 2024 వచ్చింది. కాంగ్రెస్‌ ఏం చేసింది.. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని చెడు కోసం వాడుకుంటున్నారు. ఇలా చేయడం దురదృష్టకరం. ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి, అది అర్థం చేసుకోవడం లేదు.

నవికా:  ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎందుకు? రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్, మమతా బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు ఉండటం వల్ల ఇండియా కూటమి మీకు అంత అనుకూలం కాదనుకున్నారా?
సీఎం జగన్‌: ఈ రెండు జాతీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో అప్రధానమైనవి అనేది మనం ముందుగా గుర్తించాలి. ఎవరైనా వాటితో కలిసి ఎందుకు పోటీ చేయాలనేది ప్రాథమిక ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంశాల వారీగా కేంద్రానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుంది. దేనికి మద్దతివ్వాలి.. దేనికి ఇవ్వకూడదనేది మేం ఆలోచించుకుంటాం.

నవికా: ఒకవేళ ఎన్‌ఆర్‌సీ వస్తే మద్దతిస్తారా?
సీఎం జగన్‌: మద్దతు ఇవ్వం.

నవికా: జగన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా తనకంటూ సొంత గుర్తింపుతోనే ముందుకు వెళ్లాలనుకుంటోందా? దానికి మీరు పూర్తిగా కట్టుబడి ఉన్నారా?
సీఎం జగన్‌: కచ్చితంగా. విశ్వసనీయత, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయాలలో విశ్వసనీయత ప్రధానమైనదని నేను గట్టిగా నమ్ముతాను. ప్రజల కోసం ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధం.

నవికా:  ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏమనుకుంటున్నారు. చాలా సమావేశాల్లో ఆయనతో కలిసి మీరు పాల్గొన్నారు. ఈ మధ్య ఆయన చాలా పొత్తులు పెట్టుకున్నారు. మీరెలా భావిస్తున్నారు?
సీఎం జగన్‌: రాజకీయాల్లో మోదీని, రాహుల్‌ గాంధీలను చూశాం. అయితే మైనార్టీలకు వ్యతిరేకం వంటి కొన్ని విషయాల్లో మోదీతో మేం విభేదించవచ్చు. కానీ ఆయన మంచి నాయకుడే.

నవికా: రాహుల్‌ గాంధీ గురించి చెప్పాలంటే ఏం చెబుతారు. మీరొక భారతీయ పౌరుడిగా చెప్పండి.
సీఎం జగన్‌: నేను ఇప్పటికే ఈ విషయంపై చెప్పాను. ఒక వేళ రాహుల్‌ మంచి నాయకుడైతే ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ నాకు చేసిన అన్యాయాన్ని బట్టి రాహుల్‌పై నా అభిప్రాయం నాకుంది. నాకైతే రాహుల్‌ అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేదు.

నవికా: మూడు రాజధానుల అంశం గురించి ఏమంటారు?
సీఎం జగన్‌: ఆ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా నేను ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తాను.

నవికా: ఎన్నికల్లో మీకెన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటున్నారు? 151 సంఖ్యను దాటుతామని అనుకుంటున్నారా? బీజేపీకి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 
సీఎం జగన్‌: మా పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. నన్ను నమ్మండి. నంబర్స్‌ చూస్తూ ఉండండి.

నవికా: ప్రధాన మంత్రి ఎవరవుతారని అనుకుంటున్నారు?
సీఎం జగన్‌: అది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అందరూ చెబుతున్నది, టీవీల్లో చూస్తున్నదానిని బట్టి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్పిస్తోంది. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ సెఫాలజిస్ట్‌(విశ్లేషకుడు)ను కాదు. ఒక వేళ ఎవరైనా ఏదైనా చెబితే అది కేవలం ఒక అంచనా మాత్రమే.

నవికా: మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంత కంటే గొప్పగా ఏం చేస్తారు? 
సీఎం జగన్‌: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ పెద్ద హామీయే. అవన్నీ చేస్తాం.

నవికా: మీ సోదరిని మిస్‌ అవుతున్నారా?
సీఎం జగన్‌: కచ్చితంగా మిస్‌ అవుతున్నాను(భావోద్వేగంతో). దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడికిపోతాయి?

నవికా: ఆమె విషయంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారా?
సీఎం జగన్‌: దురదృష్టవశాత్తు ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఈ పరిస్థితి మారచ్చు.. మారకపోవచ్చు.

నవికా:  వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మోదీ అన్నట్టు.. రాజకీయాలు, కుటుంబం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

సీఎం జగన్‌: ఆయన ఏ సందర్భంగా అన్నారో నాకు తెలియదుగానీ మోదీ అన్న మాటలను నేను బలంగా నమ్ముతున్నాను. కుటుంబాన్ని బేలెన్స్‌గా చూసుకోవాలన్నది నా బలమైన నమ్మకం. అయితే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే పార్టీని నడపలేం. అలాంటప్పుడు అప్రమత్తంగా లేకపోతే పార్టీ నష్టపోతుంది. పులివెందులలో నేను నామినేషన్‌ వేసినప్పుడు ఈ అంశంపై స్పష్టంగా చెప్పాను. కడప నుంచే ఆమె (షర్మిల) ఎంపీగా పోటీ చేస్తోంది. ఇదే స్థానం నుంచి నా కజిన్‌ ఎంపీగా ఉండి నా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా నేను ఉన్నానంటే అది దేవుడి దయ. ఈ పదవి అణగారిన, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలకు మేలు చేయడానికి లభించిన అవకాశం. నేను డబ్బు సంపాదించుకోవడానికో లేక నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికో కాదు. వారు నా నుంచి అలాంటివి ఆశలు పెట్టుకోకూడదు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాను.

నవికా: ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు మీకు ఎన్నికల్లో పోటీదారు అనుకుంటున్నారా? చంద్రబాబు జైలుకెళ్లి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందనుకుంటున్నారా? లేక ఉచిత పథకాలు ఫలితాలిస్తాయని అనుకుంటున్నారా?
సీఎం జగన్‌: ఇవన్నీ కాదు. మా ఐదేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఇస్తున్నవి ఉచిత పథకాలుగా చూడకూడదు. అవి సామాజిక పెట్టుబడి. పరిపాలన, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గొప్ప సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మారాయి. స్కూల్స్‌ అప్‌గ్రేడ్‌ అయ్యాయి. మూడో తరగతి నుంచే పిల్లలు టోఫెల్‌ గురించి ఆలోచిస్తున్నారు. ఆరో తరగతి నుంచే డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ వచ్చాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. ఐబీ సిలబస్‌ అందిస్తున్నాం. 

మా రాష్ట్రంలో 2025 నుంచి ఒకటో తరగతిలోనే ఐబీ సిలబస్‌ బోధిస్తాం. 2035 నుంచి మా పిల్లలు ఐబీ సర్టిఫికెట్‌ పొందుతారు. ఇవన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో మార్పు వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా దాదాపు 600 రకాల సేవలు ఇంటి వద్దకే అందుతున్నాయి. ప్రతి సర్టిఫికెట్, ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సేవ.. వలంటీర్‌ ద్వారా ఇంటి గుమ్మం ముందుకే వస్తున్నాయి. విలేజ్‌ క్లినిక్, రైతుల కోసం రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, నవీకరించిన పాఠశాలలు, నవీకరించిన సిలబస్‌.. ఇలాంటివేవీ గతంలో లేవు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను అధికారంలోకి రాక ముందు, ఇవన్నీ చేయక ముందు ఏదైనా సంక్షేమ పథకంలో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా, వివక్ష చూపకుండా అర్హులందరికీ చేరుతుందంటే ఎవరూ నమ్మే వారు కాదు.

నవికా: మరి మీ చెల్లి వాళ్లతో పనిచేస్తోంది. పవర్‌ పాలిటిక్స్‌లో ఆమె ఏ విధంగా రాణిస్తుందనుకుంటున్నారు? షర్మిలకు సునీత కూడా తోడయ్యారు.
సీఎం జగన్‌: వాళ్లకు వాళ్ల వ్యక్తిగత కారణాలున్నాయి. అయితే వాళ్లు ఎంచుకున్న మార్గం, సమయం రెండూ సరైనవి కావు. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్‌లో ఒకరు మాత్రమే రాజకీయాలను లీడ్‌ చేస్తారు. మిగిలిన వాళ్లు లీడ్‌ చేసే వారికి మద్దతుగా నిలుస్తారు. రెండో జనరేషన్‌ రాజకీయాల్లోకి రాకూడదు. దీన్ని నమ్ముతాను. ఈ క్రమంలో వారిని రాజకీయాల్లోకి రావద్దనే సూచించాను. వ్యాపారాలు, ఇంకా వాళ్లకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాను. రాజకీయాల్లోకి వచ్చి కుటుంబంలో సంబంధాలు దెబ్బతినేలా చేయొద్దని కోరాను. రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకుని మన మధ్యే చిచ్చుపెట్టి సంబంధాలను కలుషితం చేస్తారని చెప్పాను. మనలో మనమే ప్రత్యర్థులుగా మారిపోతామని తెలియజేశాను.

నవికా: వారి వెనకాల చంద్రబాబు ఉన్నారని మీరు నమ్ముతున్నారా?
సీఎం జగన్‌:  అవును. నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చంద్రబాబు వాళ్లను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి పేరును కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్‌లలో పెట్టింది. అక్రమ కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసింది. నాపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ కేసులో కో పిటీషన్‌ వేసింది టీడీపీ. నా తండ్రి బతికి ఉన్నన్ని రోజులు, నేను ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు నేను నిజాయితీపరుడిని. నేను ఆ పార్టీ వీడిన వెంటనే నా తండ్రి, నాపైనా అవినీతి మరక వేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ రోజుకూ వారు నాపై మోపిన తప్పుడు కేసులపై పోరాటం చేస్తున్నాను.

నవికా: అందుకే చంద్రబాబు నాయుడినిజైలుకు పంపించారా?
సీఎం జగన్‌: చంద్రబాబు నాయుడు చేయకూడని పని చేశారు. స్కిల్‌  స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు. అలా అతను చేసి ఉండకూడదు. ఆయన స్కామ్‌లో ప్రమేయం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కోర్టుల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలతో వాదనలు జరిగాయి. అందుకే కటకటాల వెనక్కి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాలతో కోర్టులు ఏకీభవించాయి. అందుకే అతను 52 రోజులు జైలులో ఉన్నాడు.

నవికా: చివరికి బెయిల్‌ వచ్చింది కదా?
సీఎం జగన్‌: బెయిల్‌ పొందడం అనేది హక్కు. అది జైలులోకి వెళ్లిన ఎవరికైనా.. ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. అంతేగానీ, సరైన సాక్ష్యాలు లేకుంటే చంద్రబాబు జైలుకి వెళ్లేవారు కాదేమో! చంద్రబాబుపై కేసుల్లో ఎక్కడా రాజకీయ కోణంలో వ్యవహరించలేదు.

నవికా:  మీపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. దానికి మీరేమంటారు?
సీఎం జగన్‌: దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా (డీబీటీ) ప్రజల ఖతాల్లో జమ చేశాను. ప్రజల ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలతో సహా ఆధారాలు ఉన్నాయి. మరి అవినీతి చేశానని వారు ఎలా అంటారు? 90 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.

నవికా: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు మీరు మద్దతిస్తారా?
సీఎం జగన్‌:  కచ్చితంగా మద్దతిస్తాం. ఇప్పటికే మద్దతిచ్చాం

నవికా:  యూనిఫాం సివిల్‌ కోడ్‌కు మద్దతిస్తున్నారా? 
సీఎం జగన్‌: మేం మద్దతివ్వడం లేదు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement