‘‘మగవారు గొప్పా? ఆడవారు గొప్పా? అనే గొడవ ఎప్పట్నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అలాగే లింగ వివక్ష కూడా ఉంది. ఈ రెండింటినీ మేళవించి ఓ కథ రెడీ చేస్తే బాగుంటుందని భావించి, కల్పిత కథగా ‘శ్వాగ్’ సినిమా తీశాం. తరతరాలుగా మగ – ఆడ గొడవలు ఎలా మారుతూ వస్తున్నాయి? అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. ‘రాజ రాజ చోర’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో హసిత్ గోలి పంచుకున్న విషయాలు.
⇒ నాలుగు తరాలకు చెందిన కథ ఇది. ప్రతి తరంలోనూ హీరోగా శ్రీవిష్ణుగారే కనిపిస్తారు. ఒక తరంలో భవభూతిగా, మరో తరంలో యయాతిగా, ప్రస్తుత తరంలో సింగాగా కనిపిస్తారు. కథ, గెటప్స్, క్యారెక్టర్స్ పరంగా ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఆ విధంగా మంచి స్క్రీన్ ప్లేని తయారు చేశాం.
⇒ శ్రీవిష్ణు గెటప్స్ కోసం ్రపోస్థెటిక్ మేకప్ చేశాం. జాతీయ అవార్డు గ్రహీత రషీద్‌గారు చాలా కష్టపడ్డారు. మగజాతి ఉనికిని నిలబెట్టే వంశమే శ్వాగణిక వంశమని, అతను లేకపోతే మగవారు అందరూ బానిసలుగానే ఉండిపోతారనేది భవభూతి (శ్రీవిష్ణుపాత్ర) మహారాజు ఫీలింగ్. ఈ వంశానికి అపోజిట్‌లో మాతృస్వామ్యం డామినేటెడ్‌గా ఉంటుంది వింజామర వంశం. ఈ వంశంలో రుక్మిణీ దేవిగా రీతూ వర్మ ఉంటారు.
⇒ ఓ సీరియస్ సబ్జెక్ట్‌నే వినోద పంథాలో చెప్పే ప్రయత్నం చేశాం. ఇంట్రవెల్ ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. ‘ఏడు తరాల’ నవలకు, మా ‘శ్వాగ్’కు ఏ సంబంధం లేదు. ఇక నా తర్వాతి సినిమాని ఫ్యాంటసీ జానర్‌లో తీయాలనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment