ఇప్పటికీ స్పిరిట్ తగ్గలేదు - దాసరి
ఇప్పటికీ స్పిరిట్ తగ్గలేదు - దాసరి
Published Wed, Aug 28 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
‘‘నేటి దర్శకులు సింగీతాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సింగీతం పలు మార్లు నిరూపించాడు. ఇప్పటికీ ఆయనలో స్పిరిట్ తగ్గలేదు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎస్.భారతి, కృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘వెల్‌కమ్ ఒబామా’. సింగీతమే సంగీతాన్నందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన దాసరి ఇంకా మాట్లాడుతూ -‘‘కొత్తగా వచ్చిన నిర్మాతలు కొత్త దర్శకులతో సినిమా చేస్తారు.
కానీ భారతి, కృష్ణ అందుకు భిన్నంగా సింగీతంగారికి బాధ్యత అప్పజెప్పడం అభినందనీయం. ఆ రోజుల్లో చాలా సందర్భాల్లో సంగీత దర్శకునిగా అవకాశం ఇవ్వమని నన్ను అడిగారు సింగీతం. సరదాగా అంటున్నారేమో అనుకున్నాను. ఈ సినిమాకు ఆయన అందించిన పాటలు వింటుంటే.. ఆయన ఎంత మంచి సంగీత దర్శకుడో అర్థమవుతోంది’’ అన్నారు. ‘‘పింగళి గారిని స్ఫూర్తిగా తీసుకొని సంగీతం అందించాను. అంతర్జాతీయ స్థాయిలో ‘3డి కురుక్షేత్రం’ చేయాలనుంద’’ని సింగీతం తెలిపారు.
‘పుష్పకవిమానం’ టైమ్‌లో సింగీతం వద్ద చాలా నేర్చుకున్నానని అమల గుర్తుచేసుకున్నారు. నటన మాత్రమే తెలిసిన తనతో సింగీతం మాటలు రాయించారని నటి రోహిణి చెప్పారు. విద్యార్థులుగా మారి సింగీతం వద్ద ఎన్నో నేర్చుకున్నామని నిర్మాతలు తెలిపారు. ‘ఆదిత్య 369’లోని ‘జాణవులే’ పాటకు సింగీతం, రోజా సరదాగా స్టెప్స్ వేయడం ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Advertisement