డిజాస్టర్ అయితే తిరిగి ఇవ్వాల్సిందే!
దాసరి అంటే దర్శకరత్న. అత్యధిక సినిమాల దర్శకుడిగా తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఘనత సంపాదించిన సినీ ప్రతిభామూర్తి. ‘తాత మనవడు’, ‘ఓ మనిషి తిరిగి చూడు’, ‘బలిపీఠం’, ‘స్వర్గం- నరకం’ వంటి సినిమాలతో ఆయన దాదాపు తెలుగు వారి సాంఘిక జీవనాన్ని తెర మీద నమోదు చేశారని చెప్పాలి. మరోవైపు ‘కటకటాల రుద్రయ్య’, ‘ప్రేమాభిషేకం’, ‘బొబ్బిలిపులి’ వంటి సినిమాలతో కమర్షియల్ ధోరణిని కొత్త ఆకాశాలకు ఎత్తారు. ‘తాండ్ర పాపారాయుడు’ వంటి చారిత్రక సినిమాలు తీసినా ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి ఉద్యమ తరహా సినిమాలు తీసినా అది దాసరికే చెల్లింది.
నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, అనేక మంది కొత్త నటీ నటులకు జన్మనిచ్చిన ఆ సృష్టికర్త జన్మదినం నేడు. తెలుగు సినిమాతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలితో ఇంటర్వ్యూ...
♦ గత పుట్టిన రోజుతో పోల్చితే ఆరోగ్యంగా గ్లామర్‌గా కనిపిస్తున్నారు...
(నవ్వుతూ). 15 కేజీల బరువు తగ్గా. వేరే రహస్యం ఏమీ లేదు.
♦ పవన్ కల్యాణ్‌తో ప్రకటించిన సినిమా ఏమైంది?
సబ్జెక్ట్ ఓకే అయిపోయింది. దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది కాకుండా నా దర్శకత్వంలో కొత్త వాళ్లతో లవ్‌స్టోరీ తీస్తాను.
♦ లవ్‌స్టోరీల ట్రెండ్ మారింది కదా. మీరు తీయబోయే లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది?
నేను తీయబోయేది ‘రియల్ లవ్ స్టోరీ.. నాట్ ఎ లస్ట్ స్టోరీ’. నేను తీయబోయేది స్వచ్ఛమైన ప్రేమకథ. ఇప్పుడు తయారు చేసుకున్న కథ కాదు. రామానాయుడు కోసం ఈ కథ తయారు చేసుకున్నా. ఆయనకు బాగా నచ్చింది. ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన నిర్మించలేక పోయారు
♦ మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారనిపిస్తోంది?
ఆ మధ్య ‘పరమవీరచక్ర’, ‘ఎర్రబస్సు’ చిత్రాలను చాలా మంచి కథాంశాలతో తీశాను. అవి కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడం నిరాశకు గురి చేసింది. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడున్న ట్రెండ్‌ను గమనిస్తున్నా. ఈ రెండేళ్ల కాలంలో మంచి సినిమాలు వచ్చాయి. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చక్కగా నవ్వించింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘కల్యాణవైభోగమే’, ‘క్షణం’, ‘ఊపిరి’ సినిమాలు ఓ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి.
‘క్షణం’ సినిమాను హిందీలో సల్మాన్‌ఖాన్ తీసుంటే కచ్చితంగా వంద కోట్లు కలెక్ట్ చేసేది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌ను ‘ఊపిరి’ సినిమాలో కుర్చీలో కుర్చోపెట్టేయడం దర్శకుని ప్రతిభ. ఇలాంటి సినిమాలు సక్సెస్ కావడం వల్ల ట్రెండ్‌లో చిన్న మార్పు వచ్చింది. ఆరు పాటలు, ఒక హీరో కొడితే వంద మంది గాల్లోకి లేచిపోవడాల్లాంటివి ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సినిమాలు తీయవచ్చు.
♦ సినిమాలు ఫ్లాప్ అయితే దానికి పని చేసిన దర్శకులు, హీరోలు బాధ్యత వహించాలని పరిశ్రమలో ఓ వాదన నడుస్తోంది. దానిపై మీ అభిప్రాయం.
రెమ్యునరేషన్ తిరిగిచ్చేయాలనేది కరెక్ట్ కాదు. సినిమా నష్టపోతే డిస్ట్రిబ్యూటర్లను పిలిచి ‘కథ రెడీ చేసుకోండి. మేం మీకు పని చేస్తాం’ అని చెప్పేవాళ్లు. ఇది 40 ఏళ్ల క్రితం నాటి మాట. ఇప్పుడు బయ్యర్ల వ్యవస్థ వచ్చింది. 20, 30 శాతం నష్టపోతే తిరిగివ్వాల్సిన పని లేదు. కానీ, డిజాస్టర్ అయితే మాత్రం కొంత సర్దుబాటు చేయడానికి తెలుగు పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇందులో రజనీకాంత్, అల్లు అరవింద్, పవన్‌కల్యాణ్, శ్రీనువైట్ల, మహేశ్‌బాబు లాంటి వాళ్లు ఉన్నారు. మేము కూడా గతంలో చేశాం. అడగడం, ఇవ్వడం తప్పు కాదు. కానీ రోడ్డుకెక్కడం కరెక్ట్ కాదు.
♦ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫ్లాప్స్, హిట్స్ మీద అభిప్రాయం?
ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు వస్తున్నారు. వాళ్లకి విషయం ఉంటోంది గానీ అనుభవం ఉండటం లేదు. దాంతో ఒకటి, రెండు సినిమాల తర్వాత కనిపించడం లేదు. సినిమా తీయాలనుకున్నప్పుడు కొంత ప్రాక్టికల్ అనుభవం కావాలి. లైట్‌మ్యాన్, కెమెరామ్యాన్ కావాలంటే కూడా అనుభవం కావాలి. కానీ, డెరైక్టర్ కావాలనుకుంటే మాత్రం వెంటనే అయిపోవచ్చు. అది కరెక్ట్ కాదు. నిర్మాణ రంగం మీద అవగాహన లేని వాళ్లు నిర్మాతలవుతు న్నారు. సినిమాలు తీసి వాళ్లు నష్టపోయి, పరిశ్రమను నాశనం చేస్తున్నారు. దయచేసి అవగాహన పెంచుకుని నిర్మాతలు కావాలని కోరుతున్నా.
♦ సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం కమిటీని నియమించింది. దాని గురించి మీతో ఏమైనా చర్చించారా?
హైదరాబాద్‌ను తెలుగు సినిమా కోసమే కాకుండా సినీ హబ్‌గా చేయాలి. రెండు వేల ఎకరాలను సినీ హబ్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన. అందుకోసం సలహాలు అడగడానికి ప్రభుత్వం తనంతట తానే పూనుకుని కమిటీని నియమించడం విశేషం. మా డిమాండ్ ఏంటంటే, థియేటర్లలో రోజూ జరిగే నాలుగు షోలను అయిదు షోలుగా చేసి, కేవలం అందులో నాలుగో ఆటను చిన్న సినిమాకు కే టాయించాలి. ఇది తప్పనిసరి చేయాలి. దీనికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాగా స్పందించారు.
♦ చిరంజీవి ‘కత్తి’ సినిమా కథ వివాదం మీ దృష్టికి వచ్చిందా?
చిరంజీవి ‘కత్తి’ సినిమా మీద ఇది వివాదం కాదు. ఆ వివాదం అంతకు ముందే తమిళ మాతృక మీద ఉంది. అంతేగానీ, ఇది చిరంజీవి 150వ సినిమా వివాదం అనుకోకూడదు. అయినా, అది పరిష్కారమైంది కూడా.
♦ ఫైనల్లీ.. ఇంత కాలం దర్శకునిగా కంటిన్యూ కావడంపై మీ స్పందన?
ఎంతమందికి వస్తుంది చెప్పండి ఆ అదృష్టం!