నా చివరి యుద్ధం | Exclusive Interview with Dasari Narayana Rao | Sakshi
Sakshi News home page

నా చివరి యుద్ధం

Published Sun, May 3 2015 11:13 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నా చివరి యుద్ధం - Sakshi

నా చివరి యుద్ధం

 దా‘సరి’ లేరు నీకెవ్వరూ...
 బాగుంది కదా అని అంటున్న మాటలు కాదివి..
 దర్శకత్వం, రచన, నటన, నిర్మాణం...
 అన్నిటికీ న్యాయం చేయగల దిట్ట ఆయన.
 అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత దాసరికే సొంతం. ఎక్కువ మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత ఆయనకే సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి గురించి ఎంతయినా చెప్పొచ్చు.
 అందుకే, దా‘సరి’ లేరు నీకెవ్వరూ అనేది.
 నేడు ఆయన జన్మదినం.
 ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

 
 ఇప్పుడు మీ నుంచి చాలామంది తెలుసుకోవాలనుకునేది పవన్ కల్యాణ్‌తో మీరు చేయనున్న సినిమా గురించే. అసలు కల్యాణ్‌తో సినిమా తీయాలనెందుకనుకున్నారు?
 (నవ్వుతూ)... పవన్ కల్యాణ్ అంటే నాకు మొదట్నుంచీ చాలా ఇష్టం. మా ఇద్దరికీ మధ్య బాగా ఇంటరాక్షన్ కుదిరింది ‘లంకేశ్వరుడు’ సినిమా షూటింగ్ సమయంలో! అతని ఆలోచనలన్నీ నాకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ మధ్య ఒకసారి అతను నాతో మాట్లాడ్డానికి వచ్చాడు. అప్పుడు ‘ఏం చేస్తున్నారు?’ అనడిగాడు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సినిమాలు తీయదల్చుకోలేదన్నాను. ‘అదేంటి సార్.. మీరిలా ఉండటానికి వీల్లేదు. యాక్టివ్‌గా ఉండి, ఇప్పుడు పరిశ్రమలో జరుగుతున్న చాలా విషయాలను దారిలోకి తెస్తే బాగుంటుంది’ అని  సిన్సియర్‌గా అన్నాడు. అలాగే, ‘మీరేంటో నాకు తెలుసు.
 
  మీకు సినిమా చేస్తానని అనేంత పెద్దవాణ్ణి కాదు నేను. కానీ, మీరు ఒప్పుకుంటే, మీతో సినిమా చేయాలనుంది’ అన్నాడు. నిజంగా స్టన్ అయ్యాను. ఎందుకంటే, అతను నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నాడు. తను సినిమా చేస్తానంటే, మొత్తం డబ్బు తీసుకెళ్లి తన దగ్గర పెట్టి ‘మీరెప్పుడైనా సినిమా చేయండి’ అనే నిర్మాతలు చాలామంది ఉన్నారు. అలాంటిది తనంతట తను నాకు సినిమా చేస్తాననడం ఆశ్చర్యం. అప్పటికి నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకరోజు ఫోన్‌లో ‘మన సినిమా గురించి ఏం చేశారు?’ అన్నాడు. ‘నిజంగానే అంటున్నావా?’ అనడిగా. ‘డిసైడ్ చేసుకునే ఆ మాట మాట్లాడా’ అన్నాడు. దాంతో నమ్మకం కుదిరింది. ‘నిర్మాతగా మాత్రమే చేస్తాను. డెరైక్షన్ చేయను. వేరే డెరైక్టర్‌తో చేద్దాం’ అన్నాను.
 
  ఎందుకని డెరైక్షన్ చేయాలని అనుకోలేదు?
 పవన్ కల్యాణ్ నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నాడు. నేనేమో ఫెయిల్యూర్స్‌లో ఉన్నాను. ఇలాంటి సమయంలో నేను తనతో సినిమా అంటే... బాగానే చేస్తా. కానీ, ఎక్కడైనా చిన్న తేడా వస్తే? అతని కెరీర్‌ని ఓ స్టెప్ దించినవాణ్ణవుతా. అది ఇష్టం లేక వేరే దర్శకుడితో చేద్దామన్నాను. కానీ, అతను ఒప్పుకోలేదు. ‘సరే సబ్జెక్ట్ కుదిరిన తర్వాత డిసైడ్ చేద్దాం’ అన్నాడు. ప్రస్తుతం కథ తయారీ మీద ఉన్నాం.
 
 అప్పట్లో మీరు చేసిన ‘బొబ్బిలిపులి’ ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి మంచి పునాది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నారనే టాక్ ఉంది కాబట్టి, ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడే సినిమా చేయాలనుకుంటున్నారా?
 అలా ఏమీ అనుకోలేదు. పవన్ రాజకీయ జీవితానికీ, ఈ చిత్రానికీ నేను ముడిపెట్టలేదు. అతను కూడా అడగలేదు. ఒకవేళ నిజంగా ఎన్నికల్లో నిలబడితే, రాజకీయ జీవితానికి ఉపయోగపడే సినిమా చేయాలని అతను కోరుకుంటే, అప్పుడా పొలిటికల్ సినిమాకు నేను డెరైక్షన్ చేస్తా. ఇప్పుడు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయాలనుకుంటున్నా.
 
 మీరు ఇటీవల చేసిన ‘ఎర్రబస్సు’ పెద్ద ఆడలేదు. కారణం?
 ఇప్పుడొస్తున్న సినిమాలు చూడలేక ఆడవాళ్లందరూ దాదాపు బుల్లితెరకు పరిమితం అయిపోయారు. మీరు థియేటర్‌కి  వెళ్లి గమనిస్తే పదహారు నుంచి పాతికేళ్ళ లోపు వయసున్న ప్రేక్షకులే ఎక్కువగా ఉంటున్నారు. వెటకారం, ఎగతాళి, పిచ్చి జోకులు, పంచ్ డైలాగులు, ఐటమ్ సాంగ్స్... ఇలాంటి ‘ఐటమ్స్’ కోసం వెళుతున్నారు. ‘పరిపూర్ణమైన సినిమా’లను కోరుకోవడం లేదు..  ఐటమ్స్ కోరుకునే సెక్షనే ఎక్కువగా సినిమాలు చూస్తోంది. అందుకే శుక్రవారం సినిమా రిలీజైతే, మూడు రోజులతో ఫినిష్. ఆ తర్వాత థియేటర్లు ఖాళీ. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘రేసు గుర్రం’ లాంటి పెద్ద సినిమాలు, ఐదారు చిన్న సినిమాలకు లాభాలు వచ్చి ఉండొచ్చు. టోటల్‌గా 70 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. నేను తీసిన ‘ఎర్రబస్సు’ ఈ 70 శాతం మంది ప్రేక్షకుల కోసమే. కానీ, వాళ్లే థియేటర్‌కి రానప్పుడు ఇంకెందుకు సినిమాలు తీయాలి?
 
 రాజకీయాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మీ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న చేదు పరిణామాల గురించి?
 రాజకీయాల్లోకి నేను అడుగుపెట్టడం వంద శాతం కరెక్ట్.  1989, 2004, 2009.. ఈ మూడుసార్లు కాంగ్రెస్ పార్టీని సక్సెస్ బాటలో తీసుకెళ్లా.  2009లో గెలుపులో ఎక్కువ ప్రభావం వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారిది. 2004లో రాజశేఖర్‌రెడ్డిగారూ, నేనూ కలిసి పని చేశాం. 1989 ఎక్స్‌క్లూజివ్‌గా నాది. అప్పుడు వంగవీటి రంగా గారు చనిపోవడం, నేను విజృంభించి 240 నియోజక వర్గాల్లో తిరగడం.. అలా అప్పటి కాంగ్రెస్ గెలుపు పూర్తిగా నాది. ఇక, కోల్ బ్లాక్ గురించి అంటారా? రాజకీయాల్లో ఈ బురద సహజం. నేను దీన్ని బురద అని కూడా అనుకోవడం లేదు. కడుక్కోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే, నాకు కోల్ బ్లాక్‌లు ఎలాట్ చేసే అధికారం లేదు. ఆ అధికారం స్క్రీనింగ్ కమిటీది... పైన ఉన్న ప్రధానిది. ఆయనే కోల్ మినిస్టర్. ఏ ఫైల్ అయినా ప్రధాని దగ్గరికి వెళ్లాల్సిందే. ఆయనే క్లియర్ చేస్తారు. నా ఫైల్‌లో ఏం రాశానో నాకు తెలుసు. కొందర్ని కాపాడడం కోసం ఆ రోజు నన్ను ఇరికించారు. ఇప్పుడు అసలువాళ్లు కూడా దాంట్లోకొచ్చారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఛార్జ్‌షీట్ వేశారు. ఈడీవాళ్లు కూడా ఓ ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ తర్వాత విషయం కోర్టు వరకూ వస్తుంది.  వాస్తవాలు బయటికొస్తాయి. ‘ఐయామ్ వెరీ క్లీన్’.
 
 కోల్ బ్లాక్ వ్యవహారంలో ఎంతోమంది ఉండగా ప్రముఖంగా మీ పేరే వినిపించడానికి కారణం ఏంటి?
 ఆ సమయంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు నేను సహాయ మంత్రిగా ఉన్నాను. పైగా.. ఈ డిస్కషన్ అంతా కోల్‌లో ఇచ్చిన రెండొందల బ్లాకుల గురించి కాదు.. ఒకే ఒక్క బ్లాక్ గురించి నా మీద ఆరోపణ ఉంది. మిగతా బ్లాక్‌ల పరంగా నా మీద ఆరోపణలు లేవు. అది కూడా నాకు షేర్స్ ఉన్న ఒక కంపెనీలో అవతలి తాలూకు వాళ్లు కూడా షేర్స్ కొన్నారు. అది కూడా సెబీ రూల్స్ ప్రకారం కొన్నారు! నేనా కంపెనీకి ఏమీ కాను. అది లిస్టెడ్ కంపెనీ. లిమిటెడ్ కంపెనీ. ఆ రోజు మార్కెట్ వేల్యూ ఎంతో అంతకేషేర్స్ ఇచ్చారు.

  మీరు ‘ఆరోపణ’ అంటున్నారు. చాలామంది ‘నిజంగా ఏదో చేసి ఉంటారు’ అనుకుంటున్నారు?
 యాభై ఏళ్ల నుంచి దాసరి అంటే ఏంటో చాలామంది తెలుసు. రెండు కోట్లు అనేది దాసరికి ఆఫ్ట్రాల్. ఎన్ని కోట్లు దానధర్మాలకు ఖర్చు పెట్టి ఉంటాడు? ఎన్ని కుటుంబాలను నిలబెట్టి ఉంటాడు? ఎంతమందిని చదివించి ఉంటాడు? ఎంతమందిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసి ఉంటాడు? ఆయనకు ఇది అవసరమా? ప్రజలు అనుకునేది ఇదే. నా మీద ఉన్నది కేవలం రాజకీయ ఆరోపణలే.
 
 ఈ మధ్య ‘మా’ ఎన్నికల రసాభాసపై మీ అభిప్రాయం?
 ఇలా జరగడం దురదృష్టకరం. ‘నేనే.. నాకంటే ఎవరూ లేరు’ అని ఒకళ్లు ఎనౌన్స్ చేసుకున్నారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్ల పద్ధతి ప్రకారం మరో అభ్యర్థిని నిలబెట్టారు. ఇద్దరి మధ్యా రాజీ కుదర్చడానికి నేను ప్రయత్నించా. అప్పటికే పంతాలూ, పట్టుదలలూ పెరిగిపోయాయి. దాంతో, నేను సెలైంట్‌గా ఉండటం బెటర్ అనుకున్నా.
 
  తెలుగు పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. ‘వర్గ పోరు’ అనేది నిజమేనా?
 ఎలాంటి గొడవలు జరిగినా ‘వర్గ పోరు’ అనడం పరిపాటి అయ్యింది. ఇక్కడ ఏ వర్గాలూ లేవు. అందరూ ఒకటే.
 
 ప్రస్తుతం దర్శకులు, హీరోలదే హవా. నిర్మాతకు విలువ లేదు. అసలు భవిష్యత్తులో నిర్మాతలు ఉంటారా?
 ఉండకపోవచ్చేమో. దర్శకులు, హీరోలే నిర్మాతలుగా మారతారేమో! లేకపోతే వేరేవాళ్లతో వీళ్లు టైఅప్ అయ్యి సినిమాలు తీస్తారేమో!  హీరోతో కలిసి ఫొటో దిగితే చాలు, కాఫీ తాగితే చాలనే పిచ్చి కొంతమందికి ఉంటుంది. ఆ పిచ్చితో నిర్మాతలుగా వచ్చేవాళ్లుంటారు. వాళ్లు మినహా ‘రియల్ ప్రొడ్యూసర్స్’ ఉండకపోవచ్చు. సినిమా గురించి అవగాహన ఉన్న నిర్మాతలు ఇప్పటికే సినిమాలు తీయడం మానేశారు.
 
 తెలుగు పరిశ్రమ వైజాగ్‌కి మకాం మార్చే అవకాశం ఉందా?
 1990లో తెలుగు పరిశ్రమను చెన్నయ్ నుంచి హైదరాబాద్ మార్చాలనుకున్నాం. 2000నాటికి ఇక్కడ స్థిరపడింది. అప్పట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. మళ్లీ ఇక్కణ్ణుంచి వేరే చోట అంటే.. స్థిరపడటానికి పన్నెండేళ్లు అవుతుంది. ఇక్కడే ఉంటుందా, ఎక్కడికైనా వెళుతుందా అనేది చెప్పలేం.
 
 ఇప్పుడున్న దర్శకుల్లో మీ స్థానం అందుకోగలవాళ్లున్నారా?
 రాజమౌళి, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, త్రివిక్రమ్.. ఇలా అందరూ తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పూరి అంటే నాకు చాలా ఇష్టం. తక్కువ రోజుల్లో సినిమా తీసేస్తాడు.
 
 మీకు ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ అంటూ ఏదైనా ఉందా?
 మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్. అందులో భారత యుద్ధాన్ని తెరపై చూపించాలన్నది నా కల. మహాభారతాన్ని చాలామంది తీశారు కానీ, యుద్ధం జరిగిన రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయాలను ఎవరూ చూపించలేదు. 18 రోజులు జరిగిన యుద్ధంలో గొప్ప మంత్రాంగాలు జరిగాయి. గొప్ప గొప్ప కథలున్నాయి. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాలుగు భాగాలుగా ఆ సినిమా తీయాలనుకుంటున్నా. ఒక్కో భాగానికయ్యే బడ్జెట్ వంద కోట్లు. ఈ చిత్రాన్ని ఓ విదేశీ కంపెనీతో కలిసి నిర్మించబోతున్నాం. దర్శకునిగా నా చివరి చిత్రం ఇదే అవుతుంది. ఘంటశాలగారికి ’భగవద్గీత’ ఎలా మిగిలిపోయిందో, నా జీవితానికి ఈ భారత యుద్ధం మిగిలిపోవాలన్నది నా లక్ష్యం.
 
 - డి.జి. భవాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement