నన్నూ... పవన్‌కల్యాణ్‌నూ విడదీసే శక్తి రాజకీయాలకు లేదు! | politics cannot divide me and pawan kalyan, says chiranjeevi | Sakshi
Sakshi News home page

నన్నూ... పవన్‌కల్యాణ్‌నూ విడదీసే శక్తి రాజకీయాలకు లేదు!

Published Thu, Aug 21 2014 10:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

politics cannot divide me and pawan kalyan, says chiranjeevi

రాత్రి ఏడుగంటలవుతోంది...
 ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లోంచి తలెత్తి చూస్తే మబ్బుపట్టిన ఆకాశం... ముచ్చటగా కనిపిస్తోంది.
 ఆ దిగువనే హైదరాబాద్ మొత్తం విద్యుద్దీపాల తళుకులతో ఓ పెయింటింగ్‌లా గోచరిస్తోంది.
 స్విమ్మింగ్‌పూల్ పక్కనే ఉన్న బ్లాక్ కలర్ సోఫాలో ‘ఇంద్ర’ స్టయిల్‌లో కూర్చుని ఉన్నారు ‘మెగాస్టార్’ చిరంజీవి.
 ఆ గెటప్... ఆ లుక్... ఆ స్టయిల్ చూస్తే పదేళ్ల క్రితం నాటి చిరంజీవిలా అనిపించారు.
 నేడు చిరంజీవి పుట్టినరోజు.
 ఈ సందర్భంగా చిరంజీవితో ‘సాక్షి’ జరిపిన సినీ, రాజకీయ సమ్మిళిత సంభాషణ.

చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. ఇదంతా సినిమా కోసమేనా?
చిరంజీవి: అలా అని ఏం కాదు. ఆరేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండి ఫిట్‌నెస్ గురించి పట్టించుకోలేదు. రకరకాల ఊళ్లు తిరుగుతూ రకరకాల ఫుడ్ తినేయడంతో బాడీ కంట్రోల్ తప్పింది. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరకడంతో మళ్లీ ఫిట్‌నెస్ మీద, హెల్త్ మీద దృష్టి పెట్టాను. అనుకోకుండా సినిమా ఏర్పాట్లు కూడా ముమ్మరం కావడంతో ఈ విధంగా కూడా కలిసొచ్చిందంతే.
 
150వ సినిమా అని చాలా కాలంగా ఊరిస్తున్నారు కదా. ఆ ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయి?
చిరంజీవి: నా 150వ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారని నాకూ తెలుసు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌బాబు, నాగార్జున... వీళ్లను ఎప్పుడు కలిసినా ఆ విషయమే అడుగుతున్నారు. మోహన్‌బాబు అయితే చాలా స్ట్రాంగ్‌గా ‘‘నువ్వు వస్తున్నావు... సినిమా చేస్తున్నావు... కథ కుదిరితే మనిద్దరం కలిసి చేద్దాం’’ అన్నాడు. ఇలా అందరూ కోరుతున్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదనాలి. నేను కూడా 150వ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. స్టోరీ లైన్ అయితే రెడీ. దర్శకుడెవరనేది ఇంకా ఖరారు చేయలేదు. ఇద్దరు ముగ్గురితో చర్చలు జరుగుతున్నాయి.
 
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అంటున్నారు. నిజమేనా?
చిరంజీవి: 150వ సినిమా అయితే అది కాదు. పరుచూరి సోదరులైతే అదే చేద్దామంటున్నారు. నాకేమో ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’, ‘అన్నయ్య’, ‘రౌడీ అల్లుడు’ తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా చేయాలని ఉంది. అండర్ కరెంట్‌గా సందేశం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెవీ సబ్జెక్ట్స్, హెవీ కేరెక్టర్స్‌కి వెళ్లాలని లేదు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మరెప్పుడైనా చేయొచ్చు.
 
నిర్మాతగా ఎవరికి అవకాశం ఇస్తున్నారు?
చిరంజీవి: రామ్‌చరణ్ తానే చేస్తానని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఈ సినిమా వాడే చేస్తాడు.
 
ఇకపై వరుసగా సినిమాలు చేస్తారా?
చిరంజీవి: ప్రస్తుతానికైతే అలా అనుకోవడం లేదు. నా దృష్టి అంతా 150వ సినిమా మీదే! అంతకుమించి ఆలోచించడం లేదు.
 
మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఏమైంది?
చిరంజీవి: అది నా కోసం కాదు. చరణ్ కోసం. చరణ్‌కి ఆ కథపై ఎందుకో నమ్మకం కుదరలేదు. అందుకే వర్కవుట్ కాలేదు.
 
మీరు సినిమాలకు దూరమై దాదాపు ఏడేళ్లవుతోంది. ఈ ఏడేళ్లలో సినిమా ఫీల్డ్‌లో విపరీతమైన మార్పులొచ్చేశాయి. అవన్నీ మీకు కొత్తగా అనిపిస్తున్నాయా?
చిరంజీవి: నేను సినిమాలకు దూరమయ్యానే కానీ, సినిమా ఫీల్డ్‌కి కాదు. మా ఇంట్లోనే ఓ హీరో ఉన్నప్పుడు, ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది. నేను చరణ్ కోసం కథలు వినడం, రషెస్ చూడడం, దర్శకులతో ఇంటరాక్ట్ కావడం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. దాంతో ఇండస్ట్రీలో వస్తున్న మార్పులన్నీ నాకు తెలుస్తున్నాయి. అయినా ఈ మార్పులేమీ నాకు కొత్త కాదు కదా. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతరిస్తున్న సమయంలో నేను పరిశ్రమలోకి ప్రవేశించాను. ఇన్నేళ్లలో ఎన్నో టెక్నాలజీలు, ట్రెండ్‌లూ మారడం చూశాను. అయితే ఈ మధ్య మాత్రం చాలా అనూహ్యమైన మార్పులు వచ్చేశాయి. రీలు అనేది అంతరించిపోయి మొత్తం డిజిటల్ కెమెరాల మయం అయిపోయింది. అలాగే థియేటర్లలో ప్రొజెక్షన్‌కి పాజిటివ్ అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. పాజిటివ్, నెగటివ్ లేకుండా అద్భుతమైన నాణ్యతతో సినిమాలు వస్తాయని ఊహించాం కానీ, ఇంత త్వరగా మార్పులు వస్తాయని మాత్రం ఊహించలేదు. ఏది ఏమైనా ఇదంతా శుభపరిణామమే. అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా మార్పులొచ్చేశాయి. చరణ్ రేంజ్ హీరోల సినిమాలు యావరేజ్ అంటే చాలు, 50 కోట్లు వసూలు చేస్తున్నాయి. సూపర్‌హిట్ అంటే వంద కోట్ల క్లబ్బులో చేరిపోతున్నాయి. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను.
 
ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందంటారు?
చిరంజీవి: బాగానే ఉన్నట్టుంది. అత్తారింటికి దారేది, ఎవడు, లెజెండ్, రేసుగుర్రం, మనం, దృశ్యం, అల్లుడు శీను, రన్ రాజా రన్... ఇలా పెద్దా చిన్నా సినిమాలు చాలా విజయం సాధిస్తున్నాయి. ఆహ్లాదకరమైన సినిమాలు వస్తున్నాయి. అయితే ఇక్కడొక విషయం ప్రస్తావించాలి. నిర్మాణ వ్యయం అదుపు విషయంలో మనం ఎంతవరకూ సక్సెస్ అవుతున్నామనేది పూర్తిగా శోధన చేయాలి. ఒకప్పుడు నిర్మాత అంటే బాస్ కింద లెక్క. ఇప్పుడలాంటి పరిస్థితులే కనబడటం లేనట్టుంది. మా తరంలో నిర్మాత శ్రేయస్సు గురించి ఆలోచించేవాళ్లం. సినిమా హిట్టయితే లాభం రావడం కాదు ముఖ్యం. ఎలా ఆడినా నిర్మాత బయటపడగలిగే పరిస్థితి ఉండాలని కోరుకునేవాళ్లం. సినిమా తీసిన నిర్మాత దగ్గర్నుంచీ, ఆ సినిమా కొనుక్కునే వాళ్ల వరకూ అందరికీ డబ్బులు మిగిలితేనే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. ఆ దృక్పథంతో అందరూ సినిమాలు చేస్తే బావుంటుంది.
 
రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితుల్లో తెలుగు సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
చిరంజీవి: ఇక్కడ ఎలాంటి కన్‌ఫ్యూజనూ లేదు. మనం సినిమా ఎక్కడ తీసినా ప్రేక్షకుడు చూస్తాడు. ఫలానా చోట తీస్తేనే చూస్తాననే నిబంధనలేవీ ప్రేక్షకుడు పెట్టుకోడు. ఇంతకు ముందు చెన్నైలో సినిమాలు తయారైనప్పుడు, ఇక్కడ అందరూ చూశారు కదా. రేపు కూడా అంతే.
 
మీరు వైజాగ్‌లో స్టూడియో కట్టబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది?
చిరంజీవి: లేదు... అస్సల్లేదు. ఇవన్నీ గాలివార్తలు. ఫలానా చోట మీరు స్టూడియో కడుతున్నారటగా, ఆ పక్కనే మేమూ స్థలం కొంటున్నామని కొంతమంది నాతో చెప్పారు. ‘‘అదేదో మార్కెట్ మాయ... మీరు మోసపోకండి’’ అని వాళ్లతో చెప్పాను. చెన్నై నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి అందరి కృషీ ఉంది. మళ్లీ ఇక్కడ నుంచి వేరే చోటకు వెళ్లే ఆలోచనగానీ, అవసరం గానీ ఉంటుందని నేననుకోవడం లేదు. అయితే వైజాగ్‌ను రెండో సినీకేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటే మాత్రం తప్పేమీ కాదు.
 
రామ్‌చరణ్ ప్రతి సినిమా విషయంలోనూ ఫైనల్‌గా మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుందటగా?
చిరంజీవి: నాకు ఏ మాత్రం ఖాళీ దొరికినా... చరణ్ తను చేస్తున్న సినిమా కథ వినిపించడమో, రషెస్ చూపించడమో చేస్తుంటాడు. నాకున్న అనుభవం వాళ్లకు ఎంతో కొంత ఉపయోగపడితే సంతోషమే కదా. అయితే అది అవతలివాళ్లు తీసుకోవడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప - ఈ సలహా మీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే అని నియంత్రించడం మాత్రం ఉండదు. వాళ్లతో పాటు నేనూ కలిసిపోయి సలహాలివ్వడం తప్ప, పూర్తి ప్రమేయం ఏమీ లేదు.
 
మీ కుటుంబం నుంచి మరో ఇద్దరు హీరోలు వస్తున్నారు కదా. వాళ్ల గురించి ఏం చెబుతారు?
చిరంజీవి: మా చెల్లెలి కొడుకు సాయిధరమ్ తేజ్ చాలా ఎనర్జిటిక్. వాడిలో ఓ పేషనూ, కసి ఉంది. నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ నా ఫేవరెట్ కిడ్. నాగబాబుని నాన్నా అంటాడు, నన్నేమో డాడీ అని పిలుస్తాడు. ఆరడుగుల ఆజానుబాహువు, అందగాడు. నాకు తెలిసి తెలుగు తెరకు మరో అందమైన హీరో దొరికాడు. వాడు, వాడి ఫేస్‌కట్... ఓ ఇటాలియన్ లుక్‌తో ఉంటాడు. వీళ్లిద్దరికీ కెరీర్ అంటే భయమూ, భక్తీ ఉన్నాయి. ఏదో మేం వెనుక ఉన్నామని దేన్నీ ఆషామాషీగా తీసుకోవడం లేదు. చాలా బాధ్యతగా కెరీర్‌ని డిజైన్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇక్కడ అలా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇక్కడ స్థానం దక్కదు. నా ఉద్దేశం ప్రకారం వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
 
ఈమధ్య ‘లింగా’ షూటింగ్‌లో రజనీకాంత్‌ని కలిశారట?
చిరంజీవి: అవును. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మనసు విప్పి చాలా విషయాలు పంచుకున్నాం. రజనీ నాతో ‘‘నువ్వు వెంటనే సినిమా చేయాలి చిరంజీవి.. కమాన్. ఈమధ్య కొన్ని కథలు విన్నాను. నీకు ఏదైనా సూటవుతుందనుకుంటే చెబుతాను’’ అని ఉత్సాహపరిచాడు.
 
ఇండస్ట్రీలో మీ స్థానం ఇప్పటికీ అలానే ఉందంటారా?
చిరంజీవి: అది ప్రజలు చెప్పాలి. ఎవరేమనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. నాపై ప్రేక్షకుల్లో అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టే, నేనూ సినిమా చేయగలుగుతున్నానేమో.
 
ఇకపై మీరు సినిమాలూ, రాజకీయాలూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటారా? లేక ఒక దానికే పరిమితమవుతారా?
చిరంజీవి: సినిమాలు చేస్తే చేస్తాను కానీ, రాజకీయాలకు మాత్రం దూరం కాను. రాజకీయాల్లో ఉంటూనే అవకాశం కుదిరినప్పుడల్లా సినిమాలు చేస్తాను.
 
దాదాపు 30 ఏళ్లు సినిమాలే ప్రపంచంగా బతికారు. అలాంటిది ఏడేళ్లు సినిమాలకు దూరంగా రాజకీయ ప్రపంచంలోకి వెళ్లడం ఎలా అనిపించింది?
చిరంజీవి: అది దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. దాదాపు 30 ఏళ్లు ప్రజల్ని వినోదపరిచాను. ఇప్పుడు ప్రజలకు ఈ రూపంలో సేవ చేసే అవకాశం లభించిందంతే. సినిమా ఇండస్ట్రీని మిస్సయిన ఫీలింగ్ అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే నా స్థానంలోకి చరణ్ వచ్చేశాడు కదా. ఐ యామ్ వెరీ హ్యాపీ.
 
మీరు ఎంత కేంద్రమంత్రిగా పనిచేసినా, సినిమా హీరో అనే ఇమేజ్ మీ వెనుక ఉంది కదా. అందరూ సినిమాలు గుర్తు చేస్తున్నప్పుడు మీకేమీ ఫీలింగ్ కలగలేదా?
 చిరంజీవి: సినిమా హీరో కావడం వల్లనే మిగతా రాజకీయ నాయకుల కన్నా నాకెక్కువ ఛరిష్మా వచ్చింది. పర్యాటకశాఖలో రకరకాల మార్పులు ప్రవేశపెట్టగలిగానంటే అందుకు నా వ్యక్తిగత ఛరిష్మా కూడా ఉపకరించింది.
 
 ఆరేళ్ల అనుభవంతో చెప్పండి... రాజకీయ రంగంలో మీరు హ్యాపీయేనా?
 చిరంజీవి: చాలా హ్యాపీ. సాధారణంగా పర్యటకశాఖకు ఎక్కువ ప్రాధాన్యం కనబడదు. కానీ మన దేశానికి 90 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాగలిగిన సామర్థ్యం ఆ శాఖకు ఉంది. ఈ విషయం మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు గత ఏడాది తన ప్రసంగంలో వివరించినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి శాఖకు ఓ గుర్తింపు తీసుకురావడంలో, ఓ మెట్టు పైకి ఎదిగేలా చేయడంలో నా వంతు తోడ్పడ్డా. మామూలుగా మన దేశంలో ఆన్-ఎరైవల్ వీసా సదుపాయం నాలుగైదు దేశాలకే పరిమితమైంది. కానీ నేను దాన్ని 145 దేశాలకు వర్తించేలా చేయగలిగా. అంతేకాక మన రాష్ట్రానికి కూడా రకరకాల పర్యాటక ప్రాజెక్టులు తీసుకురాగలిగా! ఇలాంటివన్నీ నాకు తప్పకుండా ఆనందాన్ని ఇచ్చాయి.
 
 మీరు అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లారనే ఫీలింగ్ చాలామందికి ఉంది. దీని గురించి మీరేమంటారు?
 చిరంజీవి: ఈ విషయంలో నేనేమీ కామెంట్ చేయను. అయినా ఆ ఫీలింగ్ కూడా కరెక్ట్ కాదు. స్టార్‌డమ్ సాధించి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన నాకు, మరో వేదిక ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తప్పేమీ కాదే! పార్టీ విషయం పక్కన పెడితే, వ్యక్తిగతంగా ఓ ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండటమనేది ఆషామాషీ విషయం కాదు. ఆ విధంగా నేను రాజకీయాల్లో విజయవంతంగా ఉన్నాననే భావన ఉంది. అనవసరంగా వెళ్లాననే ఫీలింగ్ వాళ్లకు ఎందుకొచ్చిందో మరి!
 
 రాజకీయాల పరంగా  మీరు చాలా కలలు కన్నారు. వాటిని భవిష్యత్తులోనైనా సాధించుకోగలననే నమ్మకం ఉందా?
 చిరంజీవి: ఇక్కడ కలలు కనడమే ముఖ్యం కాదు. వాటిని ఎంతవరకూ సాకారం చేసుకోగలిగామన్నదే ప్రధానం. నా దృష్టిలో జీవితం అనేది గమనమే కానీ, గమ్యం కాదు. ఏది ఎప్పుడు నెరవేరాలో అప్పుడే నెరవేరుతుంది.
 
 మరో నాలుగేళ్లలో మీ రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతుంది. మరి మీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
 చిరంజీవి: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. రాజకీయాలనేవి డైనమిక్‌గానే తప్ప, స్టాటిక్‌గా ఉండిపోయేవి కాదు. సో... ఏ రోజు ఏం అవుతుందనేది ఇప్పుడే ఊహించడం కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు... ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటుందనుకోవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సేవలు, చేపట్టిన పథకాల గురించి అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో అనుసరించిన విధానం నచ్చక ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. భవిష్యత్తులో వాళ్లే అర్థం చేసుకుని కాంగ్రెస్‌ని మళ్లీ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
 
 కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉంది కదా!
 చిరంజీవి: ఎస్. ఇది నేనూ ఒప్పుకుంటాను. కల్యాణ్ ఏం తక్కువవాడు కాదు. విపరీతమైన ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి. అతని ప్రభావం కూడా ఉందనడంలో ఏమాత్రం అవాస్తవం లేదు.
 
 పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టినప్పుడు మీరు బాధపడ్డారా? ఇదంతా మీకు వ్యతిరేకంగా అని భావించారా?
 చిరంజీవి: నాకు వ్యతిరేకమని నేను అనుకోలేదు. కల్యాణ్ పార్టీ పెట్టడమనేది ఒక రకంగా నాకు సపోర్ట్ అనే అనుకున్నాను. ఎందుకంటే - మా ఇద్దరి లక్ష్యం... ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయడం. అయితే తన పార్టీ వేరు, నా పార్టీ వేరు అంతే. మార్గాలు వేరయినా మా లక్ష్యం ఒక్కటే... ప్రజాహితం, ప్రజాశ్రేయస్సు. అందుకే తను పార్టీ పెట్టినప్పుడు నేనేం బాధపడలేదు. కల్యాణ్ అయినా, చరణ్ అయినా స్వతంత్రంగా ఆలోచించి సమాజం కోసం పని చేస్తామంటే నేను వాళ్లకు కచ్చితంగా స్వాగతం చెబుతాను. వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలను నియంత్రించే వ్యక్తిత్వం కాదు నాది.
 
 ‘జనసేన’ పార్టీ కారణంగా మీకూ పవన్‌కల్యాణ్‌కీ మధ్య దూరం పెరిగిందని టాక్?
 చిరంజీవి: ఈ దూరం అనేది వ్యక్తిగతమైనది కాదు. వేరే దారుల్లో వెళ్తున్నంత మాత్రాన, ఒక తల్లి కడుపున పుట్టినవాళ్లం దూరమైపోతామా! ఒకే కుటుంబంలో ఉంటూ వేర్వేరు పార్టీల్లో ఉన్నవాళ్లు ఎంతమంది లేరు. ఇదేదో మాతోనే మొదలు కాలేదు కదా. ఎవరి అభీష్టాలు వాళ్లవి.
 
 మీ కుటుంబ సభ్యులంతా నెలకోసారైనా కలిసి సరదాగా గడపడమనేది మొదటి నుంచీ అనుసరిస్తున్నారటగా. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోందా?
 చిరంజీవి: నూటికి నూరుశాతం కొనసాగుతోంది. బిజీ వల్ల అప్పుడప్పు డూ కుదరకపోవచ్చు కానీ, మా కుటుంబ సభ్యులందరం తరచుగా కలుస్తుంటాం. పండగలూ పబ్బాలకైతే మేం కలవడం తప్పనిసరి.
 
 ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ మిమ్మల్ని కలిశారా?
 చిరంజీవి: మొన్నీమధ్యనే ఇంటికి వచ్చాడు. వాళ్ల వదినకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి వచ్చాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం.
 
 మీరిద్దరూ అసలు మాట్లాడుకోవడం లేదని, వేర్వేరు శిబిరాలు ఏర్పడ్డాయని బయట ప్రచారం...!
 చిరంజీవి: ఇలాంటివి విని విని మాకే బోర్ కొట్టేసింది. ‘మెగా బ్రదర్స్ మధ్య బ్రేక్’ అని ఎన్నిసార్లు చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్‌లు రాలేదు. అసలివన్నీ ఏ ఆధారంతో రాస్తారో అర్థం కాదు. అయినా మా బంధాల్ని, అనుబంధాల్ని విడదీసే శక్తి రాజకీయాలకు లేదు.
 
 మరి చరణ్ సినిమా ఫంక్షన్లకు పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు?
 చిరంజీవి: ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా రాలేదు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకొచ్చిందో మరి. నేను కూడా కొన్ని ఫంక్షన్లకు వెళ్లడం లేదు మరి. బిజీగా ఉంటే ఎవరైనా ఏం చేయగలం. దానికే బ్రేక్ అయిపోయారనుకుంటే ఎలా? అయినా మా వ్యక్తిగత జీవితాలపై నిఘావేసి, ఫోకస్ చేసినట్టుగా, లేనిది ఉన్నట్టు రాయడం ఏం సంప్రదాయం చెప్పండి?
 
 అయితే మీకు, పవన్‌కల్యాణ్‌తో మునుపటి స్థాయిలోనే సంబంధ బాంధవ్యాలున్నాయంటారా?
 చిరంజీవి: ఎందుకుండవు. అయినా హఠాత్తుగా బంధాలన్నీ ఎక్కడికి పోతాయి. కల్యాణ్‌బాబు మొదట్నుంచీ అంతర్ముఖుడు. తక్కువ మాట్లాడతాడు. మనుషులతో తక్కువ కలుస్తాడు. ఇది ఇప్పటికిప్పుడు మార్చుకున్న పద్ధతి కాదు కదా. ముందు నుంచి కల్యాణ్ ధోరణి అంతే.
 
 మీ ప్రతి బర్త్‌డేకి చరణ్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు కదా. మరి ఈసారేం ఇచ్చాడు?
 చిరంజీవి: (చాలా మురిపెంగా) కిందకు వెళ్లి చూడండి. కొత్త కారు. ల్యాండ్ క్రూజర్. చరణ్ ఇచ్చిన గిఫ్ట్ అదే.

 ****************
 
చరణ్ సొంతంగా ఓ ఎయిర్ లైన్స్ సంస్థ మొదలు పెడుతున్నారటగా?
అవును... చరణ్, అతని స్నేహితులు మొదలుపెట్టారు. అందులో తన భాగస్వామ్యం తక్కువ. ఆ ఎయిర్‌లైన్స్‌కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడు.
 
 మీ కోడలు ఉపాసన గురించి చెప్పండి?
 ఆమె చాలా స్వీట్ పర్సన్. ఇంత మంచి ఫ్యామిలీని నాకిచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. నా ఫ్యామిలీనే నా బలం, బలగం.
 
 మీ డెరైక్షన్ ఎప్పుడు?
 ఆ సరదా, కోరిక ఉన్నా కూడా, ప్రస్తుతం డెరైక్షన్ చేయాల్సిన అవసరం లేదు.
 
 ఈమధ్య సినిమాలేమైనా చూశారా?
 అన్నీ చూస్తున్నాను. నిన్ననే హిందీ సినిమా ‘సింగమ్ రిటర్న్స్’ చూశా. వెంకటేశ్ నటించిన ‘దృశ్యం’ కూడా చూశా!
 
 ఇంటర్వ్యూ: పులగం చిన్నారాయణ

 ఫొటోలు: శివ మల్లాల
 
 చిరంజీవి లేటెస్ట్ ఫొటో సెషన్ స్టిల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement