అల్లు అర్జున్.. ఈ పేరు ఒక సంచలనం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను మెప్పించాడు. మెగా కాంపౌండ్, బన్నీ మధ్య విభాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది సినిమాలను దాటి వ్యక్తిగత దూషణలకు కూడా దారి తీస్తుంది. కొద్దిరోజుల క్రితం పవన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు.. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి వార్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
కృషి,తెగువ,ఆత్మవిశ్వాసం, పట్టుదల,ప్రేరణ ఇవన్నీ అల్లు అర్జున్‌లో ఉన్నాయని, ఆయన్ను గమనిస్తూ ఉండేవారు చెబుతున్న మాట. వాస్తవంగ మెగా కాంపౌడ్ హీరో అనే ముద్రతో గంగోత్రి సినిమాలో ఎంట్రీ ఇచ్చినా.. తనదేమీ సాదా సీదా నేపథ్యం కాదని అందరికీ తెలుసు. తండ్రి టాప్ నిర్మాత, తాతయ్య పేరు ఎప్పటికీ చరిత్ర మరవదు. కానీ, మామయ్య చిరంజీవి అండతోనే అల్లు అర్జున్ తొలి అడుగులు వేశాడు. ఆ అనుబంధం వారిద్దరి మధ్య ఇప్పటికీ ఉంది. ఇన్నేళ్ల బన్నీ ప్రయాణంలో ఎక్కడా కూడా మెగాస్టార్‌ను కానీ, ఆయన అభిమానులను కానీ తప్పుగా దూషించిన దాఖలాలు కనిపించవ్. కానీ, ఎప్పుడైతే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారో ఆ సమయం నుంచి మెగా కాంపౌండ్ అభిమానులకు బన్నీ టార్గెట్ అయ్యాడు. సమయం దొరికనప్పుడల్లా దారుణమైన ట్రోల్స్‌తో ఆయనపై ఎగబడుతున్నారు.
పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఒక్క కామెంట్ చేయలేదు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది. దీంతో జనసేనకూ, బన్నీకి నడుమ చాలా ఏళ్ల నుంచి గ్యాప్ ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రెడ్డి గారికి మద్దతు పలికేందుకు నంద్యాల వెళ్లడంతో మెగా అభిమానుల్లో కోపం పెరిగింది.
అప్పుడు నాగబాబు 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అంటూ ఒక పిచ్చి డైలాగ్ కొట్టి మళ్లీ తొలగించేశాడు. బన్నీ ఎలా తమవాడు అయ్యాడు..? అల్లు అర్జున్ అనే పర్సనాలటీ కేవలం పవన్ కల్యాణ్ సొంత వదిన అన్న కొడుకు మాత్రమే కదా..! సరే, బన్నీ మెగా కాంపౌండ్ మనిషే అనుకుందాం. ఐనంతమాత్రాన తను తప్పకుండా జనసేనకు భజన చేస్తూ ఉండాలా..? అలా చేయకపోతే పరాయివాడు అయినట్లేనా..? అందుకే కాస్త పరిపక్వత, పరిణతి ఉండాలని చెబుతుంటారు. ఇవేమీ లేని కొందరు అభిమానులు బన్నీని టార్గెట్ చేస్తూ చెత్త కామెంట్లు చేసుకుంటూ బతికేస్తుంటారు. తనేమైనా జబర్దస్త్ బ్యాచ్ కమెడియనా..? 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తొలి సారిగా తెలుగు హీరో జాతీయ అవార్డు గెలిచాడు. ఇదొక్కటి సరిపోదా బన్నీ సత్తా ఏంటో చెప్పడానికి.
ఇష్టమున్నా లేకపోయినా జై కొట్టాల్సిందేనా..?
అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. తను కేవలం స్నేహితుడి కోసం మాత్రమే నంద్యాల వెళ్లి కేవలం శిల్పా రెడ్డికి మాత్రమే సపోర్ట్ చేశాడు. అదీ.. స్నేహ ధర్మం అని కూడా గుర్తించలేని స్థితిలో అభిమానులు ఉన్నారు. పవన్, మెగా కాంపౌండ్ అంటే బన్నీకి ఇష్టం లేకుంటే ఆయన అనుచరులు బన్నీ వాసు, సాయి రాజేష్,ఎస్కేఎన్ లాంటి వారందరూ పవన్ గెలవాలని ప్రచారం చేశారు కదా.. వారిని బన్నీ నిలవరించలేదే..! దీనినీ పరిణతి అంటారు. అది లోపించిన వారే అందరూ నా చుట్టే ఉండాలని కోరుకుంటారు. ఇష్టమున్నా లేకపోయినా సరే, పవన్ కల్యాణ్‌కు జై కొట్టాల్సిందేనని మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మాట.
పవన్ కంటే బన్నీనే బెటర్ కదా
సినిమా, కలెక్షన్స్, ఫ్యాన్స్, రికార్డ్స్,డ్యాన్స్,నటన ఇలా ఏ విభాగంలో అయినా సరే పవన్ కల్యాణ్ కంటే అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నారని చెబుతారు. ఈ సినిమా లెక్కలన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి కూడా సరైన బలగం ఉంది. ఇతర హీరోలకు మించిన ఫ్యాన్స్ ఉన్నారు. అయినా ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన మామయ్యలు పవన్, చిరు, నాగబాబులను ఒక్కమాట కూడా తూల లేదు. కానీ, కొద్దిరోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. పుష్ప సినిమాపై, బన్నీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వాస్తవానికి పవన్ కూడా పర్యావరణం-అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ ఫ్లోలో పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో అయన అభిమానులు బన్నీని ట్రోల్ చేయడం ప్రారంభించారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి..?
తాజాగా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్లు చేశారు. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పాడు. ఇదే డైలాగ్ సినిమాలో చెబితే విజల్స్ వేస్తారు కదా.. బన్నీ చెప్పిన మాటలు నిజమే కదా. అసలుసిసలైన మనిషి వ్యక్తిత్వం బయటపడేది ఇక్కడే కదా..? నమ్మిన వారి కోసం, స్నేహం కోసం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. సమస్యలకు జంకకుండా, ధైర్యంగా వెళ్లేవాడే కదా గొప్పవాడు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు, బంధుత్వం వేరు. వీటన్నింటి మధ్య కనిపించని గీతలుంటాయి.. వాటిని దాటితేనే ప్రమాదం. ఆ గీత బన్నీ దాటలేదు.. మెగా అభిమానులు కొందరు ఎప్పుడో దానిని దాటేశారు. ఇప్పటికే మొదలైన ఈ వార్ ఎక్కడ ఆగుతుందో..
చిరంజీవికి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పిన బన్నీ
మెగాస్టార్ చిరంజీవి పట్ల ఎక్కడలేని గౌరవం,ప్రేమను చూపిస్తుంటాడు అల్లు అర్జున్. ప్రతి పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పడమే కాదు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చిరుతో తన సంతోషాన్ని పంచుకుటాడు బన్నీ. చిరుకు పద్మవిభూషణ్ వచ్చినా.. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినా వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని బన్నీ చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment