Chiranjeevi Birthday: సుప్రీమ్‌ హీరో.. మెగాస్టార్‌గా ఎప్పుడు అయ్యారో తెలుసా..? | Megastar Chiranjeevi 69th Birthday Special Story | Sakshi
Sakshi News home page

Chiranjeevi Birthday: చిన్న సినిమాల ఈవెంట్‌లకు అతిథిగా చిరంజీవి ఎందుకు వెళ్తారో తెలుసా..?

Published Thu, Aug 22 2024 9:29 AM | Last Updated on Thu, Aug 22 2024 10:03 AM

Megastar Chiranjeevi 69th Birthday Special Story

చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాయి వేరు.. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ‘స్వయంకృషి’తో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విజయాలతో పాటు ఆపజయాలను కూడా చవిచూశారు. పరిశ్రమలో ఆయనకు ఎదురైన అవమానాలను కూడా నవ్వుతూనే హూందాగా తీసుకున్నారు. అందుకే ఆయన్ను మెగాస్టార్‌ అంటారు.  చిరంజీవి అంటేనే ఒక శిఖరం అని ఆయన అభిమానులు కీర్తిస్తుంటారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు మీకోసం..

సినిమా అభిమానుల్లో ఎప్పుడూ ఒక వార్‌ నడుస్తూనే ఉంటుంది. వారందరూ కూడా  మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుంటూ సోషల్‌మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తుంటారు. వారికి ఈ విషయం తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్‌ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్‌ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్‌ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు.

పునాదిరాళ్ళతో కొణిదెల కోట
చెన్నైలోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో 'పునాది రాళ్లు' సినిమాలో తొలిసారి నటించాడు. కానీ 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. తొలి సినిమానే ప్లాప్‌ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించారు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది.

ఈ సినిమాలే మెగాస్టార్‌గా మార్చాయి.
పునాదిరాళ్లుతో సినీ కెరీర్​ ప్రారంభించిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 80, 90వ దశకంలో వచ్చిన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశారు. ముఖ్యంగా ఖైదీ,శుభలేఖ,ఛాలెంజ్,దొంగ,అడవిదొంగ,పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అల్లుడా మజాకా,ముగ్గురు మొనగాళ్ళు,ముఠామేస్త్రి,ఘరానా మొగుడు, స్వయంకృషి, వేట, రుద్రవీణ, చంటబ్బాయి, కొండవీటి దొంగ, , ఆపద్భాందవుడు, హిట్లర్, స్నేహం కోసం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.

చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, ఇంద్ర,ఠాగూర్,స్టాలిన్,శంకర్ దాదా సినిమాలతో మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించాయి. రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం 2017లో 'ఖైదీ నెంబర్ 150'తో 'బాస్​ ఈజ్ బ్యాక్' అంటూ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి'తో చిరు నటవిశ్వరూపం చూపించారు. వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డులు క్రియేట్‌ చేశాడు. త్వరలో విశ్వంభరతో మరోసారి తన సత్తా ఏంటో చూపించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు.

డైరెక్టర్ సెలక్షన్‌ ఇలా
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నేడు తన కొత్త  సినిమా విశ్వంభర నుంచి టీజర్‌ విడుదల కానున్నట్లు సమాచారం. భోళా శంకర్‌ లాంటి భారీ డిజాస్టర్‌ తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పూరీ చెప్పిన ఆటోజానీ కథలో సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపాడు. కథను బట్టే డైరెక్టర్ తప్ప.. దర్శకుడిని బట్టి కథ కాదన్నారు.

సుప్రీమ్‌గా చివరి సినిమా, మెగాస్టార్‌గా మెదటి సినిమా ఇదే
ఇండస్ట్రీలో ఒక హీరోకు రెండు బిరుదులు ఉండటం చాలా తక్కువని చెప్పవచ్చు. మొదట 'సుప్రీమ్‌ హీరో'గా గుర్తింపు పొందిన చిరంజీవి.. ఆపై మెగాస్టార్‌గా ఎదిగాడు. 1988లో విడుదలైన 'మరణ మృదంగం' సినిమాతో చిరంజీవి.. మెగాస్టార్‌ అయ్యారు. ఈ సినిమా నుంచే టైటిల్స్‌లలో మెగాస్టార్‌ అని వెండితెరపై కనిపిస్తుంది. అయితే, ఈ సినిమాకు ముందు సుప్రీమ్‌ హీరో అనే ఉండేది. ఈ బిరుదు 'ఖైదీ' సినిమా వరకు ఉండేది. అలా చిరుకు సుప్రీమ్‌ హీరో,  మెగాస్టార్‌ అనే ట్యాగ్‌ లైన్స్‌ ఉన్నాయి.

సత్కారాలు
2006 జనవరిలో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న సేవా సౌకర్యాలు. నాలుగేళ్లు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి. అనంతరం చిరంజీవికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించగా.. మే 10న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకున్నారు.

చిన్న సినిమాల ఈవెంట్‌లకు చిరు ఎందుకు వెళ్తారంటే..
టాలీవుడ్‌ నుంచి ఆహ్వానం అందటమే ఆలస్యం. ఆయన ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా సినిమా ఈవెంట్‌లకు అతిథిగా వచ్చేస్తారు. అలా ఇతర హీరోల సినిమాల వేడుకలో పాల్గొన్ని మరింత క్రేజ్‌ తీసుకొస్తాడు. ముఖ్యంగా చిన్న సినిమాల ఈవెంట్‌కే చిరు  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయం గురించి మెగస్టార్‌ ఇలా చెప్పుకొచ్చారు. ' ఇలా వేడుకల్లో నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటాను. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహం ఇవ్వాలని ఆలోచిస్తా.' అని చిరంజీవి తెలిపారు.

చిరు గురించి ఆసక్తికరమైన విషయాలు

  • ‘రుద్రవీణ‌’లోని పాటలు చిరంజీవికి చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన సతీమణి సురేఖకు కూడా ఈ పాటలే ఇష్టమట. ఈ సినిమాలోని ‘న‌మ్మ‌కు నమ్మ‌కు ఈరేయిని క‌మ్ముకు వ‌చ్చిన ఈ మాయ‌ని’అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని గతంలో చిరంజీవి తెలిపారు.

  • చిరంజీవి చేతి రాత అస్స‌లు బాగుండ‌ద‌ట‌. ఆయన రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోతాడట. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా చేతి రాత‌ను మ‌ళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటానని గతంలో చిరంజీవి చెప్పారు.

  • చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు. ‘నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఫోటోగ్ర‌ఫి అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు కెమెరాలు కొనుక్కోలేక‌పోయాను. సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత నాకు తెలియ‌కుండానే అదొక హాబీగా మారిపోయింది’అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పారు.

  • ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్‌ని దాదాపు రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ  ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని చెప్పాడు .

  • ‘ప‌సివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొద‌టిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘ‌న‌త చిరంజీవి కే ద‌క్కుతుంది.చిరంజీవి డాన్సుల‌కే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయ‌న ఫైట్స్ శైలి కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు.

  • చిరంజీవి నటనకు అవార్డులు క్యూ కట్టాయి. తొమ్మిది ఫిల్మ్​ ఫేర్‌​ పురస్కారాలతో పాటు నాలుగు నంది అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

  • తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీలోనూ నటించిన చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్‌ మూవీ ఖరారైనా, అది కార్యరూపం దాల్చలేదు.

  • పర్సనల్‌ వెబ్‌సైట్‌ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి అని తెలుసా..? ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ క్లిక్‌ చేయండి.

  • ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్‌’. ఆ వేడుకలో (1987) అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి ఘనత సాధించారు.

  • రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు సినిమా కూడా చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement