‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది..! | comedian venu madhav interview | Sakshi
Sakshi News home page

‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది..!

Published Wed, Sep 25 2019 1:20 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’  అనిపించింది..! - Sakshi

‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది..!

 సందర్భం  వేణుమాధవ్ బర్త్‌డే
 ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ అంటూ తన పర్సనాలిటీతో వేణుమాధవ్ తెరపై రెచ్చిపోతుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం? అదిరిస్తాడు, బెదిరిస్తాడు, హడలెతిస్తాడు.. చివరకు హడలెత్తిపోతాడు.. ఈ పరిణామ క్రమంలో వేణుమాధవ్ విన్యాసాలకు ఎవరికైనా పొట్టచెక్కలు కావాల్సిందే. నేడు వేణు మాధవ్ పుట్టినరోజు సందర్భంగా ‘సాక్షి’ జరిపిన భేటీ.
 
 ఈ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
 పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది. నేను మాత్రం ఆ విధానానికి విరుద్ధం. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ నా పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకుంటున్నాను. వారికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయడం నాకు చెప్పలేని తృప్తినిస్తుంది. నాది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడి నా మిత్రులు కూడా ఈ రోజు హాస్పిటల్‌లో పళ్లు పంపిణీ చేస్తారు. అయితే... ఒక్కసారి మాత్రం నేనూ కూడా కేక్ కట్ చేశాను. దానికి కారణం చిరంజీవిగారు. ‘జై చిరంజీవ’ షూటింగ్ టైమ్‌లో నా పుట్టిన రోజు వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవిగారు స్వయంగా కేక్ తెప్పించి మరీ నాతో కట్ చేయించారు. ఈ ఏడాది నా పుట్టిన రోజు నవరాత్రుల్లో, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మధ్య రావడం ఆనందంగా ఉంది. నన్ను అభిమానించే ఎవరైనా ఈ రోజు నాకోసం ఒక్క మొక్క నాటినా ఆనందిస్తా.
 
 అంతకు ముందు విరివిగా సినిమాలు చేసేవారు. ఇప్పుడు వేగం తగ్గించేశారేం?
 కారణం ఒకటి కాదండీ.. చాలా ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి నా మైండ్‌సెట్‌లో తెలీని మార్పు వచ్చింది. హాస్యంలో అసభ్యతను తట్టుకోలేకపోతున్నాను. పాత్ర డిమాండ్ మేరకు కొన్ని చేయక తప్పదు. అందుకని విలువలకు తిలోదకాలిచ్చేస్తే ఎలా? బ్రహ్మానందంగారి హాస్యం చూడండి... ఇప్పటికీ అసభ్యత కనిపించదు. కానీ.. కొందరి హాస్యం చూస్తుంటే బాధ అనిపిస్తోంది. చివరకు టీవీ షోలు కూడా రోత పుట్టిస్తున్నాయి. ‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది. అలాగే ఆంధ్ర, తెలంగాణ గొడవల ప్రభావం కూడా మా నటులపై పడింది. రాష్ట్రం కలిసున్నప్పుడు రియల్ ఎస్టేట్ బావుండేది. దాంతో నిర్మాతలు విరివిగా వచ్చేవారు. మా లాంటి ఆర్టిస్టులకు అవకాశాలుండేవి. కానీ... ఇప్పుడు రియల్ బూమ్ లేదు. నిర్మాతల సంఖ్య కూడా తగ్గింది. అందుకే ఇదివరకు చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నా. అయితే... ఇప్పటికీ ఖాళీగా మాత్రం లేను. డా.రాజేంద్రప్రసాద్‌గారి ‘టామీ’, వైవీఎస్ చౌదరి ‘రేయ్’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రవితేజ ‘కిక్-2’... ఇలా సినిమాలు చేస్తూనే ఉన్నాను.
 
 ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది.. చెప్పండి?
 బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడొచ్చిన యంగ్ హీరోలకు కూడా ఫ్రెండ్‌గా వేయడానికి రెడీ. అందుకే కాస్త బరువు కూడా తగ్గుతున్నా.
 
 తెలంగాణ నుంచి వచ్చిన కమెడియన్‌గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ప్రథములు మీరు. అందుకు తగ్గ గౌరవం మీకు ఇక్కడ లభిస్తుందంటారా?
 కచ్చితంగా. నా ప్రజలు నాకు సరైన గౌరవాన్నే ఇస్తున్నారు. చూడగానే నవ్వడమే ఒక హాస్యనటునికిచ్చే పెద్ద గౌరవం. తెలంగాణలో పుట్టినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతాన్నేను. అయితే... కళాకారునిగా నాకు ప్రాంతీయ భేదాల్లేవు. నేను చేసిన ఓ మిమిక్రీ కార్యక్రమం చూసి ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’(1996)తో నన్ను నటునిగా పరిచయం చేశారు. వారు తెలంగాణవాళ్లు కాదు. తన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమాలోనూ నాకో మంచి పాత్ర ఇచ్చి పోత్సహించిన వినాయక్, నాకెంతో పేరు తెచ్చిన సై, ఛత్రపతి చిత్రాల దర్శకుడు రాజమౌళి తెలంగాణవాళ్లు కాదు. నా అభ్యున్నతిలో ప్రతి ఒక్కరికీ భాగం ఉంది.
 
 ‘సంప్రదాయం’ అంటే గుర్తొచ్చింది. మీ మిమిక్రీ చూసి ఎస్వీ కృష్ణారెడ్డి మీకు అవకాశం ఇచ్చారన్నారు కదా! మరి ఆ సినిమాలో మీకు డబ్బింగ్ చెప్పించారేంటి?
 దానికొక తమాషా కారణం ఉంది. ఆ రోజు డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నారు. వెళ్లాను. తెరపై నన్ను నేను చూసుకోగానే... నాకు ఆనందం పగ్గాలు తెంచేసుకుంది. ‘అయ్... నేనా... తెరపై కనిపిస్తున్నానా’ అని డబ్బింగ్ మీద ధ్యాస పెట్టకుండా తెరపై నన్నే చూసుకుంటున్నాను. ఈ కారణం వల్ల లిప్ సింక్ అవ్వడం లేదు. దాంతో ఎడిటర్‌గారికి, కృష్ణారెడ్డిగారికి విసుగొచ్చేసి, నాకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. అప్పుడు నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే... సినిమాలో నటించడం తప్ప నాకు వేరే టార్గెట్ లేదు. నటించేశాను. ఎస్వీ కృష్ణారెడ్డి గారే... ‘హంగామా’తో నన్ను హీరోను చేశారు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో కూడా హీరోగా నటించాను. ‘ప్రేమాభిషేకం’ చిత్రానికి నిర్మాతను కూడా నేనే.
 
 బ్రహ్మానందం తర్వాత అలీ, మీరూ స్టార్ కమెడియన్లుగా చక్రం తిప్పారు కదా. ఉన్నట్లుండి వెనుక పడటానికి కారణం?
 తెలుగు సినిమా చాలా గొప్పది. ఇక్కడ ఉన్నంతమంది కమెడియన్లు ఏ భాషలోనూ కనిపించరు. ఇంకో యాభై మంది కమెడియన్లకు ఇక్కడ స్థానం ఉంది. రాజకీయాలకు మా హాస్యనటులు అందరం దూరమే. ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటాం. పోటీగా ఫీలవ్వడం మాకు ఎప్పుడూ లేదు.
 
 నటునిగా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
 లక్ష రూపాయలు సంపాదించడమనేది ఒకప్పుడు నా లక్ష్యం. లక్షలు సంపాదించాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, డి.రామానాయుడు, చిరంజీవి... ఇలా లెజెండ్రీ కుటుంబాల హీరోలందరితో కలిసి పనిచేశాను, చేస్తున్నాను. పరిశ్రమలో నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్న లక్ష్యం. అందుకే... ఇక నుంచి అసభ్యతతో కూడుకున్న పాత్రల్ని చేయను. నా భార్య, పిల్లలతో కలిసి చూసేంత స్వచ్ఛమైన సినిమాలే చేస్తా.
 - బుర్రా నరసింహ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement