Venu Madhav
-
తీన్మార్ మల్లన్న సినిమాలో నటించాడా? కామెడీ సీన్ వైరల్!
తీన్మార్ మల్లన్న.. సోషల్ మీడియాను రెగ్యూలర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. ప్రతి రోజు ఉదయం యూట్యూబ్ లైవ్‌లోకి వచ్చి వార్త పత్రికల్లో వచ్చిన వార్తలపై చర్చిస్తుంటాడు. అతని అసలు పేరు నవీన్ చింతపండు. కానీ తీన్మార్ మల్లన్న పేరుతో ఓ వార్త చానెల్లో యాంకర్‌గా పని చేసి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ వార్త చానల్ని, వార్త పత్రికను పెట్టుకొని.. తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలీలో చర్చిస్తుంటాడు. (చదవండి: 2024లో ఈ సినిమాలు వెరీ స్పెషల్.. రూ. 1000 కోట్లే టార్గెట్!) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎక్కువగా విమర్శించడం కారణంగా మల్లన్నకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇలా పాత్రికేయుడు, రాజకీయ నాయకుడిగానే మల్లన్న అందరికి తెలుసు కానీ.. అతను కూడా ఒక నటుడనే విషయం ఎవరికీ తెలియదు. మల్లన్న ఓ సినిమాలో నటించాడు. ప్రస్తుతం మల్లన్న నటించిన సినిమాలోని ఓ కామెడీ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో దివంగత కమెడియన్ వేణుమాదవ్ కూడా ఉన్నారు. (చదవండి: 2024లో బాలీవుడ్ నుంచి సత్తా చాటేది ఎవరు..?) మల్లన్న నటించిన ఆ చిత్రం పేరు ‘శ్రీమతి బంగారం’. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, వేణుమాధవ్, హేమలతో పాటు తీన్మార్ మల్లన్న కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. 2016లో ఈ మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అసలు ఆ సినిమా రిలీజైన విషయం కూడా జనాలకు తెలియదు. ఇక మల్లన్న అందులో నటించారనే విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ఈ విషయం ఇన్నాళ్లు మరుగున పడింది. అయితే తాజాగా మల్లన్నకు సంబంధించిన కామెడీ సీన్‌ని ఎవరో కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మల్లన్నలో కూడా మంచి నటుడు ఉన్నాడే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వేణుమాధవ్ పక్కన ఉన్న యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా 😂 pic.twitter.com/YFQ5L25FjA — Vamshi (@vamsi_144) January 1, 2024 -
వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దె ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి
టాలీవుడ్లో ఎప్పటికి గుర్తుండిపోయే కమెడియన్‌ల్లో నటుడు వేణు మాధవ్ ఒకరు. ఖమ్మంలో పుట్టిన వేణు మాధవ్ మొదట మిమిక్రి అర్టిస్ట్‌గా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన ఆయన అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. వెండితెరపై స్పెషల్ ఇమేజ్‌ని సొంతంగా చేసుకున్న ఆయన 2019లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక వేణు మాధవ్ అనారోగ్యం, ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన తల్లి సావిత్రమ్మ తాజాగా ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు. చదవండి: గంగోత్రికి ముందు బన్నీని అడగలేదు.. అన్నయ్య చెప్పడంతో..: నాగబాబు రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. వేణు మాధవ్ చనిపోయే నాటికి ఆయనకు రూ. 20 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయని, అయినా తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. ‘నాకు ముగ్గురు కొడుకులు. అందులో వేణు మాధవ్ చిన్నవాడు. చిన్నప్పటి నుంచి వాడు చురుగ్గా ఉండేవాడు. మిమిక్రీ బాగా చేస్తుండే వాడు. అలా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఓ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు తనని ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగారు చూసి వేణుకి మూవీ ఆఫర్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మంచి నటుడిగా ఎదిగాడు. నటుడిగా కొడుకు ఎదుగుదల చూసి గర్వపడ్డాను. వేణు సినిమాలతో బిజీగా ఉండటంతో నా ఇద్దరు కొడుకులని తనకి అసిస్టెంట్‌గా పెట్టాను. కానీ ఇప్పుడు అలా ఎందుకు చేశానా అని బాధపడుతున్నా. చెప్పాలంటే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. వేణు ఎదిగాడు కానీ, వాళ్లీద్దరు ఎదగలేదు. ఒకవేళ వేణు ఉండి ఉంటే వాళ్లిద్దరిని బాగా చూసుకునేవాడేమో’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేణు మాధవ్ చేజేతురాల తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. వేణుకి ఓ అలవాటు ఉందని, ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదన్నారు. చదవండి: అవతార్ 2ను వెనక్కిన నెట్టిన ఆర్ఆర్ఆర్, మరో అంతర్జాతీయ అవార్డుకు ఎన్నిక ‘తలనొప్పి వచ్చినా టాబ్లెట్ వేసుకునే అలవాటు ఆయనకి లేదు.. అదే అతని కొంపముంచింది. జాండిస్, డెంగ్యూ వ్యాధి వస్తే మందులు వాడకుండా నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో పరిస్థితి విషమించి చనిపోయారు. అయితే వేణు చనిపోవడానికి నెల రోజుల ముందే నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరి కొడుకుల మరణం చూసి కృంగిపోయాను’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక వేణు ఆస్తులు బాగానే సంపాదించాడని, ఏడెనిమిది ఫ్లాట్లతో పాటు దాదాపు 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. వేణుకి ఇద్దరు కొడుకులని, వారు సొంత ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. తాను మాత్రం తన మూడో కొడుకుతో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని సావిత్రమ్మ చెప్పుకొచ్చారు. -
సెప్టెంబరు 25.. విషాదం!
సాక్షి, హైదరాబాద్: ‘‘మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ.. నీ బరువూ... నీ పరువూ... మోసేదీ... ఆ నలుగురూ...’’. జీవిత పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఈ పాటకు తన అద్భుత గాత్రంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం చూరగొన్న ఆ యశస్వి అందరినీ శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగా జన్మించి ఎస్పీ బాలుగా సుపరిచితులై, సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.(చదవండి: నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత) కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆగష్టు 5న ఆస్పత్రిలో చేరిన బాలు, సెప్టెంబరు 25న కన్నుమూశారు. దీంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ‘బాలు’ను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేగాక గతేడాది సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్లో చోటు చేసుకున్న మరో విషాదాన్ని తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేణుమాధవ్ ఈ లోకాన్ని వీడిన రోజు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని హాస్య నటుడుగా కళామతల్లికి తనవంతు సేవ చేసిన వేణుమాధవ్ 2019, సెప్టెంబరు 25న మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయన సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. కాగా అంతకుముందు కొద్ది నెలల క్రితమే వేణు మాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కాగా నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్, 1997లో ‘సంప్రదాయం’ సినిమా ద్వారా సిల్కర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. ‘తొలిప్రేమ’ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కమెడియన్‌గా దూసుకుపోతూ, నవ్వులు పూయించిన ఆయనను, ‘లక్ష్మి’ సినిమాలో నటనకు గానూ నంది అవార్డు వరించింది. కాగా వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వేణుమాధవ్ మృతి.. టీమిండియా క్రికెటర్ ట్వీట్
హాస్య నటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వేణుమాధవ్ మరణించారన్న వార్త తనను షాకింగ్‌కు గురిచేసిందన్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై తాను చూసిన అద్భుత హాస్యనటుల్లో అతను ఒకరని పఠాన్ తెలిపాడు. వేణుమాధవ్ లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే క్రికెటర్ యూసఫ్ పఠాన్ వేణు మాధవ్‌కు సంతాపం తెలుపుతున్న సందేశానికి వేణుమాధవ్ ఫోటోను జతచేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. గుజరాత్‌కు చెందిన పఠాన్‌కు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన వేణుమాధవ్ గురించి ఎలా తెలుసని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సై, ఛత్రపతి వంటి చిత్రాలు హిందీ వర్షన్లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో వేణుమాధవ్ తన విలక్షణ కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు. దీంతో పఠాన్ వేణు మాధవ్‌కు ఫ్యాన్ అయ్యాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సన్‌రైజర్స్ తరుపున పఠాన్ ఆడుతుండటంతో వేణుమాధవ్ గురించి తెలిసుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా, అనారోగ్యంతో మృతిచెందిన వేణుమాధవ్ అంత్యక్రియలు గురువారం అభిమానుల అశ్రనయనాల మధ్య ముగిశాయి. వేణమాధవ్ మృతిపై టాలీవుడ్ లోకం దిగ్భ్రంతిని వ్యక్తం చేసింది. Shocking to hear the demise of Venu Madhav. He was one of the irreplaceable and finest comedians I've seen on the silver screen. Deep condolences to his family and friends. pic.twitter.com/qxPl63WpwH — Yusuf Pathan (@iamyusufpathan) September 26, 2019 -
వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు
కుషాయిగూడ : అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఆయన అంత్యక్రియలను హెచ్‌బీకాలనీ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయంలో వేణుమాధవ్ పార్థివ దేహాన్ని హెచ్‌బీకాలనీ నుంచి ఫిలింనగర్‌కు తరలించారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హెచ్‌బీకాలనీకి తీసుకువచ్చి నేరుగా రాజీవ్‌నగర్ చౌరస్తా నుంచి అంతిమయాత్ర జరిపారు. అక్కడి నుంచి ఇందిరానగర్ చౌరస్తా, వార్డు కార్యాలయం మీదుగా లక్ష్మీనగర్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వేణుమాధవ్ చిన్న కొడుకు మాధవ్ ప్రభాకరణ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. ఈ అంతిమయాత్రలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, మన ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య. పన్నాల దేవేందర్‌రెడ్డి పాల్గొ న్నారు. వ్యాపారవేత్త దేవరకొండ శ్రీనివాసరావు, నటుడు ఫిష్ వెంకట్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. వేణుమాధవ్ కుటుంబాన్ని ఆదుకుంటాం హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు ఈటల, ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఇది తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని వారన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, వీరేందర్‌గౌడ్, నివాళులు అర్పించారు. ఫిలింనగర్ వద్ద అగ్ర నటుడు చిరంజీవి, హీరో రాజశేఖర్, నటి జీవిత, మురళీమోహన్, ఉత్తేజ్ తదితరులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముగిసిన వేణుమాధవ్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌజింగ్ బోర్డ్ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు వేణుమాధవ్‌కు కడసారి నివాళులర్పించారు. (చదవండి : నవ్వు చిన్నబోయింది) టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. -
వేణు మాధవ్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు
బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేణు మాధవ్ పెద్ద కుమారుడు ప్రభాకర్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నాడు. టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణు మాధవ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. -
కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం
సాక్షి, కోదాడ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు కోదాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కర్ణాటకకు చెందిన వేణుమాధవ్ తండ్రి ప్రభాకర్ (నాయర్) 50 సంవత్సరాల క్రితం కోదాడకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన టెలిఫోన్ డిపార్టుమెంట్లో పనిచేసేవారు. తల్లి సావిత్రమ్మ కోదాడలో ఆర్ఎంపీగా పని చేసిది. వేణుమాధవ్‌కు ఇద్దరు అన్నలు, అక్క, చెల్లి ఉన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఆయన ఆ తరువాత ఇంటర్, డిగ్రీ బీకాం కోర్సులను కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు. చదువుకునే సమయంలో మిమిక్రీ, వెంట్రిలాక్విజంలో మంచి పట్టు సంపాదించారు. మాధవరెడ్డితో పరిచయం... కోదాడ ఎమ్మెల్యేగా వేనేపల్లి చందర్రావు ఉన్న సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేణుమాధవ్ పాల్గొని వేదికలపై నవ్వించేవాడు. ఈ క్రమంలో నాటి హోంశాఖమంత్రి మాధవరెడ్డి వద్దకు వేణుమాధవ్‌ను ఎమ్మెల్యే చందర్రావు తీసుకెళ్లి పరిచయం చేయడంతో ఆయన కోదాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొంత కాలం పాటు టీడీపీ కార్యాలయంలో లైబ్రేరియన్‌గా పని చేశారు. ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టిలో పడడంతో ఆయన తన సినిమా ‘ సంప్రదాయం’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1996 జనవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి 2016 వరకు ఆయన దాదాపు 500 సినిమాళ్లో నటించారు. హం గామా, భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాళ్లో ఆయన హీరోగా కూడా నటించారు. ఈ మూడు సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. ఆయనకు భార్య వాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో సినీ నటుడిగా ఎంతో బిజీగా ఉండే వేణుమాధవ్ కోదాడలో జరిగే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 2009వ సంవత్సరంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జోలె పట్టి విరా ళాలు సేకరించి నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. 2016లో కోదాడలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 2018లో కోదాడలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టకు ఆయన వచ్చి రెండు రోజులపాటు కోదాడలో సందడి చేశారు. ఎన్నికల సమయంలో హడావుడి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన కోదాడ వచ్చారు. రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేయడానికి వెళ్లి ఎలాంటి పత్రాలు తీసుకురాలేదు. దీంతో నామినేషన్ తీసుకోవడానికి అధికారులు తిరస్కరించడంతో వెళ్లిన ఆయన మళ్లీ రెండవసారి వచ్చినామినేషన్ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య చివరి రోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వేణుమాధవ్ మృతికి సంతాపం పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ అకాల మృతికి పలువురు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మంచి కళాకారుడిని కోల్పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉంటుందని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, ఎన్.పద్మావతి, కోదాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితలు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాకు వెన్నుదన్నుగా ఉండేవాడు కోదాడ బాలుర పాఠశాల నుంచే వేణుమాధవ్ నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత కేఆర్ఆర్ కళాశాలలో చదువుకున్నాం. కోదాడలో మేము ఏర్పాటు చేసిన తెర సాంస్కృతిక కళామండలికి ఆయన చేదోడుగా ఉండేవాడు. కోదాడ వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లడు. సంవత్సరం క్రితం భార్యభర్తలు, పిల్లలు వచ్చి వెళ్లారు. ఆయన మరణం తీవ్రమైన బాధ కలిగించింది. – వేముల వెంకటేశ్వర్లు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ వేణుమాధవ్ నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా అన్యోన్యంగా ఉండే వాడు. ప్రతి ఎన్నికల్లో కోదాడకు వచ్చి నాకు ప్రచారం చేసేవాడు. కోదాడకు వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయనతో 20 సంవత్సరాల అనుబంధం ఇలా అర్ధంతరంగా ముగియడం బాధగా ఉంది.– పారా సీతయ్య, మాజీ సర్పంచ్ ఎంతో సరదాగా ఉండేవాడు వేణుమాధవ్ ఇంటర్, డిగ్రీలో నా క్లాస్మేట్. గత సంవత్సరం కోదాడలో జరి గిన వినా యక చవితి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మాతో రెండు రోజులు గడిపాడు. కళాశాల రోజుల్లో సరదాగా ఉండేవాడు. పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఇలా అకాల మరణం చెందడం బాధ కలిగించింది. –పాలూరి సత్యనారాయణ, క్లాస్మేట్ -
వేణుమాధవ్‌కు ప్రముఖుల నివాళి
-
ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు
అనారోగ్యంతో బుధవారం మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ స్థానికులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని మౌలాలీ వాసులు గుర్తు చేసుకున్నారు. ఆయన గత 25 ఏళ్లుగా స్థానిక పెద్దలు, చిన్న పిల్లలకు సన్నిహితులని పేర్కొన్నారు. డివిజన్లో జరిగే ప్రతి పండగలోను వేణుఉత్సాహంగా పాల్గొనేవారని, తోటివారితో సందడి చేవారని వారు పేర్కొన్నారు. కుషాయిగూడ: అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ స్థానికులతో కలివిడిగా.. ఎంతో అప్యాయంగా ఉండేవారు. 25 సంవత్సరాలుగా మౌలాలి ప్రాంతంలో నివసిస్తున్న ఆయన పెద్దలతో పాటుగా చిన్నపిల్లలకు సుపరిచితుడిగా మారారు. స్థానికంగా నిర్వహించే పండుగలు, ఉత్సవాలలో పాల్గొంటూ తన హాస్యంతో అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకున్నారు. నా గెలుపులో భాగస్వామి జీహెచ్ఎంసీ ఎన్నికలలో నాకు అన్ని విధాలా అండగా నిలిచాడు. ఎన్నికల ప్రచారంలో సొంత మనిషిలా నాకు మద్దతుగా ప్రచారం చేసి నా గెలుపులో భాగస్వామి అయ్యాడు. నేను తలపెట్టే ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. వేణుమాధవ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. – గొల్లూరి అంజయ్య, కార్పొరేటర్ 1997 నుంచి స్నేహితులం వేణు మాధవ్ హెచ్‌బీకాలనీకి వచ్చిన తరువాత 1997లో మా స్నేహం మొదలైంది. ఆయనతో పాటు పది సంవత్సరాలుగా సినిమా రంగంలో పనిచేశాను. ఈ క్రమంలో మా స్నేహం కాస్తా మరింత బలపడి కుటుంబ స్నేహితులుగా మారాం. తన సమస్యలు నాతో చర్చించేవాడు. గొప్ప మిత్రుడిని కోల్పోడం బాధగా ఉంది. – శ్రావణ్‌కుమార్‌గౌడ్ ప్రతి ఫంక్షన్‌కు వచ్చేవాడు కొద్ది కాలం క్రితం పరిచయమైన వేణన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారాడు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. ఎక్కడైనా కలిశాడంటే చాలు నవ్వులు పండించేవాడు. అతనితో గడిపినంత సేపు సమయం గుర్తుకు వచ్చేది కాదు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కుటుంబ సమేతంగా హజరై సంతోష పరిచేవాడు. అలాంటి వ్యక్తి మరణించాడన్న వార్త మా కుటుంబ సభ్యులందరినీ బాధలో ముంచేసింది. – వంజరి ప్రవీణ్ అందరిలో జోష్ నింపేవాడు మా కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమానికీ ఆయనను ఆహ్వానించేవాళ్లం. ముఖ్యంగా బోనాలకు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని మా అందరిలో జోష్ నింపేవాడు. ఎలాంటి సాయం కోరినా తనవంతు సాయం చేసేవాడు. – సురేష్ నమ్మలేకున్నాం హాస్యనటుడు వేణుమాధవ్ హెచ్‌బీకాలనీలో అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. డివిజన్లో నిర్వహించే అన్ని ఉత్సవాలకు హాజరై ఉత్సహపరిచేవాడు. అలా అందరికి సుపరిచితుడుగా మారిన వేణుమాధవ్ ఇక లేడంటే నమ్మలేకున్నాం. – బోదాస్ రవి (వేణుమాధవ్‌కు ప్రముఖుల నివాళి దృశ్యాల కోసం... క్లిక్ చేయండి) -
ప్రముఖ నటుడు వేణుమాధవ్ కన్నుమూత
‘పంతులమ్మని చేసుకుని పలక మీద అఆలు రాసుకోవాలా? పదిమంది చూపూ నా మీదే ఉండాలి.. వందమందిలో ఉన్నా నన్ను స్పెషల్‌గా గుర్తించాలి’ (ఛత్రపతి), ‘నేనెవరో ఎరుకనా.. నల్లబాలు నల్లతాచు లెక్క.. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తం దడ’ (సై), ‘ఒసేయ్ శకుంతల.. రేపు మార్నింగ్ 9గంటలకు నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా.. రూమ్‌కి వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్లి 10 గంటలకు క్యాష్ తీసుకెళ్లు.. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్ నడిరోడ్డు మీద ఓ ఆడదాన్ని కొట్టాననే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వొద్దు (లక్ష్మీ)’’ అంటూ ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్ (51) ఇకలేరు. హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకుని, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆయన అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన. అయితే ఇటీవల వ్యాధి సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్రీవాణి, కొడుకులు మాధవ్ సావికర్, మాధవ్ ప్రభాకర్ ఉన్నారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. వేణుమాధవ్ మృతదేహాన్ని కాప్రా హెచ్‌పీ కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కాగా అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్ పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30గంటల వరకూ ఫిల్మ్‌నగర్‌లోని ‘మా’ కార్యాలయ ఆవరణలో ఉంచనున్నారు. మిమిక్రీ ఆర్టిసుగా... నల్గొండ జిల్లాలోని కోదాడలో 1969 డిసెంబర్ 30న ప్రభాకర్–సావిత్రి దంపతులకు జన్మించారు వేణుమాధవ్. తండ్రి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్. తల్లి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. వేణుకి అక్క, ఇద్దరు అన్నయ్యలు, ఓ చెల్లి ఉన్నారు. చిన్నప్పట్నుంచి టీచర్లనీ, స్నేహితుల్నీ, తల్లి సావిత్రి దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరిస్తుండేవాడు వేణుమాధవ్. వేణు సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ కోదాడలో ఓ మ్యారేజ్ ఫంక్షన్లో మిమిక్రీ చేశారు. అప్పట్నుంచి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మిమిక్రీ చేసేవారు. అయితే మిమిక్రీని ఓ వృత్తిగా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల్లో మిమిక్రీ చేసేవారు. బీకాం తర్వాత సీఏ చదవాలని బలమైన కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోయారు వేణు. డిగ్రీ తర్వాత ముంబయ్ వెళ్లి ‘టాకింగ్ డాల్’ తెచ్చుకుని, ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టారు. రచయిత దివాకర్బాబుకి రవీంద్రభారతిలో జరిగిన సన్మానంలో వేణు ప్రతిభ చూసిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’ (1996) సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా పూర్తయ్యాక డబ్బింగ్ చెప్పేందుకు థియేటర్‌కి వెళ్లిన వేణుమాధవ్ తొలిసారి తెరపై తన బొమ్మ చూసుకోవడంతో ఎగ్జయిట్ అయిపోయి డబ్బింగ్ చెప్పలేకపోయారట. చివరికి ఆయన పాత్రకి కాదంబరి కిరణ్‌తో చెప్పించారు. మొదటి సినిమా రిలీజ్ కాకముందే వేణుమాధవ్‌కి అవకాశాలు వచ్చాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తూ, కారులోనే టిఫిను, భోజనం చేసేవారు. అప్పుడు కొంచెం అలసటగా అనిపించినా మళ్లీ ఇలాంటి అవకాశం రాదేమో అని కష్టపడేవాడినని పలు సందర్భాల్లో వేణుమాధవ్ చెప్పారు. హైట్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదాయన. ‘ఎత్తున్న హీరోలు వినోదం పండిస్తే ప్రేక్షకులు చూస్తారా? వాళ్లు హీరోగానే చేయాలి. హీరోగా అయితే ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను దాదాపు 10–15ఏళ్లు ఏడాదికి 40– 50 సినిమాలు చేశా’ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారాయన. దాదాపు 600 సినిమాలు చేశారు. ఆయన్ని నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ‘హంగామా’ సినిమాతో హీరోని కూడా చేశారు. ఆ తర్వాత ‘భూ కైలాస్, ప్రేమాభిషేకం’ చిత్రాల్లో సోలో హీరోగా నటించారు వేణుమాధవ్. ‘ప్రేమాభిషేకం’ సినిమాని ఆయనే నిర్మించడం విశేషం. వినాయక్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు వేణుమాధవ్. సీమాంధ్ర ఉద్యమం సమయంలో తనకు కొంచెం అవకాశాలు తగ్గాయని ఆ మధ్య చెప్పారు. వేణుమాధవ్ సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తండ్రి ప్రభాకర్ జ్ఞాపకార్థం, తల్లి సావిత్రి పేరుతో కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించారు. ‘వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్’ పేర్లతో సేవాకార్యక్రమాలు చేసేవారాయన. గుణశేఖర్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ తర్వాత వేణుమాధవ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినీ ప్రముఖుల సంతాపం వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, రాజశేఖర్, శ్రీకాంత్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, నటులు అలీ, శివాజీరాజా, ఉత్తేజ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’
సాక్షి, సూర్యపేట : ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మరణం పట్ల మంత్రి జగదీష్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హాస్యప్రపంచానికి వేణుమాధవ్ మరణం తీరని లోటు అన్నారు. సినీ గగన నీలాకాశంలో హాస్యాన్ని పండించిన నటుడు వేణుమాధవ్ సూర్యపేట జిల్లా బిడ్డ కావడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి వేణుమాధవ్ అని కొనియాడారు. కళామతల్లి ఒడిలో ఒరిగిపోయిన వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి వేణుమాధవ్ మరణం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. వేణుమాధవ్ తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మంత్రి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. -
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం
ప్రముఖ సినీ హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేణు మాధవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన కృష్టి పట్టుదలే కారణమన్నారు తలసాని. -
వేణు మాధవ్ కోలుకుంటారనుకున్నా : పవన్
బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్. యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ లు వేణు మాధవ్ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. వేణుమాధవ్‌తో సన్నిహితంగా ఉండే కమెడియన్లు అలీ, ఉత్తేజ్‌లు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే వేణు మాధవ్ లేడంటే నమ్మలేకపోతున్నా అంటూ సీనియర్ నటుడు గౌతమ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేను మౌలాలి మెగాస్టార్‌ని!
ఒక్క ఫ్రెండు... వేణుమాధవ్ లాంటి ఒక్క ఫ్రెండు... ఉంటే చాలు. ఎంత పెద్ద స్టార్ యాక్టర్‌కైనా పక్కన పెద్ద సపోర్ట్! అల్లు రామలింగయ్య, చిరంజీవి, రామ్‌చరణ్ నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఫర్ ఎవ్రీ జనరేషన్... మిత్ర ‘పాత్రుడు’ వేణుమాధవ్! ఇక ఆయన రుబాబ్ కామెడి... అదొక కొత్త ఒరవడి! చేతులు తలపెకైత్తి, సైడుకి ఒక్క లుక్ ఇచ్చాడంటే... ఆడియన్స్ తుకడాల్, తుకడాల్!! ప్రదీప్ రావత్, తెలంగాణ శకుంతల... ఎవరైనా... లెక్క చేసేదే లేదు. ‘నల్లబాలు’ లెక్క! సినిమా ఛాన్స్ వస్తే... ‘‘వద్దొద్దు, ప్రోగ్రామ్స్ ఇప్పించండి చాలు’’ అని తప్పుకుని తప్పుకుని తిరిగిన ఈ ‘జూనియర్ నేరెళ్ల’... చివరికి ఈ ఫీల్డులో ఎలా సెటిలయ్యారు? ఇప్పుడెందుకు మళ్లీ దూరమైనట్లు కనిపిస్తున్నారు?! చదవండి... ఈవారం ‘తారాంతరంగం’. మీ చిన్ననాటి తీపి గుర్తులు? వేణుమాధవ్: నాకేం తీపి గుర్తులు లేవు. నాది ఉగాది పచ్చడిలాంటి జీవితం. మాది నల్గొండజిల్లాలోని కోదాడ. పుట్టింది, పెరిగింది, చదివింది అక్కడే. కాలేజీ చదువు మాత్రం బాలాజీనగర్ తండాలో. ప్రతి రోజూ అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. మీ నాన్నగారు ఏం చేసేవారు? వేణుమాధవ్: టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్. అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చేసేవారు. మేం ఐదుగురం. అక్క, ఇద్దరన్నయ్యలు, తర్వాత నేను. నా తర్వాత చెల్లి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవారా? వేణుమాధవ్: అమ్మానాన్న తట్టుకోలేనేంత చేసేవాణ్ణి. స్కూల్‌కి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. సరిగ్గా చదువుకునేవాణ్ణి కాదు. అప్పట్లో ఓ సినిమా విడుదలవుతోందంటే, రిక్షాలో ఎనౌన్స్మెంట్ చేసేవాళ్లు. రిక్షా కనబడగానే నేనే ఎక్కి, అనౌన్స్ చేసేసేవాణ్ణి. డప్పులోళ్లు కనిపిస్తే.. వాళ్ల వెంటపడి డప్పులు కొట్టడం, పిల్లలతో గోలీలాడటం.. ఇలా నా అల్లరికి అంతుండేది కాదు. మా పిల్లలందరిలోనూ ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. మా కుటుంబంలో నా మీద ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. ఎందుకూ పనికి రానివాడని అనుకునేవారు. చదువులో వీక్. మరి, పరీక్షల సంగతేంటి? వేణుమాధవ్: టెన్త్ క్లాస్ రెండుసార్లు చదివా. అసలీ చదువుని ఎవరు కనిపెట్టారా? అని నానా రకాలుగా తిట్టుకునేవాణ్ణి. చదవకపోతే ఇంట్లో, స్కూల్లో కొడతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకునేవాణ్ణి. సరే.. ఇంతకూ మిమిక్రీలోకి ఎలా ఎంటరయ్యారు? వేణుమాధవ్: నేను చిన్నప్పట్నుంచీ స్కూల్లో టీచర్లనీ స్నేహితుల్నీ, మా అమ్మ దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరించేవాణ్ణి. అయితే దాన్ని మిమిక్రీ అంటారన్న సంగతి నాకు తెలియదు. నేను సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌గారు మా కోదాడలో ఓ మ్యారేజ్ ఫంక్షన్లో ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు నేను చేసేది మిమిక్రీ అనే సంగతి నాకర్థమైంది. అప్పట్నుంచీ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా మిమిక్రీ చేసేవాణ్ణి. మిమిక్రీ మీ జీవితానికి మలుపవుతుందనుకున్నారా? వేణుమాధవ్: అస్సలు లేదు. అయితే మిమిక్రీని ఓ ప్రొఫెషన్‌గా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. అప్పుడు ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల్లో మిమిక్రీ చేయడానికి ఇక్కడికి వచ్చేవాణ్ణి. డిగ్రీ అయిన తర్వాత ముంబయ్ వెళ్లి ‘టాకింగ్ డాల్’ తెచ్చుకుని, ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టాను. టాకింగ్ డాల్ తెచ్చుకోవాలని ఎందుకనిపించింది? వేణుమాధవ్: శ్రీనివాస్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర చూసి, తెచ్చుకున్నాను. నాకు నేనుగా వెంట్రిలాక్విజమ్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను. టాకింగ్ డాల్ అంటే చాలా ఖరీదు కదా? వేణుమాధవ్: నిజమే. అప్పట్లో దాని విలువ ఐదువేల ఎనిమిదివందల రూపాయలు. అది కొనడానికి నేను మామూలు ఇబ్బందులు పడలేదు. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్ సహాయంతో కొనుక్కున్నాను. మిమిక్రీలో జూనియర్ వేణుమాధవ్ అనిపించుకున్నారు.. ఎలా అనిపిస్తోంది? వేణుమాధవ్: నేరెళ్ల వేణుమాధవ్‌గారి ఏకలవ్య శిష్యుణ్ణి. కొన్ని వందల సార్లు ఆయన్ను కలిశాను. ‘అరేయ్.. నువ్వు స్ప్రింగులు మింగావురా..’ అని మెచ్చుకునేవారు. ‘నువ్వు కచ్చితంగా సినిమా యాక్టర్ అవుతావు’ అని కూడా అనేవారు. అంతటి మహానుభావుడితో పోల్చి, జూనియర్ వేణుమాధవ్ అనే పేరు తెచ్చుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఆ టాకింగ్ డాలే మిమ్మల్ని ఎన్టీఆర్ వరకూ తీసుకెళ్లింది కదూ? వేణుమాధవ్: అవును. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్రావుగారు, కలక్టర్‌గారు, ఇంకా పలువురు ప్రముఖుల సమక్షంలో టాకింగ్ డాల్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చందర్రావుగారికి నచ్చి, భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మాధవరెడ్డిగారు, చంద్రబాబునాయుడుగారు నా టాకింగ్ డాల్ ప్రదర్శన చూసి, ‘మహానాడులో నువ్వు ప్రోగ్రామ్ చేయాలి’ అన్నారు. ఎన్టీ రామారావుగారి సమక్షంలో ఆరు లక్షల మంది ముందు పోగ్రామ్ చేశా. నా జీవితంలో ఊహించని మలుపు అది. ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అంటే.. మధ్యాహ్నమే నన్ను స్టేజి మీద కూర్చోబెట్టారు. అందరూ మాట్లాడిన తర్వాత, ఎన్టీఆర్‌గారు మాట్లాడే ముందు, నాతో ప్రోగ్రామ్ చేయించారు. అప్పుడు ఎన్టీఆర్‌గారు నా భుజం మీద చెయ్యేసి, ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు. నాకంతా అయోమయంగా ఉండేది. సరే.. డబ్బులు బాగానే ఇస్తారనే ఊహతో చేరాను. ఆ ఊహ నిజమైందా? వేణుమాధవ్: నెలకు ఆరువందలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎనిమిది వందలు. 1994 నుంచి 96 వరకు అక్కడే చేశాను. సినిమాల్లోకి ఎలా వచ్చారు? వేణుమాధవ్: అప్పుడు నేను, మిమిక్రీ శ్రీనివాస్‌గారు, జనార్ధన్, కోలా... అని మేమందరం ఆకృతి సంస్థ నిర్వహించే ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. నాకు సెకండ్ హ్యాండ్ బజాజ్ 150 ఉండేది. పెట్రోలు ఖర్చులు కలిసొస్తాయని నలుగురూ ఒకే వాహనం మీద వెళ్లేవాళ్లం. ఓసారి రచయిత దివాకర్బాబుగారికి రవీంద్రభారతిలో సన్మానం జరిగితే, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు వచ్చారు. మేం చేసిన ప్రోగ్రామ్ చూసి, ఫోన్‌నంబర్ ఇచ్చి, మర్నాడు ఆఫీసుకు వచ్చి కలవమన్నారు. సినిమాలు చూడ్డమే తప్ప నాకు సినిమా మీద కొంచెం కూడా జ్ఞానం లేదు. సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ లేదు. సరే.. రమ్మన్నారు కదా అని వెళ్లాలనుకున్నాను. ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టింది అప్పుడేనా? వేణుమాధవ్: అవును. ఆఫీసు వెతుక్కుంటూ వెళ్లి, కలిశాను. ‘నువ్వు స్టేజ్ మీద ఏదైతే చేశావో.. సినిమాలో అదే చెయ్యాలి’ అన్నారు. ‘నాకు సినిమా అంటే తెల్వదు సార్.. మనకు ఎరక లేదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. ఒక్కో ప్రోగ్రామ్‌కి ఇంత అని తీసుకుంటా’ అని ఇదే స్లాంగ్‌లో చెప్పా. ‘కాదు.. కాదు.. ఆలోచించుకో’ అన్నారు. ఇంటికొచ్చి అమ్మకి చెబితే.. ‘పిచ్చోడా.. సినిమా అంటే చిన్న విషయం కాదు. చేస్తానని చెప్పు’ అని చెప్పింది. ఆ తర్వాత అమ్మ మా ఊరు వెళ్లిపోయింది. దాంతో నేను కృష్ణారెడ్డిగార్ని కలవాలనే ఆలోచనను వదిలేశా. కానీ ఊరెళ్లిన తర్వాత కూడా అమ్మ వదల్లేదు. అప్పట్లో నా రూమ్‌లో ల్యాండ్‌లైన్ కూడా లేదు. పక్కింటికి ఫోన్ చేసి మరీ, ‘వెళ్లకుండా ఉండొద్దు’ అని అమ్మ పదే పదే చెప్పడంతో, బాధ భరించలేక వెళ్లాను. నేను మళ్లీ అదే పాట.. ‘పబ్లిక్ మీటింగ్ అయితే చేస్త కానీ.. ఇట్టాంటివి నడ్వదు సార్. సినిమా అంటే నాకు తెల్వదు’ అన్నాను. జనరల్‌గా వేరే దర్శక, నిర్మాతలెవరైనా వద్దంటారు. కానీ, కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు ‘మేం చూసుకుంటాం..’ అని హామీ ఇచ్చారు. ఎలాగూ బతిమాలుతున్నారు కదా అని, క్యాష్ చేసుకుందామని, అయితే ‘ఆర్ నైతో పార్’.. వస్తే డబ్బులొస్తాయ్ లేకపోతే సినిమా చేయకుండా తప్పించుకోవచ్చని, లెవల్‌గా ‘ఎన్ని రోజులు కావాల’ అనడిగాను. అరవై, డెబ్భైరోజులు కావాలంటే, 70వేలు అడిగాను. ఆ సినిమాకి నిర్మాత అన్నారావుగారు. ఆయనతో మాట్లాడతామని చెప్పారు. ‘వాళ్లతో వీళ్లతో నాకు సంబంధం లేదు.. నాకు పైసల్ కావాల్సిందే’ అంటే, ఓకే అన్నారు. ఆ విధంగా ‘సంప్రదాయం’ సినిమాకి మొదటిసారి మేకప్ వేసుకున్నా. సరే... షూటింగ్ వాతావరణం ఎలా అనిపించింది? వేణుమాధవ్: కృష్ణగారు, ఇంకొంతమంది ఆర్టిస్టులు, నా కాంబినేషన్లో మొదటిరోజు షూటింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్‌కి వెళ్లగానే, టిఫిన్ తినమన్నారు. కానీ, నేను బయటికెళ్లి, హోటల్లో తినొచ్చాను. ఆ తర్వాత ఒంటి గంటకి బ్రేక్ అన్నారు. అంటే ఏంటో తెలియదు. అందరికీ భోజనం పెడుతుంటే, లంచ్ టైమ్ అనుకుని బయటికెళ్లి భోజనం చేసొచ్చాను. నన్నూ తినమన్నారు. అక్కడ భోంచేస్తే, ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తారని భయం. ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ‘ఏవయ్యా.. ఎటు వెళుతున్నావ్’ అని ప్రొడక్షన్‌వాళ్లు అడిగితే, తినడానికని చెప్పా. ‘ఎందుకు? ఇక్కడ పెడుతున్నాంగా.. ఫ్రీయే’ అన్నాడు. అంతే.. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, రమ్మన్నాను. నాలుగు రకాల పచ్చళ్లు, కూరలు.. బ్రహ్మాండమైన భోజనం. ఓ పట్టు పట్టేవాళ్లం. లైఫ్ చాలా హాయిగా అనిపించింది. పర్టిక్యులర్‌గా 70వేలు పారితోషికం అడగాలని ఎందుకనిపించింది? వేణుమాధవ్: లక్ష రూపాయలు సాధించాలన్నది నా జీవితాశయం. అందుకే 70 వేలడిగాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ చెప్పాలి రమ్మంటూ ఓ రోజు కారు పంపించారు. డబ్బింగ్ అంటే ఏంటో నాకస్సలు తెలియదు. సరే.. థియేటర్‌కి వెళ్లాను. స్క్రీన్ మీద నా బొమ్మ చూసుకుంటూ.. డబ్బింగ్ చెప్పాలి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడంతో ఎగ్జయిట్ అయిపోయాను. అలా చూస్తూ నిలబడిపోయాను. అలా పదిసార్లు జరిగింది. నోరెళ్లబెట్టి చూడటం తప్ప మాటలు మాట్లాడటంలేదు. రామ్గోపాల్రెడ్డిగారని ఎడిటర్‌గారు... ఇలా అయితే లాభం లేదని, రేపు డబ్బింగ్ చెబుదువుగాని అన్నారు. మర్నాడు కూడా అదే తంతు. మూడు, నాలుగో రోజు కూడా అంతే. నా బొమ్మ చూసుకోగానే.. భలే ఉన్నామే అనుకోవడం తప్ప డబ్బింగ్ చెప్పడంలేదు. రామ్‌గోపాల్‌గారికి నేను చెప్పనని అర్థమైంది. దాంతో కాదంబరి కిరణ్‌గారితో చెప్పించారు. లక్ష రూపాయల జీవితాశయం ఏంటి? వేణుమాధవ్: బీకామ్ చేసిన తర్వాత సీఏ చదవాలని విపరీతమైన కోరిక. కోదాడలో సీఏ లేదు. అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేదు. సీఏ చేయాలంటే చెన్నయ్ వెళ్లాలి. ఫీజు మాత్రమే లక్ష రూపాయలు కట్టాలి. ఎలాగైనా సీఏ చేయాలన్నది ఆశయం. మా అమ్మానాన్నలకు ఐదుగురు సంతానం. ఐదుగుర్నీ చదివించడం, పెంచడం చిన్న విషయం కాదు. ఇక, లక్ష రూపాయలు ఎక్కడ కడతాం? లక్ష లేకపోవడంతో సీఏ చేయలేకపోయాం కదా.. అందుకే ఎప్పటికైనా లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నా. అదేంటి.. చదువంటే అసహ్యం అన్నారు.. సీఏ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందే? వేణుమాధవ్: టెన్త్ ఎప్పుడైతే రెండుసార్లు రాశానో అప్పుడే నాకే ఏదోలా అనిపించింది. ఇంటర్లోకొచ్చాక చదువంటే ఇంట్రస్ట్ ఏర్పడింది. సెకండ్ క్లాస్ తెచ్చుకున్నా. బీకామ్ వచ్చేటప్పటికి ఇంకా ఇంట్రస్ట్ ఏర్పడింది. అప్పుడే సీఏ యాంబిషన్ కలిగింది. సరే... మళ్లీ సినిమాల్లోకొద్దాం. ‘సంప్రదాయం’ విడుదలైన తర్వాత వెంటనే అవకాశాలు వచ్చాయా? వేణుమాధవ్: ఆ సినిమా జనవరి 14న విడుదలయ్యింది. 10, 11న చెన్నయ్‌లో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ చూసిన కొంతమంది నిర్మాతలు అవకాశం ఇచ్చారు. మొదటి సినిమా రిలీజ్ అవకముందే పాపులర్ అయ్యాను. శ్రీకారం, మెరుపు.. ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. ఒక్క సినిమా కూడా విడుదలవ్వక ముందే బిజీ అవడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వెంటనే పారితోషికం పెంచేశారా? వేణుమాధవ్: ‘శ్రీకారం’ సినిమాలో నాది హాఫ్ డే కేరక్టర్. మనిషి ఆశాజీవి. అది కూడా తెలియనితనం ఉన్న మనిషైతే మితిమీరి ప్రవర్తిసాడు. అప్పట్లో నా తెలియనితనంతో ఒక్క రోజుకి 70వేలు పారితోషికం అడిగా. నిర్మాతగారు సరే... నేను మాట్లాడతాలే అన్నారు. సినిమా పూర్తయ్యింది. ఆ తర్వాత రెండోరోజుకి అనుకుంటా.. ఆఫీసుకి వెళితే, 10వేలు చేతిలో పెట్టారు. అయినా పట్టుబట్టి నేను ఆఫీసు చుట్టూ తిరిగేవాణ్ణి. నిజం చెప్పండి.. సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది. మరి.. పాత్రకు తగ్గ పారితోషికం అడగాలని ఎప్పుడు తెలిసింది? వేణుమాధవ్: ‘మెరుపు’ సినిమా చేస్తున్నప్పుడు డెరైక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర మిగతా ఆర్టిస్టులు ఎలా నడుచుకుంటున్నారో చూసి, మనం చేస్తున్నది కరెక్ట్ కాదని గ్రహించి, నా బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నాను. అంతకు ముందు వరకు నా బాడీ లాంగ్వేజ్ చాలా పొగరుగా ఉండేది. లక్కీగా అప్పుడు ఇంత మీడియా లేదు. ఉండి ఉంటే... నా తీరు స్క్రోలింగ్‌లో వచ్చి ఉండేది. బ్రహ్మానందంగారి లాంటి సీనియర్స్‌ను చూసి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాను. ఎంత పారితోషికం అడగాలో తెలుసుకున్నాను. వందల నుంచి వేలకి.. అక్కణ్ణుంచి లక్షలకు మీ పారితోషికం పెరిగింది కాబట్టి ‘మనీ మేనేజ్మెంట్’ విషయంలో మీ అన్నయ్యల సహకారం తీసుకునేవారా? వేణుమాధవ్: హండ్రెడ్ పర్సంట్ తీసుకునేవాణ్ణి. నేను కూడా బాధ్యతగానే వ్యవహరించేవాణ్ణి. అందుకే హైదరాబాద్‌లో పది ఇళ్లు కొనగలిగాను. పదెకరాల ఆస్తి ఉంది. ఆర్టిస్ట్‌గా నా వైభవాన్ని చూసి మా నాన్నగారు, ఇతర కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. నాన్నగారు చనిపోయి ఇప్పటికి పదకొండేళ్లవుతోంది. నేనెందుకూ పనికిరానని అనుకునేవారు కాబట్టి.. నేను మంచి స్థాయికి వచ్చినందుకు బయటికి చెప్పకపోయినా అమ్మ దగ్గర చెప్పి సంతోషపడేవారు. కమెడియన్‌గా ఓ రేంజ్కొచ్చిన తర్వాత ఇంకాఎత్తు ఉండి ఉంటే, అందంగా ఉండి ఉంటే ఏ హీరోనో అయ్యుండేవాణ్ణి అని ఎప్పుడైనా అనిపించిందా? వేణుమాధవ్: మీరడిగినది నాకు బాగా నచ్చింది. హైట్ తక్కువ ఉన్నాను కాబట్టే.. ఇంత సంపాదించగలిగాను. హైటు ఉన్న హీరోలని తీసుకుందాం. వాళ్లు కామెడీ చేస్తే చూస్తారా? హీరోగానే చేయాలి. సంవత్సరానికి మాగ్జిమమ్ మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను ఏడాదికి 40, 50 సినిమాలు చేసిన రోజులున్నాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో వేరే వేరే సినిమాలు చేసేవాణ్ణి. కారులోనే టిఫిను, భోజనం చేసేవాణ్ణి. ఓ పది, పదిహేనేళ్లు అలా చేశాను. కొంచెం అలసట అనిపించేది...కానీ మళ్లీ ఇలాంటిది రాదేమో అని ఎంత కష్టమైనా చేశాను. సో... పొట్టివాడు గట్టివాడు అనొచ్చన్నమాట... వేణుమాధవ్: అవును. ఒక విషయం చెబితే మీకు గమ్మత్తుగా ఉంటుంది. అల్లు రామలింగయ్యగారి నుంచి మొదలుపెడదాం. ఆయనకు, చిరంజీవిగారికి, రామ్‌చరణ్, చిరంజీవిగారి మేనల్లుడు సాయిధరమ్‌లకు ఫ్రెండ్‌గా చేశాను. ఇక, అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాగార్జునగారికి, సుమంత్, నాగచైతన్య రాబోయే అఖిల్‌కీ నేనే ఫ్రెండ్‌ని అవుతా. తరాలు మారుతున్నా ఫ్రెండ్ మారడంలేదు. తాత, కొడుకు, మనవడికి ఫ్రెండ్‌గా చేయడం అంటే చిన్న విషయం కాదు. నా హైట్ వల్ల లాభం ఇదే. ఇంతకన్నా ఏం లాభం కావాలి? నిర్మాతగా మారి, ‘ప్రేమాభిషేకం’ తీశారు. బాగా నష్టపోయినట్లున్నారు? వేణుమాధవ్: అలా అనే అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమాకి మహా అయితే కోటి రూపాయలు అయ్యుంటుంది. శాటిలైట్ రైట్సే 70 లక్షలు వచ్చింది. తక్కువలో తక్కువ అన్ని ఏరియాల్లో కలిపి నా సినిమా 30 లక్షలకు అమ్ముడుపోదా? నష్టం ఎందుకు వస్తుంది? ఒకవేళ కొంతమంది అనుకుంటున్నట్లు నష్టం వచ్చిందే అనుకున్నాం. నేనెక్కణ్ణుంచి వచ్చాను? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేనేం తీసుకొచ్చాను? మా ఊళ్లో ఉన్న ఎకరాలు ఎకరాలు అమ్మి ఇక్కడకు రాలేదు కదా. నా గురించి కొంతమంది ఎక్కువ ఆలోచించి, ఏదేదో అనుకుంటారు. ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకుంటే బెటర్. మరి.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా ఎందుకు సినిమా చెయ్యలేదు? వేణుమాధవ్: మళ్లీ బ్రహ్మాండమైన కథ దొరికితే తప్పకుండా చేస్తా. అశ్లీలత లేకుండా నీట్‌గా ఉన్న స్టోరీ అయితే చేయడానికి రెడీ. హడావిడిగా కారులోనే భోంచేసి, రకరకాల లొకేషన్స్ తిరిగి షూటింగ్‌లు చేసిన మీకు ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు మినహా లేకపోవడానికి కారణం ఏంటి? వేణుమాధవ్: కారణం ఏం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలే. కానీ, మీ ఓవర్‌యాక్షన్ వల్లే సినిమాలు తగ్గాయనే టాక్ ఉంది...? వేణుమాధవ్: ఎప్పుడైతే ఎదుటివాడు ఎక్కువ సినిమాలు చేసి, ఎక్కువ సంపాదిస్తున్నాడో అప్పుడు కొంతమంది దృష్టి వాడి మీద ఉంటుంది. నాకు తీరిగ్గా తినడానికి ఖాళీ లేక కార్లో భోంచేస్తూ వెళుతున్న సమయంలో, ఎవరైనా పలకరించారనుకోండి.. నేను మామూలుగా స్పందించి ఉండొచ్చు. అలాగే, కంటినిండా నిద్రపోయే టైమ్ దొరక్కపోవడంతో కారులోనే కునికి పాట్లు పడేవాణ్ణి. అప్పుడు ఎవరైనా పలకరిస్తే.. మామూలుగా మాట్లాడి ఉండొచ్చు. అది బలుపు అనుకుంటే నేనేం చేయగలను? అనుకున్నారు కదా అని నేను వాళ్లని ఏమీ అనడంలేదు. నేనేంటో నాకు తెలుసు. ‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పేంత స్నేహితులెవరూ మీకు ఇండస్ట్రీలో లేరా? వేణుమాధవ్: హలో అంటే హలో అనే స్థాయి ఫ్రెండ్స్ ఉన్నారు. నా దుకాణం నాది. పొద్దున్నే వెళ్లడం, షాప్ ఓపెన్ చేసి, బిజినెస్ చేసుకోవడం. అయిపోగానే దుకాణాన్ని కట్టేయడం అంతే! నాకున్నది ముగ్గురే స్నేహితులు. మా ఆవిడ, నా ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి మా నాన్న పేరే పెట్టాలనుకుని, ‘ప్రభాకర్’ అని పెట్టా. మా అమ్మ పేరు సావిత్రి. అందుకని, రెండోవాడికి ‘సావికర్’ అని పెట్టాను. మీ భార్య పట్ల అమానుషంగా ప్రవరిస్తారని, ‘శాడిస్ట్’ అనే టాక్ ప్రచారంలో ఉంది...? వేణుమాధవ్: మీ ఎదురుగానే మా ఆవిడ ఉంది కదా.. తననే అడగండి. మీకు ఇద్దరు భార్యలనే టాక్ ఉంది..? వేణుమాధవ్: ఇద్దరుంటే ఇద్దరూ కనిపించేవారు కదా. నాకున్నది ఒక్క భార్యే. మీ పెళ్లయ్యి ఎన్నేళ్లయ్యింది.. లవ్వా.. ఎరేంజ్డ్ మ్యారేజా? వేణుమాధవ్: పన్నెండేళ్లు. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ఎరేంజ్డ్ మ్యారేజే. పెళ్లయిన తర్వాత కట్నం కోసం వేధించారని టాక్? వేణుమాధవ్: అవన్నీ నిజమైన మాటలు కావండీ. ఎదుగుతున్నవాడి మీద బురద జల్లడం అన్నమాట. అలాంటివి ఏవైనా జరిగి ఉంటే.. ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదా.. లోపల ఉండేవాణ్ణి. మీకు సినిమాలు తగ్గడానికి కారణం రాష్ర్టంలో జరుగుతున్న ఉద్యమాలని చెప్పారు. అది నిజమైన కారణమేనా? వేణుమాధవ్: నిజమైనదే. ‘ఆటోనగర్ సూర్య’ చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్లో చేసిన ‘మసాలా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి. మీరు షూటింగ్స్‌కి సరిగ్గా రారనే విమర్శ ఉండటంవల్ల సినిమాలు తగ్గాయని కొంతమంది అంటుంటారు..? వేణుమాధవ్: నేను ఉంటున్నది మౌలాలీలో. ఇక్కణ్ణుంచి ఫిల్మ్‌నగర్‌కి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు పావుగంట, అర్ధగంట లేట్ అయ్యుండొచ్చు. అంతే.. అయినా నా వల్ల ఇబ్బంది కలిగిందని ఒక్క నిర్మాతని అయినా చెప్పమనండి. మీరు అంతులేని వ్యాధితో బాధపడుతున్నారని.. అందుకే సినిమాలు తగ్గాయన్నది కూడా కొంతమంది ఊహ... వేణుమాధవ్: అది పచ్చి అబద్ధం. మీరు ఏ డాక్టర్ని అయినా తీసుకొచ్చి, పరిక్షలు చేయించవచ్చు. నేను రెడీగా ఉన్నాను. మరి.. ఎందుకు వీక్ అయ్యారు? వేణుమాధవ్: డైటింగ్ చేయడంతో బరువు తగ్గాను. హీరోలు తగ్గితే సిక్స్‌ప్యాక్ అంటారు. నేను తగ్గితే అంతులేని వ్యాధా? ప్రపంచంలో లేని జబ్బులు కూడా అంటగడతారు. ఇదెక్కడి న్యాయం? డైటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వేణుమాధవ్: చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, నాగబాబుగారితో చేస్తున్నప్పుడు ఒకేలా ఉన్నాను. కానీ, రామ్‌చరణ్‌తో చేసేటప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? నాగేశ్వరరావుగారు, నాగార్జునగారి పక్కన ఒకేలా కనిపిస్తే ఓకే. కానీ, నాగచైతన్యకీ ఫ్రెండ్ అంటే నమ్మేలా ఉండాలి కదా. తరాలు మారినా ఫ్రెండ్ కేరక్టర్స్ చేయాలంటే మౌల్డ్ అవ్వక తప్పదు. అందుకే ఈ డైటింగ్. ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవడంవల్ల ఇదిగో ఇలా బక్కగా అయ్యాను. సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారట? వేణుమాధవ్: మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకి కేక్స్ కట్ చేసుకునే అలవాటు లేదు. అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో చేసుకుంటాం. ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేస్తుంటాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నాన్నగారి సంస్మరణార్ధం అమ్మ పేరు పెట్టి కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించాను. గాంధీగారి విగ్రహాలు పెట్టించాను. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేస్తుంటాం. ప్రస్తుతం మీ ఆశయం ఏంటి? వేణుమాధవ్: సినిమాలపరంగా ఏ ఆశయం లేదు. వ్యక్తిగతంగా మాత్రం వీలైనంతవరకు చాలా మందికి సహాయపడాలన్నదే నా ఆశయం. నేను లక్ష అడిగితే ఆ భగవంతుడు ఎన్నో లక్షలిచ్చాడు. ఇక ఇంతకు మించి ఏదైనా ఆశిస్తే.. ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇంకా కోరికలు కోరి, ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కాదల్చుకోలేదు. ఆయనకు ప్రియభక్తుడిగానే ఉండిపోతా. నేను తినడానికి నాకు దేవుడు ఎంతో ఇచ్చాడు. నాతో పాటు నలుగురికీ పెట్టగలిగే శక్తి ఇచ్చాడు. జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? - డి.జి. భవాని సంవత్సరానికి 40, 50 సినిమాలు చేసి, బంజారా హిల్స్, జూబ్లి హిల్స్‌లాంటి రిచ్ ఏరియాల్లో ఉండే స్థాయికి చేరుకున్నారు. కానీ, సిటీగా దూరంగా ఉండే మౌలాలిలో ఉండటానికి కారణం ఏంటి? వేణుమాధవ్: నాకున్న పది ఇళ్లూ మౌలాలీ హౌసింగ్బోర్డ్లోనే ఉన్నాయి. మా అన్నయ్యలు, అక్క, చెల్లి, నేను... అంతా ఇదే ఏరియాలో ఉంటాం. ఇంకా మా బంధువులు చాలామంది ఉన్నారు. ప్రతిరోజూ మా ఇళ్లల్లోని ఆడవాళ్లు ఫోన్లు చేసుకుని, ‘ఏం కూర చేస్తున్నావ్.. నేను ఫలానాది వండుతున్నా. నువ్వు వేరే చెయ్యి’ అని చెప్పుకుంటారు. ఎవరింట్లో అయినా మహా అయితే రెండు, మూడు కూరలు ఉంటాయేమో.. కానీ మా ఇంట్లో మాత్రం రోజుకి ఎనిమిది రకాల కూరలు ఉంటాయి. నా పిల్లలు బయటికెళితే తప్పిపోతారనే భయం లేదు. ఈ ఏరియాలో ఉన్న మా బంధువులే కాదు.. వేరేవాళ్లు కూడా ‘వేణుమాధవ్ పిల్లలు’ అంటూ.. ఇంటికి తీసుకొచ్చి మరీ వదిలిపెడతారు. ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. జూబిలీహిల్స్‌లో ఎవరున్నారు? చిరంజీవిగారు. ఆ ఏరియాకు ఆయన మెగాస్టార్. నేను మౌలాలీ మెగాస్టార్‌ని. నేను ఫిల్మ్‌నగర్‌లో ఉంటే.. నా ఇల్లెక్కడో ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా, వేణుమాధవ్ ఇల్లు అంటారు. కానీ, మౌలాలీలో ‘వేణన్నా..’ అంటూ ఆప్యాయంగా పిలవడానికి బోల్డంత మంది ఉన్నారు. ఈ ఏరియాలోకి ఎంటరవ్వగానే, వేణుమాధవ్ ఇల్లెక్కడ? అని ఎవర్ని అడిగినా.. చెప్పేస్తారు. *************** కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని నవ్వించడానికి కమెడియన్స్ జోకర్స్‌గా మారాల్సి ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులూ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడెలా ఫీలయ్యారు? వేణుమాధవ్: దేవుడి దయ వల్ల జోకర్‌గా మారే పరిస్థితి రాలేదు. అలాగే స్త్రీలను అవమానరపరిచేలా ఉండే డైలాగులు కూడా చెప్పిన దాఖలాలు ఉండవు. చెప్పాల్సి వచ్చినప్పుడు లొకేషన్ నుంచి బయటికెళ్లిన సందర్భాలున్నాయి. అందుకని వేణుమాధవ్‌కి బలుపు అన్నవాళ్లు ఉన్నారు. నాలోనూ మంచి రచయిత ఉన్నాడు. అవసరమైతే నేనే మంచి డైలాగులు రాసిస్తానని కూడా కొంతమందితో చెప్పా. వాళ్లిచ్చిన డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడానికి నిరాకరించా. ఒకవేళ నన్ను ఒత్తిడి చేస్తే, ‘ఇది మీ ఫ్యామిలీకి చూపించండి. మీ ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకుంటే చేస్తా’ అని చెబుతుంటా. ఒక్క డైలాగే కదా అని చెప్పేయొచ్చు. కానీ, ఆ తర్వాత టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడల్లా మా అమ్మ, నా అక్కచెల్లెళ్లు, నా భార్య, వదినలు.. అందరూ చూస్తారు. ఇబ్బందిపడతారు. అందుకని లేడీస్‌ని అవమానపరిచే సీన్స్ చెయ్యనని చెప్పేస్తాను. పెద్ద హీరోల సినిమాల విషయంలోనూ అలా చేసిన సందర్భాలున్నాయా? వేణుమాధవ్: కొన్ని ఉన్నాయి. అలా చేస్తే అవకాశాలు కోల్పోతానని అనుకోలేదా? వేణుమాధవ్: పోతే పోనివ్వండి. పెద్ద హీరో ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తాడు? మహా అయితే నాలుగైదు. అవి పోయినంత మాత్రాన నాకేం ఇబ్బంది లేదు. ఆ రెండు సినిమాలకు కేటాయించే సమయాన్ని నా ఫ్యామిలీకి కేటాయిస్తాను. మీ పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా? వేణుమాధవ్: అస్సలు లేదు! నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ప్రతి రోజూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి రావడం, ఉదయం షూటింగ్‌కి వెళ్లడం.. దాదాపు నా జీవితం ఇలానే సాగింది. నా పిల్లలు అలా కాకుండా టెన్ టూ ఫైవ్ జాబ్ చేసుకుని, హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను లేట్‌గా ఇంటికి రావడం, ఉదయమే వెళ్లిపోవడం చూసి, నాన్నగారు చాలా బాధపడేవారు. **************** నటుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు. ‘హంగామా’ ద్వారా హీరోని చేసిందీ ఆ ఇద్దరే! అందుకే నా ఇంటికి ‘అచ్చి వచ్చిన కృష్ణ నిలయం’ అని పేరు పెట్టుకున్నాను. నా పదిళ్లకూ అదే పేరు. మౌలాలీలో ఈ పేరుతో ఉన్న ఇల్లు ఎవరిది? అని ఎవర్ని అడిగినా, ‘వేణుమాధవ్’ది అని చెబుతారు. వాళ్లు ఇంకా నాకెలాంటి రోల్స్ ఇస్తానన్నా నేను రెడీ. ఒకవేళ ఇప్పటికప్పుడు పిలిచి ‘సినిమాలు మానేయ్’ అన్నా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేస్తా! వాళ్లంటే నాకంత అభిమానం, గురి! -
‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది..!
సందర్భం వేణుమాధవ్ బర్త్‌డే ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ అంటూ తన పర్సనాలిటీతో వేణుమాధవ్ తెరపై రెచ్చిపోతుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం? అదిరిస్తాడు, బెదిరిస్తాడు, హడలెతిస్తాడు.. చివరకు హడలెత్తిపోతాడు.. ఈ పరిణామ క్రమంలో వేణుమాధవ్ విన్యాసాలకు ఎవరికైనా పొట్టచెక్కలు కావాల్సిందే. నేడు వేణు మాధవ్ పుట్టినరోజు సందర్భంగా ‘సాక్షి’ జరిపిన భేటీ. ఈ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది. నేను మాత్రం ఆ విధానానికి విరుద్ధం. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ నా పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకుంటున్నాను. వారికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయడం నాకు చెప్పలేని తృప్తినిస్తుంది. నాది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడి నా మిత్రులు కూడా ఈ రోజు హాస్పిటల్లో పళ్లు పంపిణీ చేస్తారు. అయితే... ఒక్కసారి మాత్రం నేనూ కూడా కేక్ కట్ చేశాను. దానికి కారణం చిరంజీవిగారు. ‘జై చిరంజీవ’ షూటింగ్ టైమ్‌లో నా పుట్టిన రోజు వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవిగారు స్వయంగా కేక్ తెప్పించి మరీ నాతో కట్ చేయించారు. ఈ ఏడాది నా పుట్టిన రోజు నవరాత్రుల్లో, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మధ్య రావడం ఆనందంగా ఉంది. నన్ను అభిమానించే ఎవరైనా ఈ రోజు నాకోసం ఒక్క మొక్క నాటినా ఆనందిస్తా. అంతకు ముందు విరివిగా సినిమాలు చేసేవారు. ఇప్పుడు వేగం తగ్గించేశారేం? కారణం ఒకటి కాదండీ.. చాలా ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి నా మైండ్‌సెట్‌లో తెలీని మార్పు వచ్చింది. హాస్యంలో అసభ్యతను తట్టుకోలేకపోతున్నాను. పాత్ర డిమాండ్ మేరకు కొన్ని చేయక తప్పదు. అందుకని విలువలకు తిలోదకాలిచ్చేస్తే ఎలా? బ్రహ్మానందంగారి హాస్యం చూడండి... ఇప్పటికీ అసభ్యత కనిపించదు. కానీ.. కొందరి హాస్యం చూస్తుంటే బాధ అనిపిస్తోంది. చివరకు టీవీ షోలు కూడా రోత పుట్టిస్తున్నాయి. ‘ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయాలా?’ అనిపించింది. అలాగే ఆంధ్ర, తెలంగాణ గొడవల ప్రభావం కూడా మా నటులపై పడింది. రాష్ట్రం కలిసున్నప్పుడు రియల్ ఎస్టేట్ బావుండేది. దాంతో నిర్మాతలు విరివిగా వచ్చేవారు. మా లాంటి ఆర్టిస్టులకు అవకాశాలుండేవి. కానీ... ఇప్పుడు రియల్ బూమ్ లేదు. నిర్మాతల సంఖ్య కూడా తగ్గింది. అందుకే ఇదివరకు చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నా. అయితే... ఇప్పటికీ ఖాళీగా మాత్రం లేను. డా.రాజేంద్రప్రసాద్‌గారి ‘టామీ’, వైవీఎస్ చౌదరి ‘రేయ్’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రవితేజ ‘కిక్-2’... ఇలా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది.. చెప్పండి? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడొచ్చిన యంగ్ హీరోలకు కూడా ఫ్రెండ్‌గా వేయడానికి రెడీ. అందుకే కాస్త బరువు కూడా తగ్గుతున్నా. తెలంగాణ నుంచి వచ్చిన కమెడియన్‌గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ప్రథములు మీరు. అందుకు తగ్గ గౌరవం మీకు ఇక్కడ లభిస్తుందంటారా? కచ్చితంగా. నా ప్రజలు నాకు సరైన గౌరవాన్నే ఇస్తున్నారు. చూడగానే నవ్వడమే ఒక హాస్యనటునికిచ్చే పెద్ద గౌరవం. తెలంగాణలో పుట్టినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతాన్నేను. అయితే... కళాకారునిగా నాకు ప్రాంతీయ భేదాల్లేవు. నేను చేసిన ఓ మిమిక్రీ కార్యక్రమం చూసి ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’(1996)తో నన్ను నటునిగా పరిచయం చేశారు. వారు తెలంగాణవాళ్లు కాదు. తన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమాలోనూ నాకో మంచి పాత్ర ఇచ్చి పోత్సహించిన వినాయక్, నాకెంతో పేరు తెచ్చిన సై, ఛత్రపతి చిత్రాల దర్శకుడు రాజమౌళి తెలంగాణవాళ్లు కాదు. నా అభ్యున్నతిలో ప్రతి ఒక్కరికీ భాగం ఉంది. ‘సంప్రదాయం’ అంటే గుర్తొచ్చింది. మీ మిమిక్రీ చూసి ఎస్వీ కృష్ణారెడ్డి మీకు అవకాశం ఇచ్చారన్నారు కదా! మరి ఆ సినిమాలో మీకు డబ్బింగ్ చెప్పించారేంటి? దానికొక తమాషా కారణం ఉంది. ఆ రోజు డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నారు. వెళ్లాను. తెరపై నన్ను నేను చూసుకోగానే... నాకు ఆనందం పగ్గాలు తెంచేసుకుంది. ‘అయ్... నేనా... తెరపై కనిపిస్తున్నానా’ అని డబ్బింగ్ మీద ధ్యాస పెట్టకుండా తెరపై నన్నే చూసుకుంటున్నాను. ఈ కారణం వల్ల లిప్ సింక్ అవ్వడం లేదు. దాంతో ఎడిటర్‌గారికి, కృష్ణారెడ్డిగారికి విసుగొచ్చేసి, నాకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. అప్పుడు నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే... సినిమాలో నటించడం తప్ప నాకు వేరే టార్గెట్ లేదు. నటించేశాను. ఎస్వీ కృష్ణారెడ్డి గారే... ‘హంగామా’తో నన్ను హీరోను చేశారు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో కూడా హీరోగా నటించాను. ‘ప్రేమాభిషేకం’ చిత్రానికి నిర్మాతను కూడా నేనే. బ్రహ్మానందం తర్వాత అలీ, మీరూ స్టార్ కమెడియన్లుగా చక్రం తిప్పారు కదా. ఉన్నట్లుండి వెనుక పడటానికి కారణం? తెలుగు సినిమా చాలా గొప్పది. ఇక్కడ ఉన్నంతమంది కమెడియన్లు ఏ భాషలోనూ కనిపించరు. ఇంకో యాభై మంది కమెడియన్లకు ఇక్కడ స్థానం ఉంది. రాజకీయాలకు మా హాస్యనటులు అందరం దూరమే. ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటాం. పోటీగా ఫీలవ్వడం మాకు ఎప్పుడూ లేదు. నటునిగా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లక్ష రూపాయలు సంపాదించడమనేది ఒకప్పుడు నా లక్ష్యం. లక్షలు సంపాదించాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, డి.రామానాయుడు, చిరంజీవి... ఇలా లెజెండ్రీ కుటుంబాల హీరోలందరితో కలిసి పనిచేశాను, చేస్తున్నాను. పరిశ్రమలో నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్న లక్ష్యం. అందుకే... ఇక నుంచి అసభ్యతతో కూడుకున్న పాత్రల్ని చేయను. నా భార్య, పిల్లలతో కలిసి చూసేంత స్వచ్ఛమైన సినిమాలే చేస్తా. - బుర్రా నరసింహ -
నవ్వు చిన్నబోయింది
వెండితెర మీద నవ్వులు తరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, గుండూ హనుమంతరావు లాంటి టాప్ కమెడియన్లను తెలుగు సినిమా కోల్పోగా.. తాజాగా మరో స్టార్ కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. 400లకు పైగా సినిమాల్లో నవ్వులు పంచిన వేణు మాధవ్ కాలేయ సంబందిత సమస్యతో మరణించారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా స్టేజ్ షోలు చేసిన వేణుమాధవ్ తరువాత బుల్లితెర మీద తరువాత వెండితెర మీద తనదైన ముద్రవేశారు. 1996లో రిలీజ్ అయిన సాంప్రదాయం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ కామెడీ స్టార్ దాదాపు దశాబ్ద కాలంపాటు వెండితెరను ఏలాడు. ఒక దశలో తెలుగులో రిలీజ్ అయిన ప్రతీ సినిమాలో వేణుమాధవ్ కనిపించారంటే అతిషయోక్తి కాదు. అంతేకాదు ఒక్క 2005లో వేణు మాధవ్ నటించిన 60 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన ఎంత బిజీ నటుడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వేణుమాధవ్ కెరీర్ తొలినాళ్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన వేణుమాధవ్, తొలి ప్రేమ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో ప్రేమికుల గురించి వేణు మాధవ్ చెప్పిన డైలాగ్ సెన్సేషన్ సృష్టించింది. తరువాత దిల్, ఆది, ఛత్రపతి, సై లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ సినిమాలో చేసిన సత్తన్న పాత్రకు నంది అవార్డు సైతం వరించింది. సొంతం, నువ్వే నువ్వే, నాగ, సాంబ, ఆర్య, గుడుంబా శంకర్, శంకర్ దాదా ఎంబీబీయస్, మాస్, బన్నీ, అతనొక్కడే, సూపర్, జై చిరంజీవ, రణం, పోకిరి, కిక్, దేశ ముదురు, నేనింతే లాంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రల్లో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వేణుమాధవ్. తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు. తరువాత భూకైలాష్, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వందుతులు వినిపించాయి. పలుమార్లు వేణుమాధవ్ స్వయంగా ఈ వార్తలు ఖండించారు. అయితే బుధవారం అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు. చదవండి: హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూత ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ నేను మౌలాలి మెగాస్టార్‌ని! -
హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు. అయితే వేణు మాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్చల్ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. ఫ్యామిలీతో వేణుమాధవ్ వేణుమాధవ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. 1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది. వేణు మాధవ్ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్యం విషమం
రాంగోపాల్‌పేట: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్‌లు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెళ్లారు. -
నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హాస్యపాత్రలతో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్ అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం లేదని గతంలో ఆయన వివరణయిచ్చారు. రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో నామినేషన్ కూడా వేశారు. -
కోదాడలో వేణుమాధవ్ నామినేషన్
సాక్షి, కోదాడ : సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్ వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు. దీంతో సోమవారం ఆయన మరో మారు కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని వేణుమాధవ్ భావించారు. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ శుక్రవారం ఇక్కడ కాసేపు హల్చల్ చేశారు. కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు. దాంతో అన్ని రకాల పత్రాలను తీసుకొని మారోసారి వస్తానని ఆయన వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ప్రాంత వాసులకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సోమవారం 19వ తేదీన మళ్లీ వస్తానని, అప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. -
కోదాడ బరిలో హాస్య నటుడు వేణుమాధవ్..!
సాక్షి, కోదాడ అర్బన్: సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. కాగా వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భాం తర్వాత ఆయన పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేట్టారు. తదనంతరం ఆయనకు సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను స్వయంగా వేయనున్నట్లు తెలిపారు. -
ఒరిజినల్ డూప్లికేట్
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ (86) ఏడు దశాబ్దాల మిమిక్రీ కళను గుర్తిస్తూ, ఆయన పుట్టిన రోజును (డిసెంబర్ 28) పురస్కరించుకొని తెలంగాణా సర్కిల్ తపాలాశాఖ ప్రత్యేక తపాలా కవర్ని ఆవిష్కరించిన సందర్భంగా... ఈ మనిషి ముందు అద్దం పెడితే... ఈ మనిషి కాదు! అద్దం తికమక పడుతుంది. తను తప్ప ఎందరో కనబడతారు. సారీ... వినబడతారు. ఈయన డూప్లికేట్లకు కింగ్. మిమిక్రీకి ఛత్రపతి. స్వర అనుకరణకు అంకురం. మీలో ఇన్ని ధ్వనులు ఏలా ... అని అడిగితే దేవుడి ప్రతిధ్వని అన్నారు ఈ ఒరిజినల్ డూప్లికేట్ మీరెంచుకున్న మార్గం స్వరంతో ముడిపడి ఉంది. ఈ మిమిక్రీ విద్య దైవం ఇచ్చిన శక్తిగా భావిస్తారా? మీకీ కళ ఎలా అబ్బింది? నూటికి నూరుపాళ్లు దైవం ఇచ్చినదే! మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఇంటికి పెద్ద కొడుకుని కావడంతో నేనూ తహసీల్దార్ కావాలని ఆయన కోరిక. కానీ, నాకా పని పట్ల ఎప్పుడూ ఆసక్తి లేదు. సినిమాలంటే బాగా ఇష్టపడేవాడిని. అందులోనూ చిత్తూరు నాగయ్య సినిమా అయితే ఎన్నిసార్లు చూసేవాడినో లెక్క ఉండేది కాదు. క్లాసురూమ్‌లో కూడా సినిమా యాక్టర్లను అనుకరిస్తూ తోటివారిని సంతోషపెడుతుండేవాడిని. మా ఇంట్లో అందరూ నాకేదో పిచ్చిపట్టిందనేవారు. మా నాన్న అయితే కోపంలో ‘వీడు మన కుటుంబ లెక్కలోనే లేడు’ అని వదిలేశాడు. ఇంట్లో అందరూ నాతో అలాగే ఉండేవారు. కానీ, మా కాలేజీ ప్రిన్సిపల్ నాలో ఉన్న కళను గుర్తించాడు. ఇది అద్భుతమైన కళ. ఇదే దారిగా ఎంచుకుని వెళ్లమని సూచించారు. అప్పటి వరకు మిమిక్రీ అనేది కళగా గుర్తింపు ఎక్కడా లేదు. అసలు ఈ కళను మిమిక్రీ అనేవారే కాదు. అనుకరణ అని మాత్రమే నేను అనుకునేవాడిని. రామాయణంలో సీత పర్ణశాలలో ఉన్నప్పుడు మారీచుడు రాముని గొంతును అనుకరించాడట. ఇదే అనుకరణ గొంతుకు మొదటి ప్రాధాన్యత. నేనీ కళలోకి ప్రవేశించేంతవరకు దీనికి అంతగా ప్రాముఖ్యం లేదు. అలాంటిది ఎన్నో వేదికల మీద ఈ మిమిక్రీ కళ నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ప్రపంచ దేశాలన్నీ తిప్పింది. పురస్కారాలు అందజేసింది. అంతా భగవంతుని కృప. ఏదీ ఉన్నపళంగా రాదని నమ్ముతాను. మనం ఎంచుకున్న మార్గానికి దైవ శక్తి తోడవ్వాలంటే నిరంతరం సాధన చేయాలి. ఈ కళలో జీవితాంతం గుర్తుండిపోయే సందర్భాన్ని ఏదైనా దైవం మీకు ఇచ్చిందా? ఎన్నో.. లెక్కలేవు. వాటిలో అమెరికా ప్రెసిడెంట్ జాన్ఎఫ్ కెనడీని అనుకరించడం, అందుకు ఆయన మెచ్చుకోవడం మరిచిపోలేనిది. అప్పట్లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమ్మిట్‌లో నా ప్రదర్శనకు అవకాశం లభించింది. ఆ ప్రదర్శనలో బైబిల్లోని టెన్ కమాండ్‌మెంట్స్‌ని కెనడీ గొంతును అనుకరిస్తూ చెప్పాను. అంతా తెగ ఆశ్చర్యపోయారు. కెనడీ ఆనందంగా ఆలింగనం చేసుకుని, నాతో కొద్దిసేపు ముచ్చటించారు. అదో అద్భుతమైన సందర్భం. చాలా కొద్ది సందర్భాలలో తప్ప వారి ఎదుటి వారి గొంతును అనుకరించను. వారు హర్ట్ అవుతారేమో అని ఆ పని చేయను. దైవం ఉందని అనిపించిన ఘటన? మా కుటుంబం అంతా వేంకటేశ్వరస్వామి భక్తులం. నా చిన్నతనం నుంచి నాకో నమ్మకం.. మనసుపెట్టి తలచుకుంటే ఆ స్వామి నా ముందు ప్రత్యక్షం అవుతారని. నాలో భక్తి భావం ఎక్కువే. మా నాన్నగారు తరచూ తిరుమల తీసుకెళ్లేవారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటరమణా అని నామార్చన రాయించేవారు. 1950లో కంచి వైష్ణవుల ద్వారా సమాసశ్రీనామాలు స్వీకరించాను. ఈ సందర్భంగా పీఠాధిపతి మంత్రోపదేశం చేశారు. నిత్యం నియమాలు, పారిశుద్ధ్యం పాటిస్తూ జపం చేయాలని చెప్పారు. ఓ కళాకారుడిగా నేను వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాను. కాబట్టి ఈ పారిశుద్ధ్య నియమాలు పాటించలేనండి అన్నాను. ఆయన ‘ఇక్కడున్న అందరికంటే నీవే నిజమైన భక్తుడివి. పరిశుద్ధత దేహానికి కాదు, మనసుకి ఉండాలి’ అని చెప్పారు. మంచి మనసుతో చేతులు కడుక్కుని మంత్రం జపించినా మంత్ర ఫలం ఉంటుందని చెప్పారు. దైవాన్ని తలిస్తే కుళాయి నీళ్లూ మంత్ర జలం అవుతుందని ఉపదేశం చేశారు. ఇప్పటికీ నిత్యం జపం చేస్తుంటాను. ఇదంతా దైవలీల అనిపించిన సంఘటన? కళాకారుడిగా గుర్తింపు పొంది, మంచి పేరు వచ్చాక తిరుమలలో గజారోహణం జరిగింది. ఇది పూర్తిగా దైవలీలయే. ఆ రోజు తిరుమల పూజారులు మాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. నేను ముందు, నా వెనక శిష్యులు ఉన్నారు. వెనక ఎక్కడో నా భార్య ఉంది. పూజ సమయంలో తను ఎక్కడుందో నాకు తెలియడం లేదు. ఆ సమయంలో ‘నాకింత గౌరవం దక్కుతుందంటే అది నా అర్ధాంగి వల్లే. ఆమె కుటుంబ పోషణలో సరైన పాత్ర పోషించడం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. ఆమెకూ ఈ సముచితగౌరవం దక్కితే బాగుంటుంది’ అనుకున్నాను. ఇంతలో ఎవరో చెప్పినట్లుగా ఓ పూజారి శిష్యులను దాటుకుని వెళ్లి పూజా సమయానికి ఆమెను నా దగ్గరికి తీసుకొచ్చాడు. తిరుమలలో గజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. (చేతులు జోడించి ఆ స్వామిని తలుచుకుంటూ) ఆ దైవానికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా ఆ సమయంలో అర్ధం కాలేదు. కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. మీ కష్టాలు తీర్చమని దేవుడికి మొక్కుకుని, ఆ మొక్కులు తీర్చుకున్న విధానం? మొక్కులు ఓ రకంగా దేవుడికి లంచం ఇవ్వడం లాంటిదే. నేనెప్పుడూ దేవుడికి లంచం ఇవ్వలేదు(నవ్వుతూ). దేవుడు మన వెల్విషర్ అనే నమ్మకం ఉండాలి. బయటకు వెళ్లేప్పుడు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. ఇలా ఎందుకంటే నన్ను నడిపించే దేవుడు నాతోనే ఉన్నాడు అనే భరోసాకు. దీంతో పనుల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం రాకున్నా మన ఆథ్యాత్మిక వాతావరణం కారణంగా కర్మఫలం అనుకుని సరిపెట్టుకుంటాను. దేవుడిపై నమ్మకం ఉంచి తదుపరి పనిపై దృష్టి పెడతాను. ఎంతో అనుభవసారాన్ని గ్రహించిన మీరు మీ పిల్లలకు దైవారాధనను ఎలా పరిచయం చేశారు? మిమిక్రీలో ఒక రేంజ్‌కి వెళ్లాక కుటుంబానికి టైమ్ ఇవ్వడం కుదరకపోయేది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం పిల్లలతో రకరకాల ధ్వనులతో వారిని మెస్మరైజ్ చేసేవాడిని. అలా మా ఆవిడకు కొంత పని తగ్గించేవాడిని (నవ్వుతూ) మన పిల్లలైనా సరే మన ఇష్టాయిష్టాలతో వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా జీవన విధానం. భక్తి, వృత్తి ఏదైనా సరే నా వరకే పరిమితం. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సరికాదు. నేను భక్తి పరుడిని కాబట్టి నా కుటుంబం అంతా నా మార్గంలోనే నడవాలనుకోకూడదు. వారి అభిప్రాయాలు, పద్ధతులనూ తండ్రిగా నేను గౌరవించాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారు వారి వృత్తుల్లో ఆనందంగా ఉన్నారు. మీ ఈ విశ్రాంత జీవనంలో దైవారాధన ఎలా ఉంటుంది? పిల్లలు పెద్దవాళ్లై, మనవళ్లు వచ్చాక పెద్దవాళ్లకు పని తగ్గిపోతుంది. అలాగే నే చేసే పనులు తగ్గిపోయాయి. కాలక్షేపం కోసం రామకోటి, వెంకటేశ్వర నామార్చన వంటివి ఉంటాయి. కంచి పీఠాధిపతులు ఇచ్చిన మంత్రోపదేశం ఉండనే ఉంది. గతానుభవాలను, దైవాన్ని తలుచుకుంటే ఈ మిగిలిన జీవితాన్ని గడుపుతున్నాను. గతంలో వాకర్స్ అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉండేవాడిని. రోజూ ఉదయం సాయంత్రం వాకింగ్‌కి వెళ్లేవాడిని. ఇప్పుడు ఎక్కువసేపు నడవలేకపోతున్నాను. అందుకే మానేశాను. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని క్యారమ్ బోర్డ్ క్లబ్‌కి వెళుతుంటాను. – కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, వరంగల్ ఫొటోలు: పెద్ద పెల్లి వరప్రసాద్ -
ఎవడ్రా సచ్చినోడు..!?
వేణుమాధవ్‌కి కోపం వచ్చింది! ఆయనకే ఫోన్ చేసి మూడో రోజెప్పుడు, పదకొండో రోజెప్పుడు అని అడిగారట! కాలదూ మరి! వెంటనే పోలీస్ స్టేషన్‌కి, గవర్నర్ దగ్గరికి కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లారు. వాడెవడో సచ్చినోడు ఫేస్బుక్లో, వాట్సప్పుల్లో.. వేణు మాధవ్ కాలం చేశాడని రాస్తే... నచ్చనోళ్లు దాన్ని ఫార్వర్డ్లు చేస్తే.. దాన్ని మీడియోళ్లు మోసేస్తే... మనిషేం కావాలి? కుటుంబాలేం కావాలి? స్నేహితులేం కావాలి? ఇండస్ట్రీ ఏం కావాలి? బీపీ.. బీపీ.. బీపీ.. బీపీ.. రైజయ్యి.. ఇంకెవ్వరికీ ఇలా జరక్కూడదని సాక్షి ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు. ♦ ఫిలిం నగర్‌కి ఇంత దూరంగా.. మౌలాలీలో ఉన్నా మీరెప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఈసారైతే ప్రచారం డోస్ కూడా పెరిగింది..? వేణుమాధవ్: అవునండి. నాకు రెండు రకాలు ఫ్యాన్స్ ఉన్నారు. రెండో రకం ఫ్యాన్స్‌కి ఎక్కువ అభిమానం అనుకుంటా. అందుకే ఏదో ఒకటి ప్రచారం చేసి, వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. ♦ అలా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నవాళ్లెవరో మీకు తెలుసా? వేణుమాధవ్: తెలియదు. అది తెలుసుకోమనే లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌గారికి, గవర్నర్‌గారికి వినతి పత్రం ఇచ్చాను. ఇంకా తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల సీఎంలను కలిసి, వినతి పత్రం సమర్పించబోతున్నా. ఈ ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ♦ అంతకుముందు కూడా మీ గురించి చాలా ప్రచారాలు వచ్చాయి. కానీ, ఈసారి సీరియస్‌గా తీసుకోవడానికి కారణం? వేణుమాధవ్:: వేణుమాధవ్‌కి తలనొప్పి వచ్చిందనీ, కాళ్లు చచ్చుపడిపోయాయనీ, క్యాన్సర్ వచ్చిందనీ ప్రచారం చేశారు. సరేలే అని ఊరుకున్నాను. కానీ, ఈసారి ఏకంగా చచ్చిపోయానని ప్రచారం మొదలుపెట్టారు. అందుకే చాలా చాలా హర్ట్ అయ్యాను. ఊరికే వదలదల్చుకోలేదు. ♦ ఈ ప్రచారం మొదలైనప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? వేణుమాధవ్: ఉన్నాను. మా అమ్మ, నా భార్య, పిల్లలు మామూలుగా బాధపడలేదు. నా అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లు పడిన బాధ కూడా మాటల్లో చెప్పలేను. ‘ఏమైంది?’ అంటూ కొన్ని వేల ఫోన్లు వచ్చాయి. పోనీ ఫోన్ ఆఫ్ చేద్దామా అంటే, ఆ వార్త నిజమనుకుంటారేమోనని భయం. మరీ ఘోరం ఏంటంటే... ఫోన్ చేసినవాళ్లల్లో కొంతమంది థర్డ్ డే ఎప్పుడు? లెవెన్త్ డే ఎప్పుడు? అని అడిగారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అందుకే గట్టిగా రియాక్ట్ అయ్యాను. ♦ ఓకే.. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? వేణుమాధవ్: ఐయామ్ సో ఫైన్. చూస్తున్నారుగా.. ఎంత హుషారుగా ఉన్నానో. ♦ అప్పుడు రామ్‌చరణ్ ‘రచ్చ’ సినిమా షూటింగ్లో కళ్లు తిరిగి పడిపోవడం వల్ల మీకు అవకాశాలు ఇవ్వడానికి చాలామంది వెనకడుగు వేశారేమో..? వేణుమాధవ్: నేను కళ్లు తిరిగి పడిపోవడం అబద్ధం కాదు. ఆ సినిమా చేస్తున్నప్పుడు మార్నింగ్ చరణ్, మధ్యాహ్నం ఇంకొకరి సినిమా, రాత్రి ఇంకో సినిమా.. ఇలా మూడు సినిమాల షూటింగ్స్ చేశాను. అది ఎండా కాలం. విపరీతమైన ఎండలు. దాంతో పాటు సరిగ్గా భోజనం చేయడానికి కూడా తీరిక చిక్కలేదు. ఒత్తిడి తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయాను. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సెలైన్ ఎక్కించారు. ఆ తర్వాత షూటింగ్‌కి వచ్చేశాను. ఈలోపు దాని గురించి కథలు అల్లేశారు. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ హ్యాపీ. ♦ ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేశారు.. ఇప్పుడెందుకు చేయడంలేదు? వేణుమాధవ్: సినిమాలు చేయనంత మాత్రాన నేను ఫీల్డ్కి దూరంగా ఉన్నట్లు కాదు. ఈ మధ్య కావాలనే నేను సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా డబుల్ మీనింగ్ ఉన్నవే వస్తున్నాయి. అందుకే సెలక్టివ్‌గా ఉంటున్నాను. నేనూ, నా భార్య, నా బంధువులు కలిసి చూడదగ్గ సినిమాలే చేయాలనుకుంటున్నాను. లేకపోతే ఖాళీగా ఉంటా. నాకేం ప్రాబ్లమ్ లేదు. ♦ అంటే.. హీరోగా హంగామా, భూకైలాస్, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలు చేశారు కదా.. ఆ తర్వాత కమెడియన్‌గా చేయాలని లేదా? వేణుమాధవ్: అస్సలు లేదు. కమెడియన్‌గా చేయడానికి నాకేం అభ్యంతరం ఉంటుంది? ఆ మాటకొస్తే ఏ పాత్రైనా చేయడానికి నేను రెడీ. విలన్ పాత్రలివ్వమనండి. చేసేస్తాను. అవకాశం వస్తే హీరోగా చేస్తాను. అవకాశం వస్తే చేయడం వేరు... ప్రయత్నించి దక్కించుకోవడం వేరు.. నేను ప్రయత్నం చేయను. నాకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. 1996 జనవరి 14న నా మొదటి సినిమా ‘సంప్రదాయం’ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా విడుదలకు ముందే రెండు సినిమాలకు అవకాశం వచ్చింది. ఆ దేవుడి దయ వల్ల అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎవర్నీ అడుక్కునే దుస్తితి నాకు రాలేదు. ♦ ప్రస్తుతం సినిమాలేమైనా చేస్తున్నారా? వేణుమాధవ్: కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్‌బాబు) సినిమా, చిరంజీవిగారి 150వ సినిమా, బాలకృష్ణగారి నూరవ సినిమా చేస్తున్నాను. వీళ్లంతా నాకు కొత్తవాళ్లేం కాదు. ఎన్టీ రామారావుగారిని తీసుకుందాం. ఆయన దగ్గర పని చేశాను. బాలకృష్ణగారు, హరికృష్ణగారితో సినిమాలు చేశాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో, నాగార్జునగారితో, నాగచైతన్య.. ఇలా ఆ కుటుంబం హీరోలతో చేశాను. చిరంజీవిగారిని తీసుకుందాం. ఆయనతో, కల్యాణ్‌బాబుతో, రామ్‌చరణ్‌తో, బన్నీతో.. ఇలా అందరితో చేశాను. ఫ్యామిలీలో మూడు తరాల నటుల కాంబినేషన్లో సినిమాలు చేశాను. అందుకే కెరీర్ బ్రహ్మాండంగా సాగింది. ♦ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు చిత్రాల అవకాశాలు అడక్కుండానే వచ్చాయంటారు..? వేణుమాధవ్: ప్రమాణ పూర్తిగా, దైవ సాక్షిగా, ‘సాక్షి’ పేపర్ సాక్షిగా (నవ్వుతూ) అడక్కుండానే వచ్చాయి. అన్నింట్లోనూ నావి మంచి పాత్రలే. ♦ ఏదో అంటున్నారు కానీ.. ఎప్పుడైనా ఒక్క మంచి అవకాశం కోసం ఎవరి దగ్గరైనా బెండ్ అయిన సందర్భం ఉందేమో గుర్తు చేసుకోండి? వేణుమాధవ్: చీ.. చీ.. దటీజ్ నాట్ వేణుమాధవ్. నేనా? బెండ్ అవ్వడమా? నాకా అవసరం రాలేదు. ఎప్పటికీ రాదు. నన్ను వెతుక్కుంటూ అవకాశాలొచ్చాయి కానీ, నేను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లలేదు. ♦ఇలా మాట్లాడతారు కాబట్టే.. మీకు నోటి దురుసు అంటుంటారు..? వేణుమాధవ్: నాకా పదం అంటే చాలా ఇష్టం అండి. వేణుమాధవ్‌కి బలుపు ఎక్కువ.. నోటి దురుసు అనే మాటలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కుమారులు సావికర్, ప్రభాకర్, భార్య శ్రీవాణితో వేణుమాధవ్ ♦అదేంటీ.. ఎవరైనా తిడితే ఆనందంగా ఉంటుందా? వేణుమాధవ్: ఒక్క కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారంటే భయం.. గౌరవం. ఎందుకంటే వాళ్లే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. మిగతావాళ్లను గౌరవిస్తాను. నాకన్నా పెద్దవాళ్లయితే కాళ్లకు నమస్కరిస్తా. ఎవరి దగ్గరా చెయ్యి చాపను. ♦ఇప్పుడు మీరు సినిమాలు తగ్గించేసిన నేపథ్యంలో మీ ప్లేస్‌ని రీప్లేస్ చేసిన ప్రస్తుత కమెడియన్ ఎవరనుకుంటున్నారు? అబ్బే.. నాకు రీప్లేస్‌మెంటా? చాన్సే లేదు. వేణుమాధవ్ పోజిషన్ని రీప్లేస్ చేయగలవాళ్లు ఇప్పటివరకూ రాలేదు... రాలేరు కూడా.. వచ్చినా చేయలేరు. ♦ఏంటా కాన్ఫిడెన్స్? వేణుమాధవ్: బేసిక్‌గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్. నాకు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వడం తెలుసు. టైమింగ్ తెలుసు. నాకు తెలిసి నన్ను రీప్లేస్ చేయగలవాళ్లు లేరు. ఇప్పుడు మీరు గమనించారో లేదో కానీ, మీతో మాట్లాడుతూనే కెమెరా మ్యాన్‌కి కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నాను. ఐదువందలకు పైగా సినిమాలు చేశాను. ♦మీరు చనిపోయారని వచ్చిన వార్తకు గవర్నర్, సీఎంలను కలవడం పబ్లిసిటీలో భాగం అనుకుంటున్నారు.. మీదాకా వచ్చిందా? వేణుమాధవ్: నాదాకానా? రాదు. వేణుమాధవ్ రెబల్ అండి. చెప్పడానికి కూడా భయపడతారు. అయినా వేణుమాధవ్‌కి పబ్లిసిటీ అవసరమా? నేనెవర్నో ఎవరికీ తెలియదా? ఇప్పుడు గుండు చేయించుకున్న వేణుమాధవ్ బయటికెళ్లినా గుర్తుపడతారు. అలాంటిది పబ్లిసిటీ కోసం నేను పాకులాడతానా? పబ్లిసిటీ నాకెందుకండి బాబూ. ♦అవునూ.. గుండు చేయించుకున్నారెందుకని? వేణుమాధవ్: పెద్ద కారణం ఏదీ లేదు. నెల్లూరులో ఓ ప్రోగ్రామ్‌కి వెళ్లాను. అట్నుంచి తిరుపతి వెళ్లాను. బాలకృష్ణగారి నూరవ సినిమా, చిరంజీవిగారి 150వ సినిమా హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకున్నా. తిరుమల వెళ్లాం కదా అని గుండు చేయించుకున్నా. ♦మీ పిల్లల్లో ఎవర్ని హీరో చేయాలనుకుంటున్నారు..? వేణుమాధవ్:: మా పిల్లలెవరూ సినిమా ఇండస్ట్రీలోకి రారు. నాకు ఇంట్రస్ట్ లేదు. ♦ఇండస్ట్రీకి వస్తే.. మీ పిల్లలు కూడా మీ స్థాయిలో సంపాదించుకుంటారు కదా? వేణుమాధవ్: సంపాదన గురించి ఆలోచించలేదు. మా పిల్లలకు మంచి జీవితం ఇచ్చేంత నేను సంపాదించాను. వాళ్లు ఏం చదువుకుంటామంటే అది చదివిస్తాను. ఇంటర్మీడియేట్ వరకే నేను గైడ్ చేస్తాను. ఆ తర్వాత వాళ్ల ఇష్టం. వాళ్లు ఏం కావాలనుకుంటే అది అవుతారు. ♦వాళ్లు హీరో అవుతానంటే...? వేణుమాధవ్: అది వాళ్లిష్టం. కాదనను. ♦ఫైనల్లీ మీ మీద దుష్ర్పచారం చేస్తున్న వాళ్లకు ఏదైనా చెప్పాలనిపిస్తోందా? వేణుమాధవ్: వాళ్లకి చాలా థ్యాంక్స్. అయితే, ప్రచారం చేసేటప్పుడు కాస్త వెనకా ముందూ ఆలోచిస్తే బాగుంటుంది. మొన్నా మధ్య నా గురించి వార్త వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి, సరిపోయింది. నేనేదైనా ఊరెళ్లి, ఊహించని విధంగా నా సెల్‌కి సిగ్నల్ అందలేదనుకోండి అప్పుడు మా ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి? ఏదో జరిగే ఉంటుందని నమ్మేవాళ్లు కదా. అంతెందుకు? ఆ వార్త వచ్చినప్పుడు నేను వాళ్ల కళ్లెదుటే ఉన్నా నా భార్య, అమ్మ ఒకటే ఏడుపులు. ‘నేను బతికే ఉన్నాను’ అని ఎంతమందికి చెప్పాలి? గవర్నర్ వరకూ ఎందుకు వెళ్లానంటే... నన్ను అభిమానించే స్నేహితులకూ, నా వేరే టైప్ ఫ్యాన్స్‌కీ.. ఇలా అందరికీ నేను బతికే ఉన్నానని తెలియజెప్పడానికే. - డి.జి. భవాని