అప్పట్లో భుట్టో... ఇప్పుడు ముషారఫ్ | venu madhav special story | Sakshi
Sakshi News home page

అప్పట్లో భుట్టో... ఇప్పుడు ముషారఫ్

Published Wed, Aug 19 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

అప్పట్లో భుట్టో...  ఇప్పుడు ముషారఫ్

అప్పట్లో భుట్టో... ఇప్పుడు ముషారఫ్

హిట్ క్యారెక్టర్
చిత్రం : దిల్ (2003)  
డెరైక్ట్ చేసింది : వి.వి. వినాయక్   
సినిమా తీసింది : రాజు-గిరి   
మాటలు రాసింది : చింతపల్లి రమణ

 
కితకితలు పెట్టకుండానే కడుపుబ్బ నవ్వించేస్తాడు వేణుమాధవ్. మిమిక్రీ అతనికో పెద్ద ఎస్సెట్. ‘సంప్రదాయం’గా సెల్యులాయిడ్ మీదకొచ్చిన ఈ కోదాడ కళాకారుడు ‘తొలిప్రేమ’తో యూత్‌కి కనెక్టయిపోయాడు. ‘దిల్’తో అందరి దిల్‌లూ కొల్లగొట్టేశాడు. షార్ట్ టైమ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిపోయాడు.
 
 ఆ అక్కకు ఒక్కగానొక్క తమ్ముడు. ఆ బావకు తనివితీరా తిట్టాలనిపించే బామ్మర్ది. శీనుగాడికి ఫ్రెండ్ లాంటి, గైడ్ లాంటి, టెక్ట్స్‌బుక్కు లాంటి మేనమామ... అతడే వేణు. రాత్రయితే నిద్రకు ఆగలేడు. పగలయితే భోజనానికి ఆగలేడు. అన్నిటికీ తొందరే. నోటిదూలతో అంతా చిందరవందరే. ఇంట్లో ఖాళీగా కూర్చుని బావతో అక్షింతలు వేయించుకునే కన్నా, ఏజ్ బార్ అయినా కాలేజ్‌కెళ్లడమే బెటరాతి బెటరనుకున్నాడు వేణు. మేనల్లుడు శీనుతో కలిసి కాలేజ్‌కి అప్లయ్ చేశాడు.  ఆ రోజు ఇంటర్వ్యూలు. అక్కడేం జరిగిందంటే...
   
 కాలేజ్ నిండా కుప్పలు తెప్పలుగా కుర్రాళ్లు.‘‘ఇంతమంది వచ్చారేంటి అల్లుడూ! మనకు సీటు దొరుకుతుందంటావా?’’ అంటూ వేణు తెగ టెన్షన్.అప్పుడే ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ప్రిన్సిపాల్ రూమ్‌లో నుంచి నందిని బయటకొస్తోంది. వేణు గబగబా ఆమె దగ్గరకెళ్లి‘‘సిస్టర్.. సిస్టర్! లోపల ఏం అడుగుతున్నారు?’’ అనడిగాడు. ‘‘క్వశ్చన్స్’’ అంది నందిని.‘‘అవేంటో చెప్పి పుణ్యం కట్టుకో సిస్టర్’’ అనడిగాడు వేణు బిక్కమొహం పెట్టి. సిస్టర్ అనే మాటకి నందిని పడిపోయింది. ‘‘క్వశ్చన్స్‌తో పాటు ఆన్సర్లు కూడా చెప్తాను. రాసుకోండి’’ అని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఇండియాకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చింది?’’ అని నందిని ఫస్ట్ క్వశ్చన్ చెప్పగానే, వేణుకు ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ‘‘ఏం చెప్పాలి సిస్టర్?’’ అన్నాడు దీనంగా.మనవాడు జీకేలో వీక్ అనే విషయం నందినికి అర్థమైపోయి, ‘‘1857 నుంచి స్ట్రగుల్ చేస్తే... 1947లో వచ్చింది’’ అని ఆన్సర్ చెప్పింది. ‘‘పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు?’ మళ్లీ వేణు బ్లాంక్ ఫేస్.
 
‘‘అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్’’ వేణు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చకచకా తన అరచేతి మీద రాసేసుకుంటున్నాడు.
 ‘‘యూత్ దేనివల్ల చెడిపోతున్నారు?’’ మళ్లీ క్వశ్చన్ చెప్పింది నందిని. దీనికీ ఆన్సర్ లేదు వేణూ దగ్గర. నందినీయే ఆన్సర్ చెప్పేసింది.
 ‘‘సిగరెట్ తాగడం... మందు కొట్టడం... అమ్మాయిలతో తిరగడం...’’ వేణూకి క్వశ్చన్ పేపర్ లీకైపోవడంతో కాలరెగరేసేశాడు. ప్రిన్సిపాల్ రూమ్‌లోకి వెళ్లడమే ఓ హీరో ఎంట్రన్స్. ఇతని కాన్ఫిడెన్స్ చూసి ప్రిన్సిపాల్ పుల్లారావు ‘‘ఏంటి... చాలా హ్యాపీగా కనబడుతున్నావ్? బాగా ప్రిపేరయ్యావా?’’ అనడిగాడు. వేణు చాలా స్టయిల్‌గా ‘‘ఫుల్‌గా ప్రిపేరయ్యా. అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్లు చెప్పాక మీరు క్వశ్చన్లు వేస్తారా? మీరు క్వశ్చన్లు అడిగాక నేను ఆన్సర్లు చెప్పాలా? మీకేది బెటరనిపిస్తోంది?’’ అన్నాడు.
 ప్రిన్సిపాల్ క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టాడు. ‘‘నువ్వెప్పుడు పుట్టావ్?’’ ఈ ప్రశ్న వినకుండానే, అరచేయి చూసుకుని ‘‘1857 నుండి స్ట్రగుల్ చేస్తే... 1947లో’’ అని ఆన్సరిచ్చేశాడు.
 
‘‘మీ నాన్నగారి పేరేంటి?’’ ‘‘అప్పట్లో భుట్టో... ఇప్పుడు ముషారఫ్’’ ‘‘కాలేజ్‌లో చేరి ఏం చేద్దామనుకుంటున్నావ్?’’ ‘‘సిగరెట్లు తాగడం... మందు కొట్టడం... అమ్మాయిలతో తిరగడం...’’ఇలా వేణు చెప్పిన ఆన్సర్లన్నీ విని ప్రిన్సిపాల్ డంగైపోయాడు. వేణుకు నో సీట్. కానీ వేణు తక్కువ తినలేదు కదా. కాలేజ్‌లో బాగా పరపతి ఉన్న ప్యూన్ రామానాథానికి పది వేలు లంచం కొట్టి, సీటు సంపాదించేశాడు.
   
 కాలేజ్‌కెళ్తే వేణు ఎక్కడ దొరుకుతాడో తెలుసా?

 క్లాస్‌రూమ్‌లో కాదు... కారిడార్‌లో. వచ్చేపోయే అమ్మాయిలకు సైట్ కొట్టడంతో టైమ్ సరిపోతుంది. ఓ అమ్మాయి వేణుకు తెగ నచ్చేసింది. గ్లామర్‌గా ఉంది. స్టయిల్‌గా ఉంది. ఆమెను ఆపాడు. ‘‘మన దగ్గరో లవ్ లెటర్ ఉంది. ఎవరికిస్తే బావుంటుందంటావ్? మేటర్‌లో మంచి డెప్త్ ఉందిలే! బ్లడ్‌తో రాశా. రాణీకిద్దామా? వద్దులే! ఆల్రెడీ ఎవడితోనో తిరుగుతున్నట్టుంది. నిర్మల మనకు వర్కవుట్ అవుద్దంటావా? ఊహూ... సుజాత? అమ్మో అది మన రేంజ్ కాదు. ఇంకెవరికిస్తే బావుంటుందంటావ్? సత్యవతి... ప్రభావతి... నాగలక్ష్మి... వాణి... ఊహూ... ఓ పని చేయ్! నువ్వే ఉంచేసుకో!’’ అంటూ తెలివిగా లవ్ లెటర్ ఆమెకిచ్చాడు. ఆ అమ్మాయి కన్‌ఫ్యూజ్ అయిపోయి ‘‘ఏంట్రా?’’ అనడిగింది. ‘‘ఎహే... మొహమాటపడకు. ఏం... నీకేం తక్కువ! సత్యవతి కన్నా కాస్త కలర్ తక్కువ. ఏం... ఆ మాత్రం సర్దుకోలేనా? సరదాగా చదువుకో! చెప్పాను కదా... మేటర్‌లో మంచి డెప్త్ ఉందని! ఉంచుకో! చదువుకో! క్లియర్‌గా చదువుకో! టైమ్ తీసుకో!’’ అని ఆమె ఇంకేమీ అడగకముందే వేణు అక్కడ నుంచీ మాయం.
   
ఆ అమ్మాయి వేణును వెతుక్కుంటూ వచ్చి, ‘‘మీ లెటర్ చదివాను’’ అని చెప్పింది. ‘‘బ్లడ్ మరీ రెడ్‌గా ఉందా?’’ కొంటెగా అడిగాడు వేణు. ‘‘అందుకే... ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించా. షుగర్, మలేరియాల్లాంటివి ఏమీ లేవంట! కానీ కేన్సర్ ఉందేమోనని డౌట్ అంట’’ అని ఆ అమ్మాయి చెప్పగానే, వేణు పక్కన నిలబడ్డ కుర్రాడు కళ్లు తిరిగి ఢామ్మని పడిపోయాడు.

‘‘అదేంటి? నీకు కేన్సరంటే... వాడు పడిపోయాడు?’’ అడిగిందా అమ్మాయి ఆశ్చర్యంగా. వేణు చాలా తాపీగా ‘‘ఆ బ్లడ్ వాడిదేలే! అందుకే టెన్షన్’’ అన్నాడు. ‘‘ఎవరి బ్లడ్‌తో రాసినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. మీతో పావుగంటసేపు పర్సనల్‌గా మాట్లాడాలి’’ అడిగిందా అమ్మాయి. దాంతో వేణు సిగ్గుపడిపోయాడు. చెలరేగిపోయాడు. ఫ్రెండ్స్ వైపు విజయగర్వంతో చూశాడు. ‘‘రా... తలుపులేసుకుని మరీ మాట్లాడదాం’’ అని ఆ అమ్మాయిని అక్కడున్న గదిలోకి తీసుకెళ్లి తలుపులేసేశాడు. పావుగంట తర్వాత చెమటలు కక్కుకుంటూ బయటికొచ్చాడు వేణు. ఆ అమ్మాయి అలా వెళ్లగానే... ఓ ఫ్రెండ్‌ను కావలించుకుని ‘‘వా...’’ అంటూ బావురుమన్నాడు. లోపలేం జరిగిందో అందరికీ అర్థమైంది.
   
శీనుగాడు నందినితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసి వాళ్ల నాన్న ఆ అమ్మాయి వాళ్ల అమ్మమ్మ గారింటికి పంపించేశాడు. నిజాంపేట. ఓ పల్లెటూరు. శ్రీనుగాడితో కలిసి వేణు కూడా వెళ్లాడు. శీనుగాడు, నందినిని కలవడానికెళ్తే, వేణు టిఫిన్ చేయడానికి ఓ హోటల్‌కెళ్లాడు.

అక్కడందరూ టిఫిన్లు చేసేసి ‘‘సప్తగిరన్నా! నాలుగు దోసెలు రాసుకో!’’ అనేసి వెళ్లిపోతున్నారు. వేణు కూడా దోసెలు సుష్టుగా లాగించేసి చాలా తాపీగా ‘‘సప్తగిరన్నా! నా దోసెలు కూడా రాసుకో’’ అని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరబోయాడు. ఆ సప్తగిరొచ్చి వేణు కాలరట్టుకున్నాడు. ‘‘ఏంరా... డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావ్?’’ ‘‘అదేంటన్నా! అందరూ అకౌంట్లో రాసుకోమని చెప్పి వెళ్తున్నారుగా’’ అనడిగాడు వేణు. ‘‘వాళ్లంటే మా ఊరోళ్లు. ముందు డబ్బులు తీయ్’’ అని గదమాయించాడు సప్తగిరి. ‘‘పర్సు ఖాళీ. పోనీ పిండి రుబ్బనా?’’ అనడిగాడు వేణు. ‘‘నువ్వు పిండి రుబ్బడానికి కూడా పని చేయవ్. డబ్బులిచ్చి ఈ బండి తీసుకెళ్లు’’ అని బైక్ లాగేసుకున్నాడు సప్తగిరి.

‘‘వార్నీ’’ అనుకుంటూ వేణు నీరసంగా ముందుకెళ్లాడు. అక్కడ పొలం దగ్గర నలుగురు చిన్నపిల్లలు పేకాట ఆడుతున్నారు. వేణు వాళ్ల దగ్గరకు చేరి ‘‘నాకూ ముక్కలేయండ్రా!’’ అనడిగాడు. ‘‘నా బర్రెను పట్టుకోరా... వేస్తా’’ అన్నాడో కుర్రాడు. ‘‘అమ్మో ఈ ఊరోళ్లందరికీ గోరోజనమెక్కువే’’ అనుకుంటూ ముక్కలందుకున్నాడు. తాడు గుంజుకోవడానికి బర్రె ప్రయత్నిస్తోంది. వేణు బూతులు తిట్టాడు.
 ఆ కుర్రాడు హెచ్చరించాడు. ‘‘అన్నా! మా బర్రెకి కోపమెక్కువ. బూతులు తిడితే అస్సలు ఊరుకోదు’’ అన్నాడు. ‘‘నా సంగతి తెల్వదు. నేను హైద్రాబాద్ నుంచి వచ్చినోణ్ణి. ఈ బర్రె ఓ లెక్కా!’’ అని వేణు బిల్డప్పిచ్చాడు.

 అక్కడ బర్రెకు కిర్రెక్కింది. అది సూపర్‌ఫాస్ట్‌లో పరుగు తీయడం మొదలుపెట్టింది. ఆ తాడుతో పాటు వేణును కూడా ఈడ్చుడే ఈడ్చుడు. వేణూ కుయ్యో మొర్రోమన్నాడు. బర్రె ఓ చోట ఆగింది. వేణుకి నోటి దూల కదా! ‘‘హైద్రాబాద్ నుంచి మీ ఊరికొచ్చినానని తెలిసి కూడా ఇంత పని చేస్తావా? కోసి కారం పెడతా నీ తల్లి’’ అని తిట్టాడు. దాంతో బర్రె మళ్లీ పరుగందుకుంది. ముందు బర్రె రన్నింగ్... వెనుక
వేణు దొర్లింగ్... పాపం... వేణు! ప్చ్...
 - పులగం చిన్నారాయణ
 
 స్పాట్‌లో మార్పులు బాగా పేలాయి!
 మేనల్లుడు, మేనమామ - ఒకేసారి ఒకే కాలేజ్‌లో ఒకే క్లాస్ చదవడమనే దర్శక, రచయితల ఐడియా సూపర్. షూటింగ్ స్పాట్‌లో అప్పటికప్పుడు చేసిన ఇంప్రొవైజేషన్‌‌స బాగా పేలాయి. క్లాస్ రూవ్‌ులో ఒక డైలాగ్ చెప్పమంటే, అప్పటికప్పుడు నేను ఎన్టీఆర్,  వైయస్సార్, చంద్రబాబు వగైరాలను ఇమిటేట్ చేస్తూ చెప్పా. అలా సీన్‌ను పెంచుకుంటూ పోయాం. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ నా గురించి అడుగుతున్నప్పుడు, అతనెదురుగా వెళ్ళి, అతణ్ణే ఇమిటేట్ చేస్తూ నేను చెప్పే డైలాగులు కూడా స్పాట్‌లో అనుకొని చేశా. బర్రెతో సీన్‌లో అయితే వినాయకన్న వద్దని చెబుతున్నా సరే, డూప్ లేకుండా, స్టంట్ మాస్టర్ లేకుండా పొలాల మధ్య నేనే చేశా. సీన్ సూపర్‌గా వచ్చింది. రిలీజ్ రోజు మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌‌సలో సినిమా చూసి, భోజనానికి వెళుతున్న నన్ను లక్డీకా పూల్ దగ్గర హోటల్‌కు పిలిచి, యూనిట్ సభ్యులు ఎదురొచ్చి మరీ నన్ను పెకైత్తుకున్న క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. ఈ సినిమాతో నిర్మాత రాజు కాస్తా ‘దిల్’ రాజు అయ్యాడు. ఈ పాత్ర వెంటనే పడ్డ రాజమౌళి ‘సై’ సినిమాతో నా కెరీర్ జెట్ స్పీడ్ అందుకుంది. రెమ్యూనరేషన్ దగ్గర తేడా వచ్చి, మొదట ‘దిల్’ సినిమా చేయనంటే, మంచి క్యారెక్టరని నచ్చజెప్పిన వినాయకన్నదే ఈ క్రెడిటంతా! ఇవాళ నాకింత పేరు, డబ్బు వచ్చి, నాలుగువేళ్ళూ నోట్లోకి వెళుతున్నాయంటే, అది వినాయకన్న చలవే!
 - వేణుమాధవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement