
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు. అయితే వేణు మాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మృతి చెందారు.
ఫ్యామిలీతో వేణుమాధవ్
వేణుమాధవ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. 1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది. వేణు మాధవ్ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment