yashoda hospitals
-
కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీ నటుడు నాగార్జున ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. -
హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు. అయితే వేణు మాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్చల్ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. ఫ్యామిలీతో వేణుమాధవ్ వేణుమాధవ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. 1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది. వేణు మాధవ్ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్యం విషమం
రాంగోపాల్‌పేట: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్‌లు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెళ్లారు. -
నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హాస్యపాత్రలతో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్ అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం లేదని గతంలో ఆయన వివరణయిచ్చారు. రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో నామినేషన్ కూడా వేశారు. -
ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం
హైదరాబాద్ : మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. డెలివరీకి వచ్చిన మహిళ అకస్మాత్తుగా చనిపోవడంతో ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు..మిర్యాలగూడకు చెందిన ప్రవీణ్, బిల్గేట్ హాచార్ భార్య,భర్తలు. వారం క్రితం డెలివరీ నిమిత్తం మలక్‌పేట్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. బిల్గేట్ హాచార్ 4 రోజుల క్రితం బాబుని ప్రసవించింది. ఆరోగ్యంగా ఉన్న బిల్గేట్ హాచార్ బుధవారం చనిపోయిందని చెప్పడంతో బంధువులు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే రూ.10 లక్షలు కట్టించుకున్నారని, అకస్మాత్తుగా చనిపోయిందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ములుగు మొదటి ఎమ్మెల్యే మృతి
సాక్షి, భూపాలపల్లి : ములుగు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే సూర్యనేని రాజేశ్వర్ రావు మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (ఆదివారం) కన్నుమూశారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) పార్టీ తరఫున ములుగు మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 62 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు స్వస్థలం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామం. -
బోడుప్పల్లో యువతి అదృశ్యం
బోడుప్పల్(హైదరాబాద్‌సిటీ): ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈసంఘటన జరిగింది. ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ ఇందిరానగర్‌కు చెందిన జె. స్వామి కుమార్తె రేణుక (18) నగరంలోని యశోద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తుంది. ఈనెల 12న ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రొమ్ము క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 20 సంవత్సరాలు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా విపరీతమైన తలనొప్పి. తలలో ఒకవైపు మొదలై కంటి వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. డాక్టర్గారిని సంప్రదిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మానేస్తే మళ్లీ మామూలే. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్యకి హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - టి.విజయ్ కుమార్, నల్గొండ మీరు ఆందోళన చెందకండి. హోమియోలో మైగ్రైన్‌కి పూర్తి చికిత్స లభిస్తుంది. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. ఈ పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నవారిలో నెలలో ఐదుకంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తుంటుంది. ఒకపక్కే వచ్చే ఈ నొప్పి నాలుగు గంటల నుండి మూడు రోజుల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వాంతులు అవడం, శబ్దాలను, వెలుతురును భరించలేకపోవడం వంటి లక్షణాలు తలనొప్పితోబాటు కానీ, ముందుకానీ ఉంటాయి. కారణాలు: ఒత్తిడి, నిద్రలేకపోవడం, ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్. నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో సాధారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు. పొగతాగటం, ఇంట్లో పొగతాగేవారుండటం, మద్యపానం లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం కూడా కారణాలవుతాయి. పైన పేర్కొన్న అంశాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని అదుపులో ఉంచవచ్చు. నొప్పి తగ్గిన తర్వాత కూడా చికాకు ఎక్కువగా ఉండటం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలుంటాయి. రోగనిర్ధారణ పరీక్షలు: రోగలక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్ధారించడం జరుగుతుంది. ఈసీజీ, సీటీ బ్రెయిన్, ఎమ్మారై- బ్రెయిన్ వంటి పరీక్షల ద్వారా ఇతరత్రా వ్యాధులు లేవని నిర్ధారించుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్ధారించుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపునొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. నాకు పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈమధ్య ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాళ్లలో వాపులు వస్తున్నాయి. రక్తపరీక్ష చేయిస్తే క్రియాటినిన్ 10, యూరియా 28 అని వచ్చింది. యూరిన్ పరీక్ష చేయిస్తే 3 ప్లస్ అన్నారు. నాకు షుగర్ వల్ల సమస్య అవుతోందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - దయాసాగర్, శ్రీకాకుళం మీ రిపోర్ట్ ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. ఇది షుగర్ వల్లనా లేక ఏదైనా కిడ్నీ సమస్యల వల్లనా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కూడా కలవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నదేమోనని (డయాబెటిక్ రెటినోపతీ) అని చూపించుకోవాలి. మీకు మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ పోవడానికి కూడా షుగర్ వల్లే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీ షుగర్ లెవెల్స్‌ను బాగా నియంత్రించుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 110 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. బీపీ 125/75 లోపల ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ 150 ఎంజీ ఉండేలా మందులు వాడాలి. ఇవి కాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించాలి. పొగతాగడం / ఆల్కహాల్ అలవాట్లు ఉంటే వాటిని దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. మా అబ్బాయికి ఐదేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? - రవీంద్రరావు, కొత్తగూడెం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నా చిన్నప్పుడే మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక రొమ్మును తొలగించాల్సి వచ్చింది. కుటుంబంలో ఇలా చాలామందికి క్యాన్సర్ రావడంతో నాకూ ఈ వ్యాధి వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు ఈ ఏడాది లేదా పై ఏడాది పెళ్లి చేస్తామంటున్నారు. నా వైవాహిక జీవితం బాగానే ఉంటుందా? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వస్తే తగ్గుతుందా? దీని బారిన పడకూడదంటే నేను తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి. - ఒక సోదరి, విజయవాడ ఇటీవల చాలామంది మహిళలు రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... దీని పట్ల తగిన అవగాహన లేకపోవడం. అంత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లోపం వల్ల ముందుగానే దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డవారు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మీకు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంది కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మీ అనుమానాలు తొలగిపోతాయి. ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అనే పరీక్ష ద్వారా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ మొదటే గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ ఉన్నా ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా ముందుగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ అవసరమైతే వైద్యులు మీకు నీడిల్ బయాప్సీ అనే మరో పరీక్ష చేస్తారు. ఒకవేళ ఇప్పుడు పరీక్షలో మీకు ఎలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేదని తేలినప్పటికీ మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకూ మూడేళ్లకొకసారి బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ అవినాశ్ పాండే మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : ప్రతి ఏడు లక్షలమందిలో ఒకరు ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చే అరుదైన ఘటన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తునికి పట్టణానికి చెందిన జి.శేఖర్, నళిని భార్యాభర్తలు. శేఖర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా నళిని గృహిణి. నళిని గర్భం దాల్చినప్పటి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నెలలు నిండటంతో ఈ నెల 4వ తేదీన శుక్రవారం రాత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీనియర్ గైనకాలజిస్టులు భాగ్యలక్ష్మి, మాధవీలతలతో పాటు 15 మంది వైద్య బృందం నళినికి ఆపరేషన్ నిర్వహించి పురుడుపోశారు. పుట్టిన నలుగురు ఆడ శిశువులూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు 1.2 కేజీల చొప్పున బరువున్నారు. తల్లి నళిని కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. -
ఎదలో విషపుగడ్డ!
బ్రెస్ట్ క్యాన్సర్ - జాగ్రత్తలు ప్రతి మహిళా జీవితంలో యుక్తవయసులోకి ప్రవేశించాక ఏదో ఒక దశలో రొమ్ముక్యాన్సర్ గురించి ఆందోళన పడుతుంది. రొమ్ముక్యాన్సర్ కుటుంబాన్ని తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి గురిచేసే అంశం. కానీ అతి త్వరగా కనుక్కుంటే నేడది పూర్తిగా తగ్గే క్యాన్సర్. పైగా రొమ్ము కోల్పోకుండానే ఇంతకు మునుపులాగే ఉండేలా చూడగలరు డాక్టర్లు. వ్యాధి ఆనవాళ్లు కూడా లేకుండా తగ్గించగల క్యాన్సర్ ఇది. అయినా ఆ వ్యాధిపై అనేక అపోహలు. వాటిని దూరం చేసుకొని, రొమ్ము క్యాన్సరపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. లక్షణాలు రొమ్ముకు సంబంధించినవి : రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ముపై అల్సర్స్ రావడం. నిపుల్లో : రొమ్ముపై ర్యాష్ లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలియడం భుజం వాపు కనిపించడం. నిర్ధారణ పరీక్షలు : ఎఫ్ఎన్ఏసీ అనే పరీక్ష మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మార్చలేని అంశాలు : వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో బాంధవ్యంలో దగ్గరితనం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ (మోడల్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. ఒక మహిళకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేలితే... దాన్నిబట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అవి... పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలు ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యాయామం : మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకుని, అలా వారంలో కనీసం ఐదు రోజులైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో నివారించవచ్చు శస్త్రచికిత్సతో నివారణ : బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. స్వయం పరీక్ష : రొమ్ముక్యాన్సర్‌ను ఎవరికి వారే స్వయంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మహిళలు తమ రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకుంటూ రొమ్ములో ఏవైనా గడ్డలు చేతికి తగులుతున్నాయా, రొమ్ము ఆకృతిలో తేడా ఉందా, రొమ్ము నిపుల్ నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, నిపుల్ లోపలికి ముడుచుకుపోయి ఉందా, నిపుల్ మీద ర్యాష్ లేదా వ్రణాలు ఏవైనా ఉన్నాయా అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ముందే కనుగొంటే ప్రాణాలనూ, దాంతో పాటే రొమ్మును పూర్తిగా కాపాడుకునేందుకు అవకాశం ఉన్న వ్యాధి ఇది. చికిత్స : రొమ్ముక్యాన్సర్‌కు ఈ రోజుల్లో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు 50 - 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రతి మూడేళ్ల కోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5 శాతం మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యూటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. - డాక్టర్ శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
గుండెలు ఉన్నాయి... కానీ మార్చుకునేవారేరీ?
నేడు డాక్టర్స్ డే డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ అందరిలాగే డాక్టరీ చదివాం. అందరిలాగే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ జీవితానికి అది సరిపోతుందా? లేదు. మనం ఓపెన్‌హార్ట్ సర్జరీ దగ్గరే ఆగిపోకూడదు. గుండెల్ని మార్చి మనుషుల్ని బతికించాలి. గుండెమార్పిడి నైపుణ్యంలో విదేశాలకు దీటుగా పరుగిడాలి. ఇదీ 1992 నుంచి నా కోరిక. అదే కల. అదే తపన. మేము ఒక బృందంగా ఏర్పడి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విరివిగా జరిగే ‘కొలంబియా ప్రెసిబిటేరియన్’కు శిక్షణ కోసం వెళ్లాం. అక్కడ ఎముకలు కొరికే చలి. మా దృఢసంకల్పపు పులి ముందు చలి గడగడా వణికింది. ఒక సన్మార్గపు ఉన్మాదం. ఒక ధ్యానం లాంటి అధ్యయనం. అక్కడి ప్రొటోకాల్స్ ఏకాగ్రతతో పరిశీలించాం. 2004 జనవరిలో అక్కడికి వెళ్లిన మేము ఫిబ్రవరి 2, 2004న తిరిగి వచ్చాం. నేను విదేశాలకు వెళ్లకమునుపు ఒక 32 ఏళ్ల యువకుడు నన్ను కలిశాడు. అప్పటికే అన్ని ఆసుపత్రులూ తిరిగాడట. గుండె పూర్తిగా విఫలమైంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే రికరెంట్ హార్ట్ ఫెయిల్యుర్. బీపీ పూర్తిగా పడిపోయింది. కాళ్ల వాపులు. గుండెమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కేసు అది. 2004 ఫిబ్రవరి 6న కారు యాక్సిడెంట్లో జీవన్మృతుడిగా మారిన ఓ పాతికేళ్ల యువకుడి గురించి సమాచారం వచ్చింది. అప్పుడు మేము ఒక చిన్న వేడుక సందర్భంగా ఎవరో ఇస్తున్న విందులో ఉన్నాం. సమాచారం విన్న వెంటనే హుటాహుటిన బయలుదేరి ఆసుపత్రికి వచ్చాం. అప్పటికి నా వద్దకు వచ్చిన పేషెంట్ మరికొద్ది గంటల్లో చనిపోయే పరిస్థితి. అతడికీ, అతడి బంధువులకూ రిస్క్ గురించి వివరించాం. ‘నేనెలాగూ చికిత్స చేయకపోయినా చనిపోతాను. మీ మొట్టమొదటి కేసే అయినా ప్రయోగాత్మకంగా నాకు శస్త్రచికిత్స చేయండి’ అంటూ చెప్పాడతడు. అంతే! కారు ప్రమాదంలో చనిపోయిన ఓ యువకుడి గుండెను అప్పటికప్పుడు తీసుకొచ్చి అతడికి అమర్చాం. మొట్టమొదటిసారి గుండె మార్పిడి చేస్తున్నామన్న ఉద్వేగం ఒకవైపు. ఎంతో మంది నిపుణుల కళ్లు మా మీదే నిమగ్నమై ఉన్నాయన్న ఉద్విగ్నత ఒక వైపు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతమైంది. కొద్దిగంటల్లో తప్పక చనిపోవాల్సిన ఆ వ్యక్తి బతికాడు. గుండె మార్పిడి తర్వాత విజయవంతంగా ఐదేళ్ల పాటు తన జీవనాన్ని కొనసాగించాడు. అది నా తొలి కేసు కావడంతో అతడి ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి చదువుకు అవసరమైన సహాయాన్ని కూడా నేను అందించాను. అలాగే ఎంబీయే చదువుతున్న 23 ఏళ్ల మరో యువకుడి వృత్తాంతమూ ఆసక్తిగొలిపేదే. నడుస్తుంటే ఆయాసం. చేయని చికిత్సా లేదు. తిరగని ఆసుపత్రీ లేదు. ఒక దశలో బీపీ పూర్తిగా పడిపోయింది. వెంటిలేటర్‌పై పెట్టారు. అతడు చనిపోయాడని భావించి ఊరికి తీసుకెళ్లడానికి వాహనంలో తరలిస్తుండగా కొద్దిగా కదిలాడట. వెంటనే నాకు ఫోన్ చేశారు. తక్షణం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాను. కొద్దిగా కోలుకోగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ గుండె దొరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాను. ఆ తర్వాత విజయవంతంగా అతడు ఎంబీయే పూర్తిచేసి, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇలా గుండె మార్పిడులు విజయవంతం అయ్యాక ఊపిరితిత్తుల మార్పిడికీ ప్రయత్నించా. పూణేకు చెందిన 40 ఏళ్ల మహిళ ఒకావిడ ముంబైలాంటి నగరాల్లోని ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రులకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎవరో చెప్పారట. హైదరాబాద్‌లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని. వారు నేరుగా ఇక్కడికి వచ్చారు. ‘‘మేము ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం. ఏం చేసినా మీరే’’ అని నాతో అన్నారు. అప్పటికి ప్రతి రెండేళ్లకు ఓసారి నేను టెక్సస్‌లోని డీబేకీ సెంటర్‌కు వెళ్లి ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగే ప్రక్రియలను పరిశీలిస్తూ ఉన్నాను. ఊపిరితిత్తుల మార్పిడి చేయడం నాకిదే మొదటిసారి. అయినప్పటికీ ప్రయత్నించా. నాతోపాటు ఒక బృందం బృందమంతా నాపై ఆపారమైన నమ్మకం ఉంచి కష్టపడ్డారు. దాదాపు 16, 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆమె కోలుకుంది. అవును... మనమిప్పుడు గర్వంగా చెప్పగలం. గుండె, ఊపిరితిత్తులు మార్చి అమర్చగల నైపుణ్యం మన సొంతమని. ఇప్పటికి నేను తొమ్మిది గుండె మార్పిడులు, మూడు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేశాను. ‘జీవన్‌దాన్’ అనే కార్యక్రమం ద్వారా నిమ్స్ వారు జీవన్మృతుల బంధువులను ప్రోత్సహిస్తూ, కౌన్సెలింగ్ చేస్తూ అవయవదానం కోసం చాలా కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలించి గత ఏడాదిన్నర కాలంలో 60 మంది దాతల నుంచి అవయవాలు సేకరించారు. ఆ దాతలనుంచి సేకరించిన అవయవాల్లో 115 మూత్రపిండాలను వేర్వేరు వ్యక్తులకు అమర్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగాం. కానీ గుండె విషయానికి వస్తే కేవలం రెండింటిని మాత్రమే అమర్చగలిగాం. ఊపిరితిత్తులు మూడు మాత్రమే. కారణం... అవగాహన లోపం. గుండె పూర్తిగా విఫలమైన వారికి దాన్ని మార్చి కొత్త జీవితం ప్రసాదించడం సాధ్యమనే అవగాహన చాలామందిలో కొరవడింది. ఆ అవగాహన పెంచుకుంటే గత ఏడాదిన్నర వ్యవధిలో 60 మంది దాతల్లో చాలా మంది గుండెలు... వేర్వేరు శరీరాల్లో ఇప్పటికీ స్పందిస్తూ ఉండేవి. వారిని జీవింపజేస్తూ ఉంచేవి. ఆ అవగాహన పెరగాలన్నదే డాక్టర్స్ డే సందర్భంగా నా ఈ గుండెఘోష. అలా గుండెలు మార్చి, హృదయాలను అమర్చి మరింత మందిని బతికించాలన్నదే నా సంకల్పం. -
రెండు గంటల్లో గుండె మార్పిడి
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్సను రెండు గంటల్లోనే పూర్తి చేయడం, అతి చిన్న కోతతోనే ఆపరేషన్ పూర్తి చేయడం, బాధితురాలు వారం రోజుల్లోనే కోలుకోవడం.. ఇలా అన్నీ ఇందులో విశేషాలే.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన వెంకట రమ్య (25) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హృద్రోగ నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే.. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో గుండె దాతల కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదన రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువకుడి గుండెను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. జీవన్‌దాన్ సిబ్బంది ఈ విషయాన్ని యశోద ఆస్పత్రికి తెలియజేశారు. వెంటనే లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 16వ తేదీన ఆపరేషన్ నిర్వహించి యువకుడి నుంచి గుండెను వేరుచేశారు. అదే సమయంలో రమ్యకు శస్త్రచికిత్స చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు గతంలోలాగే అమోఘమైన పాత్ర పోషించారు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్‌కు అత్యంత తక్కువ సమయంలో గుండెను తరలించారు. రెండు గంటల్లోనే శస్త్రచికిత్స కూడా చేశారు. శస్త్రచికిత్స పూర్తయినే రెండు గంటల్లో సాధారణ రక్తప్రసరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ శస్త్రచికిత్సలో వైద్యులు గోపాలకృష్ణ గోఖలే, విశ్వనాథ్, దిలీప్రాఠీ, సుబ్రమణ్యం, సుధాకర్, మాధవ్, సాయిచంద్ర పాల్గొన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా యశోద చైర్మన్ జీవీ రావు మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి వైద్య సేవలకు ఇది వేదిక అని స్పష్టమైందన్నారు. -
మృత్యువుతో పోరాటం
హన్వాడ, న్యూస్‌లైన్: ఆడిపాడే వయసులో ఆ బాలుడికి ఆపదొచ్చింది. విధి వెక్కిరించడం తో ఉన్నట్టుండి కడుపులో క్యాన్సర్ గడ్డలు పుట్టుకొచ్చాయి. రెక్కాడితే డొ క్కాడని ఆ పేద తల్లిదండ్రులు ఒక్కగానొక కొడుకును కాపాడుకునేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. వైద్యానికి మరింత డబ్బు కావాలని వైద్యులు సూచించడంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు. మండలంలోని కొత్తపేట పిల్లిగుండు తండాకు చెందిన విస్లావత్ శంకర్ నాయక్, బుజ్జిబాయిలకు నలుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు కాగా, రెండోవాడైన కైలాష్ ఉన్నట్టుండి క్యాన్సర్ వ్యాధి బారినపడ్డాడు. ఏడాది కాలంగా కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులుచేయని ప్రయత్నం లేదు. తండాలో ప్రస్తుతం నివాసం ఉం టు న్న ఇల్లుతో పాటు ఉన్న ఎకరా పొలాన్ని కూడా అమ్మి కొడుకు వైద్యం కోసం వెచ్చించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్యచికిత్సలు పొందుతున్న కైలాష్ బతకాలంటే ఇంకా* 3.50లక్షలు అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కాయకష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలను, ఓ కొడుకుని చదివిస్తున్న తమకు ఎలాంటి ఆదాయవనరులు లేవని, ఒక్కగానొక్క కొడుకును క్యాన్సర్ బారి నుంచి కాపాడుకునేందుకు ఆదుకోవాలని ఆర్థికసాయం చేయాలని శంకర్ నాయక్ దాతలను వేడుకుంటున్నా డు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 90523 56361, 97037 53633.