నేడు డాక్టర్స్ డే
డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ అండ్ లంగ్
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
అందరిలాగే డాక్టరీ చదివాం. అందరిలాగే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ జీవితానికి అది సరిపోతుందా? లేదు. మనం ఓపెన్‌హార్ట్ సర్జరీ దగ్గరే ఆగిపోకూడదు. గుండెల్ని మార్చి మనుషుల్ని బతికించాలి. గుండెమార్పిడి నైపుణ్యంలో విదేశాలకు దీటుగా పరుగిడాలి. ఇదీ 1992 నుంచి నా కోరిక. అదే కల. అదే తపన. మేము ఒక బృందంగా ఏర్పడి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విరివిగా జరిగే ‘కొలంబియా ప్రెసిబిటేరియన్’కు శిక్షణ కోసం వెళ్లాం. అక్కడ ఎముకలు కొరికే చలి. మా దృఢసంకల్పపు పులి ముందు చలి గడగడా వణికింది. ఒక సన్మార్గపు ఉన్మాదం. ఒక ధ్యానం లాంటి అధ్యయనం. అక్కడి ప్రొటోకాల్స్ ఏకాగ్రతతో పరిశీలించాం. 2004 జనవరిలో అక్కడికి వెళ్లిన మేము ఫిబ్రవరి 2, 2004న తిరిగి వచ్చాం.
నేను విదేశాలకు వెళ్లకమునుపు ఒక 32 ఏళ్ల యువకుడు నన్ను కలిశాడు. అప్పటికే అన్ని ఆసుపత్రులూ తిరిగాడట. గుండె పూర్తిగా విఫలమైంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే రికరెంట్ హార్ట్ ఫెయిల్యుర్. బీపీ పూర్తిగా పడిపోయింది. కాళ్ల వాపులు. గుండెమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కేసు అది. 2004 ఫిబ్రవరి 6న కారు యాక్సిడెంట్‌లో జీవన్మృతుడిగా మారిన ఓ పాతికేళ్ల యువకుడి గురించి సమాచారం వచ్చింది. అప్పుడు మేము ఒక చిన్న వేడుక సందర్భంగా ఎవరో ఇస్తున్న విందులో ఉన్నాం. సమాచారం విన్న వెంటనే హుటాహుటిన బయలుదేరి ఆసుపత్రికి వచ్చాం.
అప్పటికి నా వద్దకు వచ్చిన పేషెంట్ మరికొద్ది గంటల్లో చనిపోయే పరిస్థితి. అతడికీ, అతడి బంధువులకూ రిస్క్ గురించి వివరించాం. ‘నేనెలాగూ చికిత్స చేయకపోయినా చనిపోతాను. మీ మొట్టమొదటి కేసే అయినా ప్రయోగాత్మకంగా నాకు శస్త్రచికిత్స చేయండి’ అంటూ చెప్పాడతడు. అంతే! కారు ప్రమాదంలో చనిపోయిన ఓ యువకుడి గుండెను అప్పటికప్పుడు తీసుకొచ్చి అతడికి అమర్చాం.
మొట్టమొదటిసారి గుండె మార్పిడి చేస్తున్నామన్న ఉద్వేగం ఒకవైపు. ఎంతో మంది నిపుణుల కళ్లు మా మీదే నిమగ్నమై ఉన్నాయన్న ఉద్విగ్నత ఒక వైపు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతమైంది. కొద్దిగంటల్లో తప్పక చనిపోవాల్సిన ఆ వ్యక్తి బతికాడు. గుండె మార్పిడి తర్వాత విజయవంతంగా ఐదేళ్ల పాటు తన జీవనాన్ని కొనసాగించాడు. అది నా తొలి కేసు కావడంతో అతడి ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి చదువుకు అవసరమైన సహాయాన్ని కూడా నేను అందించాను. అలాగే ఎంబీయే చదువుతున్న 23 ఏళ్ల మరో యువకుడి వృత్తాంతమూ ఆసక్తిగొలిపేదే. నడుస్తుంటే ఆయాసం. చేయని చికిత్సా లేదు. తిరగని ఆసుపత్రీ లేదు.
ఒక దశలో బీపీ పూర్తిగా పడిపోయింది. వెంటిలేటర్‌పై పెట్టారు. అతడు చనిపోయాడని భావించి ఊరికి తీసుకెళ్లడానికి వాహనంలో తరలిస్తుండగా కొద్దిగా కదిలాడట. వెంటనే నాకు ఫోన్ చేశారు. తక్షణం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాను. కొద్దిగా కోలుకోగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ గుండె దొరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాను. ఆ తర్వాత విజయవంతంగా అతడు ఎంబీయే పూర్తిచేసి, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
ఇలా గుండె మార్పిడులు విజయవంతం అయ్యాక ఊపిరితిత్తుల మార్పిడికీ ప్రయత్నించా. పూణేకు చెందిన 40 ఏళ్ల మహిళ ఒకావిడ ముంబైలాంటి నగరాల్లోని ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రులకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎవరో చెప్పారట. హైదరాబాద్‌లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని. వారు నేరుగా ఇక్కడికి వచ్చారు. ‘‘మేము ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం. ఏం చేసినా మీరే’’ అని నాతో అన్నారు. అప్పటికి ప్రతి రెండేళ్లకు ఓసారి నేను టెక్సస్‌లోని డీబేకీ సెంటర్‌కు వెళ్లి ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగే ప్రక్రియలను పరిశీలిస్తూ ఉన్నాను.
ఊపిరితిత్తుల మార్పిడి చేయడం నాకిదే మొదటిసారి. అయినప్పటికీ ప్రయత్నించా. నాతోపాటు ఒక బృందం బృందమంతా నాపై ఆపారమైన నమ్మకం ఉంచి కష్టపడ్డారు. దాదాపు 16, 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆమె కోలుకుంది. అవును... మనమిప్పుడు గర్వంగా చెప్పగలం. గుండె, ఊపిరితిత్తులు మార్చి అమర్చగల నైపుణ్యం మన సొంతమని.
ఇప్పటికి నేను తొమ్మిది గుండె మార్పిడులు, మూడు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేశాను. ‘జీవన్‌దాన్’ అనే కార్యక్రమం ద్వారా నిమ్స్ వారు జీవన్మృతుల బంధువులను ప్రోత్సహిస్తూ, కౌన్సెలింగ్ చేస్తూ అవయవదానం కోసం చాలా కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలించి గత ఏడాదిన్నర కాలంలో 60 మంది దాతల నుంచి అవయవాలు సేకరించారు. ఆ దాతలనుంచి సేకరించిన అవయవాల్లో 115 మూత్రపిండాలను వేర్వేరు వ్యక్తులకు అమర్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగాం. కానీ గుండె విషయానికి వస్తే కేవలం రెండింటిని మాత్రమే అమర్చగలిగాం.
ఊపిరితిత్తులు మూడు మాత్రమే. కారణం... అవగాహన లోపం. గుండె పూర్తిగా విఫలమైన వారికి దాన్ని మార్చి కొత్త జీవితం ప్రసాదించడం సాధ్యమనే అవగాహన చాలామందిలో కొరవడింది. ఆ అవగాహన పెంచుకుంటే గత ఏడాదిన్నర వ్యవధిలో 60 మంది దాతల్లో చాలా మంది గుండెలు... వేర్వేరు శరీరాల్లో ఇప్పటికీ స్పందిస్తూ ఉండేవి. వారిని జీవింపజేస్తూ ఉంచేవి. ఆ అవగాహన పెరగాలన్నదే డాక్టర్స్ డే సందర్భంగా నా ఈ గుండెఘోష. అలా గుండెలు మార్చి, హృదయాలను అమర్చి మరింత మందిని బతికించాలన్నదే నా సంకల్పం.
గుండెలు ఉన్నాయి... కానీ మార్చుకునేవారేరీ?
Published Tue, Jul 1 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement
Advertisement